మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

మా ఒంటిమిట్ట  క్షేత్ర  సందర్శన౦-3(చివరి భాగం )

15-12-19 ఆదివారం

  గత రెండు రోజులుగా రాత్రి నిద్రలేనందున శనివారం రాత్రి మాంచి నిద్రపట్టి ఆదివారం ఉదయం 6-30కు మెలకువ వచ్చి ,కార్యక్రమాలు కానిచ్చి , గీజర్ వేడి నీటి స్నానం చేసి సంధ్య ,పూజా పుస్తక పఠనంతో పూర్తి చేశాను .ఈలోపే కిందినుంచి శ్రీమతిపద్మ మామనవడితో కాఫీ పంపిస్తే సేవించి ,సామానంతా సర్దేసుకొని బాగ్ తో 7-15కి కిందకి దిగాను .మా వాళ్ళు స్నానానికి ఉపక్రమించారు .ఆడవాళ్ళు ఇంకా బద్ధకం గానే ఉన్నారు .స్నానాలు కాలేదు .అందరి స్నానాలు అయే సరికి పద్మగారు అందరికీ పూరీ కూర సిద్ధం చేయగా ,కావలసినన్ని అడిగి అడిగి వేసి తినిపించారు .తృప్తిగా అందరం తిన్నాం .ఇంతమందికి అంటేమా ’’ సెవెన్ సీటర్స్ ‘’కు శివగారికి, తనకూ అనగా ‘’నవగ్రహాలకు ‘’పూరీ బ్రేక్ ఫాస్ట్ మహా ఫాస్ట్ గా చేసి వడ్డించారు .అందరం ఆమె వర్క్ హాలిక్ తనానికి మెచ్చుకోన్నాం. తనకు ఇలా ఇంటికి బంధువులు స్నేహితులు వస్తే వడ్డించి భోజనం పెట్టటం లో ఎంతో సంతృప్తి ఉందన్నారామె.శనివారం సాయంత్రం శివ దంపతులకు మేము ‘’చిరు సత్కారం ‘’చేస్తే,పద్మగారు ‘’ఎన్నాళ్ళయిందో మా పుట్టింటి వారు ఇలా చీర సారే పెట్టి .అచ్చంగా మా అమ్మానాన్న ల్లాగా మీరు నన్ను ఆదరించారు ‘’అని ఆనంద బాష్పాలు రాల్చారు .మా శ్రీమతి ‘’అమ్మా !మీలాంటి వాళ్ళందరూ మా అమ్మాయిల్లాంటి వారే .వారికి ఏదైనా ఇలాచేయటం లో మాకు కొండంత సంతృప్తి ఉంది .’’అని భుజాన చేయి వేసి దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా తలనిమిరి ఆలింగనం చేసుకొన్నది .ఆ అనుభూతి మాకు మహదానందంగా ఉన్నది .

               మృకండ మహర్షి ఆశ్రమ సందర్శనం

 అనుకొన్న సమయం కంటే గంటన్నర ఆలస్యంగా ఆదివారం ఉదయం 8-30కు సామాన్లన్నీ కారులో సర్దేసి శివగారితో సహా కారు ఎక్కు తుండగా ఎదురింట్లో  ఉన్న ఆయన తమ్ముడు  ,లాయర్    శ్రీ ఆదినారాయణ రావు గారు వాళ్ళఅబ్బాయి వారి బంధువు వాకిట్లో నిలబడి మాకు సెండాఫ్ ఇచ్చారు .రావుగారు శుక్రవారం రాత్రి వచ్చి మాట్లాడి 1-శ్రీ మదొంటి మిట్ట కోదండరామాలయ దివ్య చరిత్రము 2-ఒంటిమిట్ట శ్రీరామకథ 3-జయం జయం పుస్తకాలిచ్చారు .కారుకు శుభ శకునంగా  శ్రీమతి పద్మ ఎదురు రాగా బయల్దేరాం అందరికీ వీడ్కోలు చెప్పి .రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటాక మృకండ మహర్షి ఆశ్రమం పది నిమిషాలలో చేరాం .అక్కడి పూజారికీ ముందే శివ గారు చెప్పి ఉండటం తో మాకు విఐపి ట్రీట్ మెంట్ జరిగి ‘’శ్రీ మృకండేశ్వర స్వామిని ‘’పూజ చేసి ,తీర్ధ ప్రసాదాలిచ్చారు .నాకు పుష్పహారం కూడా వేశారు .ఇక్కడే మార్కండేయుడి తండ్రి మృకండ మహర్షి తపస్సు చేశారు .ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది .పెళ్ళిళ్ళు బాగానే జరుగుతాయి .శివ గారి వివాహం పద్మగారితో ఈ కళ్యాణ మండపం లోనే జరిగిందని జ్ఞాపకం చేసుకొని శివ చెప్పారు .

    ఒంటిమిట్ట దగ్గర ‘’మాధవరం’’ గ్రామం చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి .రెండు రోజులనుంచి అదేరూట్ లో వేడుతూ౦ డటం తో ఒకసారి దిగి చూడాలని పించి శివగారికి భార్యకు చెబితే , సరసమైన రెట్ల తో ఇచ్చే శ్రీ సాయిఈశ్వర్ హాండ్ లూం స్టోర్స్ ‘’దగ్గర మమ్మల్ని దింపి ,షాప్ వోనర్ తో మాగురించి చెప్పగా  ,ఇంటికి మా కారులోనే ఆయన్ను డ్రాప్ చేసివచ్చారు మావాళ్ళు .షాప్ ఇంకా తెరవలేదు .మమల్ని చూసి హడావిడిగా ఊడ్పులు ,ముగ్గులు వేసి ఓపెన్ చేసి సరుకు చూపించాడు వోనర్ .మేము 12 చీరలు ,మా కోడలు మామనవరాలికోసం టాపులు,వియ్యపురాలు రెండు ,రాంబాబు వాళ్ళమ్మకు రెండు కొన్నాం .మంచి’’ హోమ్ మేడ్’’  కాఫీ ఇచ్చారు అందరికీ .షాపింగ్  అయేసరికి 10-30అయింది .సరాసరి బ్రహ్మంగారి మఠానికి బయల్దేరాం .

      బ్రహ్మంగారి మఠ సందర్శనం

  మాధవరం నుంచి సిద్ధవటం మీదు గా కచ్చాపచ్చా రోడ్ పై ప్రయాణం చేసి ,చివరికి సింగిల్ రోడ్ లోనూ ప్రయాణించి కందిమల్లయ పల్లి అనే బ్రహ్మం గారి మఠం అనే గ్రామానికి  మధ్యాహ్నం 12-15కు  ,శివగారి బంధువు ల ఇంటికి చేరాం.శివగారు వీరికి చెప్పి ఉండటం చేత వారబ్బాయి డాక్యుమెంట్ రైటర్ ‘’ శివ ‘’మా కోసం ఎదురు చూస్తున్నాడు .అతను బైక్ మీదా మేము కారులో బ్రహ్మం గారి మఠం చేరాం అయిదు నిమిషాలలో .శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాశీలో అత్రి మహర్షి ఆశ్రమంలో పెరిగి  ,ఇక్కడికి వచ్చి తత్వ బోధలు చేస్తూ సంఘ సంస్కరణకు పాల్గొనగా ఊరి జనం వెలి వేస్తె  ,నీరు ఆహారం లేకుండా చేస్తే ,ఒక రోజు రాత్రి మహాసంకల్పం తో చేతిలో ఉన్న చిన్న కొమ్ముతో బావి తెల్లారేటప్పటికి తానొక్కడే త్రవ్వి తన సంకల్ప బలం నిరూపించారు .ఆ బావి నీరు మహా రుచిగా ఉన్నాయి ఏబావి ఎండిపోయినా ఈ బావి నీరు ఎప్పుడూ ఎండక పోవటం విశేషం .గ్రామ దేవత పోలేరమ్మకు ఊరిజనం జంతువులను బలి ఇస్తుంటే ఆపేసిన కారుణ్య మూర్తి  బ్రహ్మ౦గారు .తను చుట్ట కాల్చుకోవటానికి నిప్పుకావాలంటే పోలేరమ్మ దేవతతో స్వయంగా తెప్పించుకొన్న మహిమామూర్తి బ్రహ్మం గారు .ఆయన నివశించిన ఇల్లు కూడా చూశాం .అసలు మఠం లో బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యారు .దానిపై శివలింగం ఏర్పాటు చేశారు భార్యవీర పాపమాంబ కూడా ఇక్కడే సిద్ధిపొందారు .వీరిద్దరి సమాధులు ప్రక్కప్రక్కనే ఉన్నాయి .వెనక భాగాన ఒక నూనె దీపం ఇరవై నాలుగు గంటలూ  వెలుగుతుంది. బ్రహ్మంగారు జీవించి ఉన్నప్పడు నీటితో దీపం వెలిగించారు .ఆయన పోయాక నూనె దీపం పెట్టి కాపాడుతున్నారు .బ్రహ్మంగారు కొడుకు ,కోడలు కూడా ఇక్కడే సమాధి అయ్యారు .బ్రహ్మ౦ గారు రాసిన కాలజ్ఞానం ప్రతులు వెండి బాక్సుల్లో ఆయనసమాది వద్ద భద్ర పరచారు .కాలజ్ఞానం ఆయన బనగానపల్లిలో రాశారు .అక్కడి నుండి ఇక్కడికి వచ్చాకనే ఇక్కడసమాది అయ్యారు..మఠం  లో నిత్యాన్నదానం జరుగుతుంది .
ఈవిషయాలన్నీ ‘’చిన్న శివ ‘’మాకు దగ్గరుండి చూపిస్తూ వివరించాడు .ఇవన్నీ చూపించి  చిన్న శివ ఇంటికి మమ్మల్ని తీసుకు వెళ్ళాడు .ఆ శివకు ఈ శివకు చుట్టరికం ఏమిటి ?ఆ శివ అన్నగారి అమ్మాయి ఈశివ అమ్మగారు .అదీ బంధుత్వం .శివనాన్నగారు గ్రామకరణం చేసి తర్వాత డిగ్రీ బి.ఎడ్ పాసై టీచర్ గా చేరి హెడ్ మాస్టర్గా రిటైరయ్యారు .వీరిపేరు సుబ్రహ్మణ్యంగారు .పనిమీద బెజవాడ వెడితే ఈ శివ మా బాధ్యతా అంతా ఆశివ చెప్పగా తీసుకొన్నాడు. ఇంట్లో ఆడవారందరూ మహా కలుపుగోలుగా మమ్మల్ని దగ్గర బంధువులుగా ఆదరించి మర్యాద చేసి కమ్మని భోజనం వండి వడ్డించి కొసరి కొసరి తినిపించారు .శివ బ్రదర్స్ నలుగురు .అందరూ ఉద్యోగస్తులే. దగ్గరలోనే పని చేస్తున్నారు .ఉమ్మడి కుటుంబం .కోడళ్ళు,అత్తగారు మహా నిదానస్తులు .ఆతిధి మర్యాద బాగా తెలిసినవారు .ఆ ఆదరణకు మేము ‘’ఫిదా ‘’అయ్యాం .ఒకమనవరాలు మహాలక్ష్మి చాలాకలుపుగోలు గా చాలాకీగా ఉండి,నన్ను ‘’తాతయ్యా తాతయ్యా’’ అని ఆత్మీయంగా పిలుస్తూ ,నా నవ్వు చాలాబాగుందని మెచ్చుకొని, కావాలని నవ్విస్తూ ఫోటోలు తీసింది .నిజంగా మనవరాలే అనిపించింది ఆ చిన్నారి .తొమ్మిదో తరగతి చదువుతోంది .అక్కడి ఫోటోలన్నీ ఆపిల్లే తీసింది .జామ చెట్టు ,మిగిలిన చెట్లతో వాతావరణం బాగుంది .ఈ ప్రాంతాలలో కోతులెక్కువ .కరెంట్ తీగలమీద కూడా కూర్చునే సాహసం వాటిది .భోజనాలుకాగానే ఆకు ,వక్కా ఇచ్చి తాంబూలం వేసుకోమన్నారు అరటిపళ్ళు తినటానికిచ్చారు జామకాయ కోసి ముక్కలు పెట్టారు .ఆడవారికి జాకెట్ పసుపు,కుంకుమ పూలుఇచ్చి మర్యాద చేశారు .వాళ్ళ అందరి భోజనాలు అయ్యే దాకా మేము ఉండి,వీడ్కోలు చెబుతుంటే ‘’వీలైనప్పుడల్లా వస్తుండండి.మాకేమీ ఇబ్బంది లేదు .మీవాళ్ళు ఎవరొస్తున్నా చెప్పండి అన్నీ దగ్గరుండి మా శివ చూపిస్తాడు ‘’అని ఆప్యాయత వర్షించి మమ్మల్ని తమవాళ్ళ ను చేసుకొన్న సౌజన్యం వారందరిదీ .ఎక్కడో ఒంటి మిట్ట శివ గారికి తెలిసిన మాకు ఇంతటి ఆప్యాయత ఆత్మీయతా చూపటం పరమా శ్చర్యంగా ఉంది .ఆ సంస్కారం అలాంటిది .బాంబుల సీమలో ‘’ప్రేమ అనురాగ ఆత్మీయ బాంబులు ‘’పేల్చిన ఆ కుటుంబం ఎన్నటికీ మరపురాదు .శివను అడిగి వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇంటికి వెళ్ళగానే సరసభారతి పుస్తకాలు పంపిస్తానని చెప్పి ,ఉయ్యూరురాగానే 16వ తేదీసోమవారం 12పుస్తకాలు రిజిస్టర్డ్ పార్సిల్ లో పంపి కొంతవరకు రుణవిముక్తులంయ్యామనుకొన్నాను .

                    త్రిపురాంతక సందర్శనం

 బి.మఠం లో చిన్న శివ ఇంటివారందరికీ ధన్యవాదాలు చెప్పి ,షార్ట్ కట్ లో ప్రయాణం ఎలాగో

తెలుసుకొని మధ్యాహ్నం 2-30కు బయల్దేరాం ఆనందంగా .ఇక్కడి నుంచి కడపజిల్లా పోరుమామిళ్ల మీదుగా ,ప్రకాశం జిల్లా బేస్తవారి పేట కు సాయంత్రం 4కు చేరి,కాఫీలు తాగాం.ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం  వచ్చింది  .ప్రకాశం జిల్లా కనిగిరి మీదుగా వచ్చేటప్పుడు ప్రయాణం చేశాం కదా .కనిగిరి ని కాటమరాజు అనే యాదవ రాజు ,నెల్లూరును మనుమసిద్ధి మహారాజు పాలిస్తున్నప్పుడు పాలించాడు .పశువుల ‘’పుల్లరి’’(పచ్చిక బీడులలో మేపుకోవటానికి ఇచ్చే డబ్బు ) విషయమై తగాదా వచ్చి యుద్ధం జరిగింది కనిగిరిలో .మనుమసిద్ధి సేనాని ఖడ్గతిక్కన .మంత్రి తిక్కన సోమయాజి .ఖడ్గతిక్కన  యుద్ధం లో వీర విహారం చేసి మరణించిన సంగతి ,అంతకుముందు యుద్ధం నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రీ తల్లీ బార్య ఆయన్ను  ఆడదానికింద జమకట్టి  నిష్టూరాలాడటం విరిగినపాలు అన్నం లోపోయటం మంచం వెనక స్నానానికి నీళ్ళుపెట్టి అవమానించటం  మనకు తెలిసిన విషయాలే .పేట నుంచి  30కిలోమీటర్లదూరం లో ‘’గుంట’’వెళ్లి ,అక్కడి నుంచి సుమారు20కిలో మీటర్లదూరం లో ఉన్నప్రకాశం జిల్లా  త్రిపురాంతకం చేరే సరికి సాయంత్రం 5-30అయింది .ము౦దుగా కొండ దిగువన ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం లో అమ్మవారి దర్శనం చేశాం. అమ్మవారు మహా వైభవంగా వెలిగిపోతోంది .ఇక్కడ అమ్మవారు ఒక చెరువు నూతిలో ఉంటుంది  ,ఇది గొప్ప శక్తి పీఠం.అమ్మవారు మహా మహిమాన్విత .’’బాల’’ ఆకారం లో ఉంటుండటం విశేషం. త్రిపురాంతకం లో కొండపైన మహా శివుడు తారకాసురుని ముగ్గురు కొడుకులను అమ్మవారి సహాయంతో ఇక్కడే సంహరించాడు కనుక త్రిపురాంతకం అని పేరు .పార్వతీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామిగా ఇక్కడి శివుడిని పూజిస్తారు .త్రిపురాంతకం  శ్రీశైలానికి 100కిలో మీటర్లు .శ్రీశైలానికి తూర్పు ముఖద్వారం త్రిపురాంతకం .

   సాయంత్రం 6-30కు త్రిపురాంతకం నుండి బయల్దేరి ,నరసరావు పేట ఔటర్ ద్వారా గుంటూరుకు రాత్రి 8-30కు చేరి ,అక్కడ మదీనా మొబైల్ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ తిని 9గంటలకు బయల్దేరి రాత్రి 10-30కి ఉయ్యూరు చేరాం .బయల్దేరిన దగ్గరనుండి మొత్తం 61 గంటలు ఈ మూడు రోజుల్లో .మాడ్రైవర్ ఈసా చాలా నిదానస్తుడు .ఎంతోజాగ్రత్తగా సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసినా మాకు అలపు  లేకుండా చేశాడు  .అతని ఓర్పుకు హాట్సాఫ్ .అందుకే ఘనంగానే అతనికి మామూలు ఇచ్చాం అడగకపోయినా .ఇలా శ్రీఒంటిమిట్ట కోదండరామ దర్శనం తో మొదలుపెట్టి ,,శ్రీత్రిపురా౦తకేశ్వర  బాలాత్రిపురసుందరీ దర్శనం తో యాత్ర ముగించి హరిహరాద్వైతాన్నిచాటామేమో నని పించాం .

 ఒంటిమిట్ట శ్రీ  కోదండ రామాలయ ,పుష్పగిరి ,సిద్ధవట వివరాలు , విశేషాలు తరువాత తెలియజేస్తాను .ఇన్ని రోజులు ఇంతదూరం మాతో ప్రయాణించిన మీకు ధన్యవాదాలు .

  మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -18-12-19-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.