దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తుగా మాట నోట రానందున ,విషయంతెలిసిన ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం మనసులో ఉన్నా వెళ్లలేకపోయారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య ఎస్వీ. జోగారావు గారింట బసచేసి కోరికచెప్పగా, ఆయనకూడా ఆమధ్యే వెళ్లి వచ్చానని అనటం తో, కోరిక బలపడి,నరసిహాచార్యులగారితో అనగా, తానూ వెళ్ళాలనే అనుకొన్నానని కుదరలేదని తనకారులో కలిసి వెడదామనీ, బలమిచ్చి మరో ముగ్గురు ఆప్తులతో తో కలిసి జిల్లెళ్ళమూడి కి రాత్రి 7 గంటలకు కారులో చేరుకొన్నారు .వాకబు చేస్తే అమ్మ డాబా పైన ఉన్నదని తెలిసి డాబాపైకి అమ్మ సన్నిధికి చేరి ,దూరాన్నుంచే నమస్కరించి కూర్చున్నారుఅంతా .ఆమెకు ఒక వైపు మగవారు, మరో వైపు ఆడవారు భక్తి తో కూర్చుని ఉన్నారు .ఆమె యెవరితొనూ మాట్లాడలేదు .అలా ఒక అరగంట గడిచాక, వీరందరికీ అమ్మను చూస్తుంటే దుఖం పొర్లుకొచ్చింది .కళ్ళ వెంట ఒకటే ధారాపాతం.ఆమె వీళ్ళ వైపు చూస్తూనే ఉంది .ఏదో ఒక గంట మోగింది .ఒక్కొక్కరే అమ్మను చేరి పాదనమస్కారాలు చేసి వెడుతున్నారు .వీరు కూడా వెళ్ళారు. దువ్వూరివారు అమ్మ పాదాలు పట్టుకొని నమస్కరించారు .
అప్పుడు అమ్మ ‘’కూర్చో నాన్నా !’’అన్నది. అందర్నీ కూర్చోమన్నది .ఎవరూ ఏమీమాట్లాడలేదు. కొంతసేపటికి ప్రక్కకు చెయ్యి జాపింది .మాతృశ్రీ సన్ని ధాన భాగ్యశాలి డా.పన్నాల రామకృష్ణగారు అమ్మ చేతిలో నాలుగు చక్రకేళి పళ్ళు పెట్టారు .వాటిని దువ్వూరివారి చేతుల్లో ఉంచింది అమ్మ .అందరికీఅలాగే ఇచ్చింది .మౌనమే రాజ్యం చేస్తోంది .కాసేపు తర్వాత శాస్త్రి గారి చేతిలో పండు తీసుకొని ,వొలిచి ఒక ముక్క ఇవ్వ బోయింది .మళ్ళీరెండుచేతులు సాచారు శాస్త్రిగారు .చేతుల్లో ఉంచకుండా నోటిదగ్గర చెయ్యి జాచింది .నోరు తెరిచారు. నోట్లో పెట్టింది .నమిలి మింగటం కనిపెట్టి ,మరో ముక్క అందించింది .అన్నిపళ్ళు తానే ఒలిచి ముక్కలు చేసి నోటిలో పెట్టి తిని పించింది .ఊహించని ఇషయం ఇది .’’చిన్నప్పుడు ఏడాది ,రెండేళ్ళ వయసులో అన్నప్రాసన అయిన కొత్తలో మా అమ్మ తినిపించిన గోరు ముద్దలు జ్ఞాపకం లేవుకాని ,అప్పుడు ఎలాంటి అనుభవం కలిగి ఉంటుందో ఇప్పుడు అలాంటి అనుభూతి కలిగి ,ఎంతతృప్తి కలిగిందోచేప్పలేను ‘’అన్నారు దువ్వూరి వారు ‘’నన్నుగన్న తల్లో,నా పాలిదైవమో ఇట్లా మాహా వాత్సల్యం తో తినిపిస్తోంది అన్న తృప్తి మనసులో ఒక మూల ఉన్నా ,అరే,ఈ పళ్ళు జానెడు పొడవున ‘’పొతకల్లా’’ ఉన్నాయే !ఒక్కొక్కటి వరుస పెట్టి తిని పిస్తోందే.అమ్మ అనుగ్రహానికి ఆన౦దిస్తున్నాం కాని అజీర్ణం పట్టుకొంటుందేమో అని సంకోచం .అన్నిటికీ అమ్మే ఉందని ధైర్యంగా పళ్లన్నీ తినేశాను ‘’అని అనుభూతి పొందారు .
అమ్మ చనువిచ్చింది కదా అని శాస్త్రిగారు ‘’అమ్మా !అమ్మ దగ్గరకు పనిమీద రాలేదు .లోకంలో తల్లి దగ్గరకు పిల్లలు ఎందుకు వస్తారో అందు కోసమేవచ్చాం ‘’అన్నారు .అమ్మ ‘’అవున్నాన్నా !అమ్మదగ్గరకు పిల్లలు రాకపోవటానికి ఏదైనా కారణం ఉండవచ్చు కాని ,రావటానికి కారణం ఎందుకు “”?అనగానే ‘’ఆమె లోతైన భావానికి ,ఆముచ్చటైన మాటకు తబ్బిబ్బయ్యారు .అమ్మ ‘’నాన్నా !చాలాసేపటి నుంచి కూర్చున్నావు శ్రమగా ఉందా ?’’అని అడిగితె ‘’అమ్మ సన్నిధిలోకూర్చోవటం కనుక యెంత సేపైనా శ్రమగా లేదు ‘’అన్నారు .అక్కడి వారి వైపుచూసి ‘’నాన్నకు శ్రమలేకుండా ఖాళీమంచం ,పక్కాదిండు అన్నీ చూడు ‘’అన్నది .వీరంతా లేచినిలబడి వ౦దనం చేసి బయటికి వచ్చి వారికి అప్పటికే ఏర్పాటు చేసిన వాటిపై విశ్రమించారు .సాపాటు చేశారు ఆచార్యులవారు .’’ఇక్కడికి వచ్చే వారు, వచ్చి స్థిరపడిన వారు అంతా అమ్మ బిడ్డలే .జిల్లెళ్ళమూడిఓరియెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు ,కాలేజీ పండితులు వచ్చి ఎంతో ఆదరాభిమానాలు ప్రదర్శించారు .పన్నాల వారు అమ్మపై ఎన్నో గ్రంథాలు సుప్రభాతం రాశారు .సంస్కృతం లో .అమ్మపై ‘’పావకప్రభ ‘’గొప్ప సంస్కృత కావ్యం రాశారు .దీన్నిఒకామే ఆంగ్లం లోకి అనువదించింది ,అ౦బికాకాసహస్రనామస్తోత్రం ,అంబికా కరావలంబం ,అంబికా నవరత్నమాల మొదలైన 20 గీర్వాణ రచనలు చేశారు .కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని రాసిన సంస్కృత ‘’ఉమాసహస్రం ‘’కు తెలుగు అనువాదం చేశారు .పొన్నూరు సంస్కృత కాలేజి మాజీ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ తూములూరు శ్రీ దక్షిణామూర్తి శాస్త్రి గారు నాపై ఆదరం తో పన్నాలవారి సెల్ నంబర్ ఇవ్వగా హైదారాబాద్ లో వారింటికి వెళ్లి ఇంటర్వ్యు చేసి వారిచ్చిన పుస్తకాలు చదివి వారిపై గీర్వాణ౦ -2లో పన్నాలవారిపై రాసే భాగ్యం నాకు కలిగింది .
మర్నాడు ఉదయమూ ‘’ప్రేమస్వరూపిణీ,ప్రత్యక్ష దేవతామూర్తి అమ్మ దర్శనం చేసి ‘’ సంతృప్తిచెంది ‘’అమ్మ చూపు ‘’కు తన్మయులయ్యారు ‘’ఆమెను చూస్తున్నంత సేపూ బాహ్య దృష్టికి కాని ,మనో నేత్రానికి కాని మరేదీ గోచరించలేదు .అదో ఆకర్షణ ,అదో రీతి తన్మయత్వం ‘’అని మహా అను భూతిపొందారు దువ్వూరివారు .ఉన్న విశేషమంతా అమ్మ చూపులోనే ఉంది .మనతో మాట్లాడదేమిటి అనే భావం రాదు .మాటాడుతున్నట్లే ఉంది ,ఆదరిస్తున్నట్లే ఉంది ,జాలి పడుతున్నట్లే ఉంది ,బుజ్జగిస్తున్నట్లు ధైర్యం చెబుతున్నట్లు ఉంది .ఇవన్నీ కంటి చూపులలోనే ఉన్నాయి .ఆ చూపు మహిమే మాతృశ్రీ జిల్లెళ్ళ మూడి అమ్మ చూపు .ఉదయం పాద నమస్కారం అయ్యాక ,గదిలోకి వెళ్లి పోయింది .లేద్దామనుకొంటు౦డగా,సన్నిధానులు కాసేపు ఆగమన్నారు .అందర్నీ పంపేసి ,ప్రత్యేక దర్శన అనుగ్రహం ఇవ్వగా,ఆమె మంచాన్ని ఆనుకొని కూర్చున్నారు .అమ్మ ‘’నా చేయి పట్టుకొని తిరగ ,బోర్లాతిప్పి ,తన వ్రేళ్ళతో నిమురుతూ ,ఎన్నో కుశలప్రశ్నలు వేసి మాట్లాడుతోంది .ఇలా చేయటం తో నా కంఠ దోషాలను ,నాలుక దోషాలను వ్రేళ్ళద్వారా బయటికి లాగేస్తోంది ‘’అని పించింది శాస్త్రి గారికి .’’అదొక భావన ,నమ్మిక ,.నమ్మిక లేకపోతె ప్రపంచం లేదు .సృష్టి అంతా మన నమ్మకం పైనే ఉంది .’’యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ’’’’అను కొన్నారు .’’బ్రహ్మ తన సృష్టిలోఅక్కడొక బొట్టూ అక్కడొక బొట్టూ గా ఉన్న వాత్సల్య రసాన్ని అంతనూ పోగు చేసి ,ఒక్క ‘’అమ్మ ‘’హృదయం లో ఉంచి నట్టున్నాడే అని తోచింది .అమ్మసన్నిధికి వెళ్ళే టప్పటికి నా వయసు 74.అమ్మ దగ్గర నా వయస్సు 7+4=11 ఏళ్ళ పసివాడిని అని నేను అనుకొన్నాను .ఆమె కూడా అలాగే అను కొని ఉంటుంది .వదల్లేక వదల్లేక అమ్మను వదిలి వదిలి వచ్చాము ‘’అని దివ్యానుభూతితో అన్నారు దువ్వూరివారు .
తర్వాత ఎప్పుడో ప్రముఖ లింగ్విస్ట్ ఆచార్య భద్రి రాజు కృష్ణమూర్తి గారు కనిపించి ‘’అమ్మను చూసి వచ్చారట కదా ‘’అనగా ‘’నీకు ఎలాతెలిసి౦దోయ్ .ఎట్టాతెలిసింది?’’ అని అడిగారు .’’ఈ మధ్యే కుటుంబం తో వెళ్లి వచ్చాం మాస్టారూ .మీరు వచ్చినట్లు అమ్మ చెప్పింది ‘’అన్నారు .అమ్మ చెప్పింది అంటేఆశ్చర్య పడ్డారు దువ్వూరి వారు .’’నా మీద అమకు యెంత ప్రేమకలిగిందో ?ఎట్టా కలిగిందో ?అని లోపల పొంగిపోయాను ‘’అన్నారు శాస్త్రీజీ .
ఆధారం –దువ్వూరి వారి స్వీయ చరిత్ర .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-19-ఉయ్యూరు
—