మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు
క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం పై శ్రద్ధ ఏర్పడింది .అద్వైతుడు అనే మహాయోగి ని దర్శించాలని శాంతిపురానికి వెళ్ళగా స్వామీజీ మొదట అంగీకరించక పోయినా తర్వాత అతని భక్తీ విశ్వాసాలు చూసి,అనుగ్రహింఛి హరినామం ఉపదేశించాడు . ‘’కునియా ‘’అనే పల్లెకు దగ్గరలో ఉన్న అరణ్యం లో నివాసమేర్పరచుకొని హరినామ స్మరణం తో గడిపాడు .తురక విష్ణు భక్తుడవటం సహించలేక ఆమతస్తులు నేరం మోపి నవాబు దగ్గరకు తీసుకు వెళ్ళగా భటులతో తీవ్రంగా కొట్టించాడు .రక్తం ప్రవాహంలా కారి స్పృహ తప్పి పడిపోయాడు .చనిపోయాడని భావించి గోతిలో పాతిపెట్ట మన్నారు .అప్పుడు స్పృహ రాగా సేవకులు గురువుకు చెప్పారు .బ్రతికి ఉండగా పాతిపెట్టటం మంచిదికాదని నవాబు నదిలోకి తోసేయించాడు .చాలా దూరం కొట్టుకుపోయి చివరికి ఒడ్డు చేరాడు .
తినటానికి ,ఉండటానికి ఏమీ లేక అల్లాడుతుండగా సప్తగ్రామానికి చెందిన బలరామాచార్యులు ఇంటికి తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చాడు .హరి భక్తుడైన ఆచార్యులు పరమత సహనం తో జనం నినదించినా లెక్క చేయకుండా ఈతురకను కాపాడి,ఇంట్లో ఉంచుకొన్నాడు .హరి దాసు నామ సంకీర్తనం తో ఎక్కడోకాలిన మహమ్మదీయులు ఆచార్యులను దూషించారు .అతడు తన్మయత్వంలో హరినామ స్మరణ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు .పిచ్చివాడని గోల చేశారు .సప్తగ్రామ జమీందార్ కొడుకు రఘునాధుడు ఆచార్యుల వద్ద విద్య నేరుస్తున్నాడు .కాని హరిదాసు భక్తికి ఆకర్షితుడై చదువు సంధ్యలు మానేసి తానూ అదే ధోరణిలో హరి కీర్తన చేస్తుండగా తురక సన్యాసి దగ్గర ఇలా చేయటం తండ్రికి నచ్చక ,కేకలేసి వినకపోతే గురువునే దూషించాడు .తనవలన గురువు నిందపడాల్సి వస్తోందని గ్రహించి ,గురువుకు కృతజ్ఞత చెప్పి శాంతిపురం చేరి ,గంగానది ఒడ్డున ప్రశాంతంగా గడిపాడు .
రోజుకు లక్ష సార్లు తక్కువ లేకుండా హరి నామ స్మరణ చేసి మాత్రమె మంచి నీరు త్రాగేవాడు .అతని తారకమంత్రం ”హరే కృష్ణ హరే కృష్ణ -కృష్ణకృష్ణ హరే హరే -హరేరామ హరేరామ రామరామ హరే హరే ” ఈ పవిత్రాత్ముని చూసి జనం శిష్యులుగా చేరారు .ఆ వూరి జమీందార్ కు ఇది ఇష్టం లేక ,అతని ఏకాగ్రత మరల్చాలని ఒక భోగం స్త్రీని ప్రేరేపించి ఒకార్ధ రాత్రి అతని కుటీరం లోకి పంపాడు .దేహ స్పృహ లేని దాసు హరినామస్మరణతో పరవశమై ఇదేదీ గమనిచ లేదు .ఆమె అనేక ప్రయత్నాలు చేసి౦ది కాని అతనికి బాహ్య స్పృహ ఉంటేగా ?రాత్రి తెల్లవార్లూ బతిమాలుతూ బామాలుతూ తిడుతూ ,కోప్పడుతూ విశ్వ ప్రయత్నం చేసి విఫలమై తెల్లవారగానే వెళ్లి పోయింది . మళ్ళీరాత్రి వచ్చి రెచ్చ గొట్టే మాటలతో ప్రయత్నించి చివరకు తానుకూడా దొంగ భజన చేస్తున్నట్లు నటించింది కాని దాసు ప్రవర్తనలో మార్పు లేక,ఏకాగ్రతకు భంగం కలగక పోవటంతో నిరాశతో ఇంటికి వెళ్ళింది .ఎలాగైనా అతన్ని లొంగ దీయాలన్న జమీందార్ ప్రేరణతో ఎక్కువ డబ్బు ఆశకు మూడో రోజూ వచ్చింది .సకలప్రయత్నాలు చేస్తూ చివరికి ‘’భ్రమర కీటక న్యాయం’’లాగా ఆ వేశ్య కూడా భక్తి పారవశ్యంలో తన్మయురాలైంది.ఇప్పుడు కళ్ళు తెరిచిన హరిదాసు ఆమెపై జాలిపడి మంత్రోప దేశం చేశాడు ఆమె కూడా నిరంతర హరినామ స్మరణతో జన్మ చరితార్ధం చేసుకొన్నది ..
కొంతకాలం తర్వాత హరిదాస ఠాకూర్ నవద్వీపం వెళ్లి అక్కడి వైష్ణవులతో కలిసి తిరిగాడు .అతని భక్తి,ప్రేమలను గుర్తించి అనేక సేవలు చేశారు .చైతన్య మహాప్రభువు ‘’నీలాచలం ‘’అంటే పూరీ జగన్నాధం లో ఉన్నారని తెలిసి భక్త బృందం తో వెళ్లి ,చైతన్య సమక్షంలో జీవనం గడిపాడు .’’యవన హరిదాసు ‘’గా గుర్తింపు పొందిన యితడు చైతన్యుడు తనువు చాలించక పూర్వమే పరమ పదించాడు .అంత్య సమయంలో చైతన్య ప్రభువు శిష్యులతో వచ్చి హరిదాసు దగ్గర కూర్చుని హరినామ స్మరణ చేశాడు .ఆ హరినామ సంకీర్తన చేస్తూ ,వింటూ తనవు పులకంకురాలు పొందగా యవన హరిదాసు దేహం చాలించాడు ఆ మహా భక్త శిఖామణి .చైతన్యుడు అతని పార్ధివ దేహాన్ని సింధు నది తీరానికి చేర్చి,దిక్కులన్నీ హరినామ స్మరణతో పిక్కటిల్లుతుండగా సమాధి చేయించి బృందావనం నిర్మించాడు .
ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’మహా భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-19-ఉయ్యూరు