‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు
‘’2019 అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం ‘’గా నిర్వహిస్తున్న నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలుగా విజయవాడ పిబి సిద్ధార్ధ కళాశాలలో డిసెంబర్ 27శుక్రవారం నుంచి 29ఆదివారం వరకు మూడు రోజులు ,1600మంది ప్రతినిధులు, జీవిత సభ్యత్వం లేక ప్రతి నిధిరుసుం చెల్లించి,ప్రయాణ, విడిది ఖర్చులు ఎవరికి వారే భరించి అత్య౦త ఉత్సాహం పాల్గొన్నారు .వీరందరికీ ఉదయ సాయ౦త్ర అల్పాహారం ,షడ్ర సోపేత మధ్యాహ్న,రాత్రి భోజనం నిర్వాహకులు అందించి అందరి మెప్పు పొందారు .ఈ సభల గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ .అధ్యక్ష కార్య దర్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా,జి.వి పూర్ణచంద్ ల ఆలోచనా ఫలితంగా కార్యక్రమ రూపకల్పన జరిగి ప్రాంగణానికి డా.కొమరరాజు లక్ష్మణ రావు గారి పేరు ,సదస్సులు జరిగే రెండువేదికలకు గిడుగు శ్రీరామమూర్తి ,సురవరం ప్రతాప రెడ్డిగార్ల పేర్లు పెట్టటం సముచితంగా ఉన్నది .ప్రారంభ ముగింపు సభలు గిడుగు వారి వేదికపై నే జరిగి ,చర్చా సదస్సులు రెడ్డిగారి వేదికపై మొత్తం 15 సదస్సులు మూడు రోజులలో జరిగాయి .ప్రత్యేకకవి సమ్మేళనం ,జీవితసభ్యుల ,ప్రతినిధుల కవి సమ్మేళనం ,శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి చే ‘’చమత్కార చతుర్ముఖ పారాయణం ‘’,డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ చే ‘’ఎనుకుదురాట’’అనే అచ్చతెలుగు అష్టావధానం , డా మీగడ రామలింగస్వామి ‘’సంగీత నవావధానం ‘’,డా సప్పా అప్పారావు ‘’తెలుగు వారి ఆలయ నృత్య రీతులు ‘’ప్రదర్శన ,శ్రీ రాజేష్ బృందం చే ‘’తెలుగు భాషోద్యమ గీతాలు ‘’,శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ చే ‘’కావ్యాలలో తెలుగు సొగసు,’’శ్రీ సిల్వెస్టర్ చే ‘’ప్రపంచ తెలుగు ‘’ధ్వన్యనుకరణ ,డా రాధశ్రీ చే ‘’పలకరిస్తే పద్యం ‘’,తెలుగు తల్లి వైభవం ‘’కదంబ కార్యక్రమం ,శ్రీఅనంత శ్రీరాం చే’’యువత –తెలుగు భవిత ‘’పై ప్రత్యేక ప్రేరణ ప్రసంగం ,డా కెవి సత్యనారాయణ బృందం చే ‘’పారిజాతాపహరణం లో సత్యాకృష్ణులప్రణయ ఘట్టం’’నృత్య ప్రదర్శన ,కూడా నవరస పోషకం గా ఉత్సాహ, వినోదాలను పంచాయి
.ప్రత్యేక సదస్సులుగా విదేశీ ప్రతినిధుల ,తెలుగు భాషా పరిశోధక ,సాహితీ ,బోధనా, ,రాజకీయ, పాలనా ,సాంకేతిక తెలుగు ,భాషోద్యమ ,చరిత్ర పరిశోధన ,సాహితీ సంస్థల సాంస్కృతిక ,ప్రచురణ ,రాష్ట్రేతర ,పత్రికా ప్రసార మాధ్యమాల మహిళా రంగాలకు చెందిన ప్రతినిధుల సదస్సులు ఆయారంగాలలో నిష్ణాతులైన వారు పాల్గొని చర్చా వేదికలుగా ఉండాల్సినవాటిని ఉపన్యాస వేదికలుగా మార్చి ,సభలు ఇచ్చిన సమయంకంటే రెండు గంటలు కూడామించి మాట్లాడేవారికి నిమిషం ,అరనిమిషం మాత్రమె దక్కి ఉసూరు మనిపించాయి ,.చెవులకు పరీక్ష అనిపించాయి .
ప్రారంభ సభ దగ్గరనుంచి అన్ని సభల్లోనూ అందుబాటులో ఉన్న శాస్త్ర ,సాంకేతికతను ఉపయోగించకుండా రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో విసుగు తెప్పించారు .కేంద్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు శ్రీ చంద్ర శేఖర కంబార్ ఆంగ్లం లో, కన్నడం లో చేసిన ప్రసంగం ఒక్కరికంటే ఒక్కరికీ అర్ధం కాకపోవటం శోచనీయం .వీరి ప్రసంగానికి అప్పటికప్పుడు వెనుక స్క్రీన్ పై తెలుగు అనువాదం వాక్యాలు వచ్చే అత్యాధునిక సాంకేతికత అవకాశం ఉన్నప్పుడు ఆఆలోచన ఎందుకు రాలేదో ఎవరికీ అంతు బట్టని విషయమై చర్చకు దారి తీసింది .పేపర్లలో కూడా ఈవిషయం వచ్చింది ..ఉపన్యాసాలలో సాంకేతికత యేకాని ఆచరణలో సాంకేతికత లేక పొతే సభల సఫలత ఎలాసాధ్యం అని గొణుక్కున్నారు .ఈ రంగం లో విశేషానుభవం ఉన్న శ్రీ షేక్ రహ్మనుద్దీన్ ను మర్నాడు అడిగితే ‘’ఆదిచాలా తేలిక .మా దృష్టికి నిర్వాహకులు తెచ్చి ఉంటె హాయిగా ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం .ఈ గందర గోళం ఉండేది కాదు ‘’అన్నారు .తెలుగు భాషా సంస్కృతులపై పరిశోధనలు చేస్తున్న ఫ్రెంచ్ ఆచార్యులు ఆచార్య డేనియల్ నేజెర్స్ చక్కని తెలుగులో మాట్లాడి అందరి దృష్టి ఆకర్షించారు. మారిషస్ తెలుగు పెద్దాయన శ్రీ సంజీవ నరసింహ అప్పుడు హాయిగా తెలుగులోనే వేదికపైనా, బయట అందరితోనూ మాట్లాడుతూ మనమాటల్లో ఆంగ్ల శబ్దం దొర్లితే బాధపడి సవరిస్తూ’’ తెలుగులోనే మాట్లాడండప్పా .మేమంతా తెలుగుకు అంకితమై మారిషస్ లో జీవిస్తుంటే ,మీకెందుకు ఈ ఆ౦గ్లవ్యామోహం ’’అని మెత్తగా ‘’– పెడుతూ ‘’కర్తవ్య బోధ చేసి అందర్నీ ఆకర్షించారు .ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారు తక్కువ సమయం తీసుకొని మాట్లాడినా అర్ధవంతమైన, కర్తవ్య బోధకమైన ,ఆచరణీయాత్మక ప్రసంగాలు రెండు వేదికలపైనా చేశారు .’’ వెయ్యేళ్ళయినా తెలుగు మరణించదు’’అని కమ్మని ఆశ కలిగించారు తన విస్తృత అవగాహన ,అనుభవాల దృష్ట్యా .సాహిత్య అకాడెమి కార్యదర్శి డా శ్రీనివాసరావు తెలుగు పుట్టు పూర్వోత్తరాలలోకి వెళ్లి బోర్ కొట్టిస్తే ,ఆచార్య ఇనాక్ ఆకర్షిస్తే ,సిరివెన్నెల మాటలతో చి౦దులేస్తే ,జొన్నవిత్తుల కరుణశ్రీ పద్యాలతో హితవు చెప్పారు .ప్రారంభ వేదిక పై ‘’తెలుగు ప్రపంచం ‘’ప్రత్యేక సంచిక ,తెలుగు వెలుగు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది .అమెరికానుంచి వచ్చి,ప్రార్ధన గీతం ఆలాపి౦చిన శ్రీమతి ఆకునూరి శారద శ్రావ్య కంఠం పరవశింపజేసింది .94ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు,రచయిత్రి ,స్వర్గీయ బుచ్చిబాబు గారి అర్ధాంగి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు వీల్ చైర్ లో కూర్చుని అందరికి ప్రేరణ ,స్పూర్తి కలిగించటం విశేషం .రచయిత్రులలో ఆమే అందరికన్నా పెద్ద వారవటం ,ఆమెను చూసే అదృష్టం రచయితలకు కల్గి౦చిన౦దుకు నిర్వాహకులు బహుధా అభినందనీయులు . శ్రీ బుద్ధ ప్రసాద్ గారు అధ్యక్షోపన్యాస కర్తవ్య బోధ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్వాగత ,శ్రీ పూర్ణచంద్ లక్ష్య ప్రస్తావన జరిగాయి .ఉదయం 10గంటలకు ప్రారంభమై రెండు గంటలలో ముగియాల్సిన ప్రారంభ సదస్సు మూడున్నరగంటలు ‘’సా—-గి ‘’ శ్రోతల సహనానికి పరీక్ష పెట్టింది .
నన్ను సురవరం వేదికకు అనుసంధానం చేసి ,ఎప్పటికప్పుడు సదస్సు రిపోర్ట్ తయారు చేసి ప్రెస్ కు ఇచ్చే బాధ్యత అప్పగించారు శ్రీ గుత్తికొండ ,శ్రీ పూర్ణ చ౦ద్ లు .కనుక గిడుగు వేదికపై జరిగిన మిగతా కార్యక్రమాల వివరాలు ప్రత్యక్షంగా నాకు తెలీక పోయినా ,కొన్ని వివరాలు సేకరించి అందిస్తాను .ఇక్కడివాటికి నేను సాక్షీభూతుడిని కనుక వివరంగా చెప్పగలను .నాకు సహాయకంగా గోదావరి జిల్లారచయితల సంఘం(గోరసం ) అధ్యక్షుడు ,యువకుడు అత్యుత్సాహవంతుడు, ‘’ఎవర్ ఎనర్జేటిక్’’,సెల్ లో తెలుగు మెసేజ్ లను ‘’సెల్ పగిలి పోతుందేమో’’ అన్నంత అత్యంత వేగంగాతన సెల్లో టైప్ చేసి విలేకరులకు యెప్పటికప్పుడు తాజాగా’’ వండి వడ్డిస్తూ’’ అందించటానికి సహకరించిన ‘’యువర్స్ మోస్ట్ ఒబీడిఎంట్లీ’’గా నన్ను ;’’;గురువుగారు గురువుగారు’’ అంటూ సంబోధించే శిష్యుడులాంటి చి .శిష్టు సత్యరాజేష్ ఉండటం నా అదృష్టం. అందుకే పూర్ణ చ౦ద్ పెట్టిన బాధ్యతను సంతృప్తిగా నెరవేర్చగలిగాను రాజేష్ తోడ్పాటుతో .నా దగ్గరే కాదు గిడుగు వేదిక ‘’రిపోర్ట్ కొట్ట టానికీ’’ అతడే .ఇలా ‘’సవ్య సాచిత్వం’’ చేసిన రాజేష్ మిక్కిలి అభిన౦దనీయుడు .
ఇది ధనుర్మాసం తెల్లవారుజామున 3-15కు లేచి స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి చేసి ,టిఫిన్ తిని కాఫీ తాగి నేను రెడీగా ఉంటె మా మనవడు చి.చరణ్ లేక మనవరాలు చి.రమ్య నన్ను’’ బండీ’’ ఎక్కించుకొని సెంటర్ లో దింపి తే నేను ఉదయం 7-30కు సిద్దార్ధకాలేజీ కి చేరి ,సాయ్న్త్రకార్యక్రమాలయ్యాకభోజనం చేసి బయల్దేరి వస్తే ,,రాత్రి కూడా సెంటర్ నుంచి నన్ను ఇంటికి తీసుకువస్తూ ‘’తాతా! ఈ వయసులో ఇలా చీకటితో వెళ్లి ,రాత్రి పొద్దుపోయే దాకా ఉండి,బస్సుల్లో తిరగటం అవసరమా ‘’?అని అమాయకంగా, ఆప్యాయంగా నన్ను అంటుంటే ముసిముసినవ్వులే నా సమాధానం .వాళ్ళ అభిమానానికి హాట్సాఫ్ .కనుక వీరిద్దరూ కూడా అభినందనీయులే కదా ..
వేదికలపై మాట్లాడినవారిలో శ్రీ రెంటాల జయదేవ్ వంటి ఒకరిద్దరు మినహా ‘’పాలకుల అస్తవ్యస్త విధానం పై అగ్నికి ఆహుతౌతున్నతెలుగు ‘’గురించి తీవ్ర స్వరం లో హెచ్చరించినవారు లేక పోవటం విచారకరం .అసలు ముఖ్యవిషయం పై ము౦దు గానే సభలో తీర్మానం చేసి ప్రతినిధుల ,అతిధుల అందరి సమక్షం లో చదివి ఆమోదం పొందించి ఉంటె దాని ప్రభావం ఇంకా బాగా ఉండేది . భాషాభిమానమున్న రెండు వేలమంది ప్రతినిధులతో సిద్ధార్ధ కాలేజి నుంచికనీసం ఒక పావు కిలోమీటర్ ప్రదర్శన చేసి ఉంటె ఆ ఎఫెక్ట్ మరింతగా ఉండేదేమో .2019లో మరణి౦చిన మన తెలుగు సాహితీ ప్రముఖులకు మొదటిరోజు సభలో శ్రద్ధాంజలి ఘటించక పోవటం మనం ఏ సందేశం ఇస్తున్నామో అర్ధం కావటం లేదు .యువత ను ఆకర్షించే విధంగా వారి ఇన్వాల్వ్ మెంట్ తో ఒక్క కార్యక్రమం కూడా లేక పోవటం క్షమార్హం కాదేమో ! కాలేజీ విద్యార్ధులు ఈ కాలేజీలో నే ఉన్నారు .వారి కి ప్రబోధాత్మక కార్యక్రమం నిర్వహింఛి ఉంటె సార్ధకమయ్యేవి సదస్సులు .రాష్ట్రం నిప్పులమీద ఉంటె కాలక్షేపం కవి సమ్మేళనాలు అర్ధరాత్రి దాకా సాగించటం చాలామంది వ్యతిరేకించారు .అచ్చతెలుగు అవధానం చేసేవారికి పృచ్చకులకు మరో అరడజను మందికి మాత్రమె అర్ధమయ్యే ప్రక్రియ .దానికి అంతప్రాదాన్యమా అన్నవారూ ఉన్నారు .’’కవి సమ్మేళనం లో పాల్గొనటానికి ఎంతో దూరం నుంచి వస్తే ఖండువాలను ఎవరికీ తెలీని వారితో కప్పించటమేమిటని ‘’బాధపడ్డారుకొందరు కవులు . ‘’బడిలో తెలుగు మాధ్యమం అవసరాన్ని’’తెలియజేసే మెమొరాండం రాష్ట్ర ముఖ్యమంత్రి లేక విద్యామంత్రి లేక ప్రధానకార్యదర్శి వంటి వారికి ఒకబృందాన్ని పంపి ఇప్పింఛి ఉండాల్సింది .ఇదే మన తక్షణ కర్తవ్యమ్ కనుకఅని అభిప్రాయపడ్డాడు ప్రతినిధులు . . సభలకు హాజరైన వారంతా దాదాపు 50పడి దాటిన వారే .వీరిలో వృద్ధులు అతి వృద్ధులు ,కన్ను లేక కాలు వంటి అవయవ వైకల్యం ఉన్నవారు ,వీల్ చైర్ లో చేతికర్ర ఊతం తో ,లేక భార్య పిల్లల తోడుగా వచ్చారంటే వారికి తెలుగు భాషపై ఉన్న ఆరాధన ఎంతటిదో ,దాన్ని కాపాడుకొనే తపన ఎలాంటిదో అర్ధమౌతోంది .అలాంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు .16వందలమందేకాక ఇంకా అంతమంది ప్రతినిధులుగా నమోదవటానికి ఉత్సాహం చూపారని వారికి ఇక్కడి ప్రాంగణం చాలదనే భావంతో మర్యాదగా ఒద్దని చెప్పామని నిర్వాహకులు చెప్పటం సముచితమే . .ప్రతి సదస్సు,లేక కార్యక్రమం జరగటానికి కార్యకర్తలంతా’’ నిలువు జీతం ‘’తో పని చేసి తమ అంకితభావాన్ని చాటుకున్నారు .ఉపాహార, భోజనాల సమయంలో కేటరింగ్ వారు చాలా మర్యాదగా ప్రవర్తించి ఏలోటు రాకుండా చేసినందుకు, అక్కడి పారిశుధ్యం పై శ్రద్ధ వహించిన వారూ అభినదనీయులే .అయితే గోడలప్రక్కన కనీసం ఒక 20కుర్చీలైన వేయించి ఉంటె ‘’నావంటి ముసలి ముతకా’’కూర్చుని తినటానికి వీలుగా ఉండేది .ఎప్పటికప్పుడు మంచినీళ్ళ గ్లాసులు సిద్ధం చేసిన సిబ్బందిని నేను అభినందనలు తెలిపాను స్వయంగా . ఈ కార్యక్రమాలన్నే సమాజ శ్రేయస్సు, పిల్లల భవత కోసం చేసినవే ,ఇందులో ఆర్ధికంగా ఆర్ధికేతరంగా సహాయ సహకారాలందించిన వారందరూ వందనీయులే .ప్రతినిధులకు ఒక బ్యాగ్ ,రాసుకొనే పుస్తకం, పెన్ను, సావనీర్, జ్ఞాపిక ,సర్టిఫికేట్ ,’మెడలో బిళ్ళ ‘’ఇచ్చి సత్కరించటం ముదావహం .ప్రతినిధులను నమోదు చేసుకోవటం లో కార్యకర్తల బాధ్యతా బాగా మన్ననలు పొందింది . మొదటి రెండు రోజులలోనూ , మూడవరోజూ ఎప్పుడూ సమావేశ మందిరాలు దాదాపు పూర్తిగా ప్రతినిధులతో నిండి ఉండటం అభి రుచికి నిదర్శనంగా నిలిచింది .స్టేజి ముందు వీడియో వారి వలన వెనక వారికి చాలా ఇబ్బందిగా ఉండటం చూస్తూనే ఉన్నాం .’’హా౦గి౦గ్ కేమేరాలు’’ పెట్టి దూరం నుంచి ఆపరేషన్ చేసే వ్యవస్థవస్తే తప్ప ఈ లోపం సరి చేయలేమేమో .వేదిక బానర్ వద్ద, తెలుగుతల్లి విగ్రహం వద్దా ప్రతినిధులు గుంపులు గుంపులుగా ఫోటోలు తీసుకోవటం వారి ఆన౦దానికి ,దీన్ని చిరస్మరణీయ౦ చేసుకోవటానికి పడిన ఆరాట౦ అభినందనీయం . మిగిలిన సదస్సుల పై విషయాలు ఈ సారి తెలియ జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-19-ఉయ్యూరు ,
—
- D