మహా భక్త శిఖామణులు
16-నాగ మహాశయుడు -1
గృహస్తుడైన నాగమహాశయుడు ఆదర్శ పురుషునిగా కీర్తి గడించాడు..’’నేను భూమి మీద చాలా ప్రదేశాలు తిరిగానుకాని నాగమహాశాయుడి వంటి వారెక్కడా కనిపించలేదు ‘’అని స్వామి వివేకానంద తరచుగా చెప్పేవారు .తూర్పు బెంగాల్ లో నారాయణ గంజ్ రేవుకు దగ్గరలో దేవ భోగ్ అనే పల్లెటూరిలో నాగమహాశయుడు1846ఆగస్ట్ 21 న జన్మించాడు .పూర్తిపేరు ‘’దుర్గా చరణ నాగ్ ‘’.తండ్రి దీనదయాళు. తల్లి త్రిపురసుందరి .తాత ప్రాణ కృష్ణ ,నాయనమ్మ రుక్మిణి ..వీరి పూర్వ నివాసం ‘’తిలారది’’.కాని మూడు తరాలనుంచి దేవ భోగ్ లోనే ఉంటున్నారు .దీనదయాళ్ కు ఇద్దరు చెల్లెళ్ళు .పెద్దావిడ భగవతి తొమ్మిదేళ్ళకే భర్తను కోల్పోయి ,విధవరాలై అన్న ఇంట్లోనే ఉంది .రెండవ చెల్లెలు భారతి సంసారం చేసుకొంటూ ,అప్పుడప్పడు అన్నగారింటికి వచ్చి వెళ్ళేది .దీన దయాళ్ కు దుర్గా చరణ్ ,మరో కొడుకు ,ఇద్దరు కూతుళ్ళు .నాగమహాశాయుడనే దుర్గా చరణ్ తర్వాత శారదామణిపుట్టింది .ఈమె తప్ప మిగిలిన అనుజన్ములు అందరూ చనిపోయారు .చివరిపిల్ల పుట్టుకలో పురిటిజబ్బు సోకి తల్లికూడా మరణించగా బాధ్యత అంతా ఆడబడుచే చూసింది.
తల్లి పోయే నాటికి నాగ్ వయసు 8.శారదకు 4ఏళ్ళు .తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పిల్లల పెంపకం మేనత్త చూసింది ..’’నా మేనత్త పూర్వజన్మలో నాకు తల్లి యై ఉంటుంది ‘’అని నాగమహాశయుడు ఆమెఎడ అవ్యాజానురాగంతో చెప్పేవాడు .తండ్రి దైవభక్తి తో నిష్టగా ఉండేవాడు .కలకత్తాలో ‘’కుమారటులి’’ అనే చోట రాజకుమార పాల్, హరిచరణపాల్ అనే సోదరుల వ్యాపారసంస్థలో పనిచేసేవాడు .జీతం తక్కువైనా ఆకుటు౦బ౦ తో అన్యోన్యంగా ఉండేవాడు .వేలకొద్దీ డబ్బు అతని చేతులమీదనుంచే నడిచేది .స్వార్ధం లేని నిజాయితీ అతనిది .ఒకసారి కొన్ని వేలరూపాయలు లెక్కతేలకపోయినా దీనదయాళ్ ను అడగనైనా అడగలేదు .అతని ప్రవర్తనపై అంతటి నమ్మకం ఆసోదరులకు .కొన్నేళ్ళకు ఆడబ్బు లెక్క తేలి దీనదయాళ్ పై నమ్మకం విపరీతంగా పెరిగిందివారికి .
పాల్ సోదరులది ఉప్పువ్యాపారం .నారాయణ గంజ్ కు పడవలద్వారా ఉప్పు సరఫరా చేసేవారు .ఆ రేవు పట్నానికి వెళ్ళే కాలువ దట్టమైన అరణ్యం గుండా ప్రవహిస్తుంది .కనుక బందిపోటుదొంగలు పడవలపై దాడి చేసి సరుకు దోచేసేవారు .నమ్మకస్తులనే ఉప్పు పడవలలో పంపేవారు .ఒకసారి దీనదయాళ్ ను అలా పంపారు .పడవ ‘’సుందర్ బన్’’అడవి చేరేసరికి చీకటిపడింది .ముందుకు వెళ్ళే సాహసం చేయకుండా అక్కడే లంగరు వేసి ,దగ్గరలో శిధిలమైన ఇల్లు ,ప్రక్కన రెండు గుడిసెలు కనిపిస్తే అక్కడికి చేరారు .నావికులు రాత్రి భోజనం చేసి నిద్రపోయారు .దీనదాయాల్ దుడ్డుకర్రపట్టుకొని రామనామస్మరణ చేస్తూ హుక్కాపీలుస్తూపడవలోనే ఉండికాపలా కాశాడు .
తెల్లారగానే పడవ దిగి ,కంచెం దూరం నడవగానే కాలి వ్రేలి తాకిడికి ఏదో తళుక్కున మెరవగా ,బంగారునాణాల తోపాతి పెట్ట బడిన బిందేకనిపించింది.కొన్ని నాణాలు పరీక్షించి చూడగా అవి పూర్వకాలం నాణాలుఅంటే మొహర్లు అని అర్ధమై మళ్ళీ అన్నీ బిందెలో పోసి కనపడకుండా మట్టి కప్పేసి ,పడవవ వాళ్లను తొందర పెట్టి ప్రయాణం సాగించాడు ,.ధనం మీద వ్యామోహం, పరుల సొత్తుపై ఆపేక్ష లేని సోశీల్యం అతనిది. ఆసద్గుణాలే కొడుకు నాగమహాశయుడికి సంక్రమించాయి .
నాగ మహాశయునికి ఒక జత వెండి మురుగులుతప్ప ఏ ఆభరణాలు లేని కడుపేద .సహజ సౌందర్య దీప్తి అతనిది .నవ్వుతూ హాయిగా నామకీర్తన గానం చేస్తూ ఉండేవాడు .ముచ్చటపడి ఏదైనా ఇస్తే తీసుకోనేవాడుకాదు.మేనత్త ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకొని పురాణకథలు చెప్పేది .ఆటలపై ఆసక్తి తక్కువే .ఒకసారి తోటిపిల్లలు అబద్ధం చెప్పమని బలవంతం చేస్తే ససేమిరా చెప్పను అంటే విపరీంగా కొట్టగా,రక్తం కారుతూ గాయాలతో ఇంటికి రాగా మేనత్త విషయం తెలుసుకోవటానికి అనేకరకాలప్రశ్నలు వేసినా తన స్నేహితులు దండింప బడుతారని అసలు విషయం ఏమీ చెప్పనేలేదు .ఆబాధ అణచుకొన్నాడు .నారాయణ గంజ్ లో బడిలో చేరి కొంత చదువుకొన్నాడు .పై చదువు కలకత్తాలోనే చదవాలి తండ్రితో కలకత్తావెళ్లి చదువు కొంటానని చెప్పగా తనకు పంపి చదివించే స్తోమత లేదన్నాడు తండ్రి .పోనీ ఢక్కాలో చదువు దామనుకొంటే 10క్రోశులదూరం .అందరూ వద్దన్నా వినక ,ఎవరికీ చెప్పకుండా కొన్ని అటుకులు మూటకట్టుకొని ఢాకా బయల్దేరి వెళ్లి అక్కడతనకు నచ్చిన స్కూలును ఎన్నుకొని రాత్రికి ఇంటికి చేరాడు .మేనత్త తల్లడిల్లి అడిగితె చెప్పి మర్నాడు ఉదయమే అక్కడ బడిలో చేరాలికనుక అన్నం సిద్ధం చేసి ఉంచమని చెప్పాడు .చదువుపై అతనికున్న ఆసక్తికిఆమెమారు మాట చెప్పకుండా ‘’శ్రీరామ రక్ష’’అని దీవించింది .
మర్నాడుమేనత్త వండిన అన్నం తిని ,చేతిలో కొంచెం డబ్బు తీసుకొని ఢక్కావెళ్లి నార్మల్ స్కూల్ లో చేరి ,స్కూలుకాగానే రాత్రికి ఇల్లు చేరాడు .ఇలా 15నెలలు అక్కడ చదివాడు అతి నడక వలన ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది. అయినా దీక్ష వదలలేదు .దారిలో ఒకసారి పిశాచం కనిపించిందని ,భయపడకుండా అలాగే ఉండిపోయాననీ, అదీ ఏమీ చేయలేదనీ, తర్వాత నాలుగడుగులు వేశాక అది పకపకా నవ్విందని,మూడు సార్లుఅది కనిపించినా తనకే అపకారమూ చేయలేదని తన అనుభవం చెప్పాడు .ఒక ఉపాధ్యాయుడు నాగ్ శ్రమ గుర్తించి పితృవాత్సల్యంతో తమ ఇంటనే ఉండి చదువుకోమని చెప్పగా ,కృతజ్ఞత చెప్పి అదే వాత్సల్యం సదా తనపై చూపనికోరి మళ్ళీ యధాప్రకారం ఇంటినుంచే వచ్చి చదివాడు .
ఒకరోజు బడి నుంచి తిరిగివస్తుంటే ‘’ఫతుల్లా ‘’అనే పల్లెటూరిలో గాలివాన చిమ్మచీకటి కమ్మేసి అడుగు వేయటం కష్టమైంది .ఏ ఇంటివారు రమ్మని పిలవలేదు .ఎవరినీఅతడు ఆశ్రయమివ్వమని కోరనూలేదు .ఆజడివాన ,హోరుగాలి మెరుపులు, ఉరుములమధ్య అలాగే ఇంటికి నడుస్తూనే ఉన్నాడు .కొంతదూరం పోయాక దారిప్రక్కన ఉన్న చెరువులో పడిపోయాడు .లేవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .ఒక రెల్లు దుబ్బుపట్టుకొని గట్టు చేరదామని ప్రయత్నిస్తే అది తెగిపోయి, మరింత లోతుకు కూరుకు పోయాడు. వర్షం గాలీ ఏమాత్రమూ తగ్గలేదు. మేనత్త గుర్తు కొచ్చి దుఃఖించాడు .రామనామ స్మరణ చేస్తూ ధైర్యంగా అనేకప్రయత్నాలు చేసి చివరికి ఒడ్డుకు చేరి ఆలస్యం చేయకుండా ఇంటికి బయల్దేరాడు .పొలిమేర చేరేసరికి చేతిలో లాంతరుతో మేనత్త ఎదురు చూస్తూ ‘’నాయనా దుర్గా చరణా ‘’అని గద్గదస్వరంతో పిలిచి ,దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా కౌగిలించుకొని ‘’నీకే అపాయం జరిగిందో అని గుండె తల్లడిల్లి పోయాను .దేవుడి దయవలన సుఖంగా చేరావు ‘’అని తలనిమిరి ముద్దుపెట్టింది. నాగమహాశయుడు ‘’అత్తా !నాకేమీకాలేదు ఎందుకు బాధపడతావు .కొంచెం తడిశాను అంతే’’అని ధైర్యం చెప్పాడు ,
ఢక్కాలో చదివింది కొద్దికాలమే అయినా వంగ వాజ్మయం లో గొప్ప పట్టు సాధించాడు .అతని దస్తూరి ముత్యాలప్రోవు .రచన సర్వాంగ సుందరం .రాసింది ఎవరికీ చూపించేవాడుకాదు .తర్వాత కలకత్తాలో వైద్య విద్య నేర్వటానికి వెళ్లేముందు తనరచనలను ‘’ఉపన్యాసమంజరి ‘’పేరుతొ ప్రచురించాడు .బాలబాలకులకోసం రాసి౦ది కనుక వారికి ఉచితంగా పంచిపెట్టేవాడు .వివాహవయసురాగానే మేనత్త అన్నగారితో ఆలోచి౦చి విక్రమపురికి దగ్గరలో ఉన్న ‘’రాయి జదియా’’గ్రామానికి చెందిన ధనికుని 11ఏళ్ళ కూతురుతో వివాహం చేశారు .అదే రోజు మరో ముహూర్తంలో చెల్లెలు శారద వివాహం కూడా జరిపించారు .అయిదు నెలల తర్వాత నాగమహాశయుడు కలకత్తాలోని కేమ్బెల్ మెడికల్ కాలేజీ లో చేరాడు .
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు