మహా భక్త శిఖామణులు
12-దీపా౦కుర స్వామి
బౌద్ధరాజు గోవి౦దపాలుడు విక్రమపురం రాజధానిగా పాలించేకాలం లో ,దానికి దగ్గరగాఉన్న వజ్ర యోగిని అనే పల్లెలో క్రీ.శ980లో దీపాంకురుడు పుట్టాడు .ఇతడిని ఆదినాథుడు అనిపిలిచేవారు. గొప్ప గురువు వద్ద చేరి మహా విద్వా౦సుడయ్యాడు .పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార సుఖం పొంది ,ఇల్లువదిలి విశేష శ్రమ చేసి హిందూ బౌద్ధ శాస్త్రాలలో గోప్పపా౦డిత్యం సాధించాడు .ధర్మ రక్షితుని వద్ద బౌద్ధ దీక్ష తీసుకొన్నాడు .ఆకాలం లో బర్మాలో బౌద్ధం బాగా వ్యాపించిఉంది .కొంతమంది వర్తకులు ఏనుగులు ఎక్కి బర్మా వెడుతుంటే వాళ్ళతోకలిసి 13నెలలు ప్రయాణం చేసి ఆదేశం చేరాడు .
చంద్ర కీర్తి అనే మహనీయుని చేరి యోగ శిక్షపొంది ,12ఏళ్ళు గడిపి సిద్దుడై భారత దేశం తిరిగి వచ్చాడు .మగధ బౌద్దులాతడిని’’ధర్మపాలుడు ‘’గా స్వీకరించగా అతనికీర్తి దశదిశలా వ్యాపించింది .రాజా న్యాయపాల్ అతని ప్రతిభను గుర్తించి ప్రధాన యాజకుని గా (ఋత్విక్కు) నియమిస్తానని అంటే ఒప్పుకోలేదు .ఆకాలం లో టిబెట్ దేశాన్ని హ్లాలామల్ అనే రాజు దోరింగ్ నగరాన్ని రాజధానిగా పాలిస్తున్నాడు .ఆదేశంనుంచి కొందరు బౌద్ధ సాధకులను భారత దేశానికి బౌద్ధ ధర్మం విశేషంగా నేర్చుకోవటానికి పంపాడు .వారు చాలా చోట్ల తిరిగి చివరికి మగధ చేరి దీపాకురిని ప్రజ్ఞా విశేషాలు తెలుసుకొని ,అతని సేవించి విజ్ఞానం గడించి తమతో టిబెట్టుకు రమ్మని ఆహ్వానించారు .దీపా౦కురుని ఎలాగైనా తీసుకురమ్మని వారికీ రాజు లక్షలాది బంగారునాణాలు పంపాడు .కాని యితడు అంగీకరించలేదు .
టిబెట్ రాజు చనిపోయాక అతని కొడుకులు దీపా౦కురుని ప్రార్ధించి ,ఒప్పుకోకపోతే నిర్బంధించి బలవంతంగా టిబెట్ తీసుకు వెళ్ళారు .అక్కడ 15ఏళ్ళు బౌద్ధధర్మాన్ని బోధింఛి విశేషకీర్తి సాధించాడు . 1035లో 55వ ఏట దీపాంకురుడు లాసా నగరం లో నిర్యాణం చెందాడు .ఇప్పటికీ టిబెట్ ,చైనా బౌద్ధులు దీపా౦కురుని స్మరిస్తారు .
13-కమలాకాంత స్వామి
వంగ దేశం బర్ద్వాన్ ఇల్లా అ౦బికాకాల్నా గ్రామంలో వంగశకం 1179లో కమలాకా౦త స్వామి పుట్టాడు .తండ్రిది వైదిక వృత్తి.చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ,తల్లి ఊరిబడిలో చదివించింది .మాతృభాషతోపాటు , సంస్కృతంకూడా పట్టుదలగానేర్చి గొప్పవాడయ్యాడు .చిన్నతనలోనే గ్రంథ రచనలు చేయటం ప్రారంభించాడు .కవిత్వంలో దిట్ట అనిపించాడు రసబందురకవిత్వం రాసేవాడు .సంగీతంలోనూ నిష్ణాతుడయ్యాడు .కంఠ స్వరం మహా మాధుర్యంగా ఉండటం తో వినేవారు పరవశి౦చే వారు .గాన్ధర్వగానాన్ని మరిపించేవాడు .శాంతదయా ప్రేమ పరిపూర్ణుడు .ఇతని గుణ గరిస్టతకు మెచ్చి బర్ద్వాన్ రాజు తేజచంద్ర బహదూర్ ఆస్థాన పండితునిగా 1216న నియమించి గౌరవించాడు .
రాజ ధర్మం నిర్వర్తించి మిగిలినకాలం దుర్గా దేవి ఆరాధనలో గడిపేవాడు .రసరమ్య గీతాలు అమ్మవారిపై రచించిపాడేవాడు .ఆ గానానికి జడపదార్ధాలు సైతం చైతన్యం అయ్యేవని చెప్పేవారు .రాజు ఇతనిని తన ఆచార్యుని చేశాడు .కోటం హాట్ లో అన్నివసతులతో సుందరభవనం కట్టించి అందులో ఉంచాడు .పూజలకు భజనలకు రాజు మరొక ప్రత్యేక మందిరం నిర్మించి ఇచ్చాడు .పూజలకు భజనలు దసరాలలో ప్రాత్యేకంగా చేసే దుర్గాపూజకు ఖర్చు అంతా రాజే భరించే వాడు .భార్య గుణవతి .సదా పతిసేవలోదుర్గా మాత సేవలో గడిపేది .భర్త సేవలో పగలూ రాత్రి సేవ చేసేది భార్య అని తలచి అతడు భావోద్రేకానికి గురయ్యేవాడు అప్పుడామె శాంతంగా ప్రేమతో అనునయించేది .
ఒక రోజు రాజోద్యోగి వచ్చి ‘’మహాశయా !పవిత్ర జీవితానికి కామినీ కాంచనాలు బంధనాలు కావటం లేదా ??’’అని అడిగాడు కమలాకా౦తు డు ‘’స్త్రీలు భగవతి స్వరూపులు ‘’స్త్రియః సమస్తః సకల జగత్ ‘’.స్త్రీ రత్నం .అలాంటిది సాధనాలకు అడ్డంకీ కాదు ‘’నాస్తి భార్యా సమో బన్ధుఃనాస్తి భార్యా సమాగతిః-నాస్తి భార్యా సమో లోకే సహయో ధర్మ సంగ్రహే ‘’ .ఆమె శక్తి స్వరూపిణి ‘’అన్నాడు .మనసు తృప్తి చెంది శిష్యుడయ్యాడు .
కొంతకాలానికి భార్య మరణించింది .చితిపై ఆమెను చేర్చి మృదు మధురంగా గీతాలాపన చేస్తూ నృత్యం చేశాడు .తన్మయత్వంలో నృత్యం చేసి ఆమె అంత్యక్రియలు నిర్వర్తింఛి మహదానందంతో ఇంటికి చేరాడు .ఒకసారి వేరే ఊరికి వెడుతుంటే ‘’ఓడగాయ ‘’అనే గ్రామం దగ్గర బందిపోటు దొంగలు కత్తులూ బల్లాలతో మీదకు ఉరికారు .ఏమాత్రం భయం లేకుండా మృత్యువు సమీపిస్తోంది అన్న పరమానందంతో గానం చేస్తూ నాట్యమాడాడు .ఆమధురమంజుల గానానికి బందిపోట్ల హృదయాలుకరిగి సాష్టాంగ నమస్కారాలు చేసి వెళ్ళిపోయారు .భయరహితుడు భగవతిని స్థిరంగా మనసులో కొలువు చేసుకొన్నవాడు కమలాకా౦తుడు తనమరణం దగ్గర పడిందని గ్రహించి రాజును తనదగ్గరకు పిలిపించి ధర్మోపదేశం చేసి ,పారమార్ధిక విషయాలు బోధించి రాజు మనసుకు ప్రశాంతత చేకూర్చాడు .తనను కి౦దపడుకోబెట్టమని చెప్పి, పడుకోబెట్టగానే ప్రాణాలు విడిచాడు .అదే సమయంలో దగ్గరున్న భోగవతీ నది బాగా ఉబికి అందరికీ ఆశ్చర్యం కలిగించిందని ఇప్పటికీ బెంగాల్ లో చెప్పుకొంటారు .సార్ధకజన్ముడు కమలాకాంత స్వామి .
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-19-ఉయ్యూరు