జొన్నలగడ్డ అంటే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్,బహుభాషా వేత్త గొప్ప ఆరేటర్, అనేకగ్రందకర్త ,అనువాదం చేయించటానికి రష్యాకు ఆహ్వానిపబడిన తత్వ వేత్త రష్యా వెడుతూ ‘’ఆమంచు గడ్డలో ఈ జొన్నలగడ్డ ఏమౌతాడో’’అని వీడ్కోలు సమావేశం లో మాతో చమత్కరించిన జొన్నలగడ్డ సత్యనా రాయణ మూర్తిగారు గుర్తుకు వస్తారు .ఇదే పేరుతొ మరొక ప్రసిద్దులున్నారని చాలామందికి తెలీదు .వారిని పరిచయం చేసే భాగ్యం పొందుతున్నాను .
శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగారు రాజమండ్రికి చెందిన ఆరువేల నియోగులు .తండ్రి మృత్యుంజయులు .హరితస గోత్రం .ఇలవేలుపు కామేశ్వరమ్మ .తల్లి వేంకమాంబ.తల్లిగారు పెమ్మరాజు నరసింహం గారి కుమార్తె .మూర్తిగారు స్వయం కృషితో అభివృద్ధి సాధించిన ఆదర్శమూర్తులు .ఎం.ఏ .బి ఎల్ పాసై మద్రాస్ హైకోర్ట్ న్యాయవాదిగా ఉన్నారు .కలకత్తా యూని వర్సిటీ లో ఇంగ్లిష్ ,ఫిలాసఫీ ,హిస్టరీ ,ఎకనామిక్స్ ,పాలిటిక్స్ ,లాజిక్ ,లా లలో డిగ్రీలు పొందిన బహు విషయవేత్త .బెంగాలీ ,పాళీ భాషలలో లోతైన అవగాహన ఉన్నవారు .1926 కలకత్తాలో ‘’టాగూర్ ప్రైజ్’’పొందిన ప్రతిభా శాలి .గిడుగు వెంకట నరసింహ మూర్తి గారి పుత్రిక ,విదుషీమణి శ్రీమతి శారదాంబ గారు మూర్తి గారి ధర్మపత్ని .వీరిది ఆదర్శ దాంపత్యం . మూర్తిగారు తెలుగులో చాలా గ్రంథాలు రాశారు .ఆంద్ర ప్రచారిణీ గ్రంధమాలకు ,అద్దేపల్లి లక్ష్మణస్వామిగారి సరస్వతీ గ్రంథ మండలి ఎన్నో విలువైన పుస్తకాలు రాశారు .ఆంద్ర మహాపురుషుల జీవితాలపై గ్రంథం రచించి ,ఆంద్ర రిసెర్చ్ యూని వర్సిటీలో ‘’సాహిత్య భూషణ ‘’బిరుదు ,విజయనగరం లో ‘’భారతీ తీర్ధ ‘’బిరుదు అందుకొన్న విద్వద్వరేణ్యులు .ఋషుల చరిత్రపై అమితా సక్తి ఉన్నవారు .దేశం లో ఏ కొత్త వింత విషయం చెవిన పడినా స్వయంగా అక్కడికి వెళ్లి విషయసేకరణ చేసి రాసి ప్రచురించటం మూర్తిగారి ముఖ్య హాబి .
కాశీ రామేశ్వరాది అనేక పుణ్యక్షేత్రాలను దర్శించిన పుణ్యమూర్తి .కవి ,పండిత పక్షపాతి .వీరి గ్రంథాలు విశ్వ విద్యాలయాలలో పాఠ్యగ్రంథాలుగా విరాజిల్లాయి .’’సంపూర్ణ భక్త విజయం ‘’పేరిట రెండు బృహద్ రచనలు చేశారు .క్లిష్టత లేకుండా సరళభాషలో అందరికీ అర్ధమయేట్లు రాయటం వీరి ప్రత్యేకత .ఇందులోని మొదటి భాగం లో 65మంది భక్త శిఖామణుల చరిత్ర ఉన్నది .840 పేజీల బృహత్ గ్రంథం.వీరిలో అతి ప్రాచీన ,ప్రాచీన ,మధ్యమ నవీన భక్తులందరూ ఉన్నారు .దీనికి శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రిగారు విలువైన ముందుమాటలు రాశారు .ఇది 1943లో ముద్రితం .ఇంతకంటే మూర్తిగారి వివరాలు తెలియలేదు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-19-ఉయ్యూరు
–