మా ఒంటిమిట్ట క్షేత్ర సందర్శన౦-2
డా.శివగారింట్లో మేడపై గదిలో మగాళ్ళం డ్రైవర్ తో సహా పడుకొన్నాం .నేను మ౦చంపైనా చరణ్ ,రాం బాబు కిందపరుపులపైనా ,డ్రైవర్ వసారాలో మంచం మీదా పడుకున్నాం .శివగారిల్లు నిత్య కల్యాణం పచ్చతోరణం లా ఎప్పుడూ బంధువులు స్నేహితులతో రద్దీ గానే ఉంటుంది .కనుక పది మంది వచ్చినా హాయిగా పడుకొనే ఏర్పాట్లున్నాయి .ఆడవాళ్ళను ముగ్గుర్ని కింద మంచాలపై పడుకోబెట్టి ,శివ దంపతులు నేలమీద పడుకొన్నారు .నాకు,మా ఆవిడకు గురు వారం రాత్రి అంతా పెద్దగా నిద్రలేదు .ఆవిడ వంట హడావిడి, నాకు యేహడావిడి లేకున్నా నిద్రలేదు .శుక్రవారం రాత్రి ఒంటిగంటకే మెలకువ రాగా మూడు న్నర దాకా అటూ ఇటూ దొర్లి ,లేచి పండ్లుతోమి కాలకృత్యాలు కానిచ్చి , ,రాం బాబు తో గీజర్ ఆన్ చేయించి ,హాయిగా వేడి నీటితో స్నానం చేశాను .సంధ్యావందనం ,పూజ పుస్తక పఠనం తో పూర్తి చేశా .అప్పటికే పద్మగారు కాఫీ కలిపి గ్లాస్ నాకు పైకి పంపిస్తే త్రాగాను .మిగిలినవారూ సిద్దమయ్యారు .
,అందరం 14వ తేదీ శనివారం ఉదయం 5కు సిద్ధమై ,గుడి ఇంటికి దగ్గరే అయినా కారులో శివగారితో సహా బయల్దేరి 5-30కి చేరి మెట్లు ఎక్కి ఆలయ ప్రవేశం చేశాం .5-45కు అంతరాలయం లో మా అభిషేకం టికెట్లు వెరిఫై చేసి ,మమ్మల్ని స్వామికి అతి సమీపం లో కూర్చోబెట్టారు .అందరి గోత్రనామాలు చదివి పూలున్న పళ్ళెం మాతో తాకించి ,మేమంతా అభిషేకం లో పాల్గొనే అర్హత కలిగించారు .ఆ రోజు 30మంది అభిషేకం టికెట్లు కొన్నారు .సరిగ్గా ఉదయం 6గంటలకు ఆలయం ఆఫీసర్ కు సంప్రదాయ తలపాగా చుట్టి చేతుల్లో పూలు పండ్లు మేమిచ్చిన నూతనవస్త్రాలతో పూల దండలతో పండ్ల తో స్వాములపాదలవడ్డ ఉంచమని ఇచ్చిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు ,సహా నూతన వస్త్రాలున్న పళ్ళెం ఇచ్చి తెల్ల గొడుగు పట్టించి ,అర్చకస్వాములు మాతో సహా అందర్నీ ఆలయ ప్రదక్షిణ మూడు సార్లు మంత్ర పూత౦గా మంగళ వాద్యాలు మ్రోగుతుండగా చేయించి ,మళ్ళీ అంతరాలయం లోకి తీసుకు వెళ్ళారు .
అభిషేకం
అప్పటికే శ్రీరామ ,లక్ష్మణ ,సీతా మాతల తో ఉన్న కోదండరామ స్వామికి అభి షేక వస్త్రాలు ,పూలమాలలు ధరింపజేసి మంత్రాలతో అభిషేకం మొదలు పెట్టారు .తర్వాత హారతి ఇచ్చి ,రెండో సారి పసుపు ,ఆవుపాలు ,పంచామృతాలతో అభిషేకం చేసి శిరసులపై రంధ్రాల పళ్ళెం తో జల్లు స్నానం లాగా చేసి మళ్ళీ హారతిచ్చారు .మూడవ సారి పవిత్ర జలాలతో జల్లుస్నానం తో అభి షేకం పూర్తి చేసి హారతిచ్చారు .ఇదంతా అయ్యేసరికి ఉదయం 7-30 అయింది .నాకేమని పించింది అంటే మంత్రాలకన్నా తంత్రాలే ఎక్కువయ్యాయని ..అందరం జ౦ప ఖానాలపై కూర్చున్నాం .మా శ్రీమతికి ,వియ్యపురాలికి అంతరాలయం వెలుపల శివ గారు కుర్చీలు వేయించి స్పష్టంగా కనబడేట్లు కూర్చో పెట్టించారు .అందర్నీ బయటకు పంపించి స్వామి వారికి నూతన వస్త్ర ధారణా అలంకరణ ,నిత్యపూజా చేసేసరికి 8-45 అయింది .నేను అభిషేకమవగానే బయట మెట్లపై కూర్చుని తెచ్చుకొన్న శ్రీరామ అష్టోత్తర , సహస్రనామాలు ,సీతా అస్టోత్తర సహస్రనామాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసి ,మళ్ళీ అందరం అంతరాలయం లోకి వెళ్లాం .శ్రీ కోదండ రాములకు హారతిచ్చి ,మాకు అభిషేకజలం శిరసుపై జల్లి ,తీర్ధం ఇచ్చారు .మేమిచ్చిన వస్త్రాలు అయ్యవార్లకు అమ్మవారికి అలంకరించి మేమిచ్చిన పూలదండలు స్వామివార్లకు వేసి కనులపండువ చేశారు. మా శ్రీమతి ఆనందం వర్ణనాతీతం పరవశించి౦ది నాకు అర్చకస్వామి చేత మెడలో స్వాముల శేషవస్త్రం ఖండువా కప్పించి స్వామి కి వేసిన పుష్పమాల వేయి౦చారు శివ .మేమందరం ఈ రెండున్నర గంటలలో దివ్యానుభూతిని పొందాం .దీన్ని ఇలా ఏర్పాటు చేయించిన శివ గారిని యెంత మెచ్చుకున్నా చాలదు .అందరం బయటకు వచ్చి ,అక్కడ ప్రసాదాలు పెట్టె మందిరం దగ్గరకు వెళ్లి దొప్పలలో అందజేసిన వేడి వేడి పొంగలి ,పరవాన్నం తిన్నాం .మహా రుచికరంగా ఉన్నాయి .ఒక్కొక్కరం రెండేసి దొప్పలప్రసాదం లాగించాం .శుక్రవారం రాత్రి శ్రీ సౌమ్య వేంకటేశ్వరాలయం లో ‘’మలిహోర ‘’అనే ప్రసాదం పెట్టిన సంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది .మహా రుచిగా ఉంది .అడిగి మళ్ళీ పెట్టించుకొని తిన్నాం .
ఆలయ లోపల, ముఖ మడపం లోనూ ,బయటి గోపురం బయటా లోపల శిల్పకళ అత్యద్భుతం గా ఉన్నది .వాటిని మాకు దగ్గరుండి చూపిస్తూ ,వివరించారు డాశివ .ఒక శిల్పం లో గుర్రం ఏనుగు తలలు కలసి ఉండటం ఆశ్చర్య౦ .బయటి మెట్లకు కుడిప్రక్కన ఆవరణలో కడప నవాబు ప్రతినిధి ‘’ఇమాం బేగ్’’ త్రవ్వించిన బావి ఉన్నది .దీని జలమేస్వాములకు అభిషేకజలం గా వాడుతారు .ఇలా శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వాముల దర్శనం ,అభిషేకం కనులపండువుగా చూడగలిగిన అదృష్ట వంతులమయ్యాం .ఆలయం లో ఒక ప్రక్క చిన్న మందిరం లో చిన్నశ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది .బయట చిన్నగూడులో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది జా౦బవంతుడిలాగా అనిపిస్తాడు .జాంబ వంతుడే విగ్రహ ప్రతిష్ట చేశాడని అతిహ్యం . కనుక జాంబ వంత క్షేత్రం గా భావిస్తారు బయట చిన్నగూడులో పొతనామాత్యుల విగ్రహం ,దానికింద పద్యం ఉన్నాయి .పోతనగారి జన్మస్థలం ఒంటిమిట్ట అనే ఏకశిలా నగరం .ఇక్కడ ఆయన జయంతి ప్రతిఏడాది ఘనంగా నిర్వహిస్తారు .పోతన మడి(పొలం ),శ్రీనాధుడు గాలిలో పల్లకీ నిలిపిన చోటు ఇక్కడే ఉన్నాయి . పోతన తెలంగాణాలో పుట్టినట్లు అక్కడివారు భావిస్తారు.మార్కండేయుని తండ్రి మృకండ మహర్షి ఈక్షేత్రం లో తపస్సు చేశాడనీ కనుక మృకండ క్షేత్రం అనే పేరు కూడా ఉందని అంటారు .ఈ వివరాలు ఆలయ చరిత్రలోతర్వాత రాస్తాను .
శ్రీ సంజీవ రాయ హనుమ
శుక్రవారం రాత్రే కోదండరామ దర్శనానికి ముందు సంజీవరాయ దర్శనం చేశాం .కోదండ రామునికి ఎదురుగా ఆలయం మెట్లకు ఎదురుగా ఈ స్వామి ఆలయం ఉంది .సుమారు 5అడుగుల భారీవిగ్రహం .మహా వర్చస్వంత౦ గా దర్శనమిస్తాడు హనుమ ఈ క్షేత్రపాలకుడు సంజీవరాయహనుమ .మేము ఉయ్యూరు నుంచి తెచ్చిన ,మా దొడ్లోని తమలపాకులు,కట్టి తెచ్చిన చేమంతిపూల దండ నూతన వస్త్రాలు ,దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండుభాగాలు , కొబ్బరికాయ వగైరా పళ్ళెంలో పెట్టి అర్చకస్వామికి అంద జేశాం .ఆయన మా అందరి గోత్రనామాలు అడిగి చెప్పి అష్టోత్తర పూజ చేస్తుండగా నేను అష్టోత్తర సహస్ర నామాలు తృప్తిగా చదివి స్వామికి వినిపించా .దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు రెండు భాగాల పుస్తకాలు స్వామి చరణాల వద్ద అర్చక స్వామితో పెట్టించాను .మేమిచ్చిన వస్త్రాలు స్వామిపై వేసి ఆనందం కలిగించారు .నైవేద్యం హారతి ఇచ్చారు .నాకు అర్చకస్వామితో ప్రసాదం ఇప్పించి స్వామి శేషవస్త్రం కప్పించి పుష్పహారం వేయించారు శివ.శనివారం నాడు మా ఇలవేల్పు హనుమ సంజీవరాయ రూపం తో దివ్య దర్శనం చేశాం .మధురానుభూతి పొందా౦ అందరం .
శివగారితో ముందే చెప్పి ప్రతి శనివారం ఇక్కడ అమ్మే తిరుమల స్వామి లడ్డూలు 10 కొన్నాం .ఒక్కోటి 50 రూపాయలు.ప్రసాదంతిని ,కారులో శివగారింటికి 9-30కు చేరాం .అందరికి వేడి వేడి మినపట్లు తిన్నవారికి తిన్నంత గా రెండుచట్నీలతో చేసి పెట్టారు శ్రీమతి పద్మ .మహారుచికరంగా ఉన్నాయి .ఆమెకు ధన్యవాదాలు చెప్పాం .ఆమె సన్నగా పీలగా ఉన్నా మహా చలాకీ మనిషి .నిమిషాలలో అన్నీ సిద్ధం చేస్తారు .మనిషికాదు మానవత్వం ,ఆపేక్ష ,ఆత్మీయత రంగరించిన యత్రం అనిపిస్తు౦ది ఆమె స్పీడ్ చూస్తే.
పుష్పగిరి సందర్శనం
శనివారం ఉదయం 10-30కి శివగారింటి నుంచి అందరం కారులో బయల్దేరి ,దారిలో సీతాదేవికి దప్పిక అయితే శ్రీరాముడు వేసిన బాణం తో భూగర్భాగంగ ఉబికి పైకి వచ్చిన రామతీర్ధం ,లక్ష్మణుడు వేసిన బాణంతో భూగర్భ జలం గా వచ్చిన లక్ష్మణ తీర్ధం చూశాం .ఈ రెండు నీళ్ళ రుచి భిన్నంగా ఉంటాయట .రామతెర్ధం కొబ్బరినీళ్ళులాగా ,లక్ష్మణతీర్ధజలం ,కొంచెం తక్కువ తీయగా ఉంటాయట .ఒకదానికొకటి 10అడుగుల దూరం లో ఉన్నప్పటికీ’ .సరాసరి పుష్పగిరి చేరాం 11గంటలకు .ఆ వూళ్ళో ఎవరో చనిపోతే ఆలయం మూసి పూజారి వెళ్ళాడట .ఊళ్ళో శవం ఉండగా ఇక్కడ ఆలయాలు తీయరట.ఒకమ్మాయి తాను చెప్పి పిలుచుకోస్తానని చెప్పి వెళ్లి వెంట ఉండి తీసుకొచ్చింది అర్చకుడు యువకుడే .ఒక్కో ఆలయం తలుపు తీసి దీపం వెలిగించి దర్శనం చేయించాడు .ఇక్కడ శివుడు ‘’వైద్యనాథేశ్వరుడు .అమ్మవారు కామాక్షి దేవి విడిగా చిన్న గుడిలో ఉంటుంది. అమ్మవారి ఎదురుగా శ్రీ చక్రం ఉంది ఈ ఆలయం శక్తి పీఠం. అస్టమాతృకల విగ్రహాలున్నాయి .సిద్దేశ్వరాలయమూ ,శ్రీ లక్ష్మీ చేన్నకేశవాలయమూ ఉంది .అన్నీ చక్కగా చూసి ఇక్కడి పుష్పగిరి పీఠం చూద్దామని ఆశపడితే ,పీఠాధిపతి ఇక్కడ ఉండటం లేదని చెప్పాడు పూజారి .కాని గో సంరక్షణ ఉన్నది సరే అని అది ఉన్న చోటు చూసి ఫోటోలు దిగాం .పుష్పగిరి పీఠం ఆంధ్రుల ముఖ్య పీఠం.కంచిది తమిళులది ,శృంగేరి కన్నడిగులది .ఒకప్పుడు మహా వైభవంగా ఉండేది పుష్పగిరి పీఠాదిపతి మందీ మార్బలంతో దేశమంతా పాదయాత్ర చేసి శ్రీచాక్రార్చన చేసేవారు .ఇప్పుడు అంతా వెలవెల బోతోంది ఇక్కడి వాతావరణం .పూల తో శోభిల్లేగిరి పుష్పగిరి .ఇప్పుడాశోభ లేకపోయే సరికి ఉసూరు మనిపించింది .పీఠ విశేషాలు తర్వాత రాస్తాను .పుష్పగిరి లో పెన్నానదికి అవతల ఎత్తైన కొండపై శ్రీ చెన్నకేశవ ఆలయం దూరానికే ముచ్చటగా అనిపిస్తుంది .వెళ్లి చూసే టైం లేక వెళ్ళలేదు .కానీ చూడాల్సిన దేవాలయం .
కడప ప్రాంతం అంటే బాంబులతో దద్దరిల్లు తుందనే భయం ఉండేది .15ఏళ్ళనుంచి ఫాక్షనిజం లేదని శివ చెప్పారు .రోడ్డుకు ఇరువైపులా వరి చేలు కంటికింపుగా ఎక్కడ చూసినా కనిపించటం మరో విశేషం .పొట్టి వంగడం ‘’జిలకర మసోరి ‘’ఈ ప్రాంతపు ప్రత్యేక వరిపంట .ఇది ఎక్స్ పోర్ట్ వెరైటీ .నాణ్యమైన సన్నబియ్యం బియ్యం జిలకర మసూరి.
దేవుని గడప
పుష్పగిరి నుంచి సరాసరి దేవుని గడపకు వెళ్లాం .ఇది కడప కు బయట 5కిలో మీటర్లలో ఉంటుంది .పాతకడప అనీ అంటారు .ఇక్కడ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయం సుప్రసిద్ధం .తిరుమల వెళ్ళే యాత్రికులకు ఇది గడప వంటిది అందుకే దేవుని గడప అని అంటారు .ఈ స్వామి దర్శనం చేస్తే తిరుమల బాలాజీని దర్శించినట్లే అవ్వాలని ఒక భక్తుని కోరికపై ఇక్కడ స్వామి వెలిశాడని అతిహ్యం .ఇక్కడ కూడా డా.శివ గారు తన బంధువుకు ముందే ఫోన్ చేసి చెప్పి మాకు శీఘ్రదర్శనం కలిపించి స్వామివారి కై౦కర్యం మాకు లభించేట్లు చేశారు .అంతటి నెట్ వర్క్ శివ గారిది .
కడప బ్రౌన్ మెమోరియల్ లైబ్రరి
దేవుని గడపనుంచి సరాసరి కడప వెళ్లి సి.పి.బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీకి వెళ్లాం .అప్పటికే ఒంటిగంట అయింది .మూసేశారు .అక్కడి లేడీ అటెండర్ తలుపులు తీసి మాకు లోపల అంతా చూపించింది .సరసభారతి ప్రచురణలు 14 లైబ్రరీలో లైబ్రేరియన్ కు ఇవ్వాలని తెచ్చాను .కనుక గీర్వాణం- 3,ఆధునిక ప్రపంచ నిర్మాతలు పుస్తకాలు ఆ అటెండర్ కిచ్చి ఫోటోలు తీసుకొన్నాం ,మిగిలిన పుస్తకాలను ప్రస్తుతం తిరుపతి లో ఉన్న లైబ్రరి ట్రస్ట్ సెక్రెటరి శ్రీ తట్టా నరసింహా చారి గారి కి ఫోన్ చేసి ఆయన రాగానే తాను అందజేస్తాననని శివ గారు అంటే వారికి అప్పగించాను .కడప కలెక్టర్ గా చేసిన బ్రౌన్ ఆంధ్రభాషకు చేసిన సేవ అమూల్యం అనితర సాధ్యం .ఎన్నో అపూర్వ గ్రంథాలు సేకరించి పండితులను తనస్వంత ఖర్చుతో నియమించి పరిష్కరి౦ప జేసి ప్రచురించాడు .తానూ స్వయంగా తెలుగు –ఇంగ్లీష్ ,ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు ‘’బ్రౌణ్యం ‘’కూర్చిన అంద్రులకు ప్రాతస్మరణీయుడు బ్రౌన్ .ఇంగ్లాండ్ లో పుట్టి ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చి తెలుగు భాషాభి వృద్ధికి యెనలేని సేవచేశాడు .వేమనగారి శతకపద్యాలు సేకరించి మొదటగా ప్రచురించాడు బ్రౌన్ .ఇక్కడ బ్రౌన్ లైబ్రరి,రిసెర్చ్ కేంద్రం ఏర్పడటానికి ముఖ్య కారకులు మహా పండితులు ,విమర్శకులు విశ్లేషకులు స్వర్గీయ శ్రీ జానుమద్ది హనుమత్సాస్త్రి గారు .ఎన్నో ఉపయుక్త గ్రంథ రచన చేశారు .సరసభారతి పుస్తకాలు వారికి పంపిస్తే ,చదివి బాగున్నాయని ఫోన్ చేసి,లేక ఉత్తరం రాసి వాటిని బ్రౌన్ లైబ్రరీకి అందజేస్తున్నట్లు తెలిపిన సౌజన్య శీలి శాస్త్రిగారు .ఆయనతో మాట్లాడటం అంటే పుంభావ సరస్వతి తో మాట్లాడినట్లు ఉండేది .ఇక్కడి నుంచి బయల్దేరి సరాసరి ఒంటిమిట్ట శివ గారి ఇంటికి మధ్యాహ్నం 2-30కు చేరాం .శ్రీమతి పద్మ రెడీ చేసిన భోజనం తిని కాసేపు విశ్రమించాం .
సాయంకాలం 5గంటలకు డా శివ దంపతులకు మా దంపతులం మాకోడలు నూతనవస్త్రాలు పసుపుకు౦కుమ పండ్లు అందజేసి ,ఇద్దరికీ చెరొక శాలువా కప్పి సరసభారతి ఆత్మీయ సత్కారం జరిపాం .అందరం కాఫీ త్రాగి సిద్ధవటం కు రెడీ అయ్యాం .
సిద్ధ వట సందర్శనం
శ్రీశైలానికి దక్షిణద్వారం సిద్ధవటం .ప్రక్కనే గలగలా పారే పెన్నానది .అందులోకి సోమశిలనుంచి లిఫ్టి ఇరిగేషన్ తో కలిసే కృష్ణాజలాలు కను విందు చేస్తుంది .సిద్ధవట౦లొ వటవృక్షం క్రింద పూర్వం సిద్ధులు తపస్సు చేసి సిద్ధిపొందేవారు అందుకే ఆపేరు .నది ప్రక్కనే వట వృక్షం ఉన్నది .ప్రశాంత వాతావరణం .సిద్ధవటం లో రాజులకోట ఉంది .దూరంనుంచే చూసి తిరుగుప్రయాణం లో ఫోటోలు తీసుకొన్నాం
జ్యోతి గ్రామ ప్రత్యేకత
సిద్ధవటానికి సుమారు 10కిలోమీటర్లలో జ్యోతి గ్రామం ఉంది .ఎన్నో వందల ఏళ్ళక్రితం ఇక్కడి సిద్దేశ్వరాలయం కామాక్షీ ఆలయం గోపురం వగైరా వరదనీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాయని ,15ఏళ్ళ క్రితం పురాతత్వ శాఖవారి త్రవ్వకాలలో ఆలయ గోపుర పైభాగం కనిపిస్తే కి౦దిదాకాత్రవ్వితే 50 అడుగులగోపురం దానికెదురుగా శిధిలావస్థలో కొంచెం ఎత్తుమీద ఉన్న శ్రీ సిద్దేశ్వరాలయం ,దానికి కుడిప్రక్క శ్రీ కామాక్షీ ఆలయం బయట పడ్డాయని ,ఆవరణ చుట్టూ గోడ కూడా ఉండేదని ఒకభాగం గోడకనిపి౦చి౦దని ,గోడలమధ్య ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయని కుమారస్వామి విగ్రహం కూడా బయటే మట్టిలో సగం కూరుకు పోయి ఉందని ,ప్రాంగణం సుమారు 5 ఎకరాల విస్తీర్ణం లో ఉందని చెప్పి స్వామి,అమ్మవార్ల దర్శన౦ , లింగాల దర్శనం చేయిస్తూ వివరించారు శివ .
జ్యోతి గ్రామం నుంచి సిద్ధవటం చేరి అక్కడి గుడిలో ఉన్న శ్రీ సిద్ద వటేశ్వర స్వామిని ,కామాక్షి అమ్మవారినీ దర్శించాం పూజారి ఉన్నాడు శ్రీశైలం నుంచి నెలకొక పూజారి ఇక్కడికి వచ్చి స్వామివారి నైవేద్యం పూజాదికాలు నిర్వహిస్తారట .ఈ ప్రాంతపు ఆలయాలన్నిటిని శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకొని సంరక్షిస్తూ భక్తులకు అందుబాటులో ఉంచటం విశేషం .,అభినందనీయం .శివగారింటికి రాత్రి 7-30కు చేరాం .అప్పటికే పద్మగారు మా అందరికి కావలసినన్ని మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా తయారుచేసి తినటానికి పెట్టారు హాయిగా తిన్నాం .కాసేపు టివి చూసి ఇక రాత్రి భోజనం అక్కరలేదని పించి పైకి వెళ్లి పడుకొన్నాను .రాత్రి 9గంటలకు సేమ్యా ఉప్మా ప్లేట్ లో పెట్టి ,మజ్జిగ గ్లాసుతో చరణ్ కిచ్చి పంపారు పద్మ .నాకు సేమ్యా పెద్దగా ఇష్టం ఉండదు ,కొద్దిగా తిని మజ్జిగతాగి హాయిగా నిద్ర పోయా .మాంచి నిద్ర పట్టింది .ఆదివారం ఉదయం 7-30కు తిరుగు ప్రయాణం అనుకొన్నాం .ఆదివారం విశేషాలు రేపు రాస్తాను.
ధనుర్మాస ప్రారంభ శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-12-19-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797