మహా భక్త శిఖామణులు
17- రవి దాసు
చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో పుట్టిన రవి దాసు ,తల్లి ఝర్ బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని ఆక్షేపిచేవారు .అనుకోకుండా కరువు వచ్చింది .తినటానికి కూడు లేకపోయినా కడుపులో కళ్ళు పెట్టుకొని హరినామజపం చేసేవాడు .గుండెకరిగి శ్రీహరి బైరాగి రూపం లో వచ్చి ,సకలైశ్వర్యాలిచ్చే దివ్య శిల చేతిలోపెట్టాడు .’’నీనామమే దివ్య ధనం.ఇంకా నాకీ ఐశ్వర్యం ఎందుకు ?’’అన్నాడు .ఎంతోబతిమాలినా ససేమిరాఅనగా చివరికి అతి బలవంతం మీద ఇంట్లో ఒక మూల విసిరేసి పొమ్మన్నాడు బైరాగితో .మళ్ళీ ఒక సారి వచ్చి శిలను ఉపయోగించావా లేదా అని అడిగాడు .దాని మొహ౦ కూడా చూడలేదన్నాడు దాసు .పరాత్పరుడు సంతోషించి అమూల్య ధనరాసులు ఇవ్వగా వాటినీ తాకనైనా తాకలేదు .ఆశరీరవాణి ఆ ఆలయ నిర్మాణ చేయి చెప్పింది .
రవిదాసు చక్కని దేవాలయం నిర్మించి ,తానె అర్చకుడై నిత్యపూజాదికాలు చేశాడు కాని బైరాగి ఇచ్చిన డబ్బు ముట్టుకో లేదు.ఒక రోజు పూజాద్రవ్యాల బుట్టలో మిలమిల లాడుతూ అయిదు బంగారు నాణాలు కనిపించాయి .దేవుడు పరీక్షిస్తున్నాడని బాధపడగా ‘’ఈశ్వరాజ్ఞ పాలించక తప్పదు ‘’అన్నాడు కలలో .ఆ నాణాలతో ఒక విశ్రాంతి భవనం కట్టించాడు .భక్త రవి దాసు పేరు నలువైపులా మారు మ్రోగి ,కొందరికి అసూయ తెప్పించింది .వారు రాజుదగ్గరకు వెళ్లి ‘’ఒక చండాలుడు పూజారియై విష్ణు ప్రసాదం అందరికీ పెట్టి ,ఆలయాన్ని మైలపరుస్తున్నాడు. వెంటనే ఆలయం నుంచి తరిమి వేయండి ‘’అని కోరారు .రాజు దాసును పిలిపించి విగ్రహాన్ని ఆలయాన్ని బ్రాహ్మణులకు వశం చేయమని ఆజ్ఞాపించగాసరే అన్నాడు .ఆ రోజు రాత్రి రాజుకు కలలో శ్రీ హరి కనిపించి దాసును తొలగించవద్దని గట్టిగా చెప్పాడు .రవి దాసు భక్తీ, మహత్యం గుర్తించి రాజు అతన్ని ఆలయ సేవలోనే ఉండమని చెప్పి ,అనేక విధాల సన్మానం చేశాడు .
చిత్తూరు రాణి’’ ఝాలీ ‘’రవి దాసు శిష్యురాలైనది .క్షత్రియ కులం లో పుట్టిన ఆమె చండాలునికి దాసురాలవటం అగ్రకులజులు జీర్ణించుకోలేకపోయి గందరగోళం సృస్టించారు .ఒకరోజు రాణి బ్రాహ్మణుల౦దర్నీ పిలిచి, సంతర్పణ చేసింది .అందరూ వచ్చారు .ఆసనాలపై కూర్చున్నారు .ఇద్దరి బ్రాహ్మణుల మధ్య ఒక హరిదాసుకూర్చున్నట్లు కనిపించి విప్రులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు .కాని ఆప్రాంగణమంతా రవిదాసు తో నిండిపోవటంతో అమితా శ్చర్య పోయి కిక్కురుమనకుండా కడుపునిండా మెక్కి బొర్రలు తడుముకొన్నారు .రవిదాసు మహత్వం అర్ధమై అందరూ అతనిపాదాలపై పడి క్షమాపణ కోరారు .రవి దాసు తన చర్మం చీల్చి లోపలి యజ్ఞోపవీతం చూపించి పూర్వ జన్మలో తాను బ్రాహ్మణుడను అని చెప్పాడు .
రవి దాసు మహాజ్ఞాని అని పేరుపొందాడు .అతడు రాసినవి ‘’ఆది గ్రంథం లో చేర్చారు .అవి సర్వ జనామోదం,ఆదరణ పొందాయి .అతడు రాసిన శ్లోకాలు కాశీ లో మహా పండితులుకూడా మహా ఆవేశం తో గానం చేస్తారు .రవిదాసు తనవారికోసం వైష్ణవ మతం లో ఒక శాఖ ఏర్పరిచాడు .అతని మహత్వం తెలిసి అన్ని జాతులవారు ఆరాధించారు .’’.భక్తిమాల ‘’లో రవి దాసుకు మహోన్నత స్థానం ఉన్నది .కుష్టువ్యాధులకు సేవ చేసేవాడు.అగ్రకులస్తులు కూడా దాసును సేవించి వ్యాదులనుండి విముక్తులయ్యేవారు .120ఏళ్ళు జీవించి రవిదాసు పరమపదించి బ్రహ్మపదం చేరాడని అందరి విశ్వాసం .ఆయన స్థాపించిన మతం ఇప్పటికీ సజీవమై అతన్ని నిరంతరం స్మరించేట్లు చేస్తోంది .
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-19-ఉయ్యూరు