మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-1

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-1

   నేపధ్యం

ఈ దసరాలలలో ఒంటి మిట్టనుండి డా.జి.శివకుమార్ ,ఆయన మిత్రులైన ఆర్.ఎం.పి.డాక్టర్ల బృందం మా మూడవ అబ్బాయి డా .నాగగోపాలకృష్ణమూర్తి ఆహ్వానం పై ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన రెండు రోజుల సదస్సుకు వచ్చి మా ఇంటిలో , మా దంపతులకు తిరుమల నుంచి తెప్పిచిన శాలువా లడ్డు ప్రసాదం ,శ్రీ ఒంటి మిట్ట శ్రీ కోదండ రామ స్వామి వ ఫోటో అందజేసి మమ్మల్ని అక్కడికి రమ్మని కోరారు .సరే అని సరసభారతి 14ప్రచురణలు మొత్తం సుమారు 350పుస్తకాలు ఇచ్చి  ఆప్రాంతం లో సాహిత్య సాంస్కృతికాభిమానులకు అందజేయమని కోరాను .మహా ప్రసాదంగా  తీసుకు వెళ్ళారు .అన్నీ సద్వినియోగం చేశారనే భావించాను .అప్పటినుంచి ఒంటిమిట్ట  ప్రయాణం ఆలోచన తీవ్రమైనది .పిల్లలకు సెలవులు కలిసొస్తాయని ఈనెల 13శుక్రవారం బయల్దేరి ,14,15తేదీలలో అక్కడ చూడాల్సినవి చూసి 15 మధ్యాహ్నం తిరుగు ప్రయాణం చేయాలని భావించాం .శివ దంపతుల ఇంట్లోనే బస భోజనాదులు అని మా మూర్తి చెప్పాడు .మనవరాలు రమ్య కు అనుకోకుండా ‘’పారాయణ ‘’వారు పరీక్ష పెట్టటం తో ,మా అన్నయ్యగారి అబ్బాయి రామనాథ బాబు వస్తానంటే సరే అని ‘’సెవెన్ సీటర్’’గా నేనూ మా శ్రీమతి ప్రభావతి ,మా మూడవకోడలు శ్రీమతి రాణి , వాళ్ళ అమ్మగారు ,మా వియ్యపురాలు శ్రీమతి దేవి గారు,మనవడు చరణ్ ,అన్నగారబ్బాయి రామనాథ  బాబు ,డ్రైవర్ ఈసా తో ఇన్నోవాలో  వెళ్లాలని తయారయ్యా౦.

              ప్రయాణం

   13వ తేదీశుక్రవారం ఉదయం 4కే లేచి ,స్నాన సంధ్యావందన పూజాదికాలు పూర్తి చేసి ,టిఫిన్ కాఫీలు లాగించి మేమిద్దరం  8 కి సిద్ధమయ్యాము  .మిగతావాళ్ళు అందరూ రెడీ అయ్యేసరికి 8-30దాటింది .దారిలోభోజనానికి ఇంట్లోనే అన్నం, కూర కొబ్బరి చట్నీ ,పులిహోరా మెంతిమజ్జిగ తయారు చేశారు అత్తా కోడళ్ళు .అన్నీసర్దుకొన్నాం  ,అక్కడి శ్రీరామ ,సీతా  లక్ష్మణులకు ,సంజీవరాయ హనుకు నూతన వస్త్రాలుకొన్నాము  ,కిలోన్నర చేమంతిపూలతో దండలు కట్టింది మాశ్రీమతి .దొడ్లోని కనకాంబరాలు  డిసెంబర్ పూలు కోసి పూజకు తీసుకు వెళ్లాం .మా వాటర్ ప్లాంట్ వాటర్ రెండు పెద్దకాన్ లలో పెట్టుకొని ప్లేట్లు గ్లాసులు,పెరుగు  కమలాపండ్లు చక్రకేళిలతో  బిస్కెట్ పాకెట్ లతో 9గంటలకు బయల్దేరాం .గుంటూరు  హైవే మీదుగా చిలకలూరి పేట ,అద్దంకి ,దరిశి ,పొదిలి మీదుగా కనిగిరి దగ్గరలో  అక్కడి గిరి సముదాయం ,అ౦దమైన ప్రకృతికి’’ ఫిదా’’ అయి ,కొండపై ఉన్న శ్రీ బాలార్క విశ్వేశ్వరస్వామి కోవెల ఉందని తెలిసి క్రిందనే అరుగులు ఉంటె భోజనానికి అనువుగా ఉంటుందని అక్కడ చేరి తెచ్చుకొన్నవి కడుపారగా ఆరగించాం డ్రైవర్తో సహా.చక్రకేళీలు తిన్నాం  .కొండపైకి వెళ్లి అక్కడ జరుగుతున్న చండీయాగం ,చూశాం .మమ్మల్ని భోజనానికి ఉండమని చేసేవారు చేయించే వారుకోరినా కుదరదని వినయంగా చెప్పి ,కిందకు దిగి బయల్దేరి ,కనిగిరి మీదుగా బద్వేల్ చేరి ,అక్కడి నుంచి ,సిద్ధవటం ,మాధవవరం ,మీదుగా ఒంటిమిట్ట డా. శివ గారింటికి సాయంత్రం 4 కు చేరాం . ఆయన, అర్ధాంగి శ్రీమతి పద్మ(జ)  దంపతులు మాకోసం ఎదురు చూసి ఆహ్వానించారు.కమ్మని  కాఫీ ఇస్తే తాగాం .మగవాళ్ళం పై అంతస్తులో ఉన్నగదిలో’’గాస్   సిలిండర్  ద్వారా గీజర్  ఏర్పాటు ఉన్న వేడి నీటి స్నానాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ,కిందికి దిగి ఈలోపు పద్మ సిద్ధం చేసిన కమ్మటి బజ్జీలు తిని   రెడీ అయ్యాం  .

   సాయంత్రం 5-30కు శివ మమ్మల్ని అందర్నీ తాళ్ళపాక తీసుకు వెళ్ళారు .దారిలోచేయ్యేరు ప్రాజెక్ట్ దానికి  చేరువలో ఒక శివాలయం ఉందని ఆ శివాలయం లోప్రతికార్తీక మాస మూడవ సోమవారం నాడు శివలింగం లోకి నీరు వస్తుందని  ఈమిస్టరి  ఎవరూ ఇంతవరకు చేధించలేదని చెప్పారు .తాళ్ళపాక లో అన్నమాచార్య జన్మించారు .ఊరి బయట 108అడుగులున్న అన్నమయ్య భారీ విగ్రహం ఉంది. అన్నమాచార్య విద్యాకేంద్రం ఉన్నది .అన్నమయ్య తండ్రి ఇక్కడి సిద్దేశ్వర స్వామి దేవాలయం లో పూజారి .శైవులు .అన్నమయ్య తిరుమల వెళ్లి అక్కడ వైష్ణవం స్వీకరించి అడ్డ బొట్టును నిలువు బొట్టుగా మార్చుకోన్నాడట .ఆయన జన్మించిన ఇల్లు, కూర్చుని రాసుకొన్న చోటు ,ద్యానమందిరం చూశాం .ప్రక్కనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చూశాం .ఈఆలయం లో శ్రీఏకా తాతయ్య అనే మహాభక్తుడు నిరంతరం తలకాయ నొప్పి తో బాధపడుతూ ఇక్కడిఈ స్వామిని దర్శించి   నొప్పి మాయమవగా ,దేవుని ఎదురుగా స్వయంగా శిలారూపం పొంది ,తనలాగే ఎవరైనా శరీర బాధలు పడేవారు తమ శిరసును తన శిరసుపై మూడు సార్లు ఉంచితే నివారణ ఆయే వరం పొందాడు .అందుకని భక్తులు మూడు సార్లు ఆయన శిరసుకు తమ శిరసుఆనించి మొక్కు కొంటారు అని శివ చెప్పారు .

 తిరిగి వెడుతూ దాములూరు గ్రామం లో శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం చూశాం .ఉగ్ర నారసింహుడు తన ఉగ్రాన్ని తగ్గి౦చు కొని శా౦తమూర్తిగా ఇక్కడ అవతరించి సౌమ్యనాథస్వామిగా మారాడు . భారీ విగ్రహం .స్వామి  వెనుక అంతేఎత్తులో శ్రీ ఆంజనేయస్వామి ఉండటం మరో విశేషం స్వామి తోకకూడా బాగా కనిపిస్తుంది రెండు విగ్రహాలు కలిసిపోయినట్లే ఉండటం మరో వింత  .వివాహాలు కానివారు సంతానం లేనివారు మరేదైనా కోరిక ఉన్నవారు ఆలయం చుట్టూ 8ప్రదక్షిణాలు చేసి కోరిక తెలియబరచాలి .కోరిక తప్పక తీరుతుంది. తీరినతర్వాత 108ప్రదక్షిణాలు చేయాలి .చాలామహిమ గలస్వామి అని శివ చెప్పారు .ఇక్కడి మూడు దేవాలయాలలో అర్చకస్వాఉ లంతా శివ గారికి బాగా పరిచయస్తులు .ఈమూడు గుడులలో పూజారి గార్లచేత నాకు స్వామి పుష్పమాలలను తీసి నా మెడలో వేయించారు .అంతటి పలుకుబడి డా.శివ గారిది .ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఒంటిమిట్ట శివగారింటికి చేరేసరికి రాత్రి 8.అయింది అప్పటికే పద్మగారు వంట చేసి సిద్ధంగా ఉంచి మాకు వడ్డించారు. పప్పు ,కాబేజికూర ,చట్నీ ,సాంబారు ,పెరుగు ,అప్పడం లతో కమకమ్మని వేడి వేడి భోజనం మా ‘’సెవెన్ సీటర్స్ ‘’వడ్డించి కొసరి కొసరి తినిపించారు .అన్నీ మహా రుచికరంగా ఉన్నాయి. ఈ దంపతుల ఆత్మీయత ,ఆదరణ ,అతిధి సేవ అమోఘం అద్భుతం .

   రాత్రి 8-30కు శ్రీ కోదండరామ స్వాములకు ఏకాంత సేవ .అంటే పవళింపు సేవ .దానికోసం మాకు ఏర్పాట్లు చేసి మమ్మల్ని తీసుకు వెళ్ళారు శివ .ఒక అరగంట సేపు జరిగింది చాలా దగ్గరగా చూడగలిగాం శివ గారి వలన .ఇక్కడఒకే రాతిపై శ్రీరామ,సీతా  లక్ష్మణ స్వాముల విగ్రహాలు కొలువై ఉండటం అరుదైన .ప్రపంచం లో ఎక్కడా లేని విశేషం .,నేను కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు లో  సైన్స్మాస్టర్ గా పని చేసినప్పుడు అక్కడి పురాతన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కోవెలలో ప్రతి శుక్రవారంరాత్రి సుమారు రెండుగంటలు పవళింపు సేవ వృద్ధ పూజారి గారు భార్య భక్తులు అతి శ్రద్ధగా చేయటం పాటలు పడటం భజనలు చేయటం చూశాను.మళ్ళీ ఇన్నేళ్ళకు ఇక్కడ .చూశా .మా ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ స్వామి ఆలయం లో ఒకసారి అర్చకస్వామి శ్రీవేదాంతం దీక్షితులు ఇలా ఏకాంత సేవ చేయించి పాటలు పాడించి గొప్ప వైభవం కలిగించాడు .కాని ఇక్కడ అంత గొప్పగా జరిగినట్లు నాకు అనిపించలేదు .తంత్రం ఎక్కువ మంత్రం తక్కువ  అన్నట్లు జరిగింది .

ప్రతి శనివారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం లో  ఉదయం  6గంటలకు స్వామి వారలకు అభిషేకం నిర్వహిస్తారు .దీనికి టికెట్ 150రూపాయలు .ఇద్దర్ని అనుమతిస్తారు మూడు టికెట్లు కొనిపించి  ఉదయానికి రిజర్వ్ చేయించారు శివ .ఇక్కడి పూజార్లు ఆయన అంటే మహా గౌరవం. అందరినీ చనువుగా ‘’మామా మామా ‘’అని ఆప్యాయంగా పిలుస్తారు శివ . ఆయనకు ఇక్కడ అడ్డు ఏమీ ఉండదు .డైరెక్ట్ ఎంట్రన్సే .నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆలయం పై ప్రత్యేక దృష్టి పెట్టి సౌకర్యాలు కలిగించి తిరుమల తిరుపతి దేవస్థానానికి దీని నిర్వహణ బాద్య అప్పగించారు .అప్పటి నుంచే ఇక్కడ ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి .సౌకర్యాలు సేవలూ పెరిగాయి .కళ్యాణమండప నిర్మాణానికి 100 కోట్లు శాంక్షన్ చేశాడు బాబు .ప్రభుత్వం మారటం తో పనులు మందంగా జరుగుతున్నాయి .మా రెండవ రోజు యాత్ర విశేషాలు రేపు తెలియ జేస్తాను .

                        విజ్ఞప్తి

కడప జిల్లాలో అతి ప్రాచీన ప్రసిద్ధ కోదండరామ క్షేత్రం ఒంటిమిట్ట మీదుగాదేశం లో చాలారాస్ట్రాలనుంచి  తిరుపతికి 65 ట్రెయిన్స్ నడుస్తున్నా ,ఇక్కడ రైల్వే స్టాప్ లేదని ,అందువలన యాత్రికులకు చాలా అసౌకర్యంగా ఉందని ,రైల్వే హాల్ట్ ఉంటె సామాన్యుఅకు ఈ రూటు బాగా అందుబాటులో ఉంటుందని ,ఈ విషయం పై ప్రజలు ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డ్ కేంద్ర ప్రభుత్వం చాలా ఉదా సీనంగా ఉన్నాయని ఎంతో బాధతోనాకు  తెలియ జేశారు డా శివ      .ఒకవిజ్ఞప్తి తయారు చేసి రైవే హాల్ట్ ఉండాల్సిన అవసరం తెలియజేస్తూ  వేయిమంది ప్రముఖులతో సంతకాలు పెట్టించి ,స్థానిక ప్రజాప్రతినిధులకు పార్లమెంట్ మెంబర్లకు రాష్ట్ర కేంద్ర మంత్రులకు ,వెంకయ్యనాయుడు గారికి జివిఎల్ నరసింహారావు గారికీ ,రాష్ట్ర పతికి రైల్వే మినిస్టర్ కు ,రైల్వే బోర్డ్ కు పంపి ,వెంబడిస్తే పని జరగచ్చునని చెప్పాను .కనుక ఈ విజ్ఞప్తిని అందరూ ముఖ్యమైనదిగా భావించి ,ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తే త్వరలో ఫలితం కలిగి ఇక్కడి ప్రజల ,దూర యాత్రీకుల కల నిజమౌతుందని ,ఇక్కడి శ్రీ కోదండ రామ శ్రీ సంజీవరాయ హనుమ ల కృపాకటాక్షం తో  . అతి తత్వరలో  ఒంటిమిట్ట లో ఎక్స్ ప్రెస్ రైళ్ళ రైల్వే హాల్ట్ ఏర్పడుతుందని క్షేత్రం మరింతగా మూడు పూలు ఆరుకాయలుగా విలసిస్తుందని  నమ్ముతున్నాను .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-19ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.