ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -3
ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -2
3-అయ్యలరాజు రామభద్రుడు
శ్రీ రామాభ్యుదయం రాసిన అయ్యలరాజు రామభద్రుడు 1550కాలం వాడు అలియరామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజు కు శ్రీరామాభ్యుదయ కావ్యం అంకితమిచ్చాడు .ఒంటిమిట్ట వాసి ఐన కవి ‘’ఇది శ్రీ మదొంటిమిట్ట రఘు వీర శతక నిర్మాణ కర్మఠ జగదేక ఖ్యాతి ధుర్య అయ్యలరాజు తిప్పయ మనీషి పర్వతాభిదాన పోత్రాక్కయార్య పుత్ర పరిశీలిత సమిద్ధ రామానుజ మతసిద్ధాంత ముమ్మడి వరదా చర్య కటాక్ష వీక్షా పాత్ర ,హృదయ పద్మాసనస్థ శ్రీరామభద్ర –శ్రీరామభద్రకవి ప్రణీతంబైన ‘’శ్రీరామాభ్యుదయ ము ‘’అన్నాడు
‘’శిలజిగురు బోడియై యుల్లసిల నొనర్చి –ఎత్తి పోయిన గౌతము నిల్లు నిలిపె
నడుగు కెందమ్మి కమ్మపుప్పొ డిని ఇంక-నేమని నుతియించవచ్చు శ్రీరాము మహిమ ‘’
ఇతని గురించి ఒక ఐతిహ్యం ఉంది .కవి చిన్నపాపడుగా ఉండగా తల్లి కోదండరామాలయం లో జరిగే ఉత్సవానికి ఈ శిశువు నెత్తుకొని వెళ్ళగా, ముద్దుగా ఉన్న అతడిని చూసి అక్కడి స్త్రీలు ఎత్తుకొని ముద్దాడుతుండగా ,వాళ్ళదగ్గరే పిల్లాడు ఉంటాడని ఇంటికి వచ్చి ,యెంత సేపటికీ బిడ్డ రాకపోవటం తో ఊరంతా వెదకి౦ది .ఆ రాత్రి శిశువు దేవాలయం లోనే ఉండిపోయి తల్లికోసం అలమటిస్తుంటే సీతమ్మతల్లి బిడ్డను ఎత్తుకొని , లాలించి, ఆకలి తీర్చటానికి స్తన్యం ఇచ్చింది .అమృ తోపమానమైన అస్తన్యం తో శిశ ఉల్లాస౦గా ఉన్నాడు .తెల్లవారుజామున పూజారులు స్వామి సుప్రభాతానికి వస్తే, సీతమ్మ పాదాల చెంత బిడ్డ ఆడుకొంటూ కనిపించి ఆశ్చర్యపరచాడు .అతని తల్లికి వర్తమానం పంపి రప్పించి శిశువును అప్పగించారు .ఆ రాత్రి ఆబిడ్డడు మూడు సార్లు సీతమ్మతల్లి పాలు త్రాగినట్లు గుర్తులున్నాయి .పెదవులపై సీతమ్మవారి గుర్తులున్నాయి. చూసి పరమానదభరితులయ్యారు .ఈ కవిని గురించి ఆంధ్రవాల్మీకి రాసిన సీసపద్యం చూద్దాం –
‘’అమ్మక !కోవెలందు దన –యమ్మయు నొంటిమివీడిపోవ,రే
పమ్మిన యాకతటన్ శిశువు –పాలకు నేడ్వగ నాలకించి ,తా
నమ్మగ స్తన్యమిచ్చిన దయామయి –నన్గనగ వమ్మ అమ్మ !సీ –తమ్మభయ క్షుధార్దితుని
నయ్యలరాజు కులోద్వాహుం బలెన్ ‘’(ఆంధ్రవాల్మీకం –బాలకాండ -86వ పద్యం )
4-ఇమాం బేగ్
1640లో కడప నవాబు రాజులలో అబ్దుల్ నబీఖాన్ మొదటివాడు నవాబులకాలం లో సిద్ధవటం కోట ఉంది .మట్లి అనంతరాజు ఈ కోట,అందులో శివాలయం 1604లో కట్టించాడు .నావాబు కోటనుస్వాదీనం చేసుకొని శివాలయం ధ్వంసం చేసి మసీదు కట్టించాడు .దేవాలయ అవశేషాలు ఇప్పటికీ కనిపిస్తాయి .నవాబు ప్రతినిధి ఇమాం బేగ్ .ఒంటిమిట్ట కోదండరామ మహాత్యాన్ని స్వయంగా చూడాలని వచ్చి ,’’మీదేవుడిని పిలిస్తే పలుకుతాడా ‘’?అని అడిగితేపలుకుతాడు అని చెప్పగా దేవాలయం లో నూ ,బయటా మనుషులెవ్వరూ లేకు౦డా,పోకుండా చేయించి ‘’ఓ రామా !ఒంటిమిట్ట రామా !అని ఆర్తిగా మూడుసార్లు పిలిచాడు ఇమాం బేగ్ .మూడవ పిలుపుకు ‘’ఓ-ఓ-ఓ’’అని వినిపించగా నవాబు సంతోషంతో సాస్టా౦గపడి ఆనంద బాష్పాలు రాలుస్తూ,పులకిత శరీరుడై వినయంగా శ్రీరాముని ప్రార్ధించాడు .స్వామి మహాత్మ్తాన్ని గ్రహించి తనవంతు కై౦కర్యంగా ,దేవాలయం మెట్లకు దక్షిణాన ఒక బావి త్రవ్వించాడు .చుట్టుప్రక్కల బావుల్లో ఉప్పునీరు ఉంటే నవాబుగారిబావిలో స్వచ్చమైన మధుర జలం ఊరింది .ఈ నీటినే స్వామి పూజా కై౦కర్యాలకు వినియోగిస్తారు దీనినే’’ ఇమా౦ బేగ్ బావి ‘’అంటారు .అంతేకాదు దగ్గరున్న మసీదులో పిల్చినా రాముడు పలికాడట .
5-మాల ఓబన్న
200 ఏళ్ళక్రితం ఆలయానికి తూర్పున అరమైలు దూరం లో ‘’మలకాటపల్లె ‘’అనే ఊరు లో ఓబన్న అనే మాలకులస్తుడు పుట్టి మహా భక్తుడయ్యాడు .విద్య శుచి ఆచారం లేనివాడు .మాలల లో చెన్న దాసరులు వైష్ణవ మతావలంబులు .భగవద్రామానుజులు కంచి గోపురమెక్కి తిరుమంత్ర రహస్యాన్ని వివరించినప్పుడు రహస్యంగా విన్నవారే చెన్నదాసరులు .ఓబని సంసారం పెద్దది .బాల్యం లోనే రామాయణ భాగవతాది పురాణాలు విని ,భక్తితో స్వామిని భజించేవాడు .నాలుగవ జామునే లేచి స్నానించి ఊర్ధ్వ పుండ్రాలు ధరించి తంబూర ,చిటి తాళం తో ,కాలిగజ్జెలతో కోదండరాముని కోవెలముందు భజన చేస్తూ పారవశ్యంలో ఇహలోక స్పృహ లేకుండా చాలాకాలం చేసి ఇంటికి వచ్చేవాడురోజూ .ఇది చూసి కన్ను కుట్టిన కొందరు సో౦బేరులు ,స్వామి అర్చనకోసం పూజారులు తీర్ధ జలాన్ని తీసుకొని వెడుతూ వేదమంత్రాలు ఉచ్చరిస్తుంటే ,శూద్రుడు అక్కడ ఉంటే అపవిత్రం అవుతో౦దని గగ్గోలు పెట్టి ,నానాయాగీ చేశారు .
ఒక రోజు తహసీల్దారు వస్తే ఆలయ ధర్మకర్తలు ఉద్యోగులు ఎదురువెళ్ళి స్వాగతం పలికి మేళతాళాలతో గుడిలోకి తీసుకు వెడుతున్నా అదేమీ పట్టనట్లు ఓబయ్య తన భజన తాను చేసుకొంటున్నాడు .ఆయనకు పూజార్లు అతనిపై చాడీలు చెప్పి పురెక్కించగా, ఆయనా వివేకం కోల్పోయి ‘’వాటీజ్ దిస్ నాన్సెన్స్ ‘’అని బిళ్ళబంత్రోతులచేత ఓబని మెడబట్టి దూరంగా నెట్టేయించాడు .ఆలయం పడమటి భాగానికి వెళ్లి యధాప్రకారం భజన కొనసాగించాడు .
మర్నాడు ఉదయం అర్చకులు ఆలయం తలుపులు తెరిచి చూడగా స్వామి పడమటి వైపుముఖం తో కనిపిస్తే అవాక్కై ,కిందపడి పొర్లు దణ్ణాలు పెడుతూ పొలికేకలు పెట్టారు .జనమంతా పోగయి ఆశ్చర్య పోయారు .ఆ రోజు రాత్రి తహసిల్దార్ కలలో కనిపించి ,మర్నాడు ఓబని తన సముఖానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు .ఏమి జరుగుతుందో అని ఊరిజనమంతా ఆలయంలోకి చేరారు .రామభజనలతో,మంగళవాద్యాలతో అర్చకులు ,తహసీల్దారు గ్రామపెద్దలు ఓబని సమీపించి తమ అపరాధాన్ని క్షమించమని కోరారు ,భూనభోంతరాలు దద్దరిల్లేట్లు అందరూ మహా గౌరవంగా ఓబన్న ను కోదండ రామ సన్నిధికి తీసుకు వెళ్ళారు .మళ్ళీ ఆశ్చర్యం కలిగిస్తూ స్వామి తూర్పు ముఖంగా దర్శనమిచ్చాడు .
ఓబన్న 120 సంవత్సరాలు జీవించాడు .తనివి తీర దేవాలం లోకి వెళ్లి స్వామిని దర్శించి పూజించి ఆడిపాడి ధన్యుడయ్యాడు .బాగా ముసలి వాడు అయ్యాక కోవెలకు రాలేక తన ఊరిలోనే ఉంటూ ,మనుమల సాయం తో పడమటి గోడవరకు వచ్చి, గోపుర దర్శనం చేసి ,తాను తినే రాగి సంకటి స్వామికి నైవేద్యం పెట్టి ,అ ప్రసాదాన్ని తినేవాడు .అనాయాస మరణం తో ఓబన్న సాయుజ్యం పొందాడు .’’భవ నాశి ‘’వంశీయుడైన ఓబన్న తరువాత తరాలవార౦తా వైష్ణవులే .స్వామి బ్రహ్మోత్సవాలలో ఓబని స్తంభం వద్ద పందిట్లో వీరంతా భజనలు చేస్తారు .ఓబన్న స్మృతిచిహ్నం ఇప్పటికీ ఉన్నది.ఇక్కడే ఆయన భజన చేసేవాడు .గరుడోత్సవం నాడు వీరంతా ఉపవాస ఉండి,స్వామి గరుడ వాహనం పై ఊరేగుతూ మహాద్వారం దగ్గరకు రాగానే స్తంభం పై పెద్ద జ్యోతి వెలిగించి ,గోవి౦ద నామాలతో చుట్టూ తిరుగుతూ భజనలు చేస్తారు. ఈ మర్యాద ఇప్పటికీ అమలు ఉన్నది .ధన్యుడు మహాభక్తుడు ఓబన్న .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-12-19-ఉయ్యూరు