‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం )
సురవరం వారి వేదికపై 28వ తేదీ శనివారం రాత్రి జరిగిన’’ సాహితీ ప్రతినిధుల సదస్సు’’ కు డా.దీర్ఘాసి విజయ భాస్కర్ ఆధ్యక్షత వహించి మనిషిలో ఆశను రేకెత్తించేది సాహిత్యమని ,ఇవాళ తెలుగు రాస్ట్రాలపరిస్థితి ‘’కుములుతున్న గడ్డి వాము ‘’లాగా ఉందని ,మంటలు కనిపించకపోయినా లోన రగిలిపోతోందని ,ప్రపంచం లో 5లేక 6అజ౦త భాషలున్నాయని అందులో తెలుగు, ఇటాలియన్ బాషలు ముఖ్యమని,మొత్తం 6700భాషలు ప్రపంచం లో ఉన్నాయని ,సాహిత్యం ఉన్నంత మాత్రాన భాష సజీవంగా ఉన్నట్లుగా అనుకోరాదని ,అంత్యకాలం లో భాష పై అయిష్టత కలగటం ,సహజమని అందు వలన జానపద కళలు సాహిత్యం అంతరిస్తాయని కనుక సాహిత్యరంగ పునరుజ్జీవన విషయం గా కలిసికట్టుగా పని చేసి భాషను రక్షించు కోవాలని కోరారు .
శ్రీ కందిమళ్ళ సాంబశివరావు ప్రస్తుతం భాష ప్రమాదం పడగ వణికిపోతూ ఉందని కనుక గొప్ప చైతన్యం వస్తే తప్ప ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేమని ,అణగారిన వారి గుండె చప్పుళ్ళను అన్ని ప్రక్రియలలో వినిపించాలని ,300మాండలీక నాటకాలున్నాయని ,వీటి నిఘంటువు,చరిత్ర పద్యనాటక చరిత్ర తయారు చేయాలని ,సెకండరి స్థాయిలో నాటకాలను ప్రోత్సహించాలని చెప్పారు .శ్రీ పివి ఎన్ కృష్ణ –యువతకు దూరమైన పద్యనాటకాన్ని చేరువ చేసే ప్రయత్నం తీవ్రంగా జరగాలని ,నటనలో భావ వ్యక్తీకరణ జరిగి ఉత్సుకత పెరుగుతుందని ,చదివి౦చక పోవటం, నేర్పించకపోవటం మన తప్పేనని ,పద్యనాటకం సంస్కృతిని నేర్పుతుందని ,’’మణి ప్రావాళభాష’’లో రాయటం తప్పేమీకాదని అన్నారు .శ్రీ స్వతంత్ర భారతి రమేష్ –భాష సంస్కృతీ పెద్ద ఉప్పెనలో చిక్కుకున్నాయని రక్షించుకొనే బాధ్యత మనదే నని ,ఆర్తిగా అందిస్తే యువత తేలికగా అ౦దుకొంటు౦దని ఇది తన అనుభవమని ,మనదైనదాన్ని యువతకు అందించే బాధ్యత మనందరిదీ అని తన అనుభవసారాన్ని తెలియ జేశారు .
శ్రీ జివి పూర్ణచంద్ –‘’అమూర్తి మంతాలకు ‘’తెలుగు ఉండదు అనీ ,భాష జీవితం లోంచే వస్తుంది ,ఋగ్వేదం లోని 350పదాలు ద్రావిడ లేక ముండా భాషలనుంచి చేరి ఉంటాయని ,ముఖ్యంగా తెలుగుపదాలెన్నో సంస్కృతం లో చేరాయని ,తెలుగు ఇతరభాషలనుంచి పదాలు తీసుకోవటమే కాదు ఇతరభాషలకు పదాలు అందించి ‘’ఆదాన ప్రదానాలతో’’ వర్ధిల్లిందని ,భాషను పెంచుకొని సుసంపన్నం చేసుకోవాలని తెలిపారు .శ్రీ స్వర వీణాపాణి ‘’ప్రాధమిక అవసరం అనేది భాష ,తెలుగు వాడు ఏ భాషనైనా యిట్టె నేరుస్తాడని పరిశోధనలు రుజువు చేశాయన్నారు .
కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకొందాం –కమ్యూనిస్ట్ నేత నారాయణ ‘’మాతృభాషలో విద్యాబోధన అమలయ్యేదాకా పోరాటం చేయాలి .భాషను ఆధునీకరణ సులభతరం చేయాలి ‘’అన్నారు ఎం ఎల్సి రామకృష్ణ ‘’ఆంగ్లమాధ్యమానికి వంతపాడుతున్న నేతలు ఏనాడైనా తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు విన్నారా ఢిల్లీ లో జరిగిన మేదావులసదస్సు ప్రాధమిక విద్యాబోధన మాతృబాషలోనే జరగాలని తీర్మానించిన విషయం వీరికి తెలుసా .ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం .నియామకాల్లో ప్రతిభకు చోటు లేకపోవటం పెద్ద లోపం .ఉపకులపతుల నియామకానికీ ఇదే కొలతబద్ద ఐతే భాష ఎలా కాపాడబడుతుందని ఆవేదన చెందారు .ఎం.ఎల్.సి మాధవ్ ‘’శాసనమండలిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలుగు తెలుగువాళ్ళకు గా ఉపయోగం ఉందా అని ప్రశ్నించటం దారుణ .సి ఏం పై ‘’భరత్ అనే నేను ‘’సినిమా ప్రభావం పడిందేమో అనిపిస్తోండి శ్రీలంకలో అక్కడున్న తమిళులపై సింహళీ భాష రుద్దే ప్రయత్నం చేస్తే తీవ్ర పోరాటం చేసి ఆపించేసారు అక్కడి ప్రధాని తమిళుల భాషాభిమానానికి చేయెత్తి నమస్కరించాడు .భాషకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే ఓటు వేస్తాం అని ప్రజలు గట్టిగా నిలబడితే ఈప్రమాదం తప్పిపోతుంది .శ్రీ అశోక్ బాబు ‘’తెలంగాణ ఉద్యమాన్ని సాహిత్యమే ముందుండి నడిపించింది. ఇక్కడా ఆ పరిస్థితి రావాలి ‘’అన్నారు .
‘’ఆయాఉ౦ది కదా అని అమ్మను చంపేద్దామా ప్రభుత్వ ఉత్తర్వు 25నంబర్ జి వో రద్దు అయ్యేవరకు మడమ త్రిప్పద్దు ‘’అన్నారు ఆవేశంగా శ్రీ తులసి రెడ్డి .కేంద్ర సాహిత్యఅకాడెమీ కార్యదర్శిశ్రీ కే శ్రీనివాసరావు ‘’ఎన్నిభాషలు నేర్చినా ,హృదయస్పందనకలిగించేది మాతృభాషమాత్రమే .మనకొచ్చే కలలు మన మాతృభాషలోనే వస్తాయి .ఇదంతా సహజ సిద్ధం ‘’అన్నారు .’’ప్రవాసాంధ్రులకే తెలుగు మీద మక్కువ ఎక్కువగా ఉంటె ,ఇక్కడ తెలుగుపై ఈ సమ్మెట పోటేమిటి ‘’అని బాధపడ్డారు తానా మాజీ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ .’’ప్రాధమిక విద్య తెలుగులో ఉంటె సున్నిత భావాలు అర్ధం చేసుకోవచ్చు .అమెరికాలో ఉన్నా మేము ఒకరినొకరం ‘’ఒరే,అరే’’అని కమ్మని తెలుగులో పలకరించుకొంటాం ‘’అన్నారు అమెరికా ప్రతినిధి డా ఆళ్ళ శ్రీనివాస రెడ్డి .’’కన్నడ లిపి తెలుగు లిపికి దగ్గర .11వ శతాబ్దం వరకు రెండూ కలిసే ఉన్నాయి ‘’అన్నారు తెలుగు కన్నడ ‘’అద్వితీయ ‘’భాషా వేత్త ‘’శ్రీ నాగ శేషు .మారిషస్ తెలుగు వెలుగు శ్రీ సంజీవ నరసింహ అప్పుడు ‘’కోటి జన్మల పుణ్యం చేస్తేనే తెలుగు దేశం లో పుట్టగలం .మారిషస్ లో ఉన్నా, మా మనసంతా తెలుగు నేలమీదే .అక్కడ మన తెలుగు పండగలన్నీ ఘనం గా చేసుకొంటాం. మారిషస్ లో ప్రాధమిక స్థాయినుంచి విశ్వ విద్యాలయ స్థాయివరకు అన్ని కోర్సుల్లో తెలుగు భాష ఉండేట్లు చేశాం. అక్కడ అధికారభాష ‘’ఫ్రెంచ్ .మాతృభాష’’ క్రియెల్’’.మరో 8భాషలుకూడా అక్కడున్నాయి. అన్ని భాషలలో బోధనా జరగటం అక్కడి ప్రత్యేకత .’’తెలుగు భాషకు బోధనాధికారి ‘’గా నేను పని చేస్తూ ఉండటం నా అదృష్టం ‘’అన్నారు అత్యంత వినయం తో .ఈయన ఇప్పటికి 50సార్లు ఆంద్ర దేశం వచ్చారు . విమానం దిగగానే తెలుగు నేలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వచ్చిన ప్రతిసారీ అన్ని పుణ్యక్షేత్ర సందర్శన చేసి అక్కడి పవిత్ర మృత్తికను మట్టిని సేకరించి మారిషస్ తీసుకు వెడతారు.
ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం అధ్యక్షులు శ్రీ ముని రత్నం నాయుడు ‘’ఇతర రాష్ట్రాలలో తెలుగు పాఠశాలలో తెలుగు పుస్తకాల కొరత ఎక్కువగా ఉంది .రాష్ట్రప్రభుత్వాలు శీతకన్ను వేస్తూసహకరి౦చట౦ లేదు అందుకని ‘’ప్రపంచ తెలుగు నిధి ‘’ని మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసి తెలుగు పుస్తకాల కోరతనూ తీర్చాలి ‘’అని కోరారు .’’ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ బోధించే సత్తా ఉపాధ్యాయులకు ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచించాలి ‘’అన్నారు రేడియో స్టేషన్ మాజీ సంచాలకులు శ్రీమతి ముజు లూరి కృష్ణకుమారి .తమిళనాడు వాసి ,ఆచార్య తిరుమల రామ చంద్ర కుమార్తె అచ్చమైన తెలుగు పేరున్న చెన్నైలో స్థిరపడి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన శ్రీమతిఆముక్తమాల్యద ‘’తెలుగు వారిలో రాత పటిమ పెంచుతున్నాను తెలుగు అక్షరాలూ నేర్పి ,తెలుగుపైఆసక్తి ఉన్నవారికి వారాంతపు తరగతులు ,వేసవిలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాను .ఈ పని నాకు మహదానందం కలిగిస్తోంది .వివిధశిబిరాలలో 300మందిదాకా నా దగ్గర తెలుగుపదాలు నేర్చుకొన్నారు ‘’అని గర్వంగా తన మాతృభాషా సేవను తెలియ జేశారు .
ఇలా అందరూ తెలుగు ప్రాధిక స్థాయి నుండి అమలవ్వాలని ముక్తకంఠంగా నినదిస్తే ,మనం మనకర్తవ్యాన్ని మరచి పోకూడదని విన్నవిస్తున్నాను .చివరగా మహాసభల తీర్మానాల్లో ముఖ్యమైనవి తెలియ జేస్తున్నాను .1-జాతీయత ,మానవ సంబంధాలు కుటుంబ బందాలు బలపర్చుకోవటానికి దోహద పడే విద్యలోప్రాధమిక స్థాయినుంచి తెలుగు మాధ్యమాన్ని ప్రభుత్వం తప్పక అమలు చేయాలి 2-తెలుగు భాష మనుగడకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా ప్రపంచతెలుగు వారు ,రచయితలూ ,మేధావులు వెంటనే స్పందించాలి 3-ఇతరరాస్ట్రాల, దేశాల లోని తెలుగు వారికి ‘’సర్టిఫికేట్ కోర్సులు ‘’నిర్వహించాలి 4-తెలుగు ‘’ప్రపంచ తెలుగు ‘’గా తీర్చిదిద్దటానికి సాంకేతక ,భాషా వేత్తలు ప్రభుత్వాలు ,ప్రజలు కృషి చేయాలి 5-న్యాయస్థానాలలో తెలుగు అమలుకున్న అవరోధాలను తొలగించే ప్రయత్నం జరగాలి .
ముక్తాయింపు –ఆహ్వానపత్రికలో చాలామంది పెద్దల పేర్లున్నా, వారిలో ఎక్కువమంది రానందుకు బాధగా ఉంది .
రేపు 2020 ఆంగ్లనూతన సంవత్సర ప్రవేశ వేళ శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-19-ఉయ్యూరు