మహా భక్త శిఖామణులు
5-కుపరాబాయి
పురోహితుడి కూతురు కుపరాబాయి .ఈ పిల్ల పుట్టకముందు సంతానం కోసం తల్లి తండ్రులు చాలానోములు వ్రతాలు చేశారు .ద్వారకానగరానికి వెళ్లి శ్రీ కృష్ణ సేవ చేశారు .కృష్ణ కృపవలన కుపరాబాయి పుట్టింది .తల్లి పురుటినొప్పులతో బాధ పడుతుంటే, కృష్ణుడే మంత్ర సానిగా వచ్చి సేవ చేశాడని జనంలో నమ్మకం ఉంది .పుట్టిన పిల్లకు ఆయనే శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించాడనీ అంటారు .తలిదండ్రుల భక్తీ ఆమెకూ అబ్బి నిరంతరం భగవధ్యానంలో గడిపేది .ద్వారక నుంచి తలిదండ్రులు స్వగ్రామం చేరారు .
దినదిన ప్రవర్ధమాన అయిన కూతురు కుపరాబాయికి యుక్తవయసు రాగానే తగిన వరునితో పెళ్లి చేశారు ,కాపురానికి అత్తవారింటికి పంపే ప్రయత్నం చేస్తుంటే ,సంసార జీవనం ఇష్టం లేక ,ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పెట్టి వెళ్లి, అనేక తీర్ధ యాత్రలు చేసి,ద్వారక చేరింది .అక్కడ శ్రీ కృష్ణ నామ సంకీర్తనతో కాలం గడిపింది .కొంతకాలం తర్వాత ఆమెను వెతుక్కుంటూ తండ్రి ద్వారకవచ్చి కూతుర్ని చూసి ఆనందించి తల్లి బెంగతో ఉందని ఇంటికి రమ్మని కోరాడు .కాదనలేక వెళ్ళింది కాని మనసంతా కృష్ణుడే నిండి ఉన్నాడు .
కూతురి ప్రభావం తలిదంద్రులమీద పడి వాళ్ళిద్దరూ కూడా హరినామస్మరణతో రోజంతా గడిపేవారు .ప్రజలలో కుపరాబాయి భక్తీ విశేషం బాగా వ్యాపించి ఆమె దర్శనం కోసం రోజూ వందలాది మంది వచ్చి ప్రభావితులయ్యేవారు .పాలనా చేసేవారూ ఆమెకు భక్తులయ్యారు .భక్తి మహాత్మ్యం వాలన వాళ్ళ కష్టాలు బాధలు తొలగి పోయేవి .ఆమె సాన్నిధ్యం లో అందరికీ పవిత్రత చేకూరింది .అంతటి ప్రభావం ప్రజలపై కలిగించింది కుపరాబాయి .
6-గుణవతిబాయి
ఉత్తర హిందూస్థాన్ లో ఒక చిన్నరాజ్యం పాలించే క్షత్రియరాజుభార్య గుణవతి బాయి .ఈమె దాసీలలో పరమభక్తురాలు ఒకామె ఉండేది .సేవచేస్తూనే మనసులో నిరంతరం భగవధ్యానం చేసేది .దాసీ భక్తికి ఆశ్చర్యపోయి రాణి తానుకూడా భక్తిలో గడపాలను కొంటున్నానని దాసికి తెలిపింది .ఆమె సంతోషంతో శ్రీకృష్ణమంత్రం రాణికి ఉపదేశించింది .మంత్రోప దేశ ప్రభావంతో రాణి నిరంతరం హరినామ స్మరణలోనే గడిపేది .సంసారం పై వ్యామోహం కలగలేదు .రాజుకు ఈమె ధోరణి నచ్చలేదు .ఆమె భక్తితో పాటు ,ఈతని కోపం కూడా హెచ్చింది .అయినా తనపూజాదికాలు మానలేదు .
బైరాగులు వచ్చి ఆమె మనసు చెడ గొడుతున్నారేమో అనే అనుమానంతో ఎవరినీ కోటలోకి రాకుండా రాజు కట్టడి చేశాడు .జాగ్రత్తగా చూస్తూ ఉండమని మంత్రికి చెప్పి ఒకరోజు రాజు వేటకు వెళ్ళాడు .రాణి గుణవతిబాయి యధాప్రకారం భజన పూజలు చేస్తూనే ఉంది .మంత్రి అడవికి వెళ్లి రాజుకు నివేదించాడు .తోక తొక్కినపామే అయిన రాజు తనమాటను ధిక్కరించినందుకు రాణి పై అసహనంతో ఆమె పీడవదిలి౦చుకొందామని నలుగురు భటులను ఆమెను చంపటానికి పురమాయించాడు .అడవినుంచి కోటకు వచ్చిన ఆ నలుగురు రాణి తీవ్ర ధ్యానమగ్నమై ఉండినందువల్ల దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోయారు .ఇంతలో వాళ్ళ హృదయాలలో ఏదో బాధకలిగి ,నలుగురూ కుప్ప గూలారు .ధ్యానం నుంచి బయటికి వచ్చిన రాణి వాళ్ళ దీనస్థితి చూసి ప్రేమతో వారికి సేవ చేసి కారణం అడిగింది .ఆమె మాటలు వారికి అమృతం గా అనిపించాయి .ఆమె కన్నులనుండి దివ్య తేజస్సు ప్రసారమౌతున్నట్లు గ్రహించారు .వెంటనే ఆమె పాదాలపై వ్రాలి క్షమించమని కోరి, రాజు పంపిన విషయం చెప్పారు .
కోటలో జరిగిన వృత్తాంతం మంత్రి రాజుకు తెలియ జేయగా, రాజు తన చేస్టకుసిగ్గుపడి ,పశ్చాత్తాపం తో కోటకు వచ్చి,రాణి గుణవతి బాయి చేతులు పట్టుకొని తనతప్పు మన్నించమని కోరాడు .ఆమె ‘’మీరు ఇలా అనకూడదు .మీ మనసుమార్చినవాడు ఆ కృష్ణపరమాత్మ .ఆకృష్ణమంత్రం నాకు ఉపదేశించిమనదాసి పుణ్యం కట్టుకొన్నది ‘’అనగా తనకు కూడా మంత్రోపదేశం కావాలని కోరాడు .దాసిని పిలిపించి రాజుకు మంత్రోప దేశం చేయమని చెప్పింది. ఆ దాసీ వినయంగా ‘’మహా రాజా !మీకు మంత్రోపదేశం చేసే అంతటి దాన్నికాను .రాణీగారు కోరినప్పుడు కూడా ఈమాటే చెప్పాను .చివరికి రాణీగాఋ పట్టుబడితే ఉపదేశి౦చాను మన్నించండి ‘’అన్నది .
మంత్రోప దేశ ప్రభావం తెలుసుకొన్న రాజు దాసీని తనకు తప్పక శ్రీ కృష్ణ మంత్రం ఉపదేశించమని అర్ధించాడు .కాదనలేక ఉపదేశించింది .ఆమెను పరిచారిక వృత్తి నుంచి విముక్తి చేసి కోటలోనే ఒక మందిరం ఏర్పాటు చేసి ధ్యానం చేసుకొనే వసతి కల్పించాడు .రాజు కూడా రాజకార్యాలతర్వాత కుటుంబంతో అక్కడే కృష్ణస్వామి పూజ భక్తీ శ్రద్ధలతో రోజూ చేసేవాడు .దాసీకి గురు పీఠంఏర్పాటు చేసి ఆమెకు తామంతా సేవకులుగా వర్తిల్లారు .రాణి గుణవతిబాయి అమితానందం పొందింది. ఇదివరకటికంటే ఎక్కువగా అతిధి అభ్యాగతులను ఆదరించేది .యోగులను దీనులను పూజించి సేవ చేసేది .ప్రజలుకూడా రాజు ,రాణీ లను అనుసరిస్తూ సత్కార్యాలు చేస్తూ కృష్ణ ష్ణభక్తిలో తరించారు .
పవిత్ర దా౦పత్యాన్ని కొన్నేళ్ళు అనుభవించి గుణవతీబాయి దేహం చాలించింది .గురుపీఠంలో ఉన్న దాసికూడా సిద్ధిపొందింది .రాజు కుమారుడికి రాజ్యమప్పగించి కోటలోని మఠంలోనే భగవధ్యానం లో రేయిం బవళ్ళు ఇహలోక ధ్యానం లేకుండా గడిపి సాయుజ్యం పొందాడు .కులం వృత్తి ముఖ్యంకాదు గుణమే గరీయసి అని దాసీ నిరూపించి, గురుపీఠ అర్హత పొందింది .దీన్ని గుర్తించిన రాజు రాణీ గార్లుకూడా తదనుగుణంగా ప్రవర్తించారు .
. ఆధారం –శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-19-ఉయ్యూరు
.