amaheరోగులపాలటిదైవం
18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి చెట్టెక్కి కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా నిరాశే అయింది .ఆయన కలకత్తాలో ఉండగా భార్యకు రక్తగ్రహణి వ్యాదివచ్చి పుట్టింటే మరణించింది .మరో పెళ్లి చేయాలని తండ్రిభావి౦చినా ,వైద్యం మీదే దృష్టి ఉన్నకోడుక్కి ఇష్టం లేదు .రోగాలను శీఘ్రంగా గుర్తించి ఉచితంగా మందులిచ్చి హస్తవాసి మంచిదని ,వైద్యో నారాయణోహరిః అనిపించుకొన్నాడు .ఇల్లంతా రోగులతో నిండేది .వారి సేవయే పరమధర్మగా భావించాడు .విసుగు విరామం లేనేలేదు .అభాగ్యులను నిరుపేదలకు అతడుప్రత్యక్ష దైవమె .
సేవా ధర్మ మహాశయుడు
ప్రేమ చంద్ర మున్షి అనే ధనికుడు కలకత్తాలో హాట్ ఖోలాలో ఉండేవాడు .ఇంటి పనులకు మనిషులను పెట్టక ,ఒక పేద బంధువుతో అన్ని పనులు చేయించుకొనేవాడు .రోజూ గంగాస్నానానికి వెడుతూ నాగమహాశాయుని ఇంటికి వచ్చి హుక్కాపీల్చి వెళ్ళేవాడు .కొంతకాలానికి ఆయనింట్లో పని చేస్తున్నబంధువు చనిపోయాడు .పిసినారి ఐన అతనికి సాటివారెవ్వరూ సాయం చేయటానికి రాలేదు. నాగమహాశయుడు వెళ్లి తాను శవాన్ని తీసుకు వెడతానానని చెప్పి ,తండ్రికూడా సాయంరాగా స్మశానానికి తీసుకు వెళ్లి దహన సంస్కారాలు చేశాడు .
శాస్త్ర జిజ్ఞాస ,మళ్ళీ పెళ్లి
నాగామహాష్యుని స్నేహితుడు సురేశ చంద్ర దత్తు బ్రహ్మ సమాజీకుడు విగ్రహారాధనకు వ్యతిరేకి ఇద్దరూ తరచూ వాదించుకొన్నా స్నేహం బాగా ఉండేది .కేశవ చంద్ర సేన్ స్థాపించిన బ్రహ్మ సమాజమందిరానికి నాగ ను తీసుకు వెళ్ళేవాడు .కేశవ చంద్రుని ఉపన్యాసాలకు ముగ్ధుడయ్యేవాడు .సచ్చరిత్రుడు పవిత్రుడు ఐన నాగమహాశాయుని చూసి చాలామంది తమ అభిప్రాయాలు మార్చుకొని వైదికాచార విధానాలు అవలంబించేవారు .నాస్తికులుఆస్తికులయ్యారు .ఏకాదశీ వ్రతం శ్రద్ధగా చేసేవాడు. గంగాస్నానం తప్పని సరి .సాధకులను సన్యాసులను దర్శించి శాస్త్రాలలో సందేహాలు తీర్చుకోనేవాడు .ఒక వృద్ధ బ్రాహ్మణుడి వలన షట్ చక్ర రహస్యం తెలుసుకొన్నాడు .తండ్రి ఎన్నిసార్లు వివాహప్రసక్తి తెచ్చినా వద్దనే చెప్పేవాడు .ఒకరోజు తండ్రి గదిలో వెక్కి వెక్కి ఏడవటం చూసి కారణం అడిగాడు .ఆయన మాట విని పెళ్లి చేసుకొంటానన్నాడు .తండ్రి వెతికి తగిన అమ్మాయితో పెళ్లి చేశాడు .
వైద్యో నాగమహాశయో హరిః
కలకత్తా వెళ్లి వైద్య వృత్తి సాగించాడు .ఎవరినీ ఏదీ అడిగేవాడుకాడు .ఇస్తే పుచ్చుకోవటమే తప్ప అడగటం రాదు .మేనత్తకు జబ్బు చేసిందని తెలిసి స్వగ్రామం వెళ్లి ,ఆమెను రక్షించాలని విశ్వప్రయత్నం చేసి విఫలంకాగా ఆమె ఆశీర్వదిస్తూ దైవ స్మరణతోచనిపోయింది .తీవ్ర దుఖంతో ఏడ్చేశాడు .పిచ్చిపట్టినవాడిలాగా ఉండేవాడు చెల్లెలు శారద వచ్చి సాయం చేసింది ఊరడించినది .కొంతకాలానికి మామూలు అయ్యాడు .మరణం గురించి మళ్ళీ జన్మ గురించి ఆలోచించేవాడు .రోగుల సేవలోనే సమయమంతా గడిపి అంతకు మించి ఆనందం లేదనుకోనేవాడు .ఒకరోజు నిరుపేద కు నాలుగుగంటలు సేవచేసి మందులిచ్చి ,వేసి ,రాత్రి ఎలాఉందో చూడటానికి వెళ్ళాడు. పూరి గుడిసెలో ఒంటిపై వస్త్రం కూడా లేని స్థితి లో చూసి ,తానుకప్పుకొన్న శాలువాకప్పి చలిను౦చి కాపాడాడు .మరోకరోగి నేలపైనే పడుకోవటం చూసి ,ఇంటికెళ్ళి తనమంచం ,దిండు తెచ్చి ,వేసి ,పడుకోబెట్టి సేవ చేశాడు .ఒకకుటుంబంలో పసిపిల్లకు కలరా సోకితే వెంటనే వెళ్లి అక్కడే ఉండి ,మందులిస్తూ సేవ చేశాడు. కాని బ్రతకలేదు .నాగ చాలాడబ్బు పిండి ఉంటాడని స్నేహితుడు సురేష్ ఊహించాడు .శిశువు చనిపోయిందనే మహాశయుని బాధ చూసి తల్లడిల్లాడు .అన్నం కాని నీళ్ళుకానీ తాగలేదు
నాగమహాసహాయుడు వాడే మందులు గొప్ప గుణాన్ని కలిగి ఉండేవని రోగులు నమ్మారు పాల్ సోదరులు ఆయనను తమ ఇంటి డాక్టర్ గా నియమించుకొన్నారు .పాల్ చుట్టాలవిడకు కలరా సోకితే ఈయనగురువును పిలిపించారుకాని నాగమహాశయుడు చేస్తున్న వైద్యమే సరైనదని గురువు శిష్యుని మెచ్చుకొన్నాడు .ఆమె బ్రతికింది .సంతోషం తో పాల్ బ్రదర్స్ ఒక వెండి పెట్టెనిండా రూపాయలు నింపి ఆయనకివ్వగా, కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు .తండ్రికి తెలిసి బాధపడ్డాడు .ఒకధనికుడు అందగత్తె ఐన వితంతువును చూపించి ఆమె గర్భాన్ని తీసెయ్యాలని కోరి పళ్ళెం నిండా రూపాయలు పెట్టాడు నాగమహాశయుడు ‘’వితంతువుకు కడుపు చేసి ఒకపాపం చేసి ,భ్రూణహత్యకోసం మరో పాపం చేస్తున్నావు ‘’అని చెప్పి మాన్పించటానికి బ్రహ్మ సమాజీకుడు,సేవాతత్పరుడు సంస్కారి శివనాధ శాస్త్రికి చెప్పగా ఇద్దరూ కలిసి వచ్చేసరికి ధనికుడు ఆ విధావరాలితోకాశీకిపారిపోయాడని తెలిసింది .
శ్రీరామకృష్ణ పరమహంస దివ్య సన్నిధిలో
వైద్యం వలన కొన్త రాబడి కొంత బాగానే ఉన్నా , తండ్రి స్వయంగానే వంట చేసేవాడు చూడలేక బాధపడేవాడు నాగ .జడభరతుడి కథ బాగానచ్చి అలా ప్రవర్తించేవాడు .ఒకసారి గంగ ఒడ్డున పరవశంతో నృత్యం చేస్తూ నదిలోపడిపోతే ,స్నేహితులు కాపాడారు .ఒక బైరాగి గురు కటాక్షం లేనిది ఏదీ సాధించలేవని చెప్పాడు అనుకో కుండా ఒక గురువువచ్చి మంత్రోపదేశం చేశాడు .దీక్షగా జపం చేశాడు .తండ్రి ఆరోగ్యం క్షీణించింది .భార్య అతనికి బగా సహకరించింది .ఒకసారి సురేష్ తో కలిసి దక్షిణేశ్వరం వెళ్లి శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శింఛి మంచంపై పడుకొన్న ఆయన పదాలను తాకాలని ప్రయత్నిస్తే ,చటుక్కున వెనక్కి లాగుకోగా ,బాధపడుతుంటే పరమహంస ‘’ఒక రకం చేప బురదలో ఉన్నా , దానికి బురద అంటుకోనట్లే, సంసారంలో ఉన్నా నీకు సంసారం మాలిన్యం అంటుకోదు ‘’అని చెప్పాడు .దగ్గరలోని పంచవటి లో కాసేపు ధ్యానం చేసిరమ్మని పంపాడు .అలాచేసి పరమహంస ఆశీస్సులు పొంది ఇంటికి చేరాడు పరమానందంగా .మరో సారి వెడితే రామకృష్ణ ‘’ఉన్నతస్థితి పొందావు ‘’అన్నారు .ఇక్కడే వివేకానంద స్వామితో పరిచయభాగ్యం కలిగింది .పరమహంస స్వామితో నాగమహాశయుని చూపిస్తూ ‘’యితడు నిజంగా స్వార్ధ రహితుడు ‘’అనగా స్వామి ‘’అచార్యులన్నమాటకాదనగలవారెవరు?“’అన్నాడు .నాగ క్రమంగా వైద్యం మానేశాడు. తండ్రికి తెలిసి పాల్ బ్రదర్స్ కు చెప్పి సంస్థలో పని కుదిర్చాడు .కాని బలవంతం మీద వెళ్ళేవాడు .తండ్రి చనిపోయాడు. దినవారాలు అప్పు చేసి చేశాడు .
సంసారంలో సన్యాసి
కలకత్తాలో ప్లేగు విజ్రుమ్భించింది .మందులిస్తారుకాని రోగులకు సేవ చేయటానికి ఎవరూ ముదుకు రాకపోతే నాగమహాశయుడే దీక్షగా సేవలో పాల్గొన్నాడు . వీలైనప్పుడల్లా పరమహంస దర్శనం చేసి, సద్గొస్టి లో పాల్గొనేవాడు .తనవూరిలో కుటీరం లో ఉందామనుకొంటే భార్య ఆయనదారికి అడ్డురానని చెప్పగా ఇంట్లోనే ఉన్నాడు .ఒకసారి ఒకభక్తుడు వచ్చి బ్రహ్మ చర్యం బాగానే ఉందికాని సంతానం కోసం ప్రయత్నించమని చెబితే ,ఇటుక రాయితో తలబాదుకొని అలాఅనటం భావ్యం కాదనగా ఆయన తన తప్పు తెలుసుకొని క్షమించమన్నాడు .
పరమదయామయుడు మహాశయుడు
పాల్ సోదరులకోరికపై భోజేశ్వరానికి పడవపై వెళ్ళాడు .తిరిగివచ్చేటప్పుడు పాల్ బ్రదర్స్ 8రూపాయలు చలికి ఆగే శాలువా ఇచ్చారు .ఓడరేవు ఆరు మైళ్ళ దూరంలో ఉంది .రేవు చేరగా బీదరాలు పసిపిల్లలతో చలికి ఆగలేక దీనంగా కనిపిస్తే డబ్బులు, శాలువా ఇచ్చేసి పడవ ఎక్కి ఇంటికి చేరాడు .పాల్ సోదరుల దుకాణంలో నాగ బదులు రణజిత్ పని చేస్తూ సగం డబ్బు మహాశాయుడికిచ్చేవాడు. అతనికి ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకోనేవాడు .చెరువులలో బియ్యం, పప్పులు చేపలకుఆహారంగా వేసేవాడు .అన్నిప్రాణులనూ సమాదరించే గొప్ప లక్షణం ఆయనది .హింసకు వ్యతిరేకి .ఎప్పుడూ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లే కనిపించేవాడు .ఎవరికి నమస్కారం అంటే ‘’జగదీశ్వరునికి’’ అనేవాడు .నాగమహశయుని దర్శన౦ తోనే దీర్ఘ వ్యాధులు కూడా నయమయ్యేవని విశ్వాసం .
ఇంటి ముందు ఉప్పొంగిన గంగ
యాభై ఎల్లఏళ్ళకు ఒక సారి వచ్చే ‘’అర్ధోదయం ‘’గంగాతీరంలో గొప్పగా జరుగుతుంది .మూడు రోజులముందే మహాశయుడు కలకత్తా వదిలి స్వగ్రామం వచ్చాడు .గంగ ఉన్న చోటు వదిలి ఇంటికొచ్చావేమితని తండ్రి అడిగాడు .నమ్మకమైన భక్తిఉంటె పావనగంగ తనంతట తానే ఇక్కడికి రాదా ?’’అన్నాడు .సరిగ్గా అర్ధోదయం రోజు శుభుహూర్తం లోఆయన పూజామందిరంలో పూజ చేసుకొంటూ ఉండగా , మహాశయునిఇంటికి ఈశాన్యభాగం లో భూమి నుంచి జలధార తటాలున పైకి ఉబికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరచింది .’’అమ్మా పతితపావని పావన గంగా ‘’ అంటూ బయటికి వచ్చి ఆ గంగకు నమస్కరించి ,పవిత్ర గంగాజలం తీర్ధంగా తీసుకొని అక్కడే తను , తండ్రీ భార్య అందరూ అర్ధోదయ పవిత్రస్నానాలు చేశారు .భక్తిపారవశ్యంతో ‘’జయజయగంగే ‘’అంటూ నాట్యం చేశాడు మహాశయుడు .ఈఅద్భుత ఘట్టం తెలిసిన వివేకానదస్వామి ‘నాగమహాశాయుని వంటి మహాత్మునకు అసాధ్యమైనదేదీలేదు .ఆయన ఇచ్చాశక్తి అమోఘం .ఆశక్తివలన ముక్తిపొండటం అతి తేలిక ‘’అన్నాడు .ఈ అద్భుతాన్ని గొప్పగా మహాశయుడు ఎన్నడూ ఎవరితోనూ ప్రస్తావించలేదు .
గురుభక్తి ,శిష్యవాత్సల్యం
నాగ మహాష్యుడిని చూడటానికి శిశ్యుడొకడుఒకసారి ఢాకా ను౦చి బయల్దేరి దారిలో విపరీతైన వర్షం గాలి కారు చీకటిలో ఎలాగగో ఇంటికి వచ్చి గడ్డకట్టుకు పొతే భార్యాభర్త సపర్యలు చేసి స్వాస్త్యం కలిగించి ఎందుకు ఇంతసాహసం చేశావని అడిగితె ‘’ఈ మహాత్ముని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోయాను ‘’అన్నాడు ఆనంద బాష్పలతో .అతిధికి వండిపెతట్ట టా నికి ఇంట్లో కట్టెలు లేవు .ఇంటివాసాలు పీకి వాటితో వంట చేయి౦చి భోజనం పెట్టాడు . కలకత్తా విద్యాసాగర కాలేజీలో చిదివే యువకుడొకడు నాగమహాశయుని చూడాలనే కోరిక తీవ్రంగా కలిగి భావోద్రేకం తో ఉండి,సాధ్యంకాక ఆత్మహత్యకు హాస్టలు పై అంతస్తు నుంచి దూకి సిద్ధమవగా ఎవరో వెనకనుంచి ‘’దూకడద్దు నాగమహాశయుని దర్శనం రేపు పోద్దునకలుగుతుంది ‘’అని వినిపించి ఆగిపోగా మర్నాడు ఉదయం మహాశయుడు అతని తలుపుతట్టి లోపలి రాగా పాదాలపై వాలిపోగా ఆప్యాయంగా కౌగిలించి పైకి లేపి ధైర్యం కలిగించి ఆత్మహత్య పాపం నేరం అని చెప్పి బేలూరు తీసుకు వెళ్లి ఆశ్రమ యోగులకు అప్పగించాడు నాటవర ముఖోపాధ్యాయ అనే కుర్రాడు శీలరహితుడై పోగా ,మహాశయుడు అతన్ని మంచిమార్గం లోకి మళ్ళించాడు .’’నాగ మహాశయుని సమక్షం లో అయిదు నిమిషాలు ఉంటె చాలు అత్యద్భుత ఆధ్యాత్మిక పరిణతి లభిస్తుంది అన్నారు హరకామి,నీ కైలాస చంద్ర దంపతులు . స్వామి వివేకానంద కూడా ఇలాగే అన్నాడు ‘.
మహా నిర్యాణం
వంగశకం 1306లో దుర్గా ఉత్సవాలకోసం కలకత్తా వెళ్లి సంబారాలకోసం జ్వరం తో కలకత్తా వెళ్ళలేకపోతే భార్య చక్రవర్తి అనే శిష్యుడికి టెలిగ్రాం ఇస్తే ,అతడు మఠం లో వేదమతం గురించి ఉపన్యాసం ఇవ్వాల్సి వస్తే , ఎటూ పాలుపోక అద్భుతానందస్వామి గ్రహించి ఉపన్యాస౦ ఎప్పుడైనా ఇవ్వచ్చు . ముందు నాగమహశయుని చూసిరామ్మని చెప్పగా, కాళీఘాట్ నుంచి వెంటనే బయల్దేరి మర్నాడు ఉదయం రాగా ఇంటివసారాలో మంచం పై పడుకొని ఉన్న గురువుగారిని చూసి గగ్గోలు పెట్టి గురుపత్నిని అడిగితతే వ్యాధి పెరగ్గానే ఆయనే అక్కడికి వెళ్లి పడుకొన్నారు తానేమీ చేయ లేకపోయాను అని వలవలా ఏడ్చింది. మహాశయుడు శూలవ్యాది గ్రహణి లతో బాధపడుతున్నాడు .పగలు నాలుగుమెతుకులే తిండి .తనబాద ఎవరికీ చెప్పనేలేదు .సుశ్రూషకు అనుమతి అడిగితె చక్రవర్తి ,గురువు అంగీకరించకపోతే ,మంచం దగ్గరే కూర్చుని డుర్గాస్తవం భాగవతం భగవద్గీత ఉపనిషత్తులు చదివి వినిపించి గురువు ముఖంలో ఆనందం చూసి సంతృప్తి పొందాడు .మహాశయుడు గంటలకొద్దీ సమాధిలో ఉండేవాడు .సమాధి నుంచి బయటికి వచ్చి ‘’అమ్మా అమ్మా, అని సచ్చిదానంద్ ,అఖండ చైతన్య ‘’అని పలవరించేవాడు .
ఈయనమంచంలో ఉన్నా ఇంటికి అతిధి అభ్యాగతుల రాక మామూలే .వారికి కావలసినవన్నీ చేకూర్చమని భార్యకు చెప్పేవాడు .తనకై దుఃఖించే వారితో ‘’ఈతుచ్చశరీరం పై మక్కువ ఎందుకు? .ఇది ఎంతోకాలం ఉండదు.ఈశ్వరుడు కారుణ్య నిధి ఆయన ప్రేమ అనంతం ‘’అనేవాడు .కళ్ళనుండి నీరు కారేది. ప్రక్కలకు ఒత్తిగిలటమూ చాలాకష్టంగా ఉండేది .దుర్గామాత దుర్గామాత అనే మాటలే తప్ప వేరొక మాట వచ్చేదికాదు .’’మాకుదిక్కెవ్వరు ?’’అని అక్కడివారు అడిగితె ‘’పరమహంస పదద్వయమే దిక్కు. రామకృష్ణుడే అందరికీ దిక్కు ‘’అనేవాడు .
ఢాకాలో ఉండే శారదానందస్వామి మఠం బాధ్యతలు చూసేవాడు .అప్పుడప్పుడు వచ్చి నాగమహాశయుని సేవ చేసి వెళ్ళేవాడు.ఆయనద్వారా మందులు తీసుకోమని భర్తకు చెప్పించినా ‘’పరమహంస ,జగన్మాతల నామాలే నాకు మందులు ‘’అన్నాడు .తండ్రి దినవారాలకు చేసిన అప్పు తీర్చలేకపోయానని బాధపడేవాడు .అప్పు ఇచ్చినాయన ఒక రోజు చూడటానికి రాగా ‘’నాయనా !అప్పు తీర్చజాలని అపరాధిని నేను .నేను చనిపోయాక నా ఇల్లు తీసేసుకుని నన్ను రుణ విముక్తుడిని చేయండి .నాభార్య పుట్టింట్లో ఉంటుంది ‘’అన్నాడు .అతడు ఏడుస్తూ ‘’డబ్బుకోసం రాలేదు మహాత్మా మీ దర్శనం కోసమే వచ్చాను ‘’అని కాళ్ళమీద పడి బావురుమన్నాడు .చలించిన మహాశయుడు ‘’ఈశ్వర కటాక్షం .మీ హృదయం మహోన్నతం .జగదీశుని కటాక్షం వలన మీకు సర్వ సుఖాలు కలుగుతాయి ‘’అన్నాడు .మధ్యాహ్నం 3గంటలైంది వ్యాధి తీవ్రమైనది .సంధి లక్షణాలు వచ్చి తాపం భరించలేక ,అకస్మాత్తుగా లేచికూర్చుని విసనకర్రతో విసిర్తే కొంచెం ఉపశమనం కలిగి ,చక్రవర్తితో ‘’పంచాంగం చూసి ప్రయాణానికి ముహూర్తం పెట్టు ‘’అన్నాడు .అంతరార్ధం గ్రహించి అతడు ‘’పుష్య శుద్ధ త్రయోదశి పగలు పది గంటలకు దివ్యమైన ముహూర్తం ‘’అన్నాడు .’’నువ్వు అనుమతిస్తే ఆముహూర్తానికే తిరిగిరానిలోకాలకు బయల్దేరుతాను ‘’అన్నాడు .భార్యతో సహా అంతా గొల్లుమన్నారు .
రెండు రోజులకు ప్రాణం విడుస్తాడు అనగా మంచం చుట్టూ చేరిన భక్తులందరూ వింటూ ఉండగా చక్రవర్తితో ‘’గురు దేవులు వచ్చారు నాకు అన్ని తీర్దాలు చూపిస్తారు .నువ్వు ఒక్కోదాని పేరు చెప్పు ‘’అన్నాడు .హరిద్వారం అనగానే త్రివేణీ సంగమం చూసి ఉప్పొంగిపోయినట్లు స్నానిన్చినట్లు తన్మయం లో అన్నాడు సమాదినుంచి లేచాక చూస్తే ‘’సురదుని’’లోస్నానం చేసినవాడుగా కనిపించాడు .తెల్లవారు జామున నాలుగు గంటలకు కొద్దిగా నిద్రపట్టి ఉదయం ఆలస్యంగా లేచాడు .తెల్లారి పుష్య శుద్ధ త్రయోదశిఉదయం 8గంటలకు అకస్మాత్తుగా లేవగా ఆయాసం ఎక్కువకాగా చక్రవర్తి మహాశయుని చెవులలో ‘’శ్రీ రామకృష్ణ శ్రీ రామ కృష్ణ ‘’అని ఉచ్చరించాడు .పరమహంస ఫోటో ఒకటి దగ్గర ఉంచి ‘’ఏనామం స్మరించటానికి సర్వం త్యజించారో ఆయన స్వరూపం చూడండి ‘’అన్నాడు .కళ్ళు తెరచి ‘’కృపానిదీ జోహార్ జోహార్ ‘’అని చివరిపలుకులు పలికాడు నాగమహాశయుడు .9గంటలకు ఆయాసం బాగా ఎక్కువై ,అరగంట తర్వాత దృష్టి నాసాగ్రం పై ఉన్నట్లు కన్పించింది .శరీరరోమాలు నిక్క బొడుచుకున్నాయి .పులకి౦త కనుదోయినుంచి ప్రేమధార కురిసింది .ప్రాణవాయువు మూలాధారం నుంచి క్రమ౦గా పైకి వెడుతోంది .నాభికి చేరగానే గుండె వేగంగా కొట్టుకొన్నది .పావు గంటకు మహాసమాదిలోకి వెళ్ళాడు .భార్య ‘’వారు గృహస్తాశ్రమంలోనే ఉన్నారుకనుక ఆప్రకారమే కార్యక్రమాలు జరగాలి ‘’అని చెప్పింది .ఆయనను జాగ్రత్తగా పట్టుకొని ఒకబల్లపై మెత్తని శయ్య ఏర్పాటు చేసి పడుకోబెట్టారు .అయిదారు నిమిషాలతర్వాత ప్రాణవాయువు ఆగిపోయింది .వదనం జ్యోతిర్మయంగా కనిపించి కళ్ళనుండి ప్రేమామృతం వర్షిస్తున్నట్లుగా ఉంది .భార్య భర్తమరణానికి తీవ్రంగా రోదించింది .
గ్రామ పెద్దలు వచ్చి శవాన్ని పరీక్షించగా శరీరం వేడిగానే ఉండటం వలన మరో 12గంటలు అలానే ఉంచి తర్వాత అగ్ని సంస్కారం చేయాలని నిర్ణయించారు .రాత్రిపదిగంటలకు చందన కర్రల పేర్పుతో ,శిష్యులే పుత్రులై దహన సంస్కారం శాస్త్రోక్తంగా చేశారు .నాగమహాశయుడు 53ఏళ్ళ 4నెలల 7రోజులు మాత్రమె జీవింఛి పుట్టిన చోటనే మట్టిలో కలిసిపోయిన పుణ్యాత్ముడు. ఆయన జన్మించిన దేవభోగాగ్రమం ,ఆయనవలన పవిత్ర క్షేత్రం అయింది .జ్ఞాన,భక్తి యోగి గా నాగమహాశయుడు చరిత్ర ప్రసిద్ధి పొందాడు .
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-19-ఉయ్యూరు