శ్రీ రమణీయ రామాయణం
బాపు రమణ లో రమణగారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు ‘’రమణీయ శ్రీ రామాయణం ‘’రాసి ,ఆత్మీయంగా తనసంతకం చేయగా , వియ్యంకుడు ,బాపుగారితమ్ముడు ,పెన్సిల్ ఆర్ట్ నిపుణులు ,మద్రాస్ రెడియోకేంద్ర మాజీ డైరెక్టర్ ,సరసభారతి ఆత్మీయులు శ్రీ శంకరనారాయణ (శ్రీ సత్తిరాజు శంకరనారాయణ )గారు ,ఆపుస్తకాన్ని తన చేతి వ్రాత ఉత్తరంతో సహా నాకు నవంబర్ 27పంపగా,మర్నాడే అంది,అందిందని ఫోన్ లో ధన్యవాదాలు తెలిపాను .శంకర్ గారి ఉత్తరం లోశ్రీ మైనేని గోపాలకృష్ణగారికి కూడా పుస్తకం పంపినట్లు తెలిపి నన్ను పుస్తకం చదివి అభిప్రాయం తప్పకుండా రాయమని కోరటం వారి సౌజన్యమే .వీరు ఈ నెల 15న బాపు గారి జన్మ దినోత్సవంనాడు ‘’బాపు గారి పురస్కారం ‘’అందుకో కోబోతున్నందుకు హృదయపూర్వక అభినందనలు .నూటికి వెయ్యి శాతం వారు అర్హులు .రమణీయ రామాయణాన్ని మా శ్రీమతి పుస్తకం వచ్చిన దగ్గర్నుంచి ,విడువకుండా పట్టుదలగా ప్రత్యక్షరం చదివి ,మధ్యమధ్యలో’’ ఎంతబాగా రాశారండీ ఆవిడ !’’అంటూ పులకించి నిన్నటితో పూర్తి చేసింది .ఇవాళ మూడుగంటలలో నేనూ ఏకబిగిన చదివాను .స్పందన రాయటానికి ఆశక్తుడనేమో అని సందేహించి ,అయినా శ్రీరామ సంకల్పం గా భావించి మొదలు పెడుతున్నాను .
త్రేతాయుగం లో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో బహుజన రంజకంగా ,మనోల్లాసంగా ,ఉపమాలంకార సుశోభిత౦గా రచించి తాను ఆదికవి అయి ,కావ్యం ఆదికావ్యం అనే ఘనత సాధించాడు .కాలక్రమంలో ఎన్నో రామాయణాలు వెలువడినా వాల్మీకం కు సాటి లేదని బహుజనాభిప్రాయం .తెలుగులో అనువాద రామాయణాలు చాలావచ్చినా ,విశ్వనాథ వారి కల్ప వృక్ష రామాయణానికి సరి సాటి లేదన్నదీ యదార్ధమే . శ్రీనివాస శిరోమణి గారి వచన రామాయణం బహుజనాభిమానం పొందింది .ప్రవచన రామాయణంగా ఉషశ్రీ రేడియో రామాయణం ‘’నభూతో’’గా సాగింది .విశ్వనాథకు వచ్చినట్లే శ్రీదేవిగారికీ ‘’మరలనిదేమి రామాయణం ‘’అనే వికిత్సకలిగినా ,ఆయనలాగే సమాధానపడి నట్లు ఈమె ‘’పలికెడిది రామకథ,పలికి౦చెడి వాడు రామభద్రు౦డట’’అని తనూ భక్తపోతనగారిలా నమ్మి, రమణీయ రామాయణ రచనకు’’కవి ‘’అనే వాల్మీకి నీ ,శిరోమణి గారిని స్మరించి, నమస్కరించి ఉపక్రమించారు .నాకు యేమని పించిందంటే ‘’వాల్మీకి మహర్షి శ్రీదేవి గారి అవతారం దాల్చి,ఆధునికకాలం లో ఉన్న ఆంధ్రులకు ,తానే తెలుగువారికోస౦ అచ్ఛ స్వచ్చమైన తెలుగులో, తెలుగు ఇంతమధురంగా ,జు౦టితేనె ,పనసతొనల రుచితో ఉంటుందా అని ఇతరులు అసూయ పడేంత మనోహరం గా భక్తి విశ్వాస బంధురంగా రాశాడేమో?’’అనిపించింది .అంతే కాక,రచయిత్రి రమణీయ శ్రీ రామాయణం ‘’అనటంలో కూడా రమణీయ అంటే ముళ్ళపూడి వెంకటరమణగారినీ,శ్రీ అన్నా శ్రీదేవి అన్నాఒకరే కనుక తనపేరుకూడా కలిసి వచ్చినట్లు పెట్టారేమో అనికూడా అనిపించింది .రచనకు మూలకారణం రమణ గారే అని ఆమె అన్నారు .బాపురమణల సీతాకల్యాణం ,సంపూర్ణ రామాయణ చలన చిత్రాలలో మాట రమణ గారిది, చేత బాపుగారిదీ .ఈ రెండు చేతులూ కలిసి అద్భుత భక్తి రసాన్ని ప్రవహింపజేసి ,రసికజన మనసులను రసప్లావితం చేశారు .బాపు ‘’బామ్మ శ్రీ ‘’మాత్రమే కాదు ‘’శ్రీరమణ అన్నట్లు ‘’బొమ్మర్షి ‘’కూడా .రమణగారు యవ్వనదశనుంచీ రామాయణ పరిమళాన్ని అంటించుకొన్న ధన్యులు .ఆయన రచనలో వాల్మీకి శైలి ప్రవహిస్తు౦దనటం యదార్ధం .భర్త రాత కోతల్లో శ్రే దేవిగారికీ మొదటినుంచీ ప్రమేయం ఉండటంతో, ఆసౌరభం ఆమె హృదయాంత రాళాల లో జీర్ణించుకు పోయింది .ఇంతకంటే రామాయణం రాయటానికి ఇంకే అర్హత కావాలి ?శ్రీరమణ అన్నట్లు యిది ‘’రామ చక్కని కలనేత ‘’.
శ్రీదేవిగారు ప్రతికాండ ను ‘’శుద్ధ బ్రహ్మ పరాత్పరరామ –కాలాత్మక పరమేశ్వరామ ‘’’’సీతా ముఖా౦భోరుహ చంచరీకః ‘’,’’దండకవన జనపావన రామ –శూర్పణఖార్తివిధాయకరామ –ఖర దూషణ ముఖ సూదక రామ ‘’,’’విరచిత నిజపితృకర్మకరామ –భరతార్చిత నిజపాదుకరామ ‘’,’’హనుమత్సేవితనిజపద రామ –నత సుగ్రీవా భీస్టద రామ ‘’,’’భీత భాను తనూ భవార్తి నివారణ జాతి విశారద౦ ‘’,సుందరే సుందరో రామః –సుందరం కిం న సుందరం “,’’ఉల్లంఘ్య సింధోస్సలిలం స లీలం –యశ్శోక వహ్నిం జనకాత్మజాయా – ఆదాయ తే నైవ దదాహ లంకాం –నమామి త౦ ప్రాంజలి రా౦జ నేయం ‘’, ‘’అన్జనానందనం వీరం-జానకీ శోక నాశనం –కపీశ మక్ష హ౦తా రం –వందే లంకా భయంకరం ‘’‘,’’ఆమిషీకృత మార్తాండం –గోష్పదీ కృత సాగరం -తృణీకృత’ దశగ్రీవం –ఆంజనేయం నమామ్యహం ‘’,శ్రీరామరామ రణ కర్కశ రామ రామ –శ్రీరామ రామ శరణం భవ రామ ‘’శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ‘’మొదలైన జనం నాలుకలపై నర్తించిన పదాలు, శ్లోకాలు ,వీలైన చోట్ల అధ్యాయాలలో కూడా చేర్చి రావణ సంహారం ముందు ఆదిత్య హృదయ స్తోత్రశ్లోకాలు ఉటంకించి ,అందులో జరిగే కథలను చెప్పీ చెప్పకుండా చెప్పటం ప్రత్యేకత .వీటికి మించి వాల్మీకి మహర్షి ప్రయోగించిన ఆమ్రేడిత ఉపమాల౦కారాల సౌందర్యాన్ని తెలుగులోకి కమ్మగా అనువాదం చేసి వాటిని’’ బోల్డ్ లెటర్స్ ‘’లో ముద్రించటం మరో ప్రత్యేకత.ఇలాంటి రచనతో ‘’గంగానది ఒక చోట అతివేగంగా ,ఒక చోట నెమ్మదిగా ,ఒక చోట తిన్నగా ,ఒకచోట వంకరలు తిరిగినట్లు ,ఒక చోట కిందికి దూకుతూ ,అతి దర్శనీయంగా ‘’ఉన్నట్లు శైలికూడా అలానే ఉండటం ఇంకో ప్రత్యేకత .అందుకే పుస్తకం చేతిలో పట్టుకొంటే ఆ రచనా ప్రవాహం లో కొట్టుకు పోవటమే తప్ప, ఇహ లోక ధ్యానం ఉండదు .అదృష్టవంతురాలు శ్రీదేవిగారు .వారితోపాటు మనమూ .
కొన్ని ఉపమాలంకార ఉదాహరణలు .శిశువు రాముడి అరచేతిలో వజ్రరేఖ ఉండి,వజ్రపాణి ని కన్న అదితిలాగా కౌసల్య ఉన్నది .రాముడికి సీతాదేవిపై అనురాగానికి కారణం ,ఆమె సౌజన్య ,సౌందర్య ,సౌశీల్య సద్గుణాల తో తనను సంతోష పెట్టటం వల్లనేకాదు ,తనతండ్రి దశరధ మహారాజు చూసి ,ఆలోచించి ,సమ్మతించి చేసిన భార్య యిందువల్ల కూడా అన్న వాక్యాలు పవిత్రాలు .అరేంజ్డ్ మారేజేస్ లో ఉన్న గొప్పతనానికి నిదర్శనం .రాముడికి సీతమీద కన్నా, సీతకు రాముడి మీద అనురాగం ఎక్కువ అనటమూ వాల్మీకమే .మారీచునితో రాయుడు యుద్ధం చేసేటప్పుడు ‘’మదపు టేనుగులా ,ఉన్నాడు .పరిశుద్ధ వంశంలో జన్మించటమే ఆఏనుగు తొండం .మహాబాహువులు పొడుగాటి దంతాలు .ప్రతాపమే మదజలం .అ రాముడు నృసింహ స్వరూపుడు ,కొపొద్రేకాలతో చెలరేగే సింహం వాడి బాణాలు గోళ్ళుఖడ్గాదులు కోరలు .సింహం మృగాలను చంపినట్లు రాక్షసులని చంపాడు .వర్షాకాల నల్లటి మేఘాలు తెల్లటి వానధారలు హోరు గాలి పోసుకొన్న గుహ లతో పర్వతాలు కృష్ణాజినం కప్పుకొని ,తెల్లటి జంధ్యాలు ధరించి వేదాధ్యయనం చేస్తున్న బ్రహ్మ చారుల్లా ఉన్నాయి .శరత్కాలం లో ‘’చేపలనే ఒడ్డాణాలు పెట్టుకొని ,నదులనే స్త్రీలు రాత్రంతా రతికేళి లో ఓలలాడి ,ప్రాతఃకాలం లో మందమందంగా తమ ఇళ్ళకు నడిచిపోయేట్లు మెల్లమెల్లగా పారుతున్నాయి .లంకాపట్టణం ‘’ప్రాకారానికి అండగా ఉన్న ఇసుక తిన్నెలు జఘనాలవలె ,అగడ్తలలో శుద్దోదకాలు కట్టుకొన్న చీరల్లాగా ,శతఘ్నులు ,శూలాలు తల వెంట్రుకలతో పెట్టుకొన్న కొప్పు లాగా ,కోటబురుజులు కర్ణాభరణాలలాగా సుందరా౦గనలాగా కనిపిస్తోంది హనుమకు .సీతా దేవికి హనుమ విశ్వ రూపం చూపించినపుడు ‘’వందే వానర నారసింహ ఖగారాట్ క్రోడాశ్వ వక్త్రా౦ చితం ‘’శ్లోకం ఉదాహరించటం ఎంతో సముచితంగా ఉంది .సీతాదేవి లంకలో ఎలాబ్రదికింది అంటే ‘’ నీళ్లున్నపొలం లో తేమవల్ల ,నీళ్ళు లేని ప్రక్కపొలం లో పైరు బ్రతికి ఉన్నట్లు ‘’.
మొదటి రోజు అలసిపోయి ,రాముడు విశ్రాంతి తీసుకొని రమ్మని పంపిస్తే రెండవ రోజు రాముడితో యుద్ధానికి వచ్చిన రావణుడు ఒకసారి గతంలో జరిగినవన్నీ చక్రాల్లా కనిపించాయి .అరణ్యుడు అనే ఇక్ష్వాకు రాజును యుద్ధంలో ఓడించి చిత్రవధ చేసి చంపగా ,అతడు చనిపోతూ తనవంశం లో ఒక పుణ్యపురుషుడు జన్మించి ,రావణుని బంధుమిత్ర సపరివారంగా సంహరిస్తాడని శపించాడు .ఆపుణ్య పురుషుడు రాముడే అని రూఢిగా ఇప్పుడు నమ్మాడు .నందిశాపం ,మానవుని వల్ల చావు గురించి బ్రహ్మను అడగకపోవటం ,వేదవతి శాపం గుర్తుకొచ్చాయి .తపస్సు ద్వారా సాధించిన పుణ్యఫలం క్షయమై ,శాపబలం అనుభవం లోకి వచ్చిందని గ్రహించాడు .లక్ష్మణ ,ఇంద్ర జిత్తులు మహా యుద్ధం చేసి ‘’దేహాలనిండా గాయాలతో ఆకులన్నీ రాలిపోయి పూలు మాత్రమే మిగిలిన బూరుగ, మోదుగ చెట్ల లాగా ఉన్నారు ‘’.తనను దెప్పిన ఇంద్రజిత్ తో పినతండ్రి విభీషణుడు ‘’ధర్మాన్ని వదలి పాపం చేయాలనుకొన్నవాడిని ,చేతికి చుట్టుకున్న పాములాగా వదిలించుకోవాలి .పరద్రవ్యం ,పరకాంత లను అపహరణ చేసినవాడిని తగలబదడిపోయే ఇంటిని వదిలేసినట్లు వదిలెయ్యాలి ‘అందుకే అన్నను వదిలాను ‘’అని చెప్పాడు .రావణుడు యుద్ధభూమిలో పళ్ళు కొరికితే ‘’రాక్షసులు త్రిప్పే నూనె గానుగ ధ్వనిలా ఉంది ‘’
భీషణ యుద్ధం చేస్తున్న రాముడు రాక్షసులకు ‘’పెద్దగాలికి వనంలో చెట్లు కూలిపోవటం కనిపించి గాలిమాత్రం కనిపించనట్లు ,మహా రథాలు చెక్కముక్కలై కనిపించాయికాని రాముడు కనిపించలేదు .’’శబ్ద స్పర్శ రూప రస గంధాలను హే౦ద్రియాలు అనుభవిస్తున్నా ,కారణభూతమైన పరమాత్మ దేహికి కనిపించనట్లు ,ఒళ్ళంతా కొట్టిన దెబ్బలు కనిపించాయికాని రామ దర్శనం కాలేదు .’’చక్రం లాగా మండలాకారంగా తిప్పే రాముడు వింటి కొననే చూశారుకాని రాక్షసులు రాముడిని చూడలేదు. తన శరీరమే నాభిగా ,బలమే జ్వాలలుగా ,బాణాలే ఆకులుగా ,,కార్ముకమే అంచుగా ,జ్యారవం మహా ఘోషగా ,పరాక్రమమమే అక్ష ప్రదేశంగా ,దివ్యాస్త్రాలే ధారలుగా శత్రు సంహారం చేస్తున్న వీర ధీర సుందరరామ చక్రం రాక్షసులకు కాల చక్రం లాగా కనిపించి భయపెట్టింది .అందుకే మహర్షి ‘’గగనం గగనాకారం –సాగరం సాగారోపమః –రామ రావణయో ర్యుద్ధం –రామరావణ యోరివ –ఏవం బృవంతో దదృశః తద్యుద్ధం రామరావణ౦ ‘’అని చేతులెత్తేశాడు .
రావణవదానంతరం అయోధ్య చేరి పట్టాభి షిక్తుడైన రాముడు –
‘’వామే భూమి సుతా ,పురశ్చ హనుమాన్ ,పాశ్చాత్ సుమిత్రానందనః –శత్రుఘ్నో భరతశ్చపార్శ్వ దళయోః,వాయ్వాది కోణేషుచ-సుగ్రీవశ్చ ,విభీషణశ్చయువరాట్ తారా సుతో జా౦బవాన్ –మధ్యే నీల సరోజ కొమలరుచిం రామం భజే శ్యామలం ‘’లా దర్శనమిచ్చాడు .
సీతా రామ కళ్యాణ మహోత్సవం లో ‘’జానక్యాః కమలాంజలి పుటే — ముక్తాస్తా శ్సుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః’’ జన హృదయాలలో స్థిరంగాఉన్న ప్రసిద్ధ శ్లోకం ఉదహరించటం శుభదాయకం కాలానికి తగినట్లుగానూ ఉన్నది .
కథా ప్రపంచం అనే తిరుపతి లోని ప్రసిద్ధ సంస్థ ముద్రించిన అందమైన దోషరహితమైన ,పాలనురుగు వంటి తెల్లటికాగితాలపై ముద్రించిన అమూల్యగ్రంథం ఇది .అందమైన శ్రీ సీతారాముల ముఖ చిత్రం , వెనుక ముకుళిత హస్తాలతో రామభక్త హనుమాన్ ఉండటం జయం ,శుభం .సుందరకాండ పారాయణ కు ,రామాయణ పారాయణకు తగినట్లుగా 28అద్యాయాలతో,217పేజీల తో ఉన్న ఈ రమణీయ రామాయణం చదివి అందరూ అందులోని మంచిని గ్రహిస్తే అందరికి క్షేమం ,లాభం విజయం ‘.వాల్మీకి ఉపమానాలకు అద్దం పట్టే రచన శ్రీదేవిగారు చేసి ధన్యులయ్యారు .అభినందనలు .
‘’స్వస్తి ప్రజాభ్యఃపరిపాలయంతాం –న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః-గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం –లోకా స్సమస్తా సుఖినో భవంతు ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-12-19-ఉయ్యూరు