మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా రాష్ట్ర ధ్యాన దేవుడు తనకులం నుంచి బహిష్కరిప బడినతర్వాత పన్ధర్పురానికి వెళ్లి మతోద్యమ విప్లవం విస్తృతం చేశాడు .బ్రాహ్మణుల అధికారాన్ని ఎదిరించాడు .జనసామాన్యానికి భగవద్గీత అర్ధమయేట్లు  మరాటీ భాషలో రాసి జన వ్యాప్తికలిగించాడు .జంతు హి౦స మాన్పించి ,విశ్వాసం తోనే భగవంతుని చేరవచ్చునని బోధించాడు .జనంలో మంచి పేరు వచ్చి భక్తజనం కవులు బాగా ఆయనకు దగ్గరయ్యారు .దీనితో ప్రజలకు సాంఘిక స్వాతంత్ర్యం ఏర్పడి నూతన రూపు దాల్చింది మహారాష్ట్ర సమాజం .ఆయన భక్తులలో ప్రముఖుడు చండాల వంశానపుట్టిన ‘’చోక మేల’’.

 

image.png

image.png

  ఈ మతోద్యమం భీమ నదీ తీరాన ఉన్న ముఖ్య స్థలం అక్కడ ఒక ప్రాచీన దేవాలయం ఉంది.కాని 13వ శతాబ్ది వరకు దానికి ప్రచారమే లేదు .అదే పన్ధర్ పుర దేవాలయం .ఈ దేవాలయం లోని ఇటుక వేదికపై నిలిచి  విఠోబా ను ఆరాధించాలని ,భక్తులు ,సామాన్య జనం ఉవ్విళ్ళూరే వారు .స్వామి దర్శనంతో పులకించిపోయి జన్మ ధన్యమైనదని భావించేవారు .దీని గురించి కధలు,గాధలు తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి .ఒక కుంటి యోగి పైథాన్ నుంచి ,పండరీ పురానికి దేక్కుంటూ పాక్కుంటూ చేరి స్వామి దివ్య దర్శనం చేశాడట .ఆలయం పెద్ద గోప్పదేమీకాడు శిల్ప సౌందర్యమూ పెద్దగా లేదు .కాని అదొక గొప్ప ఆకర్షణ .ఆలయం లోని ప్రతిభాగం లో భక్తీ చిప్పిలుతుందని భక్తులు భావించి దర్శించి మురిసిపోయేవారు .

  విఠల దేవుని ప్రదానసేవకులలో చోక మేల ఒకడు .తండ్రి సుదాముడు .తల్లి ముక్తాబాయి .వీరిది పండరికి దగ్గరలోని అనాగడ్ అనే పల్లె.మంచి స్థితిపరులే కాని సంతానం లేదు .సుదాముడు తరచూ పండరినాధుని దర్శించి పుత్రభిక్ష ప్రసాదించమని వేడుకొనేవాడు .భర్త  ఊరిలో లేనప్పుడు భార్య ముక్తాబాయి తమ తోటలోని 200మామిడి పండ్లను కోసి బీదర్ లోని ముసల్మాన్ గవర్నర్ కు అందజేయటానికి తీసుకు వెళ్ళేది .ఒక రోజు పేద బ్రాహ్మణుడు దారిలో కనిపించి ఆకలిగా ఉంది కొన్ని పళ్ళు ఇస్తే తిని ఆకలి తీర్చుకొంటానని ప్రాధేయపడ్డాడు .సంతోషం తో పండిన పండ్లు అయిదు ఆయన చేతిలో పెట్టింది .వాటిని తీసుకొంటూ ‘’అమ్మా !నీ సౌజన్యం ఎనలేనిది .మీకు పండంటి అయిదుగురు సంతానం కలుగుతారు .నాకు మామిడిపళ్ళు ఇచ్చావు కనుక  నీ పెద్ద కొడుకుకు ‘’చోక’’(చోక్ సేన్ అంటే మరాటీలో మామిడి పండు అని అర్ధం )అని పేరు పెట్టు అని చెప్పి వెళ్లి పోయాడు .

  కొంతకాలానికి ముక్తాబాయి దంపతులకు పుత్రుడు జన్మించగా ‘’చోక ‘’లేక చోక మేల అని పేరు పెట్టుకొన్నారు .తల్లీ తండ్రీ భక్తులే కనుక చిన్నప్పటి నుంచి బాలుడికి కూడా ఆభక్తి సహజంగా అబ్బింది .చండాల వంశజుడు కనుక ఊళ్ళో ఏ పశువు చనిపోయినా ఈడ్చుకు వెళ్లి బయట పారేయటం అతని పని అయింది .ఒక సారి ఊరి పెద్దలతో సహా తండ్రి ఊర్లో లేనప్పుడు ఒక పెద్ద ఆవు చచ్చిపోతే ,దాన్ని కళేబరాన్ని ఈడ్చి పారేయాల్సి వచ్చింది చోక మేల కు .యితడు చిన్నారి బాలుడు .దాన్ని లాగేసే శక్తి లేనివాడు. విఠోబాతన శక్తినిచ్చి  సాయం చేశాడు .ఒక సారి పండరి ఆలయం లో స్వామి దర్శనానికి వచ్చి దర్శించి జన సమూహం లో ఉండిపోయిన ఒక సుందరి,అయిన బాలిక  చోక మేల ను చూసి ,అకస్మాత్తుగా పాదాలపి వ్రాలి తనను భార్యగా చేసుకోమని కోరింది .సరే నని తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడాడు .

  కొన్ని రోజుల తర్వాత తన హృదయేశుడు పందడరినాథుని సమీపాన నివసించాలని కాపురం పండరిపురానికి మార్చాడు .అనుకూలవతి భార్య సకల విధాలా సాయపడుతోంది .పండరి వెళ్ళాడే కాని,నీచ కులజుడవటం వలన, ఆలయ ప్రవేశం నిషిద్ధం కనుక  విఠలుని సేవ చేయటానికి కుదరటం లేదు .బయట గుమ్మం దగ్గర కూర్చునే కనిపించీ కనుపించకుండా స్వామిని దర్శిస్తూ తన్మయుడయేవాడు .ఇలా రోజూ కూర్చుంటూ తర్వాత చీపురుతో గుడి చుట్టూ బాగు చేస్తూ ఉండేవాడు .గుడిలో జరిగే ప్రార్ధనలు భజనలు అన్నీ బయటినుంచే వింటూ కనిపిస్తే చూస్తూ కాలక్షేపం చేసేవాడు .మాదిగవాడు సన్యాసి కావటం ధ్యాన దేవుడి శిష్యులకు కూడా ఇష్టం గా ఉండేదికాదు .అతని భక్తిని అపహాస్యం చేసేవారు .

  ఇలా ఉండగా ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అసూయతో చోకమేలతో ‘’ఎందుకు వృధాగా రోజంతా ఆలయం బయటే కూర్చుంటావు .బ్రాహ్మణుడి దగ్గర కూర్చుని అతని కుక్క కంచంలోని ఆ పెరుగన్నం తినాలనే  ఆశ ఎలా నెరవేరదో, నీకు విఠల దర్శనం అలా నెరవేరదు .బిచ్చగాడు రాజవాటం యెంత అసంభవమో,  నువ్వు వైకుంఠం చేరటం అంతే అసంభవం ‘’అన్నాడు .ఆమాటలు ములుకులుగా గుచ్చుకొన్నా, చోక మేల వినయంతో నమస్కరించి ‘’అయ్యా !కోట్ల మైళ్ళలో ఆకాశం లో ఉన్న సూర్యభగవానుడు నేలమీదనీటిలో ఉన్న పద్మాలకు కిరణ శోభకలిగించి వికసింప జేయటంలేదా ?దూరంగా ఉన్నా, నా విఠలదేవుడు నామొర ఆలకించి నన్ను కనికరించక పోడు.మనుషుని హృదయం లో ఆ స్వామిని ప్రతి స్టి౦చు కొన్న ప్రతివాడూ ఆయనకు దగ్గరగా ఉన్నట్లే ‘’అన్నాడు .

 అదే రోజు రాత్రి విఠలుడు చోకమేల ను తానే దేవాలంలోకి తీసుకు వెళ్లి,గర్భాలయం లో కూర్చోబెట్టి , అతని భక్తిని ప్రశంసించాడు .ఇ౦తలొ ఆలయ౦ లోని పూజారులు మేలుకొని ,ఘోరం జరిగి పోయిందని గగ్గోలు పెట్టి మిగిలిన పూజారులను పిలిచి రప్పించారు  .తలుపులన్నీ వేసి ఉంటె ఎలా ప్రవేశించాడనే ఆశ్చర్యంతో పాటు మాదిగావాడివలన ఆలయం అపవిత్ర మైనదని ఆక్రోశం కలిగింది వారికి ,కోపోద్రేకాలను ఆపుకోలేక అతడిని కొట్టి బరబరా గొడ్డును లాగినట్లు లాగించి బయటపడేశారు  .అతడు నిశ్చల నిర్మల మనసుతో ‘’పెద్దలారా !గంగానదిలో మాదిగవాడు స్నానం చేస్తే అది మైలపడుతుందా ?వీచేగాలి చండాలుని సోకితే మైలపడుతుండా ,అతని ఊపిరి వాయువును మైలపరుస్తుందా ?చండాలకులం లో పుట్టిననేను ఏ అపరాధమూ చేయలేదు ‘’అనగా  వాళ్లకోపం తారాస్థాయి చేరి ‘’నీచకులం లో పుట్టి ,మాకు నీతులు నేర్పుతున్నావా ?’’అని మండిపడి రాజు దగ్గర నివేదించారు .

  రాజు మహమ్మదీయుడు  చోకమేల ను పిలిపించి విచారించాడు .అతడు ‘’ఆ విఠోబా దేవుడే నేను అంటరాని వాడిని అని మొరపెట్టినా ,వినక తానె తీసుకువెళ్ళి గర్భాలయం లో కూర్చోబెట్టాడు నేనేమి  చేయగలను ?’’అన్నాడు .ఎన్ని విధాలా చెప్పినా వినక ముస్లిం నవాబు అతడి మెడకు బండపలుపు కట్టించి వీధుల్లోకి   ఈడ్పించాడు .గట్టి ప్రాణం కనుక తట్టుకు నిలబడ్డాడు .పండరి నుంచి బహిష్కరింఛి భీమనదికి అవతల పదేయించి మళ్ళీ రావద్దని శాసించాడు ‘.

  హరి లోన కొలువై యున్న భక్తునికి భయమెందుకు ?చోకమేల భీమనది ఒడ్డున ‘’దీపమాల ‘’కట్టించి ,తనగుడిసె లో కూర్చునేవాడు  .ఒకరోజు నిమ్మ చెట్టుకింద భోజనం చేస్తుంటే పండరి విఠలుడు ప్రత్యక్షమవగా ,ఆయనకూ విస్తరి వేసి భార్య వడ్డించింది .వడ్డనలో కుండలోని పెరుగు స్వామి వస్త్రాలపై పొరబాటున పడింది .’’దేవాది దేవుడు మనింటికి వస్తే ఇలా అపచారం చేస్తావా ?’’అని భార్యను కసిరాడు .అదే సమయంలో ఆలయ పూజారి అటు వస్తూ చోక మేల విఠలుని దూషిస్తున్నాడని భ్రమపడి ముందూ వెనుకలు చూడకుండా చెంపలు వాయించి నీచుని ముట్టుకొన్నందున భీమనదిలో స్నానించి దేవాలయం చేరి  పూజ చేస్తుండగా దేవుని వస్త్రం పై పెరుగు కనిపించి,దేవుడి చెంప వాఛి  ఉండటం ,  కళ్ళ నుండి కన్నీరు  కారటం గమనించాడు .జరిగినది అర్ధమై మహాయోగి అయిన చోకమేల కు తాను  చేసిన పరాభవానికి చింతించి దానిప్రభావం స్వామి మీద పడటం గుర్తించి అతడు మహా యోగి అని భక్త శిఖామణి అని తెలుసుకొన్నాడు .క్షణం ఆలస్యం చేయకుండా ఆ చండాల భక్త యోగీశ్వరుని పాదాలపై వ్రాలి క్షమించమని అర్ధించాడు .సగౌరవంగా అతడిని తనతో ఆలయానికి తీసుకు వెళ్ళగా స్వామి బుగ్గ వాపుతగ్గి అశ్రుధార మాయమై,మందస్మిత ముఖారవి౦ద౦ తో  విఠోబా దర్శనమిచ్చాడు .చోకమేల పవిత్ర భక్తి అందరికీ తెలిసి ,అతని చరిత్ర మహా రాష్ట్రం అంతా వ్యాపించింది .

  బీదరునవాబు  మంగళ మేఖల అనే పట్టణం చుట్టూ ఎత్తైన రాతి గోడ కట్టాలని నిర్ణయించి ,మాదిగలందర్నీ ఆపనిలో నియమించాడు .ప్రభువు ఆజ్ఞ కనుక చోకమేలకూడా పనిలో చేరాడు .ఒకప్రక్కకట్టిన గోడ పూర్తికాకుండానే అకస్మాత్తుగా కూలి,చోక మేల తో సహా కూలీలు దానికి౦దపడి చచ్చిపోయారు .అతని అస్థికలు గోడకింద కూరుకుపోయినా కీర్తి చంద్రికలు దశ దిశలా వ్యాపించాయి .విఠలుడు తనభక్తుడు నామదేవుని చోకమేల అస్తికలను తెచ్చి పండరిపురం  చేర్చమని ఆజ్ఞాపించాడు .ఆయన వెళ్ళగా అక్కడ అందరి ఎముకలు కలిసిపోయి గుర్తించటం కష్టమైంది .ఏం చేయలాని తెగ ఆలోచించి చెవి నేల మీద ఆనించాడు  ‘’విఠోబా విఠోబా ‘’అనే శబ్దం వినిపించి ,అవి చోకమేల అస్తికలే అని రూఢిగాభావించి పోగు చేసి తీసుకు వెళ్లి పండరి పురంలో భూగర్భం లో పాతిపెట్టింఛి ఒక శిలా స్థాపించాడు .అక్కడ మహారాష్ట్ర మాదిగలు నిత్యం భజనలు చేస్తారు .

ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’

  మరో భక్తుని తో కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-11-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.