అంతేగా,అంతేమరి
”ఏమండీ !కాకినాడ నుంచి వనజాక్షి గారు వారానికోసారిఫోన్ చేసి ,మనబ్బాయి ఫోటో వాళ్లమ్మాయికి ,అందరికి నచ్చిందని, జాతకాలుకూడా భేషుగ్గా కలిశాయనివాళ్ళ పురోహితుడు చెప్పాడని ,ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూపిస్తామని చెబుతోంది .ఒకసారి వెళ్లి చూసొద్దామండీ ‘’అంది మా ఆవిడ కామం అదేకామాక్షి ,’’మనవాడికి సెలవలు దొరకటం లేదంటున్నాడు ఈఆదివారం బాగుంది వాణ్ని కదిలించి, వస్తానంటే చూసొద్దాం ‘’అన్నాను .ఆ మాట కామం వనం కి చెప్పే ఉంటుంది .రెండ్రోజులక్రితం మళ్ళీ రికార్డ్ పెట్టింది కామం .’’అబ్బాయి కి రేపు ఆదివారం వీలేనట.మీరుకూడా ఊ అంటే ఆవిడకు చెబుతా ‘’అంది.’’సరే .ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాల్సిందే గా కానీ ‘’అన్నాను .కాసేపటికే కామం ‘’వనం గారు ఒకే అన్నారు .ఆదివారం సాయంత్రం దుర్ముహూర్తం వెళ్ళాక చూపులు అని చెప్పమంది ‘’అన్నది .సరే అంటే సరే అనుకొన్నాం .
ఆదివారం సాయంత్రం రైల్ లో మాఅబ్బాయి విస్సు ,నేనూ, మా ఆవిడా ,మా అమ్మాయి బయల్దేరి విశాఖ నుంచి కాకినాడ వెళ్లాం .స్టేషన్ కు ముగ్గురు ఆడలేడీలు వచ్చి రిసీవ్ చేసుకొన్నారు .గొంతును బట్టి గుర్తించి అదిగోనండి వనజాక్షి గారు అంది .వాళ్ళు మాదగ్గరకొచ్చి నమస్కారాలు చేశారు .కుశలప్రశ్నలయ్యాక వాళ్ళ జుంబో కారులో ఇంటికి తీసికెళ్లారు .చెట్టంత మగాడిని నన్ను ఏదో ఒకపలకరింపు పలకరించి అబ్బాయి తో చనువుగా మాట్లాడుతున్నారు .అరగంట జర్నీలో ప్రపంచామంతా చుట్టేశారు కబుర్లతో. నాకూ మా వాడికీ ‘’ఎంబరాసింగ్’’గా ఉంది .ఏం చేస్తాం ?ఇల్లు రాగానే అందరం దిగాం .ఒక పంచకట్టు బుర్ర మీసాలపెద్దాయన ,మరో నడి వయస్కుడు , ఇంకో ఆతను నమస్కారాలు చేసి లోపలికిఆహ్వానించారు .లంకంత కొంప .వైభవం దర్జా ఉట్టిపడే ఫర్నిచర్ ,అధునాతన సామగ్రి తో ఇళ్ళుకళకళ లాడింది .మంచిసోఫాలపై కూర్చోపెట్టి చల్లని పానీయాలు అందించి ,తర్వాత కారప్పొడి అల్లం చెట్నీ తో పొగలు కక్కుతున్న ఇడ్లీలు పెట్టారు .తిన్నాం ,కాసేపటికి అల్లం పెసరతో ఉప్మా వచ్చింది .వద్దంటూనే లాగించాం . తర్వాత కమ్మని నురుగులు పొంగుతున్న కాఫీ ఇచ్చారు .పుచ్చుకున్నాం .’’అమ్మాయి రెడీ అవుతోంది వదినా ‘’అని మా కామానికి చెప్పింది వనం .అప్పుడే ఈ బంధుత్వం ఏమిటా అని ఒకళ్ళవైపు ఒకరం చూసుకోన్నా౦ నలుగురం .కబుర్లలో దిగాం .నడి వయస్సాయన ‘’నేనుఅమ్మాయి తండ్రిని .ఆపెద్దాయన మానాన్నగారు మీతో వచ్చింది మా అమ్మగారు ,ఆతను మాల్లుడు .మరదలి పెళ్ళిచూపులకోసం వచ్చారు’’అని పరిచయంచేశాడు .నేను ఆయన్ను ‘’మీస్వగ్రామం ఎక్కడ ఏసర్వీస్ చేశారు ?’’అని అడిగితే వనం ‘’ అన్నయ్యగారు !కాకినాడ మున్సిపాలిటీ ఆఫీసర్ అండీ .’’అన్నది ‘’అవునండీ ‘’అన్నాడాయన .’’మీనాన్నగారేం చేసేవారు ?అని అడిగితె ,ఆయనకు బదులు ముసలావిడ ‘’ ‘’ పక్క ఊరి మునసబుగిరీ చేశారు .జిల్లాలో బాగా పేరు ప్రఖ్యాతులున్నవారండీ ‘’అన్నది బుర్రమీసాలు దువ్వుకొంటూ ఆయన ‘’మరంతే నండి’’ అన్నాడు .ఓరినాయనో అనుకొన్నాం ముఖాల చూపులతోనే .ఇంకో ఆతను అని చెప్పానే ఆయన్ను ఏం చేస్తుంటారని అడిగా .యువతి ‘’మా మావారే నండి.డాక్టరీ చదివి ప్రాక్టీస్ చేస్తున్నారు వైజాగ్ లో .మాకు ఇద్దరు మగ పిల్లలు .చెల్లి పెళ్ళిచూపులుకదా అని అందరం వచ్చీసీమండి’’అన్నది .ఆకుర్రాడు ‘’మరేనండి అంతేనండి ‘’అన్నాడు .’’ఇదేం తేడా’’అని మళ్ళీ అనుకొన్నాం .
మళ్ళీ రెండు రౌండ్లు కాఫీ లయ్యాక మంచి అలంకరణతో అమ్మాయి వచ్చి ,ఆందరికీ నమస్కారాలు చేసి తన ఉచిత సముచిత ఆసనం లో ఆసీను రాలైంది .కళ్ళతోనే అందరినీ పలకరిస్తూ నవ్వుతూ చలాకీగా ఉంది .అందమైన ముఖం .మంచి రంగు .స్పురద్రూపం .చక్కని జడ ,పూల అమరిక ,చేతులనిండా గాజులు నుదుట కుంకుమ బొట్టు .చూడంగానే ఆకర్షణీయం గా అని పించించింది .మిగిలిన వారంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు .మా కామానికి ఏదైనా అడగటానికి సంకోచం గా ఉంది .సరే నేనే మొదలు పెట్టి ,ఎక్కడెక్కడ చదివి ప్రస్తుతం ఏం చేస్తోందో అడిగాను .క్షణం ఆలస్యంచెయ్యకుండా పిల్లా, పిల్లతల్లీ టకటకా చెప్పేశారు .మగాళ్లు ‘’మూగాళ్ళు’’ గా నే ఉండిపోయారు .అప్పుడప్పుడు వాళ్ళు చెప్పినదానికి ‘’అంతేగా .అంతే మరి’’ అంటున్నారు .వనజాక్షి మా విస్సు చదువు ఉద్యోగాలగురించి అడిగింది మా కామాన్ని .చెప్పబోయింది కాని నా చూపు కట్టడికి ఆగిపోయింది .నేనే వాడి చదువు ,ఉద్యోగం ,జీత ,యా౦బిషన్ అన్నీ చెప్పేశాను .ఈలోగా వచ్చిన వేడి వేడి పకోడీలు ,పల్లీలు మధ్యమధ్యలో కొబ్బరి నీళ్ళు తాగుతూనే ఉన్నాం .మర్యాద,గౌరవాలకేం లోటు లేదు . పిల్ల కూడా టెక్ పాసై ఇక్కడే ఉద్యోగం .ఈడూ జోడూ బాగుంది .నేనే జాతకాలు చూశానుకనుక అదీ తృప్తి గానే ఉంది .మా వాడిని అమ్మాయిని ఏదైనా అడగమంటే ‘’అక్కర్లేదు మీరు అడిగారుగా ‘’అన్నాడు .ఆఅమ్మాయి మాత్రం ‘’ఒకసారి ప్రక్కగదిలో మాట్లాడుడుకొందాం రండి ‘’అన్నది .అందరం పర్మిషనిచ్చాం ఉభయులవైపునుంచి.వెళ్లి పావుగంటలో తిరిగి వచ్చారు నవ్వు ముఖాలతో .దృశ్యం మాక౦దరికీ అర్ధమై పోయింది .మా కామం వనం తో చెప్పి పెద్ద ప్లేటు తెప్పించి అందులో మేము తెచ్చిన పళ్ళూ ,పూలు పెట్టి అమ్మాయి చేతిలో పెట్టింది వనం,అత్తగారు,కూతురు తోడుగా .మళ్ళీ కూల్ డ్రింకులు త్రాగాం.’’వదినగారూ !ఎప్పుడు మీఅభిప్రాయం చెబుతారు ?’’అని అడిగింది .నావైపు చూసింది కామం .’’ఇంటికి వెళ్లి మావాడితో సంప్రదించి రెండు మూడు రోజుల్లో చెబుతామమ్మా ‘’అన్నాను.ఆడాళ్ళు మగాళ్ళు ఒకరిమోహాలొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు .మాఅమ్మాయికి మా వాడికు మంచి జాకెట్ పీసులు,తలలోకి పూలు ,సంచీ నిండా పళ్ళు పెట్టి ఇచ్చింది .అందరికీ ధన్యవాదాలు తెలియ జేశాం ట్రెయిన్ ఎక్కించటానికి ఈ సారి కారులో మాతోపాటు వారింటి ఆడామగా కూడా రావటంతో మేము అవాక్కయ్యాం .
ఇంటికి చేరుకొని మర్నాడు మా విస్సుగాడిని అభిప్రాయం అడిగాము ‘’మీరు ఒకే అంటే నేనూ ఓకే’’అన్నాడు ‘’.బాగానే ఉందిరా విస్సూ .అక్కడ మగాళ్ళు ఎఫ్-2సినిమా లో ప్రదీప్ లా ‘’అంతేగా అంతేమరి ‘’టైప్ .నువ్వూ ‘’ అంతేగా’’ గామారితే ఇబ్బందే లేదు ‘’అన్నాము కామం నేనూ మా అమ్మాయీ .’’నాన్నా !వెళ్ళే టప్పటి’’ సీన్’’ కు వచ్చేటప్పటి’’ దృశ్యా’’నికి యెంత తేడా ఉందొ చూశారుగా మేమిద్దరం మాట్లాడుకొన్నప్పుడు ఈవిషయం ఆ అమ్మాయికి తెలియ జేస్తే ‘’అయ్యో !ఇది మాకు అలవాటై ఏమీ తేడా గా లేదండీ .ఇకపై మీమగవాళ్ళ,గౌరవ మర్యాదలకు భంగం రాకుండా మా వాళ్ళు ప్రయత్నిస్తారు నాది హామీ’’అన్నది . తన వాళ్లను కంటిచూపుతో శాసించి అమలు చేసి౦ది .’’అన్నాడు .కుటుంబ గౌరవాన్ని కాపాడే పిల్ల కోడలు గా వస్తోందని అందరం సంతోషించి నేనే పిల్ల తండ్రి కి ఫోన్ చేసి చెప్పా .వాళ్ళు తెగ మురిసిపోయినట్లు వనం కామానికి తర్వాత ఫోన్ చేసి చెప్పిందట .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-19-ఉయ్యూరు
—