దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -5
1-సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి –5 (1759-1847)
త్యాగరాజ శిష్య పరంపర -3
21-వైద్య కవీశ్వరన్ (1825-86)
తొండమాన్ రాజుల ఆస్థాన విద్వాంసుడు .గీర్వాణకవి ,గాయకుడు .తిరు గోకర్ణపుబృహదంబాళ్ భక్తుడు .ఇతని ప్రతిభను మెచ్చి రామచంద్ర రాజు ‘’వరపురి ‘’ఈనాము ,’’కవీశ్వర్ ‘’బిరుదు ఇచ్చాడు .భక్తి భరితంగా ఇతని సంస్కృత గేయాలుంటాయి .
22-చల్లగాలి కృష్ణయ్య (1825-65)
పచ్చిమిరియం ఆదెప్ప శిష్యుడు పల్లవి గోపాలయ్య కొడుకు .తంజావూర్ ఆస్థాన విద్వాంసుడు .వీణా ,గాత్ర సంగీత నిపుణుడు ‘’శ్రుతి తంత్రిని వాయించకుండా వీణను మీటటం ఇతని ప్రత్యేకత .వీణ మానవ గాత్రం లాగా పలికేది.దక్షిణానిలం లాగా చల్లగా ఉండేది కనుక ‘’చల్లగాలి’’ బిరుదు వచ్చింది .తిరు నెలంగాడు,త్యాగయ్య ,మాయవరం వైద్య నాథన్ శిష్యులు .
23-స్వరకాడు వెంకట సుబ్బయ్య (1825-64)
ఆరం తంగి దగ్గరున్న వల్లవాడి నివాసి .శేషాచలయ్యవద్ద గానం నేర్చి ,పల్లవి స్వరకల్పనలో సిద్ధహస్తుడయ్యాడు .నిడమంగళ గ్రామంలో ఉంటూ బయట ఏకాంత ప్రదేశం లో నాదోపాసన చేసేవాడు .చనిపోయే దాకా గాత్ర గాంభీర్యం తగ్గనే లేదు .శిష్యుడు పల్లవి సోమభాగవతార్ .శ్రీ రాజగోపాల స్వామికి తనగాత్రం నివేదించే వాడు .స్వరకల్పనా చాతుర్యాన్ని మెచ్చిన శివాజీ మహారాజ్ ఇతనికి ‘’స్వరకాడు ‘’బిరుదప్రదానం చేసి గౌరవించాడు .
24-కాళిదాసు నారాయణ స్వామి (1858-1926)
రామయ్య కొడుకైన యితడు త్యాగరాజు వంశీకుడు. మానంబు చావడి శిష్యుడు .ఫిడేలు ప్రవీణుడు .నిడమంగళం వెళ్లి స్వరకాడు సుబ్బయ్యవద్ద స్వర రహస్యం,పల్లవి ప్రస్తావన స్వరకూర్పు నేర్చాడు .తెల్ల దొరలనుంచి గిటార్ ,పియానో ,బాన్జో వాద్య లక్షణాలు తెలుసుకొని భారతీయ రాగాలు నేర్పాడు .అబ్రహం పండితర్ జరిపిన గానపరిషత్తులో పాల్గొని అనేక విషయాలు చర్చించాడు .కొడుకు నీలకంఠన్ గొప్ప సంగీత విద్వాంసుడు .
25-నీలకంఠన్
తండ్రివద్ద సంగీతం నేర్చాడు. ఇతని ఇల్లు సఖా రామారావు ,పూచయ్య౦గార్ ,కోనేరి రాజాపురం సంగీత ధ్వనులతో మారు మోగేది .7వ ఏట స్వరజ్ఞానమబ్బిన బాలమేధావి .అపార సంగీతజ్ఞానం ,దర్పంగల గాత్రం ఇతని సహజ ఆభరణాలు .రామ స్వామి శివన్ 100రచనలకు అనేక రాగ తాళగతులతో వర్ణ మెట్లు కట్టాడు .1936-నుంచి 43వరకు మద్రాస్ అడయారు కళాక్షేత్ర పండితుడిగా ,సంగీతకాలేజి ఆచార్యుడుగా ఉన్నాడు .
26-రామస్వామయ్య అనే రామానంద యోగి
వాలాజి పేట కృష్ణ స్వామి శిష్యుడు .శ్రీత్యాగరాజ స్వామి కృతులను మొదటిసారిగా ముద్రించి లోకానికి అందించిన మహానుభావుడు
27-తిల్ల స్థానం పంజు ,నృసింహ భాగవతార్ సోదరులు
త్యాగరాజస్వామి జీవిత చరిత్ర ,కీర్తనలను అచ్చు వేసిన అదృష్టవంతులు .నృసింహ హరికథ భాగవతార్ .
28-పల్లవి శేషయ్య (1832-1909)
నెయ్యకార్పట్టి సుబ్బయ్య కొడుకు .ఆంద్ర ములికినాటి బ్రాహ్మణుడు .సోదరుడు కోదండరామయ్య ‘’కొనగోలు పాటగాడు’’..మనోధర్మ సంగీతం లో దిట్ట. కల్పనా స్వరాలను క్లిష్టమైన చిత్ర విచిత్ర తాళగతులలోబంధింపబడిన ఎలాంటి జాతులలోని పల్లవులనైనా చాలాఅవలీలగా పాడే నైపుణ్యం ఉండేది.వెయ్యి త్యాగరాజస్వామి కృతులు కంఠస్థం చేసి ,శ్రీరామునికి సహస్రార్చన చేసిన మహా భక్తుడు .మల్లికా వసంత ,శుభపంతు వరాళి లలో ఇతని కృతులు రచనాపాటవానికి ఉదాహరణలు .ముత్యాలప్పేట సుబ్బయ్య ఇంట్లో సావేరి రాగం 18 గంటలు పాడి రికార్డ్ సృస్టించాడు. మేళ క్రమపద్ధతిలో వెయ్యి రాగాలను అమర్చి వాటికి ఆరోహణ ,అవరోహణ స్వరాలు కూర్చిన ప్రజ్ఞావంతుడు .గొప్ప లక్ష్య ,లక్షణ విద్వాంసుడు .అనేక కృతులు వర్ణాలు తిల్లానాలు రాసిన ప్రతిభుడు .మైసూరు రాజా సన్మానం పొంది, బందరు మొదలైన పట్నాలలో కచేరీలు చేసి కీర్తి పొందాడు .ఇతని కీర్తనలకు ‘’శేషముద్ర ‘’ఉండటం విశేషం .
29-కరూరి చిన దేవుడు (1860-1900)
దక్షిణామూర్తి, ఈయన పినతండ్రి ,పెత్తండ్రి బిడ్డలు .దేవుడయ్య కరూరి నరసయ్య కొడుకు .ఆబాల్య సంగీతజ్ఞానసంపన్నుడు.గాత్రజ్ఞుడు.ఫిడలర్ కూడా .పట్నం సుబ్రహ్మణ్యం ,శరభ శాస్త్రి వంటి దిగ్దంతులకు ఫిడేల్ సహకారమందించిన ప్రతిభ ఆయనది .ఉరయార్పురం రాజా పోషణలో మద్రాస్ లో సంగీత శాల స్థాపించి విద్యార్ధులకు నేర్పాడు .గర్భపురి ముద్రలో ఉన్న దక్షిణామూర్తి కృతులకు వర్ణ మెట్లు తయారు చేశాడు .సోదరుడు చిన్నస్వామి .శిష్యుడు నీలకంఠయ్య.’’చిన దేవుడు’’ 40ఏళ్ళకే ఉచ్ఛ స్థితి లో ఉండగా’’ ఆదేవుని’’ సన్నిధానం చేరాడు .30-సి.యస్. కృష్ణస్వామి (1865-1925)
తిరుచునాపల్లి నివాసి అయినా తూగోజి కాకినాడలో చాలాకాలమున్నాడు .అందుకే ‘’కాకినాడ కృష్ణయ్య’’ అంటారు.పట్నం సుబ్రహ్మణ్యమ వద్ద గాత్ర ధర్మాలు నేర్చాడు .త్యాగరాజ శతకీర్తన స్వరావళి ,వేంకటేశ తానవర్ణాలు,,ప్రథమగాన శిక్ష రచించాడు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’,
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-12-19
.
‘’
—