మహా భక్త శిఖామణులు(చివరిభాగం )
20-రుయి దాస స్వామి
రామానంద స్వామి ని సేవించే ఒక యువకుడు కఠిన బ్రహ్మ చర్యం పాటించేవాడు .ఊరిలో బిచ్చమెత్తి వచ్చిన బియ్యం తో అన్నం వండితే ,గురువు ఇస్టదేవతకు నైవేద్యం పెట్టేవాడు .వడ్డీ వ్యాపారం తో ‘’డబ్బు చేసిన ‘’ఒక ధనికుడు ఈ యువకుడికి బిక్షం వెయ్యాలనుకొనగా గురువు అనుమతి లేనిదే స్వీకరించనన్నాడు .ఒక రోజు విపరీతమైన గాలి వాన వచ్చి బయటకు వెళ్ళలేక పోయాడు యువకుడు .ధనికుని ఇంటినుంచి బియ్యం తెప్పించి నైవేద్యానికి అన్నం వండాడు .గురువు మనసు నిశ్చలంగా ఉండలేకపోయి శిష్యుడిని బియ్యంఎక్కడినుంచి తెప్పించావని అడగగా, వడ్డీ వ్యాపారి నుంచి అని చెప్పగా అక్రమ ధనార్జన చేసే అతని నుంచి ఎందుకు తెప్పించావని కేకలేసి తన ఆజ్ఞ ధిక్కరించినందుకు మరుసటి జన్మలో నీచ కులం లో పుడతాడని శపించాడు .
కొద్దికాలానికే ఆ శిష్యుడు చనిపోయి మాదిగ కులం లో పుట్టాడు .కాని పూర్వజన్మ జ్ఞానం ఉండేది .హృదయం హరి భక్తితో పొంగిపోయేది .కాని గురునికి దూరమయ్యాననే బాధ ఉండేది.అందువలన తలిదండ్రులు ఎంతలాలన చేసినా ఏడుపు మానే వాడుకాదు.తండ్రి చేసేదిలేక రామానంద స్వామికి విన్నవించాడు .విషయం గ్రహించిన స్వామి శిష్యుడు తనకు దూరమయ్యాననే బాధతోనే శిశు రూపం లో ఏడుస్తున్నాడని గ్రహింఛి ‘’నన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళండి .అన్నీ చక్కబరుస్తాను’’అనగా ‘’మేము నీచకులం వాళ్ళం .మా ఇంటికి మీరెలా వస్తారు స్వామీ ‘’అన్నారు అమాయకంగా .’’సేవా ధర్మం లో అంటరానితనం అనేది లేదు .పరోపకారమే నిజమైన హరి సేవ .నేను నీతో వస్తానుపద ‘’అన్నాడు
మాదిగవానితో కలసి రామానందస్వామి వాళ్ళ ఇంటికి వెళ్లగా బిడ్డను చంకలో పెట్టుకొనితల్లి ఎదురు చూస్తోంది .బాలుడు చాతకపక్షిలాగా గురు చంద్రునికోసం అలమటిస్తున్నాడు .తన దుఖాన్ని కన్నీటి దారలతో చెప్పాడు ఆ పూర్వ శిష్యుడు ,ఇప్పటి మాదిగ శిశువు .ఆచార్యుని హృదయం కారుణ్య రసమైప్రవహించి శిశువు శిరసు తాకుతూ ‘’బిడ్డా !ఏడవకు .భక్తరక్షకుడుశ్రీరామ చంద్రుడు నిన్ను కాపాడుతాడు .ధన్యుడవు అవుతావు ‘’అని ఆశీర్వ దింఛి చెవిలో రామనామ మంత్రం ఉపదేశించి వెళ్లి పోయాడు .ఈ బాలుడు క్రమగా పెరిగి రుయీ(ఏడుపు ) దాసు అనే పేరు పొంది పెద్దవాడై శ్రీరామ భక్తిలో మునిగిపోయాడు.రామనామ స్మరణ చేస్తూ,కులవృత్తి నిర్వహించేవాడు .రెండు జతల చెప్పులుకుట్టి ఒక జత కనిపించిన రామభక్తుడికిచ్చి రెండవ జత అమ్మి, ఆడబ్బుతో జీవనం సాగించాడు .డబ్బు తీసుకోకుండా హరిభక్తుల జోళ్ళు బాగు చేసేవాడు .
బంధు మిత్రులను వదిలి గంగాతీరం లో కుటీరం ఏర్పాటు చేసుకొని ,శ్రీరామ విగ్రహం పెట్టి ,పూజిస్తూ కులవృత్తీ చేస్తూ కాలం గడిపాడు .జోళ్ళు అమ్మలేని రోజు ఉపవాసం ఉండేవాడు .ఆకలి దప్పులు లేకుండా నిత్య హరినామ స్మరణ చేసేవాడు .ఒకరోజు రాముడేస్వయంగా మారు వేషం లో వచ్చి ఒకస్పర్శమణి చూపి దాన్ని తాకిస్తే ఇనుము బంగారం అవుతుందని చెప్పి ఇవ్వబోతే ‘’స్వామీ !ఎవరు నువ్వు నాపై ఇంతటి కరుణ ఎందుకు ?’’అని ప్రశ్నించాడు ..’’నీ కస్టాలు పోగొట్టటానికే పరుసవేది ఇస్తున్నా తీసుకో ‘’అనగా రుయీ ‘’నిజంగా నువ్వు నా ఇష్టదైవం శ్రీ రాముడివే ఐతే, నీ నిజ రూప దర్శనభాగ్యం కలిగించు ‘’అన్నాడు .మర్నాడుకూడా వచ్చి ఆపరుసవేదిని తీసుకోమని చెప్పి మూలనున్న కత్తికి దానిని అ౦ టించగానే అది బంగారుకత్తి గామారింది .దాసు ‘’నువ్వు ఎవరివో గారడీ వాడిలాగా ఉన్నావు బంగారం లాంటి నాకత్తిని నిజంగా బంగారం చేసి నా కడుపుకొట్టావు .నీ రాయీఅక్కర్లేదు నువ్వూ అక్కర్లేదు తీసుకొని పో ‘’అన్నాడు ..’’బంగారు కత్తి వలన బోలెడు డబ్బు వస్తుంది ‘’అని ఆశపెట్టాడు .’’నాకు బంగారం పై మోజులేదు.ధనం కూడా బెట్టాలన్నతాపత్రయమూ లేదు.నీ రాయి నాకు ముక్తినివ్వదు. కస్టాలు తెస్తుంది .దయతో తీసికెళ్ళు ‘’అన్నాడు .పరుసవేదిని రుయీ దాసు చేతిలొపెట్టి వెళ్ళాడు లీలామానుష రూపుడు.
బంగారు కత్తినీ ,తానూ మామూలుగా వాడే కత్తినీ మూలపారేసి ,కొత్తకత్తికొని వృత్తికొనసాగించాడు .ఉపవాసాలు చేస్తూ వృత్తికొనసాగిస్తూ , రామనామ స్మరణ చేస్తూనే ఉన్నాడు .కరుణామయుడు భరించలేక మళ్ళీ వచ్చి పరుస వేది ఏమైంది అని అడిగితె మూల పారేశాను కావాలంటే ఎవరికైనా ఇచ్చుకో అనగా , పరుసవేది తాను తీసు కొంటాకాని , నేనిచ్చేది ఏ దైనా కానీ నువ్వు తీసుకోవాలి ,ప్రతిరోజూ నీ దేవుడి పీఠం మీద అయిదు బంగారు నాణాలు ఉంటాయి .అవి తప్పక తీసుకో .ఇప్పుడు చూడు అక్కడ నాణాలు ఉంటాయి అని బలవంత పెట్టగా ‘’అసలు నువ్వెవరవయ్యా స్వామీ . ఈ బలవంతం ఏమిటి ?అనగా ‘’నేను నీవాడిని .నీ భక్తికి మెచ్చి ఈ ఏర్పాటు చేశాను ‘’అన్నాడు .’’నీ కరుణకు ధన్యవాదాలు కానీ నేను తీసుకోలేను .మన్నించు .నీ దర్శనం ఇప్పించు చాలు ‘’అన్నాడు . వెంటనే నిజరూప దర్శనం కలిగించి సంతృప్తి పరచి శ్రీరామ చంద్ర మూర్తి అదృశ్యమయ్యాడు ,దాసుమనసులో అద్భుత జ్యోతి ఏర్పడిన భావం కలిగింది .ఏం జరిగిందో అర్ధంకాక ఉన్మాదిలాగా ‘’రామా రామా ‘’అంటూ అటూ ,ఇటూ పరుగులు తీశాడు .తర్వాత రామనామం కలవరిస్తూ మూర్చపోయాడు .తేరుకొని లేచి రాముడు అడిగిన దాన్ని తీర్చటం తన విధి అనుకోని రోజూ వచ్చే నాణాలను రామభక్త పూజకు వినియోగించటానికి నిర్ణయించాడు .
ఆరోజు నుంచి భక్తుల రాక పెరిగి కుటీరం రామనామం తో ప్రతిధ్వనించింది .దిక్కు లేనివారంతా రూయీ దాసు దాసులయ్యారు .దాసు పెట్టే భోగాన్నం తీసుకోవటానికి ప్రతిరోజూ రాముడు ఏదో ఒక వేషం లో వచ్చేవాడు .కొంతకాలం తర్వాత ఆశ్రమం భక్తులకు అప్పగించి చిత్రకూటం వెళ్లి దగ్గరలో ఉన్న గాయత్రి ,పయస్విని మందాకినీ నదులలో మందాకినీ చెంత ఆశ్రమం నిర్మించుకొని ,రామ భజన స్మరణ చేశాడు .ఈ మూడు నదులు కలిసే చోటు ఒక త్రివేణీ క్షేత్రమైంది .దీనికి దగ్గరలో హనుమాన్ ధారా ,భరత కూపం ,భరద్వాజాశ్రమం ఉన్నాయి .సీతా ఝాలీ అనే రాణి రుయీదాసు శిష్యురాలై మంత్రోపదేశం పొందాలనుకొంటే కొందరు పండితులు క్షత్రియరాణి చండాలుని వద్ద మంత్రోప దేశమా అని ఆక్షేపిస్తే రాణి ‘’అతడు నిస్వార్ధ భక్తుడు .’’అని చెప్పి తారక మంత్రోప దేశం పొంది ,ధ్యాన ,మంత్రజప ,దీనజన పోషణలో జీవితం గడిపి,రామ సాక్షాత్కారం పొందిన ధన్యురాలు .
ఒక శ్రీరామనవమి నాడు గొప్ప సంతర్పణ చేసింది రాణి .అన్నికులాలవారినీ ఆహ్వానించి ,రుయీ దాస స్వామికి ప్రత్యేక ఆసనం వేసి చేయి పట్టుకొని తీసుకు వచ్చి కూర్చోబెట్టింది .బ్రాహ్మణులకు నచ్చక ,దూరంగా వెళ్లి కూర్చున్నారు .వడ్డన పూర్తయి నివేదన అయ్యాక ప్రతి బాపడి కుడిపక్కన దాసు కనిపించాడు .కిక్కురుమనకుండా తిన్నారు .భోజనాలతర్వాత దాస స్వామిని బంగారు సింహాసనం పై కూర్చోబెట్టి ,రాణి వి౦జామరతో విసిరింది .బ్రాహ్మలు అతన్ని చూడగా అతనికి బంగారు జందెం ఉన్నట్లు గమనించారు .కాని అహం చావక వెళ్ళిపోయారు .రాణి కొంతకాల౦ తర్వాత దాసు తో తీర్ధ యాత్రలు చేసి , ఆతడు ముందూ తర్వాత ఆమె సాయుజ్యం పొందారు
ఆధారం -శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయనమూర్తిగారి రచన ‘’సంపూర్ణ భక్త విజయం ‘’
మహా భక్త శిఖామణులు ఈ 20వ ఎపిసోడ్ తో ముగిస్తున్నాను
శ్రీ హనుమద్ వ్రత శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-19-ఉయ్యూరు
జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి… ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపేటలో 1906 సంవత్సరంలో మృత్యుంజయుడు, వేంకమాంబ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యాభాసం చేసి తత్త్వశాస్త్రం, చరిత్రలలో ఎం.ఏ. పట్టా పొందారు. ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిష్యుడు. ఆయన కొంతకాలం స్వరాజ్య పత్రికలో పనిచేశారు.
1926లో లా పట్టా పొందారు. కొన్నాళ్లు రాజమండ్రి, విశాఖపట్నంలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈయన సంస్కృతాంధ్ర భాషలనే కాక, బెంగాలీ, హిందీ, పార్సీ, ఇంగ్లీషు, జర్మన్ మొదలైన నేర్చుకొని ఆయా భాషల సాహిత్యం గురించి పరిచయం చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ భాష ప్రభావం ఈయన రచనలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈయన భార్య శారదాంబ కూడా విదుషీమణి, రచయిత్రి.
ఈయన 1965 డిసెంబర్ 14న పరమపదించారు. చంద్రగుప్త, మేవాడు పతనము వంటి నాటకాలు, శ్యామల (1920), కాలసర్పి (1922), భిన్నహస్తము (1920), నూర్జహాన్ (1925), దుర్గాదాసు, ఆటీన్ మణెలా (1920), ఒథెల్లో (1960), నాలుగు కథలు (1932) పాంచకడీ దేవ్ రాసిన బెంగాలీ కథలకు తెలుగు అనువాదం, ఆంధ్ర మహా పురుషులు (1936), సాహిత్య తత్త్వ విమర్శనము (1936), విద్యార్థి ప్రకాశిక, ప్రణయ ప్రతిమ (1920) వంటి నవలలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి.
ఈయన 1950ల్లో తాను చేసిన మహారాష్ట్ర యాత్రను ఈ గ్రంథంలో యాత్రా సాహిత్యరూపంలో రచించారు. ఈ యాత్రలో భాగంగా శివాజీ, బాజీరావు వంటి మహావీరులకు సంబంధించిన చారిత్రిక ప్రదేశాలు, కోటలు, మహానగరాలు, వివిధ పుణ్యక్షేత్రాలు వంటివి దర్శించి వాటి గురించి గ్రంథంలో పొందుపరిచారు. కాగా ఈ పుస్తకంలో అత్యంత విలువైన భాగం మాత్రం పీఠికలో ఉన్న యాత్రా సాహిత్య వివరాలు.
క్రీస్తుకు పూర్వమున్న వివిధ నాగరికతల్లో యాత్రా సాహిత్యం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి వరకూ యాత్రా సాహిత్యం రచించిన భ్రమణ కాంక్షాపరుల గురించి ఇందులో వివరించారు. ఈ సమాచారం విజ్ఞానసర్వస్వ దృక్కోణంలో యాత్రా సాహిత్యం తరహా వ్యాసాలకు చాలా విలువైనది. దీని రెండవకూర్పును వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు చెన్నపురిలోని వావిళ్ల ప్రెస్లో 1951 సంవత్సరంలో ముద్రించారు. సంపూర్ణ భక్త విజయం గ్రంథాన్ని భక్తుల చరిత్రల విషయంలో విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి.
మద్రాసులో న్యాయవాది సత్యనారాయణమూర్తి ఎన్నో ఏళ్ళపాటు శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని రూపొందించారు. భీష్ముడు, ప్రహ్లాదుడు, కుచేలుడు మొదలైన పౌరాణిక యుగపు భక్తుల నుంచి గత శతాబ్దాలకు చెందిన దయానంద సరస్వతి, భక్త రామదాసు వంటి వారి వరకూ వివరాలతో గ్రంథాన్ని తయారుచేశారు.