‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2
సాంకేతిక ప్రతినిధుల సదస్సు
28-12-19 శనివారం ఉదయం 9 సురవరం వారి వేదికపై సాంకేతిక ప్రతినిధుల సదస్సు నేను సమన్వయకర్తగాఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షులు గా ,డా పాలెపు సుబ్బారావు అతిధిగా జరిగింది .శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి బావగారు డా రాచకొండ నరసింహశార్మగారు .సెప్టెంబర్ లో95 వ ఏట రాసి, ప్రచురించిన ‘’మైదానం లో సూర్యోదయం ‘’కవితా సంపుటి నా ఆధ్వర్యం లో బెజవాడలో ఆవిష్కరణ జరగాలని కాంక్షించి విశాఖ నుండి శ్రీ గౌరినాయుడు ద్వారా పుస్తకాలు పంపారు .ఇవి ఆంగ్లకవుల కవితలకు శర్మగారి కమ్మని అనువాదం .ఇలాంటి అనువాదాలు వారు చాలా చేసి ప్రచురించారు . ప్రముఖ ఆంగ్లకవి రాబర్ట్ బ్రౌనింగ్ సతీమణి ,సానెట్ కవిత్వం లో మేటి, ఎలిజబెత్ బ్రౌనింగ్ సానేట్స్ కు అర్ధవంతమైన అనువాదం చేసి ముద్రించిన అనుభవం వారిది .తెలుగు ఇంగ్లీష్ సాహిత్యాలలో లోతైన అవగాహన ఉన్నవారే కాక ప్రముఖ నవలా, కథారచయిత శ్రీ రావి శాస్త్రి గారి తమ్ముడు కూడా . ఈ’’మైదానం లోసూర్యోదయం ‘’కవితా సంపుటిని గారపాటి వారి చేఆవిష్కరణ చేయించి శర్మగారికి మహదానందం చేకూర్చాము .
తర్వాత గారపాటి వారు మాట్లాడుతూ ఆధునికంగా ‘’అలెక్స్ ‘’వంటి పరికరాలు సమాచారం ఇవ్వటమేకాక ,మనతో సంభాషిస్తాయి ఇదొక విప్లవం .మనం మాట్లాడుతుంటే స్క్రిప్ట్ రాసే సౌకర్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది .వీటిని యువత బాగా అందుకొంటున్నారు వాటిపై పరిశోధనలూ బాగా జరుగుతున్నాయి .ఫేస్ బుక్, వాట్సాప్ లలో రాసేది శాశ్వతం కాదు .వాటిలో రాసినవాటిని బ్లాగ్ లోనో వీకీ పీడియాలోనో పోస్ట్ చేస్తే శాశ్వత గా ఉండిపోతాయి .వీటిపై విశ్లేషణకు వీలౌతుంది. ఎప్పుడుకావాలంటే అప్పుడు వాటిని మనం పొందచ్చు .ఏది రాసినా గూగుల్ లో వెతికేట్లు రాయాలి .స్వంత గొంతుతో ఆడియోలు తయారు చేసుకొని భద్రపరచండి బ్లాగుల్లో .వీడియోలు తీసి స్వంత చానల్ ఏర్పాటు చేసుకోండి .ఏది రాసినా నవతరం మాధ్యమం లో రాయాలి ,I.S.C.I.’’తో అద్భుతాలు జరుగుతున్నాయి ,ప్రామాణికత ఏర్పడింది ,యునికోడ్ లో భారతీయ భాషలు చేరాయి .ఇందులో తేలికగాతెలుగు ఇమిడి ముందున్నది .’’నేడు భాష లిపిని దాటి పోయింది ‘’యంత్రానువాదం ఆటోమాటిక్ గా భాషను మార్చే సౌలభ్యం ఏర్పడింది అని ‘’భాష మనిషిని మానవునిగా మార్చింది ‘’అన్నిభాషల మాతృక ఒక్కటే .లిపి కనబడితేనే భాష అవుతుంది అని మర్చిపోరాదు .కృత్రిమ బుద్ధి లేకుండా అనువాదం సాధ్యం కాదు .అన్నిటికీ మాతృభాష ముఖ్యం దాన్ని అందరం కలిసి కాపాడుకోవాలి ‘’అని హితవు చెప్పారు .
డా పాలెపు ‘’తాళపత్ర గ్రంధాలలో విలువైన ,సమాజానికి మేలు చేసే ఆరోగ్యానికి సంబంధింన సమాచారం చాలా ఉందని వాటిని శోధించి, సేకరించి నిలువ చేసుకోవాలని కోరారు ..శ్రీ పవన్ సంతోష్ ‘’వీకీ పీడియా ,’’తెలుగు కోరా ‘’లలో నిరంతరం రాయాలి .అప్పుడే అవి శాశ్వతాలౌతాయి .రిఫరెన్స్ కు వీలుకలుగుతు౦దన్నారు .చెన్నైకి చెందిన’’దా సుభాషితం ‘’సంస్థ కు చెందిన శ్రీ కిరణ్ కుమార్ ‘’తెలుగు మనుగడకు మా సంస్థ విపరీతంగా కృషి చేస్తోంది .నేర్చేవారు నేర్పేవారూ ఉంటేనే భాష జీవిస్తుంది .ప్రతి ఏడాది బ్రౌన్ పోటీలు నిర్వహించి బహుమతులిస్తాం .దాసుభాషితం ‘’మొబైల్ ఆప్’’ తో సాంకేతిక విప్లవం తెచ్చింది .’’think digital first ‘’అనేది నేటి నినాదం .మనపాఠకులు మనకంటే ముందున్నారు అని గుర్తుంచుకోండి .కనుక వారికోసం రాయాలి .మాట్లాడే గ్రంథాలు కూడా తెచ్చింది దాసుభాషితం ‘’అని వివరించారు .
శ్రీ జే సీతాపతిరావు ‘’ఇంజనీరింగ్ విద్య ను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం .దీనికి ట్రిపుల్ ఐ టి ఐ లు బాగా కృషిచేస్తున్నాయి .’’భావాన్ని తరంగం మార్చే ప్రయత్నం’’ విస్తృతంగా జరుగుతోంది .మాకు కావలసిన సాంకేతిక విజ్ఞానాన్ని అందిస్తే దూసుకుపోతాం ‘’అన్నారు .మైసూర్ ను౦చి వచ్చిన డా బి నాగశేషుమాట్లాడుతూ బహుజన స్త్రీకవులు తెలుగులో రావటం లేదని ,కన్నడం లో బాగా రాస్తున్నారని,మొల్లమాంబ తర్వాత తెలుగులో ఎందుకు బహుజన స్త్రీలు కవులుగా రాలేదో అన్నదానిపై పరిశోధన జరగాలని ,కన్నడ తెలుగు కవయిత్రులపై తులనాత్మక పరిశోధన జరగాలని తెలుగులో 16వ శతాబ్దినుఛి మాత్రమే బహుజన రచయిత్రులు విస్తృతంగా రాస్తున్నారని ఆమధ్యకాలం లో ఎందుకు రాయలేదన్నదానిపై పరిశోధన చేసి వెలుగు లోకి తేవాలని ,ఇవాళ తమిళనాడు లో తెలుగు ప్రాంతాలలో తెలుగులోనే ఎన్నికల ప్రచారం చేయటం హర్షించదగిన పరిణామమని చెప్పారు .శ్రీరహ్మనుద్దీన్ ‘’అత్యాధునికంగా వచ్చిన ‘’స్పీచ్ టు టెక్స్ట్ ‘’అందరూ వాడుతూ ప్రయోజనం పొందుతున్నారని ,వాయిస్ టైపింగ్ లో భాషను సెలెక్ట్ చేసుకొంటే దాని పని అది చేసుకు పోవటం ఎంతో సాంకేతికాభి వృద్ధి అనీ , యుని కోడ్ అందరికీ అందుబాటులో ఉంటె ప్రింటర్స్ మాత్రం వాళ్ళవాళ్ళ ఫాంట్ లు వాడుతున్నారని ,వాళ్ళు తప్పకుండా యునికోడ్ లోనే ప్రింట్ చేయటానికి ప్రభుత్వం రచయితలూ ఒత్తిడి తేవాలని కోరారు ఈఅధునాతనకాల౦ లో అందరూ విస్తృతంగా రాయటమే చాలావసరమని క్లిష్టమైన పదాలుసులభంగా రాయటానికి రాస్తూ ఉండటమే ముఖ్యమని ‘’ఆర్టి ఫిషియల్ ఇంటలిజెన్స్’’ ను అందుబాటులోకి తేవాలని బొమ్మలు, ఆడియోలు బాగారావాలని ,అంతర్జాలం లో తెలుగు మాధ్యమంగా అందరూ రాసి భాషను ముందుకు తీసుకు వెళ్లాలని హితవు చెప్పారు .
మాకిచ్చిన 2గంటల సమయం లో సదస్సుఉదయం 11కు పూర్తి చేసి ,ఒకరకంగా సదస్సులన్నిటికీ మార్గదర్శకంగా ఆదర్శప్రాయంగా నిర్వహించామని సంతోషంగా చెబుతున్నాను .ఇప్పటికి జరిగిన 4ప్రపంచ సభలలో ‘’సాంకేతిక సదస్సు ‘’లు మాత్రమె అర్ధ వంతంగా జరగటం దిశా నిర్దేశం చేయటం జరిగిందని గర్వంగా తెలియజేస్తున్నాను.నాకు సాహిత్యం తోపాటు సాంకేతికత పైనా అభి రుచి ఉ౦ది కనుక ఈ రెండూ కలిసిన ఈ సదస్సు నిర్వహించే బాధ్యతనాకు అప్పగించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను .
సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు ఇదే వేదికపై ‘’కవి సంధ్య ‘’ నిర్వాహకులుఆచార్య శిఖామణి అధ్యక్షతన జరిగింది .సాహిత్య సంస్థ సాహిత్యానికి ఆస్వాదించేవారికి ఉన్న ఒకవాహిక .’’తెలుగు భాషకు మరణశాసనం రాసిన’’ ఈ నాటి ప్రత్యెక పరిస్థితి లో సృజన ప్రోత్సహించి బంగారు పళ్ళానికి గోడ చేర్పుగా సంస్థలు ఉంటూ ,ఈ సభలయ్యాక తమప్రాంతాలలో సమావేశాలు జరిపి ఇక్కడి భావప్రసారం చేయాలని శిఖామణి కోరారు .యువభారతి నిర్వాహకులు .ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ రాష్ట్రం లో ఉన్న సాహిత్య సంస్థల లిస్టు ప్రతి సంస్థదగ్గరా ఉండాలి ,సంస్థలను ఎవరికి వారే రక్షించుకోవాలి ,ఆంగ్లమాధ్యమం వలన పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో మేధావులు విశ్లేషించి చెప్పాలి ,సమస్యను పరిష్కరించే మేధస్సు కావాలని ‘’పుడితే ఉయ్యాల –పోతే మొయ్యాల ‘’–ఉంటేఇయ్యాల ‘’అన్నసామెత గుర్తుంచుకోవాలని ,’’తెలుగు సేన ‘’ఏర్పడి పని చేయాలని సంస్థలన్నీ ఐక్యంగా పని చేయాలని చెప్పారు .శ్రీ విద్యా నాగభూషణం ‘’మన అభిప్రాయాలు సూటిగా జగన్ విన్నపంగా ఇవ్వాలి. రెండవరాంక్ లో ఉన్నతెలుగు నాలుగవ రాంక్ కు పడిపోయింది .తెలుగు మాట్లాడే వారి స౦ఖ్య పెంచి మళ్ళీ 2వ రాంక్ సాధించాలని కోరారు .శ్రీ సుందరేశ్వరరావు ‘’రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ‘’ను బలపర్చమని సాహిత్య విలువలు పెంచమని చెప్పారు
ఇదే వేదికపై మధ్యాహ్నం జరిగిన ‘’చరిత్ర పరిశోధన ప్రతినిధుల సదస్సు ‘’కు ఆచార్య ఈమని శివనాగిరెడ్డిగారు అధ్యక్షత వహించి ‘’శాసనాలే శ్వాస నాళాలుగా శాసన పరిశోధన జరగాలని ‘’గొప్ప అభిప్రాయాన్ని అలవోకగా మాట్లేడే తమ గంగాప్రవాహ సదృశ వాగ్దోరణితో చెప్పారు .రెడ్డిగారి రచన ‘’పంచ శిల్పుల చరిత్ర ‘’ను గోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు శ్రీ రాము సూర్యారావు ఆవిష్కరించారు ‘’తలిదండ్రులు లేని అనాధ పిల్లలుంటే నాదగ్గరకు పంపండి .ఉద్యోగం వచ్చేదాకా వారిని మాదగ్గర ఉంచుకొని ఉచితంగా చదివిస్తాను .నిరుద్యోగులు వచ్చినా ఉద్యోగం వచ్చేదాకా పోషిస్తాను అని తన సెల్ నంబర్’’9848620051’’ తో సంప్రదించమని చెప్పిన గొప్పవితరణ శీలి మటల్లోకాక చేతల్లో సేవ చూపిస్తున్న ఆదర్శ ఎం ఎల్ సి శ్రీ సూర్యారావు అభినందనీయులు.ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా ..
ముఖ్య అతిధి డా.రాపాక ఏకా౦బరేశ్వరాచార్యులు మెకంజీ నుంచి నేటిదాకా జరిగిన పరిశోధనలు వివరించారు –‘’మెకంజీ సేవ చాలా విశేషమైనది .గ్రామచరిత్రాలు ,కవిలెలు సేకరించి కైఫీయత్తులు రాసి రికార్డ్ చేసిన మహానుభావుడు .ఆ సేకరణలు మూడు భాగాలుగా భార్య తీసుకువచ్చి మద్రాస్ ఇంగ్లాండ్, మ్యూజియం లలో భద్రపరచినది. కావలి బొర్రయ్య కన్నడంలోని రెండు రకాల భాషలపై పరిశోధించాడు .చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర రాస్తే ,కొమర్రాజు భారత దేశ ,శివాజిచరిత్ర రాశాడు .యుద్ధమల్లుని బెజవాడ శాసనం కిందినుంచి పైకి చదివి ప్రచురించాడు .బెంగాల్ లో ఉన్న ‘’విశ్వ కోష్ ‘’లాగా తెలుగు విజ్ఞాన సర్వస్వం తెచ్చే కృషిలో కొన్ని భాగాలు తెచ్చాడు .మల్లంపల్లి సోమశేఖరశర్మ జీవితమంతా శాసనాలతోగడిపి ‘’శాసన శర్మ ‘’అయ్యాడు .నేలటూరి వెంకటరమణయ్య ‘’పరిశోధన రాక్షసుడు ‘’మారేమండ రామారావు కాకతీయ చరిత్ర ,రాశాడు .భావరాజు వెంకటకృష్ణారావు రాజమండ్రిలో’’తెలుగు హిస్టారికల్ సొసైటీ ‘’స్థాపించి మహోపకారం చేశాడు .’’ఎర్లి డైనాస్టీస్ ఆఫ్ ఆంద్ర ‘’,తూర్పు చాళుక్య చరిత్ర రాశాడు.రాజరాజ నరేంద్ర సంచిక తెచ్చాడు .ఈకృషికి బిఎ చదువుతుండగానే ఏం ఏ డిగ్రీ ప్రదానం చేశారు .కోరాడ పరబ్రహ్మ శాస్త్రి పరిశోదనా గొప్పదే .గుర్తి వెంకటరావు శాతవాహన చరిత్ర ,ఓరుగంటి రామచంద్రయ్య ‘’ స్టడీస్ ఆన్ విజయనగర ,స్టడీస్ ఆన్ కృష్ణరాయ రాశాడు .ఆర్ సుబ్రహ్మణ్యం త్రవ్వకాలపై గ్రంథం తెచ్చాడు ,శ్రీమతి ప్రతిభ చెన్నయ్యరుద్రమదేవిపై ,సి సోమసున్దరరావు ‘’గౌతమీపుత్ర శాతకర్ణి ‘’పై రాశారు . చరిత్ర మర్చి పోరాదు .’’గతాన్ని వర్తమానం తో అను సంధించేదే చరిత్ర’’అని నిర్వచనం చెబుతూ టకటకా మాట్లాడి ముగించారు .
శ్రీ డి. సూర్యకుమార్ ‘’రుద్రమ దేవి స్త్రీలకూ ప్రసూతి ఆస్పత్రి కట్టించిన మొట్టమొదటి పాలకురాలని ఈవిషయం నకిరేకల్ శాశనం చెబుతోందని ,రాజులు అక్షయ తృతీయనాడు విరివిగా దానాలు చేసి శాసనాలు వేశారని, ఆనాడు బంగారు కొని దాచుకోలేదని భూమికొని దానాలు చేసేవారని ,’’పెళ్ళికొడుకు మలిదేవరాజు ‘’అనే కాకతీయ యాదవరాజు న్నాడని’’ పెళ్లి కొడుకు’’ అనేది ఇంటి పేరు అని ,కోటగిరి శాసనం లో కాకతీయులకు చెందిన విరియాలవారి వంశ చరిత్ర బయటపడిందని ,శాసన విషయాలను తేలికభాషలో ఉపవాచాకాలుగా తీసుకు రావాలని ‘’కొత్తవిషయాలు బహిర్గతం చేసి చరిత మలుపు తిప్పారు సూర్యకుమార్ .
పూర్ణచంద్ గారు,నాతో రాజేష్ తో ‘’వేదికపైకి కరపత్రం లో లేనివారిని ఎవరినీ అనుమతించవద్దు ,ఎవరికీ ప్రత్యేకంగా శాలువాలు పూలహారాలు వేయించవద్దు .ఇది చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలి ‘’ అని వార్నింగ్ ఇచ్చినా ‘’రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధ్యక్షులు ‘’రెడ్డి గారు ‘’తలచుకొంటే రూల్స్ గీల్స్ జాన్తానై అయి పోయి అరడజను మంది ఆయనకు శాలువాలుకప్పి దండలు వేసి ఫోటోలు తీసుకొని వేదికను’’ కబ్జా’’ చేస్తే ఏమీ అనలేక గొణుక్కుంటూ ప్రేక్షక పాత్ర వహిచి ఊరుకోన్నాం .ఒక్కగంటమాత్రమే చారిత్రిక సదస్సుకు సమయమిస్తే రెండున్నర గంటలు ‘’వాయించిన ఘనత’’ కూడా ఈసభకు దక్కింది తిలాపాపం తలాపిడికెడు అన్నట్లు పూర్ణచంద్, ఎంవి ఆర్ శాస్త్రి గార్లు కూడా చివర్లో వచ్చి సభను ‘’లా —గించారు ‘’.అంటే ‘’చెప్పటం వేరు ఆచరణ వేరు ‘’అనటానికి ఈ సదస్సు చక్కని ఉదాహరణ అని చెప్పటానికి సిగ్గు పడుతున్నాను .
మరికొన్ని సదస్సుల సమాచారాలు తర్వాత తెలియ జేస్తాను
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-19-ఉయ్యూరు