ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4 (చివరిభాగం )

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ దేవాలయం -4          (చివరిభాగం )

ఈ క్షేత్ర సందర్శనం తో తరించిన భక్తులు -3(చివరి భాగం )

6-మహాయోగి ,త్యాగి ,భక్త శిఖామణి ఆంద్ర వాల్మీకి శ్రీ వాసుదాసు

ఆంద్ర వాల్మీకి వాసుదాసు అనే శ్రీ వావికొలను సుబ్బారావు గారు ఈ క్షేత్రాభివృద్ధికి ఆధునిక కాలం లో యెనలేని కృషి చేశారు .,  ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి “ఆంధ్ర వాల్మీకి” బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు.

గిడుగు వారి వ్యావహారిక భాష వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరి మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీసారు.

జీవితవిశేషాలు

వావిలికొలను సుబ్బారావు జనవరి 231863 న రాయలసీమలోని కడప మండలం జమ్మలమడుగు లో  జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. ఏడేళ్ళ వయసు వచ్చ్చేదాకా మాటలు రాలేదు .తర్వాత వచ్చి చదువులో అందరికంటే ముందుండేవారు .ఆంగ్లపాఠశాలలో  ఎఫ్.ఏ.చదువుతూ ,తెలుగు ,సంస్కృతాలలో గట్టిపట్టు సాధించారు 1883లో ప్రొద్దుటూరు తాలూకా ఆఫీసులో నెలకు 7 రూపాయల జీతం తో డిస్పాచ్  గుమాస్తాగా చేరి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు.  ఇన్స్పెక్షన్ కు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనం చేయకుండా ,ఏదిచ్చినా తీసుకోక ఆదర్శంగా ఉద్యోగించారు .వీలులేకపోతే స్వయంగా వండుకు తినేవారు .

వివాహం

నెల్లూరు శ్రీ కాంచనపల్లి శేషగిరి రావు గారిపుత్రిక శ్రీమతి రంగనాయకమ్మనుపెద్దలు కుదర్చగా  వివాహమాడారు .వీరికి ఒక కొడుకు పుట్టినా చిన్నతనం లోనే చనిపోయాడు ‘.భార్య 1910లో పరమపదించారు .

గ్రంథ రచన

మొదటగా ‘’శ్రీ కుమారాభ్యుదయం ‘’అనే ప్రౌఢ ప్రబంధం25వ ఏట  రాశారు .నెల్లూరు ఆవిష్కరణ సభలో ఇంత పిన్నవయసులో మహా ప్రబంధ రచనా అని చిన్నా ,పెద్దా అనుకోవటం విని, ఆసభలోనే ఆశువుగా’’ శ్రీ తల్పగిరి  రంగ నాథ శతకం ‘’చిత్ర పదకల్పనా చాతుర్యంతో చెప్పగా ప్రక్కనున్న వారు రాశారు .అలాగే ఆతర్వాత ‘’కౌసల్యా పరిణయం ‘’బంధకవిత్వం తో సహా అనేక ప్రక్రియలతో రాశారు .శీర్షికలోనే అనేక తమాషాలుఅంటే శ్లేషలు  చూపారు

1-శ్రీ కుమారాభ్యుదయం =మన్మథచరిత్ర 2 -కుమారాభ్యుదయం =మన్మథచరిత్ర 3-మారాభ్యుదయము = మన్మథచరిత్ర 4- రామాభ్యుదయము = మన్మథచరిత్ర ఇలా ఒకొక్క అక్షరం తీసేసినా అదే అర్ధం  వస్తుంది .

లెక్చరర్ సుబ్బారావు

వావికొలను వారి పాండితీ ప్రకర్ష గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఆంద్ర ఉపన్యాసకునిగా1904 నియమించి గౌరవించింది .ఇక్కడే 16ఏళ్ళు 1920 వరకు పని చేశారు . ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజు భారతదేశాన్ని చూడటానికి వచ్చినపుడు, కళాశాల తెలుగు పండితుడు గనుక యువరాజును స్తుతిస్తూ కవితలు చెప్పమని బ్రిటిషు ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. బహుమతిగా బంగారు కంకణం ఇస్తామని ఆశ చూపింది. దాన్ని ఖరాకండిగా తిరస్కరించి తాను’’ రామదాసునే గాని కామదాసును’’ గానని తేల్చి చెప్పారు.

.’’ఆంద్ర భాషాభి వర్దినీ సమాజం ‘’స్థాపించి ఎందరినో భాషా సంస్కృతులలో నిష్ణాతులను చేశారు .ఇక్కడ పని చేస్తున్నప్పుడే ‘’ఆర్యనీతి,ఆర్య చరిత్ర రత్నావళి ,హిత చర్యమాలిక రాశారు. ఆనాడు ప్రతి పాఠశాలలో, గ్రంధాలయం లో వీరి రచనలు కనిపించేవి .ప్రతిదీ 20కంటే ఎక్కువ సార్లు పునర్ముద్రణం పొందటం విశేషం .విద్యార్దులకోసం ‘’సులభ వ్యాకరణం ‘’మూడు భాగాలుగా రాశారు .’’సుభద్రా విజయం ‘’నాటకమూ రచించారు. భగవద్గీతను ‘’ద్విపద భగవద్గీత ‘’గా  తెనిగించారు ‘

ఆంధ్ర వాల్మీకి

సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని’’ ఇరవై నాలుగు వేల ఛందో భరిత పద్యాలుగా’’ తెలుగులో సప్త కాండలుగా 1900లో వ్రాశారు. . ఇది అనితర సాధ్యమైన విషయం. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలనూ )’’ 108 సార్లు నియమ పూర్వకంగా పూర్తిగా పారాయణం ‘’చెయ్యటం వలన ఆయనకు అందులోని నిగూఢ అర్ధాలు స్ఫురించాయి. ఆయన వ్రాసిన రామాయణాన్ని ఒంటి మిట్ట శ్రీ కోదండరామ స్వామి కి అంకితమిస్తూ 1908 అక్టోబర్ 9,10,11 తేదీలలోమహాజన  సమక్షం లో ఆవిష్కరింప జేశారు .మహాసభ  ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చారు.   సభలో మహాపండితులు ఆయనకు’’ ‘ఆంధ్ర వాల్మీకి’ ‘అని బిరుదు ప్రదానం చేసి సత్కరించారు .

దివ్యానుభూతులు

ఒకరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వస్తుంటే ఆకలితో ఉన్న ఒకతను  అన్నం పెట్టమని అడిగితె ,ఇంట్లో వంట చేసేవారు లేకపోతె ఆ విషయం ఆలోచిస్తూ వెనక్కి తిరిగితే ఆ వ్యక్తి కనిపించలేదు .ఇంటికి వస్తే సిద్ధవటం తహసీల్దార్ జయరామ నాయుడు ‘’ఒంటిమిట్ట రామాలయం లో స్వామికి నిత్య నైవేద్య దీపారాధనలు జరగటం కష్టం గా ఉంది .మీరు పూనుకొని ఆలోటు పూరిస్తే బాగుంటుంది ‘’అని రాసిన ఉత్తరం కనిపించింది .తనను అన్నం అడిగింది సాక్షాత్తు రామ చంద్ర ప్రభువే అని అర్ధం చేసుకొని, అప్పటినుంచి  నెలకు 10 రూపాయలు స్వామి కై౦కర్యానికి ఒంటిమిట్ట పంపారు .

ఒక సారి యోగ సాధనలో ఘటికా చలం లో ఉండగా ఒకనాటి స్వప్నం లో తాను ముండ్ల బాటలో నడుస్తున్నాడని ఇద్దరు బాటసారులు చేయిపట్టుకొని మంచి దారి చూపించారు .ఇదీ రామ మహిమగానే భావించి హఠ యోగం కన్నా భక్తి యోగం మిన్న అని స్వామి ఆజ్ఞగా భావించి ,తానూ సాధించి ఇతరులకు బోధిస్తూ ‘’ఘటికాచల నృసింహ కేశవా ‘’మకుటం తో శతకం రాస్తుంటే ,ఒక రోజు రాత్రికలలో ఇద్దరు బైరాగులు కనిపించి ‘’ఇక్కడేం చేస్తావ్ ఒంటి మిట్టకు రారాదా ‘’ అని పిలిచారు .ఉదయం లేవగానే ఇకాలస్యం చేయకుండా ఒంటి మిట్ట కు బయల్దేరి వెళ్ళారు .బాల్యం నుంచి తన ఇస్ట దైవం కోదండరాముని ఆజ్ఞగా భావించి స్వామి సేవలో తరించటానికి వెళ్ళారు .

టెంకాయ చిప్పతో స్వామి కి కానుకల నిధి

రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికీ వారు భోంచేయగా రామునికి నైవేద్యం కరువైన స్థితికి ఆలయం వచ్చిం ఉద్ధరించటానికి కంకణం ,తనకున్న సర్వస్వం రామార్పితం చేసి ,కౌపీనం మాత్రమె ధరించి టెంకాయ చిప్పను చేతిలోపట్టుకొని  ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించారుత ధనం దానిలో పడినా ఏదీ ఉంచుకోనక.  రామునకిచ్చి చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి

ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు

వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని లో

దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి

కర్మ గుణపణిముల కుప్ప ! టెంకాయ చిప్ప! ”

అంటూ  ‘టెంకాయ చిప్ప శతకం’ చెప్పిన మహాకవి.

ఆయన ఎంతటి మహా కవి యంటే ‘’నెల్లూరు’’లో జరిగిన ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా ‘’రంగనాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా ‘’చెప్పి శతకాన్ని పూర్తిచేశారు .

ఆలయ జీర్ణోద్ధారణ

విమాన గోపుర జీర్ణోద్ధారణ గర్భాలయ ,అంతరాలయ నేలను బాగు చేయించటం ,మహాద్వారానికి తలుపులు సంజీవరాయ దేవాలయ జీర్ణోద్ధరణ ,శ్రీరామ సేవాకుటీరం అనే సత్రనిర్మాణ౦  నూతన రథం ఏర్పాటు ,శృంగి శైలంపై వాల్మీకి ఆశ్రమ౦ ,ఇమాం బేగ్ బావి మరమ్మత్తులు ,ప్రక్కన భవన నిర్మాణం వాసుదాసు గారు సేకరించిన నిధితో సమ కూర్చారు ఈపనులన్నీ 1923నుంచి 4ఏళ్ళు 27 వరకు జరిగాయి .

వస్తు పరికరాలు ఆభరణాలు

వెయ్యి మందికి వంట చేయటానికి పాత్ర సామగ్రి ,108కాసులమాల ,108మంగళసూత్రాలహారం ,ఉత్సవ మూర్తులకు బంగారు కిరీటాలు ,మరికొన్నిఆభరణాలు వెండి సామాను చేయించి స్వామికి అర్పించారు ఆంధ్రవాల్మీకి .

గృహాలు

1-ఒంటిమిట్టలో ఒక భవనం 2-కడపలోని తన నివాసాన్ని ‘’శ్రీరామ చంద్ర భవనం ‘’గా మార్చి అర్పించటం 3-మద్రాస్ తిరువళి క్కేణిలోని శ్రీ రామజయమ౦దిర౦ అన్నీ కొదందరామార్పితం చేశారు వాసుదాసకవి .టెంకాయ చిప్ప  బిక్షా పాత్ర వలన వచ్చిన ద్రవ్యం ,శిష్యులు గురుదక్షిణగా సమర్పించిన డబ్బు ,స్వీయ గ్రంథాల అమ్మకం వల్ల వచ్చిన ధనం ఆరోజుల్లోనే రెండు లక్షలరూపాయలకు పైగా ధనాన్నివెచ్చించారు రామార్పణ౦ గా వావికొలను సుబ్బరాయ వాసు కవిగారైన ఆంధ్రవాల్మీకి .ఎంతటి నిస్వార్ధమో ఊహకు అందని విషయం .అక్కడ భద్రాచల రామదాసు ,ఇక్కడ ఈ వాసు దాసు శ్రీరామ సేవలో పునీతులై తరించారు .

1920లో ఒంటిమిట్టకు చేరిన వాల్మీకి గారు ,ఇంటికి వచ్చిన అతిధి అభ్యాగతి బందువర్గాలను పోషిస్తూ ,పుస్తకప్రచురణ చేశారు .దేవాలయ ఉత్సవాలు కైంకర్యాలు మహా వైభవంగా దగ్గరుండి జరిపించారు  .సాధారణ భక్తులకు తెలియని ఒంటి మిట్ట క్షేత్రాన్ని బహుళ వ్యాప్తి చెందించి అశేష భక్త జనానికి ఆకర్షణ కలిగించారు .

మహా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవ౦

వాల్మీకి రామాయణాన్ని 108 సార్లు పారాయణ చేసి హృదయగతం చేసుకొని ఆంధ్రవాల్మీకం రాసి  ,పూర్వాంగం గా ‘’మందరం ‘’రచించి ఆసేతు హిమనగ పర్యంతం హరిద్వార ,సింధు ,బ్రహ్మపుత్ర ,మొదలైన 500 దివ్య క్షేత్రాలలో సహస్ర ఘటాభి షేకాలు,కొత్తగా తయారు చేయించిన కనకరత్న కిరీటాలతో మిత్రుల తోడ్పాటుతో శ్రీరామ సామ్రాజ్యపట్టాభి షేక మహా యజ్ఞాన్ని 50 వేల ప్రజల సమక్షం లో నిర్వహించిన మహా భక్త శిఖామణి శ్రీ వావికొలను సుబ్బారావు గారు .

మందర రచన

వాల్మీకి రామాయణానికి సంస్కృతం లో మహేశ్వర తీర్ధ ,గోవింద రాజు మొదలైన వారు వ్యాఖ్యానాలు రాశారు .అప్పటికి తెలుగులో ఎవరూ వ్యాఖ్యానం రాయలేదు .ఆకొరత తీర్చారు ఆంధ్రవాల్మీకి .వాల్మీకి హృదయాన్ని ఆవిష్క రిస్తూ ,ఆ అమృతాన్ని అందరూ పొందాలని భావించి తానూ తెలుగులో రాసిన రామాయణం ఆధారంగా కవి వాల్మీకి హృదయానికి అద్దం పడుతూ ,తన ప్రయోగ వైశిస్ట్యాలను ,ప్రయోగించిన పదాల సౌరును ,వాటికి పూర్వకవుల ప్రయోగాలు చూపిస్తూ ,చమత్కార గర్భిత పదాలకు వివరణ ఇస్తూ ,వ్యాకరణాది విశేషాలు తెలియజేస్తూ సంప్రదాయ అర్ధాలను సమన్వయ పరుస్తూ వ్రాసిన మహా ఉద్గ్రంథమే వాసుదాసు గారి ‘’మంధరం’’.

రామాయణ బాలకాండ ఒంటిమిట్ట వాల్మీక్యాశ్రమం లోనే రాశారు .నగరి సమీపం మేల్పట్టుగ్రామంలో శ్రీ గుడుపూడి దొరస్వామి నాయుడు గారి ఆహ్వానం మేరకు వెళ్లి ‘’అయోధ్యకాండ ‘’రాశారు .రావు గారి  శిష్యుడు  నాయుడుగారు గురు దక్షిణగా రామార్పణం చేసినా స్వామికి చేరలేదు .గుంటూరు మండలం నడిగడ్డ పాలెం లో ప్రణవాశ్రమం నిర్మించి మౌనవ్రతం చేస్తూ ‘’అరణ్య కాండ ‘’రాశారు .పంచవటి ,పంపాసరోవరం ,కిష్కింద ,మాల్యవంతం ,భద్రాచలం నుంచి హంపి వరకు స్వయంగా దర్శించి తుది నిర్ణయం చేసి రాశారు .తూర్పు గోదావరిజిల్లా కోలంక జమీ౦దారిణి శ్రీరాజారావు రామాయమ్మ గారు వాసుదాసుగారిని ఆహ్వానించి ఒక వనం లో విడిది ఏర్పాటు చేయగా ,మౌనవ్రతం తోనే ,అవధూత నియమాలు పాటిస్తూ ఒక సంవత్సరం లో కిష్కింద ,సుందర ,యుద్ధ ,ఉత్తర కాండలు రచించారు .70ఏళ్ళ వయసులో ,రోజుకు 20గంటలు రామకావ్యానికే వినియోగించారు .

మందరం చివరలో చెప్పిన పద్యం –

‘’ ఆ తల్లి గారిట్లు లాదరంబున బ్రోవ –యామార్తి సుబ్బా దాసార్య వరుడు –శిష్యుడై హితుడయి ,చేదోడు నగుచు –నిఖిల కార్యంబుల నిర్వహింప

సీతమ్మ ప్రావుగ చిల్లర లక్ష్మమ్మ-ఏక పున్నమ్మయు నెల్ల విధుల –మేనిని బ్రోవ౦గ  మేకొన నీ విట్లు –వీరి నొసంగిన కారణమున

సాంతముగ గ్రంథమంతయు సలుపగంటి –నేక చిత్తంబు తోడ ,నే లోకమందు

నైన వీరల తోడి పోత్తమరియుండ-జేయవే జానకీ నాథ !శ్రీ సనాథ’’

మంధరం ను కోదండ రాముని కిఅర్పి౦చటానికి  వాసుదాసుగారు ఒంటిమిట్ట వచ్చారు .1934 జ్యేష్ట  శుద్ధ ద్వాదశి నాడు భక్తులతో ఆలయం క్రిక్కిరిసి ఉన్నది స్వామికి పూజ అయ్యాక’’ మంధరం’’ ను తన బంగారు కలం తోపాటు స్వామికి సమర్పించారు .’’కోదండరాముడు నాకిచ్చిన బలం కలం .కనుక దానిని స్వామి పాదాల చెంత ఉంచాను .రాముడు నాతో పలికిస్తేనే రాయగలిగాను .నేను రాసినవన్నీ ముద్రించటానికి డబ్బుకావాలి .వయసు మీదపడి బలహీనుడ నయ్యాను .రాముని సొమ్ము రామునికే అర్పించాను .కార్యభారానికి రాముడే సమర్ధుడు ‘’అన్నారు వినయంగా ఆంద్ర వాల్మీకి . ‘

‘’శ్రీరామ భిక్షాం దేహి’’అంటూ వాసుదాసు గారు ఊరూ వాడా కాలినడకన నిరాహారులై ఎండనక ,వాననక దేశమంతా తిరిగి తాను  పాదం పెట్టిన చోటల్లా కనకవర్షం కురిసింది.దాన్ని చేతితో నైనా తాకే వారు కాదు  ప్రక్క వారు లెక్క పెట్టాల్సిందే,వాళ్ళే ఖర్చు చేయాల్సిందే .విలువ నిలవ చూసే పధ్ధతి వారికి లేదు .ఉదాసీనులు .శిష్యాగ్రణి  శ్రీ దాస శేషస్వామి  దాసుగారి పాదసేవ చేస్తూ ,పట్టాభిషేకానికి రెండు సంవత్సరాలముండు వచ్చారు .దాసుగారి రచనాభారమంతా ఆయనే సమర్ధంగా చేసేవారు .ఎప్పటికప్పుడులోటుపాట్లు లేకుండా కట్టు దిట్టం చేశారు .దీనితో తేరగా తినటానికి వచ్చిన బంధు గణానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లై నెమ్మదిగా జారుకొన్నారు .ఊళ్ళో కలహాలవలన దేవాలయానికి అర్పించిన వస్తువులు ఆభరణాలు ,పెద్ద గంట తోసహా దాసుగారింట్లోనే ఉన్నాయి.దేవాలయానికి ఎదురుగా శ్రీరామ సేవా కుటీరం నిర్మించి  ,శ్రీ వరదాభయ కోదండ రాములు అనే పేరుతొ ‘’నకిలీ సన్నిధి ‘’ఏర్పరచారు .

దాసుగారి  వీలునామా

తాను  సంపాదించిన సర్వస్వం  ట్రస్టీ లను ఎన్నుకొని వారి ద్వారా శ్రీరామునికి అర్పిస్తానని ఒక సభలో ప్రకటించారు .తాను  నడుపుతున్న ‘’భక్త సంజీవని ‘’పత్రిక లోనూ అలానే రాశారు .కాని అలా చేయలేదు .చనిపోవటానికి13రోజుల ముందు ఒంటిమిట్టవచ్చారు..చాలా నీరస౦గా ఉండటం చేత స్వామిని దర్శించి మద్రాస్ వెళ్ళారు .అక్కడ అవసాన దశలో తమ తమ్ముడికొడుకు  శ్రీ లక్ష్మాజీ రావు ను ట్రస్టీ గా చేసి ,శ్రీ వరదాభయ కోదండ రామ స్వామి పేర తమకున్న యావదాస్తీ సమర్పిస్తూ వీలునామా రాశారు .అప్పటికి వారి ముద్రితాముద్రిత గ్రంథాలు ,ఆభరణాలు తప్ప ద్రవ్యం ఏమీ లేదు .రెండు వందలు మిగిలితే ఉత్తరక్రియలకు వాడమని రాశారు .నమ్మిన శిష్యుడు శ్రీ దాస శేష స్వామికి చక్రా౦క౦  వేసే శ౦ఖ చక్రాలు భక్తి సంజీవని పత్రికా నిర్వహణ అధికారమిచ్చారు .ఆంధ్రవాల్మీకి వాసుదాసకవి శ్రీ వావికొలను సుబ్బారావు గారు మద్రాస్ లోనే 73వ ఏట 1-8-1936పరమపదించారు .

దాసుగారి తదనంతరం

దాసు గారి నిర్యాణం తర్వాత లక్ష్మాజీ రావుకు నిర్వహణ బాధ్యత చేతకాలేదు .ప్రజలలో అసమ్మతి పెరిగితే ,కడప బారిస్టర్ శ్రీ కృష్ణస్వామి ఒక భక్త సంఘం ఏర్పాటు చేసి రావు గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ స్వామి వారి ఆస్తినంతటిని సంఘానికి దఖలు చేయమని కోరారు .ఇంతలో రావు గారింట దొంగలుపడి మొత్తం దోచుకుపోయారు  బ్యాంకు లో  ఉన్న స్వామి నగలు మాత్రం దక్కాయి .చేసేదిలేక రావుగారు కడప వెళ్లి  బారిస్టర్ గారి సమక్షం లో దాసుగారు రాసిన వీలునామాప్రకారం అంతా భక్త సంఘానికి బదిలీ చేసి ఊపిరి పీల్చుకొన్నారు .

దాసుగారు లేని లోటు

దాసుగారు జీవించి ఉండగానే స్వామి నిత్యభోగానికి ప్రయత్నించారు .వారున్నప్పుడు నిత్యపూజా కైంకర్యాలు ఉత్సవాలు మహా వైభవంగా జరిగేవి .గుంటూరు జిల్లా వెళ్ళగానే మళ్ళీ పరిస్థితి మామూలయింది .బారిస్టర్ గారి పూనికతో మళ్ళీ వైభవం వచ్చింది .1949 ట్రస్టీ పదవి నుంచి విరమించుకోగా,వితరణ శీలి  శ్రీ పుట్టం రెడ్డి రమణారెడ్డిట్రస్టీగా వచ్చి ,దేవాలయ ఆస్తులను ఇతరులనుంచి స్వాధీనం చేసుకొని ఆలయానికి దఖలు పరచి ‘’నిత్య నైవేద్య పూజా నిధి ‘’ఏర్పరచి  లోటులేకుండా చేశారు .దాసుగారికోరిక ‘’నిత్యభోగ కల్పనం’’రెడ్డిగారి వలన తీరింది .శ్రీ దాస శేషస్వామి దాసుగారి రచనలన్నీ పునర్ముద్రణ చేసి జిజ్ఞాసువులకుందుబాటులోకి తెచ్చారు .

దాసుగారి రచనలు

  • 1-ఆంధ్ర వాల్మీకి రామాయణం 2-శ్రీకృష్ణలీలామృతము3- ద్విపద భగవద్గీత4- ఆర్య కథానిధులు 5-ఆర్య చరిత్రరత్నావళి 6-సులభ వ్యాకరణములు7-శ్రీకుమారాభ్యుదయము( రమాకుమార చరితం )8- గాయత్రీ రామాయణం 9-శ్రీరామనుతి10- కౌసల్యా పరిణయం 11-సుభద్రా విజయం నాటకం 12-హితచర్యమాలిక 13-ఆధునిక వచనరచనా విమర్శనం 14-పోతన నికేతన చర్చ 15-పోతరాజు విజయం16- రామాశ్వమేథము17- ఆంధ్ర విజయము18-టెంకాయచిప్ప శతకము 19- ఉపదేశ త్రయము 20-మంధరము 21-శ్రీరామావతార తత్వములు22- శ్రీకృష్ణావతార తత్వములు 23-దేవాలయతత్త్వము24-దండక త్రయము.

శ్రీసీతారామకల్యాణ౦

ఒంటిమిట్టలో శ్రీ సీతారామ స్వామి కల్యాణం శ్రీరామనవమినాడు కాక చైత్రపౌర్ణమి నాడు రాత్రి వేళ జరగటం విశేషం .మర్నాదు ఉదయం రధోత్సవం ‘’మెరవణి’’చేస్తారు .సిద్ధవటం పాలించిన మట్లి రాజులకాలం లో కల్యాణం 5రోజులు రాత్రిపూట నిర్వహించేవారు .బుక్కరాయల కాలం లో చైత్ర శుద్ధ నవమి నుంచి  కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమై ,రథత్సవంతో ముగిసేవి .శ్రీరామనవమినాడు పోతన జయంతి నిర్వహిస్తున్నారు .

బ్రహ్మోత్సవాలు

1356లో బుక్కరాయలకాలం లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి .ఆయన చంద్ర వంశం రాజుకనుక చంద్రుడు శ్రీరామ చంద్రుని కల్యాణం తిలకించి పులకించాలని పౌర్ణమినాటి రాత్రి సీతారామకల్యాణం ఏర్పాటు చేశాడు .ఇది చంద్రుడికి శ్రీరాముడు ఇచ్చినవరం కూడా అంటారు .చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి  . చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఒంటిమిట్ట

నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక భద్రాచలం తెలంగాణాలోకి వెళ్ళాక ఒంటిమిట్టకు విశేష ప్రాధాన్యం తెచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు .కళ్యాణ మండపం కట్టటానికి 100కోట్లు సాంక్షన్ చేశాడు ఆలయ పూజాదికాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాడు .మళ్ళీ ప్రాభవం తీసుకొచ్చాడు .

ఒంటడు +మిట్టడు =ఒంటిమిట్ట

ఒంటిమిట్ట రామాలయం అంటే ఒంటడు మిట్టడు అనే బోయసోదరులే ముందు గుర్తుకు రావాలి .విజయనగరాన్ని కంపరాయలు పాలిస్తున్నప్పుడు చెరువులు నిర్మించి గ్రామాలు నెలకొల్పి ,వ్యవసాయాన్ని పెంచి సామ్రాజ్య వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు .అయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒంటడు,మిట్టడుఅనే బోయ సోదరులు ఆయనకు సకల సౌకర్యాలు కలిపించేవారు .వారి భక్తీ ఆసక్తి వినయాలకు రాజు సంతోషించి ఏదైనా కోరుకోమంటే ఇక్కడి రామాలయం అభి వృద్ధి చేయమని అడిగారు .వెంటనే డబ్బు శాంక్షన్ చేసి ఖర్చుపెట్టే బాధ్యత ఈ సోడురులపై పెట్టాడు .అ డబ్బులో ఒక్క కానీకూడా వ్యర్ధం చేయకుండా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు .కంపరాయలు మళ్ళీ వచ్చి చూసి పరమానంద భరితుడై ఇంకా ఏదైనా కావాలంటే చేస్తాను అన్నాడు దానికి ఆసోదరులు ఈ గ్రామం తమపేర వర్దిల్లేట్లు చేయమని కోరారు .అలాగే అని ఆగ్రామానికి వారిద్దరిపేరు వచ్చేట్లు ఒంటిమిట్ట పేరు పెట్టినట్లు స్థానిక కథనం .ఆ బోయసోదరుల పూర్వజన్మ సుకృతం అలాంటిది .స్వామి సేవలో తరించారు.తమపేర్లను సార్ధకమూచేసుకో గలిగారు  .వీరిద్దరినీ మర్చిపోతే చరిత్రమనల్ని క్షమించదు.

విదేశీ ,దేశీ యాత్రికులు

క్రీ.శ.1652లో ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ బాప్టిస్ట్ ట్రావర్నర్ ఒంటిమిట్ట ఆలయం చూసి ,ఇక్కడి ఆలయ శిల్ప విన్యాసాన్ని వేనోళ్ళ మెచ్చాడు .ఇక్కడి గోపురం అరుదైన వాటిల్లో ఒకటిగా పేర్కొన్నాడు .సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య ఈక్షేత్రం సందర్శించి రామునిపై కీర్తనలు రాసి,రామునికి  పాడివినిపించాడు .మట్లి రాజుల ఆస్థానకవి ఉప్పుగుండూరు వేంకటకవి స్వామిపై ‘’దశరధ రామా !’’మకుటం తో శతకం రాశాడు .స్వామి సేవలో తరించిన వరకవి నల్లకాల్వ అయ్యప్ప కాలం లో నెల్లూరు తిరుపతి బద్వేలు ,నందలూరు రాజం పేట వరకు తురుష్కులు  జరిపిన దాడులను ‘’శత్రు సంహార వేంకటాచల విహార ‘’అనే మకుటం తో శతకం రాశాడు. భవనాశి  ఓబులదాసు గురించి చెప్పుకొన్నాం .ఆయన రాసిన పదమాలికలుకొన్ని తెలుసుకొందాం –‘’రామనామము రామనామము రమ్యమైనది రామనామము ‘’అనేది ఇప్పటికీ జనం పాడుకొంటున్నారు .అలాగే ‘’రాముని దాసులమయ్యా –బ్రేమను గనుగొనరయ్యా-పరులమాటకు  మేము రాము –పరుల బాటకు నడ్డపడము –పరసతులను మేము పాలించి చూడము –తరుణులందరు మాకు తల్లి తోడులయ్యా ‘’మరొకటి ‘’చెప్పవే తల్లి చెప్పవే సీతమ్మ –నీవైన చెప్పవే రాముతోడ అంటూ భక్తీ ఆర్తీ లతో పాడి తరించాడు .

పోతన సాహిత్య పీఠం

1995లో ఒంటిమిట్ట ప్రాంత కవులు తెలుగుపండితులు అధ్యాపకులు కలిసి ‘’పోతన సాహిత్య పీఠం’’ఏర్పాటు చేసి .కోదండరామాలయం లో సాహితీ సమావేశాలు, ధార్మిక ప్రసంగాలు నిర్వహిస్తున్నారు .భాగవత సప్తాహాలు , ధనుర్మాసం లో నిత్యందార్మిక ప్రసంగాలు  ఏర్పాటు చేస్తున్నారు.వాసు దాసు గారు మొదలు పెట్టిన  పోతన జయంతిని  ఆలయ అధికారులతోకలిసి  ఘనంగా నిర్వహిస్తున్నారు  .ప్రముఖ భాషా పరిశోధకులు ,కడపబ్రౌన్ లైబ్రరీ ట్రస్ట్ సెక్రెటరి  శ్రీ కట్టా నరసింహులు ఇక్కడ అనేక సాహిత్యకార్యక్రమాలు బహు ఉత్సాహంగా జరుపుతున్నారు .

ఒంటిమిట్ట క్షేత్రం అభి వృద్ధికి ఆలోచనలు

1-ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో వెంటనే  రైల్వే హాల్ట్ ఏర్పాటు చేయాలి .

2-కళ్యాణమండప నిర్మాణం త్వరలో పూర్తి చేసి సకల వసతులు కల్పించాలి .ఇక్కడ ఆంధ్రవాల్మీకి గారి అద్భుతశిలావిగ్రహం నెలకొల్పాలి .శ్రీరామునిపై ఆయన రాసిన ముఖ్యపద్యాలను గోడలపై రాయించాలి .అలాగే అయ్యలరాజు రామభద్రుని పద్యాలు రాయించాలి .

3-వాసుదాసు గారి ముఖ్యపద్యాలు మంచి గాయకులతో పాడించి రికార్డ్ చేసి సిడిలు గా తేవాలి .తిరుమలలో అన్నమయ్య కీర్తనలు వినిపిస్తున్నట్లు ,నిరంతరం దాసుగారి పద్యాలు  ఆలయం బయటా ,ఊరిలో వినబడేట్లు ఏర్పాటు చేయాలి

3-సామాన్యులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేయాలి

4-ఆలయం లో పూజాదికాలలో మంత్రాలు తంత్రాలతోపాటు సమానంగా ఉండాలి .

5-ఏకాంత సేవ మొక్కుబడిగా కాక అర్ధవంతంగా ,స్వామిపై కీర్తనల గానంతో పరవశించేట్లు నిర్వహించాలి .

6-ఆలయ చరిత్ర ను చిన్న పుస్తకాలుగా ముద్రించి అందుబాటులోకి తేవాలి .

7-ఆధ్యాత్మిక గ్రంథ విక్రయ శాల నెలకొల్పాలి

8-శనివారం మాత్రమేకాక స్వామి లడ్డూ ప్రసాదం నిత్యం అమ్మే ఏర్పాటు చేయాలి

9-మరింత విస్తృతంగా ఒంటిమిట్ట కోదండరామ వైభవాన్ని ప్రచారం చేయాలి .దీనికోసం ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిర్వహించాలి .

సమాప్తం

<p style=”margin:6pt 0in;background-image:initial;background-position:initial;background-size:initial;background-repeat:initial;background-origin:initial;background-clip:i

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.