మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి
అర్జునమిశ్రపండితుడు పురుషోత్తమ ధామం లో బిచ్చమెత్తి జీవించే పరమ సాదు , ఉదార ,శాంత ,భక్తిస్వభావుడు .సదా భగవద్గీత పారాయణ చేసేవాడు .గీతార్ధసారం గ్రహించి టీక రాశాడు .ఇప్పటికీ ఉత్తరదేశం లో దీనికి విశేష ఆదరణ ఉంది .గీత 9వ అధ్యాయం 22వ శ్లోకానికి టీకరాస్తూ ‘’యోగ క్షేమ్యం వహామ్యహం ‘’అనేదానిపై సందేహం వచ్చి ‘’ప్రత్యక్ష భావం పూని ఉంటాను ‘’అని చెప్పిన గీతాచార్యుని వాక్యం సత్యం కాదని భావించికొట్టేసి ‘’పరోక్షభావం లో ఉంటాను అనే అర్ధం వచ్చే శబ్దాన్ని’’ ఇరికి౦చాడు .భగవద్గీత భగవానుని శరీరంకనుక ,ఈ కొట్టివేత పరమాత్మకు దెబ్బగా తగిలి ,మిశ్రాకు జ్ఞానోదయం కలిగించటానికి మొదట్లో గాలివాన కల్పించాడు .భిక్షాటనం చేస్తేనే కుటుంబపోషణ జరిగేదికనుక ,గాలివానకు బయటికి వెళ్ళలేక దంపతులు పస్తు ఉన్నారు .మర్నాడు భిక్షకోసం బయల్దేరితే విపరీతమైన వర్షం లో దూరం పోలేక కూలిపోబోతున్న గుడిసెలో తలదాచుకొన్నాడు .ఇంతలో ఇద్దరు బ్రాహ్మణబాలురు శరీరమంతా రక్తం కారుతూ మిశ్ర ఇంటికి వెళ్లి మిశ్రా ఆహారపదార్ధాలు పంపాడని చెప్పి ఒక రెండు మూటలు భార్యకిచ్చారు .ఆమె ఆశ్చర్యపోయి వాళ్ళ శరీరం రక్తమయం అవటానికి కారణం అడిగి అలాంటి కోమల శరీరులను తనభర్త ఎలా అంత పెద్ద బరువుగల మూటలు ,ఇచ్చి పంపాడు అని బాధపడి వాళ్ళ వృత్తాంతం అడిగింది. వాళ్ళు తమ తల్లిదండ్రులు బీదవారని తామిద్దరం మూటలు మోసి సంపాదించి కుటుంబ పోషణకు సాయపడుతున్నామని ,ఆ మూటలిచ్చి రమ్మంటే వచ్చామని ఆయనకు ఆకలి బాధతో మతి స్తిమితం తప్పి పిచ్చకోపంతో తమను ఒక ఇనుపకడ్డీతో కొట్టడని ఆయనింటికి రాగానే అడిగితె నిజం తెలుస్తు౦దని చెప్పి మూటలు దించి వెళ్ళిపోయారు .భర్తకే ప్రమాదం జరిగిందో అని కంగారుతో తన ఇద్దరు పిల్లల్ని వొళ్ళో నేసుకొని ఏడుస్తుంటే పిల్లలిద్దరూ యెగిరి పోయారు .ఇంతలో మిశ్రా వచ్చి విషయం తెలుసుకొని ,వాల్లరోపురెఖలెలాఉన్నాయని అడగ్గా ,పెద్దవాడు బంగారం రంగులో చిన్నవాడు నలుపురంగులో ఉన్నారని ,ముఖాలలో దివ్య తేజస్సుకనిపించిందని చెవులకు బంగారు కుండలాలున్నాయని చెప్పింది .’’అయ్యో భగవానుల నుకొట్టింది నేనే ‘’అని మూర్చపోయాడు దురంత వేదనతో .ఆమె కూడా మూర్చితురాలైంది .కాసేపటికి ఇద్దరూ తేరుకోన్నాక అతడు ‘’వచ్చిన వారు శ్రీకృష్ణబలరాములే .వారి దర్శనభాగ్యం పొందిన అదృష్టవంతురాలవు ‘’అని చెప్పాడు.కలం తో గీతలో తాను వహామ్యహం ‘’మాటకోట్టేసి వేరేమాట రాసినందుకు జగదీశుడికి తీవ్రమైన దెబ్బ కొట్టిందని ,పశ్చాత్తాప పడి ,తను చేర్చినమాట తీసేసి మళ్ళీ యధా ప్రకారమే ఉంచాడు .ఇంకా ఎక్కువ శ్రద్ధాసక్తులతో హరి సేవనం చేశాడు .ఇద్దరి భక్తికీ మెచ్చి కృష్ణుడు సాక్షాత్కరించి ధన్యులనుచేశాడు .
దారిద్ర్యం కఠోర దీక్షకు కారణం కావాలి. సేవాధర్మం ,పశ్చాత్తాపం విశ్వాసం ,అనుకూల దాంపత్యం జీవన్ముక్తికి హేతువులు .
15-మహంతజీ
భక్త మహంత జీ ఒరియా దేశాస్తు డైన నిరుపేద కృష్ణ భక్తుడు .భార్య మహా సాధ్వి .ఒకమగపిల్లాడు ఇద్దరాడపిల్లలు.ఒరిస్సాలో కాటకం వచ్చి తిండిదొరకటం కష్టమైంది .దరిద్రబాద భరించలేక కుటుంబం పోషించలేక మహంత్ కృష్ణుడే దిక్కు అని కటిక ఉపవాసాలతో ఉన్నారు .వీరిని చూడలేక ‘’కృష్ణా ,కృష్ణా ‘’అని మూర్చపోయేవాడు .భార్యకూడా అతనిబాధ గ్రహించి అతనికి స్నేహితులెవరైనా ఉంటె వెళ్లి ఆశ్రయిద్దామని సలహా చెప్పింది .’’దీనబంధు’ అనే స్నేహితుడు ఉన్నాడని ,అతడు ‘’నీలాచలం ‘’లో ఉంటాడని, అంతదూరం ఈ పరిస్థితిలో వెళ్ళలేమని చెప్పాడు .ఎలాగైనా వెళ్లి పిల్లలకైనా ఎంతో కొంత ఆహారం సంపాదించాలి అని చెప్పగా అందరూ కలిసి బయల్దేరారు .
చాలాప్రయాణ౦ కష్టనస్టాలుపడి చేసి పూరీ జగన్నాథంచేరారు .ఆలయంలో ఘంటా శంఖానాదాలు మిన్ను ముట్టుతున్నాయి .సింహద్వారం దగ్గర వీరంతా నిలబడ్డారు .జనంబాగా ఉన్నారు తోసుకు వెళ్ళటం కష్టం అనిపించింది .ద్వారం బయటనుంచే జగన్నాథ దర్శనం చేసి పులకి౦చి గంజికాలువదగ్గర చతికిలపడ్డారు .’’ఇంకా ఆలస్యం ఎందుకు మీ స్నేహితుడిదగ్గరకు వెళ్లి అడిగి ఏదైనా తీసుకు రండి ‘’అంది భార్య .అతడు ‘’మిత్రుడు ఎంతో మంది జనసమూహం లో ఉన్నాడు .కాసేపు ఓపికపట్టు .అప్పుడు వెళ్లి కలుద్దాం .దూరంగానైనా చూశాం కదా ఆతృప్తి చాలు .చావు గురించి దిగులెందుకు ?.ఇది మిత్రుని ప్రేమపూరిత నివేదన మైన అమృతతుల్యమైన గంజి. దీన్నే అందరం తాగుదాం ‘’అనగా అందరూ దోసిళ్ళతో ఆగంజే పంచభక్ష్య పరమాన్నంగా భావించి కళ్ళకు అడ్డుకొని కడుపు నిండా తాగారు .ఆయాసం తో ఆ గట్టుపైనే విశ్రమింఛి నిద్రలోకి జారారు .
కడుపాకలి తీరక మెలకువవచ్చి ‘’జగన్నాధా జగన్నాధా ‘’అని దిక్కులు పిక్కటిల్లేట్లు ఆర్తిగా అరిచాడు మహంత్ .రాతి గోడలలోపల బందీ అయిన జగన్నాథుని హృదయం కరిగిపోయింది .క్షణం ఆలస్యం చేయకుండా బ్రాహ్మణబాలుని వేషం లో ఒక బంగారుపళ్లెం నిండా మధురపదార్ధాలతో చరచరా నడిచి మహంత్ దగ్గరనిలించి ‘’నెచ్చెలీ !లేవండి .మీకోసమే మంచి మిఠాయిలు తెచ్చాను .తీసుకొని తృప్తిగా తినండి ‘’ అన్నాడు .మూర్చనుంచి లేచిన మహంత్ కు ఆమాటలు వినిపించాయికాని ,కళ్ళు తెరవలేదు .అలా మూడు సార్లు లేపాడు దేవాది దేవుడు .భార్యకు మెలకువవచ్చి ‘’మీ స్నేహితుడు అనుకొంటా ద్వారం దగ్గర నిలబడి పిలుస్తున్నాడు లేవండి ‘’అన్నది .అతని అనుమానాలు పటాపంచలై లేచి పిచ్చివాడిలాగా ఆసుందర బ్రాహ్మణ బాలుడిని చూశాడు .పళ్ళెం బరువుతో బాలుడి చేతులు వణుకుతున్నాయి .మహంత్ చెయ్యి చాపగా బాలుడు ఈతని నెత్తిపై పళ్ళెం పెట్టాడు .శరీరం గగుర్పొడిచింది .ఏదో మాట్లాడాలనుకొంటున్నాడుకాని మాటలు రావటం లేదు .బాలుడి పాదాలపై పడి ఏదో చెప్పాలనుకోన్నా,ఏదీ స్పృహకు రావటం లేదు. బాలుడు అదృశ్యమయ్యాడు .
మిఠాయి పళ్ళెం పిల్లల ముందు పెట్టాడు .ఆనందంగా ,సంతృప్తిగా అందరూ భుజించారు .ప్రాసాదమంతా తినేశారు .భార్య పళ్ళెం కడిగి శుభ్రం చేసి మిత్రునికి ఇచ్చిరమ్మని చెప్పగా,ఆలయంలోకి వెళ్లి ఎన్నో సార్లు పిలిచినా జవాబు రాలేదు. తలుపులన్నీ మూసి ఉన్నాయి .నిస్పృహతో బయటికి వచ్చి గుడ్డలో మూటకట్టి తలక్రిందజాగ్రత్తగా పెట్టుకొని,అందరూ గాఢ నిద్రపోయారు .తెల్లవారినా మెలకువ రాలేదు .ఆలయం లో ఏదో కలకలం వినిపించింది .గర్భాలయం లో ఉండే బంగారు పళ్ళెం కనిపించటం లేదని గగ్గోలు పెడుతున్నారు .అన్నిచోట్లా భటులు వెతుకుతుండగా మహంత్ తలకి౦ద ఉన్న పళ్ళెం పై సూర్యకిరణాలు పడి ,అందరికీకనిపించింది మహంత్ దొంగ తనం చేశాడని ,అనుమానించి అతనికుటు౦ బాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టారు తిట్టారు .తాను నిరపరాదినని మొరపెట్టినాఎవరూ వినిపించుకోలేదు .రాత్రిజరిగినకథ అంతా చెప్పాడు .పిచ్చోడన్నారు .జగన్నాథస్వామినే ఆర్తిగా అర్ది౦ చాడు ప్రార్ధనలతో .జైలులోపెట్టారు .అతని ఆర్తనాదాలు ప్రజలకు వినిపించకపోయినా జగత్ప్రభువుకు వినిపించాయి .
మర్నాడు సూర్యోదయానికి ముందే ప్రతాపరుద్ర మహారాజు కలలో జగన్నాథుడు కనిపించి జరిగినదంతా వివరించి అదృశ్యమయ్యాడు .రాజు వెంటనే మహంత్ దగ్గరకురాగా అతడు గీత గోవిందం మధుమదురంగా గానం చేస్తూ పరవశంలో కనిపించాడు .లోపలి వెళ్లి తానే సంకెళ్ళు తెంపేశాడురాజు .మహంత్ స్పృహలోకి వచ్చిచూడగా మహారాజు అతని పాదాలపై వ్రాలి క్షమించమని కోరుతూ కనిపించాడు .ఇదంతా తన’’ నెచ్చెలి ‘’ లీల అని మహంత్ మురిసిపోతూ చెప్పాడు .అతని భార్యాపిల్లలను పిలిపించి రాజు మహంత్ భార్యపాదాలపై వ్రాలి క్షమించమన్నాడు .బంగారు పల్లకీలో మహంత్ కుటుంబాన్ని కూర్చోబెట్టి ,జగన్నాథాలయానికి సాదరంగా మర్యాదగా తీసుకు వెళ్లి తీర్ధస్నానాలు చేయించి నూతనవస్త్రాలు కట్టబెట్టి చందనం అగరు పూలమాలలతో,పుష్పాలతో పూజించి సత్కరించాడు..అష్టైశ్వర్యాలు మహంత్ కుటుంబానికి ప్రతాపరుద్ర గజపతి మహారాజు ఏర్పాటు చేశాడు .భూమి రాసిచ్చాడు .దేవాలయం లెక్కలు రాసేఉద్యోగం లో నియమించి వంశపారంపర్యహక్కు కల్పించాడు .దైవ విశ్వాసం ఎంతటి కస్టాలు పెడుతుందో, అంతకు వెయ్యి రెట్లు మేలు కూడాచేస్తుంది .కృష్ణుడు కుచేలునిపట్ల చూపిన మిత్రధర్మం ,తనను నెచ్చెలిగా భావించిన మహంత్ పట్ల జగన్నాథుడు చూపి స్తవనీయుడయ్యాడు .
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-12-19-ఉయ్యూరు
.