ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -1
కడప జిల్లా ఒంటిమిట్ట లో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం రామాయణ కాలం నుంచే ప్రసిద్ధమైనది .ఈ ప్రాంతమంతా దండకారణ్యం.ఒంటి మిట్టకు సంస్కృత నామం ఏక శిలానగరం .ఒకే శిలలో శ్రీ రామ లక్ష్మణ సీతా దేవి ఉండటం ప్రత్యేకత .అందువలన కూడా ఈపేరు వచ్చి ఉండచ్చు .మహాభాగవత౦ రచించిన బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట వాడే .ఇక్కడే పోతన గారి పొలం అంటే ‘’మడి ‘’ఉంది .పోతనగారిది ఇదే ఊరు అని వాసుదాసకవి అంటే శ్రీ వావికొలను సుబ్బారాయ కవి శ్రమించి గ్రంథస్తం చేశారు ,ఆంద్ర వాల్మీకి బిరుదాంకితులైన వాసు దాసకవి చెప్పిన మాట రుషి ప్రోక్తంగా శిరో దార్యమే .ఆలయం లో ఆయన విగ్రహం దానికింద ‘’కాటుకకంటి నీరు ‘’పద్యం ఉన్నది విజయనగర రాజులకాలం నుంచి ఒంటిమిట్టకు బహుళ ప్రాచుర్యం కలిగింది .నారవీటి రాజులు స్వామికి మాన్యాలిచ్చారు .
పౌరాణిక ప్రాధాన్యం
ఒకప్పుడుఆది శేషునికి ,వాయుదేవుడికి బల ,పౌరుషాలపై వివాదం వచ్చింది .శేషుడు మేరు పర్వత శృంగాన్ని ఒకదాన్ని పట్టుకొని ,దమ్ముంటే తనను కదిలించమని వాయు దేవుడికి సవాల్ విసిరాడు .వాయుదేవుడు ప్రళయ గంభీరంగా వీస్తున్నా శేషుడు కదలలేదు .కసి హెచ్చి ఇంకా బలంగా ఢీకొట్టాడు.ప్రళయా నిలుని ధాటికి,ఊపుకు తట్టుకోలేక శేషుడు అటూ ఇటూ అవగా మేరు శృంగం ఆయన పట్టులోనింఛి జారి, గిరగిరా తిరుగుతూ భూమి మీద పడింది,దేవతలు దిగివచ్చి ఇద్దర్నీ శాంతింపజేసి ఒకరిని ‘’మహాబలుడని’’ ,మరొకరిని,’’ మేరు నగ ధీరుడని’’బిరుడులిచ్చారు .ఆ విరిగినమేరు శృంగమే శేషాచలం అయింది .ఆపర్వతాలవరుస కొనసాగి కడప మండలం నల్లమల వరకు వ్యాపించింది ,శేషాచలం అగ్రభాగాన తిరుమల ,మధ్యభాగమైన దండకారణ్యం లోని ఒంటిమిట్ట ,చివర దేవుని గడప .అయ్యాయి . తిరుమలలో శ్రీనివాసుడు ,ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామ స్వామి ,దేవునికడపలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు .దండకారణ్యం దక్షిణాన కావేరినది ద్రావిడ ,పాండ్య దేశాలు ,మధ్యభాగంలో ‘’సిరగుజ ‘’పడమట గుజరాత్ లోని కుశస్దలి,వింధ్య దక్షిణ ప్రాంతమైన బీరారు ,కన్యాకుమారి అగ్రం,తూర్పున ఒరిస్సా వైతరణీ నది మధ్యప్రదేశ్ ను ఆక్రమించి కృష్ణా ,గోదావరి మధ్యున్న ఆంద్ర దేశం వరకు దండకారణ్యం వ్యాపించి ఉన్నది .
పితృవాక్య పాలనకోసం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యానికి నడుచుకొంటూ వచ్చి ,ఎండవేడికి తాళలేక ఒక చెట్టుక్రింద కూర్చోగా కరుణా౦తరంగ సీతమ్మ ఆప్రాంతం లో జీవ జంతు సముదాయం దప్పిక ఎలా తీర్చుకొంటాయి? ‘’అని ప్రశ్నిస్తే ,జానకి దాహం వేస్తోందని గ్రహించి విల్లు ఎక్కు పెట్టి బాణం సంధించి భూమిలోకి వేస్తే అమృతోపమానమైన పాతాళ గంగ భూమిని చీల్చుకొని పైకి వస్తే ముగ్గురూ దాహం తీర్చుకొన్నారు .అదే ఇప్పుడు ‘’శ్రీ రామ తీర్ధం’’గా ఇక్కడ ప్రసిద్ధమైంది .ఎన్నికరువుకాటకాలు వచ్చినా ఈ తీర్ధజలం తగ్గదు. అంతేకాదు నల్లపూస వేసినా కనిపించేంత స్వచ్చంగా నీళ్ళుంటాయి .ఆధి వ్యాధులను తీర్చే గుణమూ ఉంది .పూర్వం దీనిచుట్టూ మొగలి పొదలు దట్టంగా వ్యాపించి పాములు కీచురాళ్ళకు నిలయమై ,ఎవ్వరూ ఇక్కడికి రావటానికి సాహసం చేయకపోతే ఆంధ్రవాల్మీకి శ్రీ వావికొలను సుబ్బారావుగారు ,స్వంత ఖర్చులతో వాటిని తొలగించి ,పైనుంచి కిందకు దిగటానికి మెట్లు కట్టించి రామతీర్ధాన్ని స్నాన యోగ్యంగా మార్చి పుణ్యం కట్టుకొన్నారు .ఒంటిమిట్ట అంటే కొదందరాముడి తర్వాత గుర్తుకొచ్చేది వాసు దాసు మహనీయులే .అంతటి అవినాభావ సంబంధం ఉంది ఆయనకు . ఆయన పద్య రామాయణం ‘’మంధరం ‘’ఇక్కడే రాశారు .రామతీర్దానికి ఉత్తరంలో ఉన్న చిన్నకొలను లక్ష్మణ తీర్ధం.దండకారణ్యం లో తపస్సు చేసుకొంటున్న మునిగణాలను రాక్షసులు బాధిస్తుంటే వారు శ్రీరాముని శరణు వెడితే అభయమిచ్చి రాక్షససంహారం చేసి శాంతికల్గించాడు .ఆంధ్రవాల్మీకి ఈ సందర్భంగా చెప్పిన పద్యం –
‘’ఈ ముని కోటి కంతటికీ నీవె శరణ్యుడ,వీవెధర్మ ర –క్షా మహితుండవో నుత యశా ! గురు వర్యుడు బూజ నీయుడున్
స్వామియు ,మాననీయుడును ,శాసకుడు న్నృపు డీవ సుమ్ము ,మ-త్స్వామివి నీవ ,నీవు వనధారుణి నుండిన ,నూరను౦డి నన్’’అని మహర్షులు గుర్తు చేశారు రామునికి .
మరి కొంతకాలానికి సీతాన్వేషణం చేస్తూ ,హనుమ ,జాంబవంతులు ఈ ప్రదేశానికి వచ్చి రాత్రి నిద్ర చేయగా స్వప్నం లో సీతా లక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామి దర్శనమిచ్చాడు .ఉదయమే లేచి చూడగానే ఏక శిలపై ఆముగ్గురు మూర్తులు ‘’ప్రకటిత ‘’మయ్యారు .మునులు ముక్తికాములు కనుక సీతామాత వామభాగం అంటే హృదయస్థానం లో ,’’రామస్య దక్షిణో బాహు ‘’అన్నట్లు లక్ష్మణుడు కుడిప్రక్కన అ౦గ రక్షకుడై ధనుర్ధారియైఉంటాడు. రాక్షససంహారం కోసం శ్రీరాముడూ కోదండాన్ని బాణాన్ని ధరించి కొదండరామస్వామిగా కనిపిస్తాడు .ఈ దివ్యమంగళ మూర్తులను తనివారా దర్శించి ,పులకించారు హనుమ ,జాంబవంతులు .జాంబవంతుని ఆత్మబలం తో ఇది సాధ్యమైనందు వలన ఈ క్షేత్రం ‘’జాంబ వత్ప్రతిస్టం’’అని పేరుపొందింది .
త్రేతాయుగం లో జాంబవంతుడు రామునితో మల్లయుద్ధం చేయమనికోరితే, ద్వాపర యుగం లో అది సాధ్యం అని చెప్పటం ,శ్రీ కృష్ణుడు శ్యమంతకమని ని వెతుకుతూ జాంబవంతుని గుహలోకి వెళ్ళటం ఇద్దరిమధ్య భీకర యుద్ధం జరిగి అమేయ బలసంపన్నుడు జా౦బవాన్ ఓడిపోవటం కృష్ణుడే రాముడు అని గ్రహించటం ,తనకూతురు జాంబవతిని శ్యమంతకమణిని ఇచ్చి పంపటం మనకు తెలిసిన విషయాలే .ఇలా త్రేతా ,ద్వాపర యుగాలతో జా౦బవంతునికి సంబంధం ఉండటం వలన జాంబవంత క్షేత్రం అని గట్టిగా చెబుతారు .
శ్రీరాముడు అవతారం చాలించి వైకుంఠం వెడుతుంటే ‘’ఎల్లవేళలా నీ రూప దర్శనం ,నామం అనుగ్రహించు ‘’అనికోరగా అనుగ్రహించాడు రాముడు .అందుకే ఇక్కడ కొండ దిగువన కొదందరామునికి ఎదురుగా శ్రీ సంజీవరాయలుగా వెలసి,అంజలి బద్ధుడై అనుక్షణ నిత్య సేవాభాగ్యం పొందుతున్నాడు హనుమ .
శివుడు వైరాగ్యం తో తపస్సు చేసింది కూడా ఈ క్షేత్రం లోనే . అందుకే ఇక్కడి శివుడు ‘’శ్రీరామలి౦గేశ్వరునిగా ప్రసిద్ధుడు .క్షేత్రానికి వాయవ్యం లో మృకండమహర్షి ఆశ్రమం ఉంది .ఇక్కడే కుమారుడు మార్కండేయుడు శివపూజతో మృత్యువును జయించాడు .శృంగి ముని తపస్సు చేస్తుండగా మెడడలో చచ్చినపాము వేశాడని నిష్కారణంగా పరీక్షిత్తు మహారాజును శపించి ,ఆ పాపం పోవటానికి శ్రీరామ తీర్ధం దగ్గర ఉన్న కొండపై తపస్సు చేశాడు .అదే శృంగి శైలం. అదే ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి ఆశ్రమం అయింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-12-19-ఉయ్యూరు