మహా భక్త శిఖామణులు
4-ఆవుల్ చాంద్ స్వామి
బెంగాల్ లో ‘’కర్తాభజ ‘’సంప్రదాయ స్థాపకుడు ఆవుల్ చాంద్ స్వామి .పార్శీ భాషలో దేవుడిని ‘’ఆవూలియా అంటారు .అందులోని పుట్టినపేరే స్వామి ది.ఆయన పుట్టుపూర్వోత్తరాలు తెలీవు .బెంగాల్ లో సుమారు 400ఏళ్ళక్రితం నదియా జిల్లా ఉలా అనే గ్రామం లో మహాదేవ దాసు అనే శూద్రుడు ఉండేవాడు .తనకున్న తమలపాకు తోటలోని ఆకులను కోసి అమ్మి,కొద్దిపాటి వ్యవసాయమూ చేస్తూ జీవనం చేస్తున్నాడు .ఒక రోజు మధ్యాహ్నం తోటలోలో పొదలదగ్గర పసి పిల్లాడి ఏడ్పు వినిపించి ,చూడగా ,తోటమధ్య ఒక బాలుడు కూర్చుని ఏడుస్తున్నాడు .అతడిని ఊరు పేరు అడిగితె తనకేమీ తెలీదన్నాడు .పిల్లలు లేరుకనుక వాడిని ఇంటికి తీసుకు వెళ్ళాడు .అందమైన ఆపిల్లాడిని చూసి భార్యకూడా సంతోషించి పూర్ణ చ౦ద్ అనే పేరుబెట్టి పెంచారు .కుర్రాడికి అన్ని పనులు పురమాయించి చేయిస్తున్నాడు దాసు .ఏదైనా నాతేడావస్తే తిట్టటం కొట్టటం కూడా చేసేవాడు .ఓర్చుకొంటూ భగవధ్యానం చేసేవాడు బాలుడు . ఆ ఇంటి ప్రక్క హరి భక్తుడైన హరిహరుడు అనే ఆయన ఇంట్లో సంకీర్తన జరిగేది .పూర్ణచంద్రుడు రోజూ వెళ్లి వినేవాడు .బుద్ధి చురుకైనదికనుక అక్కడ జరిగే వేదాంత చర్చలన్నీ అవగతం చేసుకొనేవాడు .కొద్దికాలం లోనే సంస్కృతమూ బాగా అబ్బింది .అందరు ఆకుర్రాడి తెలివి తేటలకు ,భక్తికి ఆశ్చర్యపోయేవారు .కాని పెంచిన హరిదాసు గుర్తించలేక పోయాడు .అతడి సతాయింపు వేధింపులతో ప్రక్కింటికి వెళ్ళే సమయం దొరికేదికాదు .కాని హరికీర్తనమాత్రం మానలేదు .ఇంటినుంచి వెళ్ళిపోదామని అనుకొన్నాడు. యజమాని గ్రహించి ఆపేశాడు .హరిహర ,పూర్ణ చంద్రులు నిర్విరామంగా హరి కీర్తన చేశారు .పెళ్లి చేసుకోమని గురువు చెప్పగా ,ఇష్టం లేక ఆఊరు వదిలి ‘’పులియా ‘’గ్రామం చేరాడు .అది బ్రాహ్మణ అగ్రహారం. విద్వాంసులకు నిలయం .వైష్ణవులకు ఆటపట్టు.మహా భక్తుడు గౌరా౦గుని ప్రియ శిష్యుడు హరిదాసు ఒకప్పుడున్న చోటు.ఆయనకట్టించిన మఠం ఇప్పటికీ ఉంది .బలరాం దాసు అనే భక్తుడు అక్కడ ఉండేవాడు .ఈయనవద్దకు చేరి తనప్రవర్తనతో మెప్పించి వైష్ణవాన్ని స్వీకరింఛి ‘’ఆవుల్ చాంద్’’పేరుతొ ప్రసిద్ధుడయ్యాడు .
సంవత్సరన్నర కాలం అక్కడే ఉండి,బలరామ దాసు శిష్యులతో తూర్పు బెంగాలు కు వెడుతుంటే వెంట వెళ్ళాడు .కొంతకాలం అలాగడిపి, మళ్ళీ పులియా గ్రామం రాకుండా తీర్ధయాత్రలు చేశాడు .భారత దేశ పుణ్య క్షేత్రాలన్నీ సందర్శించి చివరికి వజ్రా అనే గ్రామంలో స్థిరంగా ఉండిపోయాడు .రోజూ భిక్షాటన చేసి వచ్చినదానిలో పేదలకు పంచి తానూ తినేవాడు .రోగార్తులను అన్నార్తులను ఆదరి౦చేవాడు ,జ్ఞానబోధలతో అందరినీ ఆకర్షించేవాడు .అతని హరినామ సంకీర్తన వినటానికి భక్తులు బాగావచ్చేవారు .అతని దైవబలం గొప్పది అవటం తో రోగుల బాధలు తీరేవి ,కంటి చూపు నోటిమాటకూడా వచ్చేవి .ఏ జబ్బైనా అతని సమక్షం లో నయమౌతుందనే నమ్మకం బాగా పెరిగింది .శిష్యబృందమూ పెరిగింది .అందులో హుటూ ఘోష్ ,బెబూ ఘోష్ లు ముఖ్యులు .
రామశరణుడు అనే అతనికి శూలవ్యాదివస్తే ,ఆవుల్ చాంద్ నయం చేయాగా శిష్యుడైపోయాడు .సామాన్య గృహస్తు ఐన యితడు పెద్ద జమీందార్ దగ్గర మంచి ఉద్యోగం లో చేరి అభిమానం పొంది ‘’ఉఖరా ‘’అనే పరగణాలో పెద్ద ఉద్యోగం పొందాడు .ఈ ఉద్యోగం లో ఉండగానే శూలవ్యాది వచ్చింది మూర్చలుకూడా వచ్చేవి .ఆవుల్ చాంద్ ను శరణు వెడితే కమండల జలం ముఖం పై చల్లి నయం చేశాడు .స్వామి శిష్యుడై అతని భావవ్యాప్తికి దోహదపడ్డాడు రామ శరణుడు.
వంగశకం 1651వైశాఖ శుద్ధ పంచమినాడు సాయంత్రం సిద్ధిపొండాడు ఆవుల్ చ౦ద్ .సిద్ధి పొందేముందు బోయాలియా అనే గ్రామం లో శిష్యుడు కృష్ణదాసు వ్యాధితో బాధపడుతున్నాడని ,తనరాకకోసమే ప్రాణాలతో ఉన్నాడని తెలిసి ,అతన్ని చూడటానికి వెడుతూ అక్కడున్నవారిలో కొందరిని తనతో రమ్మనీ ఇక తాను అక్కడికి రానని పరలోకం వెడుతున్నానని చెప్పి కమండలం కాషాయం మాత్రమె తీసుకొని బయల్దేరాడు .కృష్ణదాసు మరణించాడు. స్వామికి జ్వరం వచ్చి చాలా రోజులుంది .తనకు అంత్యకాలం దగ్గరైందని గ్రహించి తనను ‘’తులసీ తలం ‘’తీసుకు వెళ్లి అక్కడ హరినామ కీర్తన చేయమన్నాడు .నామస్మరణ వింటూ, తానూ ఉచ్చరిస్తూ తన్మయం పొంది తన తుది శ్వాస వదిలాడు
శిష్యులు స్వామి పార్ధివ దేహాన్ని ‘’పరారీ ‘’అనే పల్లెకు తీసుకు వెళ్లి సమాధి చేశారు .ఆయన దగ్గరున్న కాషాయ వస్త్రాన్ని బోయాలియా గ్రామానికి పంపారు .బ్రతికి ఉండగానే చిరిగిన శాటీని రామశరణుడికిచ్చాడు స్వామి.అది ఇప్పటికీ భద్రంగా అక్కడే ఉంది.స్వామికి ఉత్తరాదికారి గా రామశరణుడు ఆశ్రమ బాధ్యతలు చేబట్టాడు .కొద్దికాలమే బ్రతికి మరణించాడు అందరూకలిసి అతని వంశీయుడు ఈశ్వర చంద్రుని మఠాధిపతినిచేశారు .తర్వాత ఇతనికొడుకు హరిదాసు ఆతర్వాత అన్నకొడుకు రసిక్ చంద్రుడు అయ్యారు .
పతివ్రత అయిన రామ శరణుడి భార్యను ఆవుల్ స్వామి ‘’అమ్మా అని సంబోధి౦చేవాడు .ఆమె కీర్తి ఇప్పటికీ ప్రజలకు జ్ఞాపకం ఉంది .
ఆవుల్ చాంద్ స్వామి బోధన సారాంశం –‘’ఏకమాత్ర పరమ స్వరూపుడైన శ్రీ కృష్ణుని ధ్యానించండి .ఇతర దేవతా దూషణ చేయవద్దు .ఆచార్యుని యెడ భక్తీ మనసులో ఆచరణలో చూపండి .ఉదయం ,సాయంత్రం ఉతికినబట్ట లే కట్టుకోండి .అతిధులను సేవించండి .హరినామ స్మరణ సత్కర్మా చరణ వదలకండి .అందర్నీ సోదరభావంతో చూడండి .అన్ని వేళల అన్ని చోట్లాసత్కాలక్షేపమే చేయండి .వైష్ణవ ధర్మాన్ని పాటిస్తూ,అందులోని మహాత్తునుప్రజలకు తెలియ జేయండి .మనసు నిర్మలంగా ఉంచుకోండి .ఉచితాహారమే తినండి .ఆత్మ సత్యం అని నమ్మండి .ధర్మ విషయాలను చర్చించండి ‘’
స్వామీజీ నిషేధించిన క్రియలు –ఇతరుల సొత్తు అపహరి౦చ టం హత్య ,పరస్త్రీ పొందు .అబద్దాలాడటం ,కఠినవాక్కు వ్యర్ధ ప్రసంగాలు ,దురాలోచన .
ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-11-19-ఉయ్యూరు