దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు –
త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు
1-శ్యామ శాస్త్రి (1763-1827)
‘’నాదోపాసన చే శంకర ,నారాయణ విధులు వెలసిరి ‘’అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు ముగ్గురు వాగ్గేయకారులు త్రిమూర్తులుగా గానమే ముక్తిమార్గంగా తెలియ జేసినవారు శ్రీ త్యాగరాజు, శ్రీ శ్యామ శాస్త్రి, శ్రీ ముత్తుస్వామి దీక్షితులుగార్లు ఒకే చోట తిరువయ్యార్ లో జన్మించటం విశేషం .ఈ కాలం లోనే జర్మనీలో సంగీతజ్ఞులు బీథోవెన్,మొజార్ట్ లు కూడా జన్మించారు .అందుకే 1750-1850 కాలం ప్రపంచానికి ‘’సంగీతానికి స్వర్ణయుగం ‘’
శ్రీనగరం అనబడే తిరువయ్యార్ లో గౌతమస గోత్రం లో బోధాయనసూత్రానికిచెందిన వడమ బ్రాహ్మణ కుటుంబం లో 1763లో శ్యామ శాస్త్రి జన్మించాడు .తండ్రి విశ్వనాథయ్యర్ .వీరిది పూర్వ ఆంద్ర దేశం లోని కంభం జిల్లా .అసలు పేరు సుబ్రహ్మణ్యం .’’శ్యామకృష్ణ ‘’ముద్దు పేరు .బ్రహ్మ ఒకప్పుడు కంచిలో తపస్సు చేస్తుంటే శ్రీ దేవి దివ్య జ్యోతి చే కళ్ళకు అవరోధమయింది .దీన్ని ధృవ పరచటానికి బంగారుకామాక్షి విగ్రహం చేయించి దేవాలయం లో ప్రతిస్టించాడు .ఆది శంకరాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయంలో పూజా పునస్కారాలు లేకపాడు పడి ఉండటం చూసి,సంప్రోక్షణ చేయించి ,నిత్యపూజాదికాలు చేయటానికి స్మార్తబ్రాహ్మణులను నియమిప జేశారు .అలా శ్యామశాస్త్రి వంశీకులు పూజారులయ్యారు .1565లో తురకలదాడికి తాళలేక ‘’జింజి ‘’కి పోయి ,1594లో అనేక బాధలు పడుతూ ఉదయార్పాలెం ,నాగూరు మొదలైన గ్రామాలు దాటి తిరువాడి చేరారు ..శ్యామశాస్త్రి తండ్రి తులజాజి రాజు రక్షణకోరగా తంజావూర్ లో ఆశ్రయమిచ్చాడు .అప్పటినుంచి అక్కడే శ్యామశాస్త్రి మరణం వరకు స్థిరపడ్డారు .శాస్త్రి మరణం తర్వాత వంశీకులు అక్కడే ఉంటూ స్వర్ణ కామాక్షి విగ్రహాన్ని కాపాడుతూ ఉన్నారు .
చిన్నతనం లోనే శ్యామశాస్త్రి సంస్కృత తెలుగు ద్రావిడ భాషలు నేర్చాడు .శ్రీవిద్య ను సంగీతస్వామి అనే యతీశ్వరుని చే ఉపదేశం పొంది ,పచ్చిమిరియం ఆదెప్ప ,వీరభద్రయ్యలవద్ద ప్రౌఢ గాన రీతులు నేర్చి ,శ్రీ కామాక్షీ ప్రసాదంగా అనేక కీర్తనలు ,స్వరజతులు ‘’శ్యామ కృష్ణ ‘’ముద్రతో రచించి కీర్తి పొందాడు ఆదెప్పయ్య ‘’కామాక్షీ ‘’అని గౌరవంగా శ్యామ శాస్త్రి ని పిలిచేవాడు .తండ్రి అర్చకత్వం లభించి దేవమాన్యాలతో కుటుంబ పోషణ జరిగేది .
శ్యామశాస్త్రి కృతుల విశిష్టత –కాలం రీతులు ,కదళీపాకం లాంటి రాగ శయ్య ,క్లిష్ట తాళగతులతో ‘’అతీత అనాగత గ్రహాలతో ‘’కలిసి పాడటానికి కొంచెం కష్టమని పించేవి .స్వర సాహిత్య ప్రకర్ష ఉండటం చేతే అందులో నిష్ణాతులు మాత్రమెజనరంజకంగా పాడగలిగేట్లు ఉండేవి .అందుకే ‘’తాళప్రస్తార శ్యామయ్య ‘’అన్నారాయనను .దేవీ భక్తి పొంగిపోరలుతాయి కీర్తనలలో .రాసిన 300కీర్తనలు ఇప్పుడు ప్రచారం లో లేవు .మీనాక్షీ నవరత్నాలు ,ధర్మ సంవర్ధిని ,కామాక్షి, బృహన్నాయకి పై రాసిన కీర్తనలు బాగా ప్రచారమయ్యాయి.ఇవి ఆంద్ర గీర్వాణ తమిళభాషలలో మనోహరంగా మధురంగా ఉంటాయి .అఖండ మనశ్శాంతి ఆత్మ సంతృప్తినిస్తాయి .
త్యాగారాజకీర్తనలలో మానసిక వ్యధ సంసారబాధలు ఉంటె, శ్యామశాస్త్రి రచనలలో బిడ్డ ఆర్తి తల్లికి చెబుతున్నట్లు ఉంటాయి .ఈయన ఆనంద భైరవి కీర్తనలు ప్రత్యేకం .మాంజి ,కలగడ ,చింతామణి అనే అపూర్వరాగాలలో కూడా రాశాడు .’’చాపు తాళం ‘’పై అభిమానం జాస్తి .తాళవర్ణాలు ,స్వరజతులు విద్యార్ధులకు బాగా ఉపయోగకరంగా రాశాడు .త్యాగరాజ ,దీక్షితార్ లతో తరచూ కలసి మాట్లాడేవాడు .దీక్షితులకు ‘’పాదుకాంత దీక్ష ‘’ఇచ్చాడు .ఊరు దాటి యాత్ర అనేది చేయనే లేదు .కొడుకు సుబ్రాయ శాస్త్రి త్యాగయ్యగారి శిష్యుడు .నిగ్రహానుగ్రహ శక్తులున్నమహా దేవీ భక్తుడు .ఒకకోమటి ‘’అర్చకుడు ‘’అని హేళన చేస్తే శాపగ్రస్తుడై చచ్చాడు .తనమరణం ఇంకా అయిదు రోజులున్నదని ముందే చెప్పి1827వ్యయసంవత్సర మకర మాస శుక్ల దశమి నాడు గానజ్యోతి వెలిగించి దేహం చాలించిన దేవీ భక్తుడు శ్యామశాస్త్రి64వ ఏట శ్రీ దేవిలో ఐక్యమయ్యాడు .
శ్యామ శాస్త్రి చింతామణి రాగం లో ‘’దేవీ బ్రోవ సమయమిదే ‘’కృతి రచించి దేవి ఆశీస్సు పొంది బొబ్బిలి కేశవయ్య అనే విద్వాంసుని ,నాగపట్నం లో అప్పుకుట్టి ని ఓడించాడు .
1926లో మైసూర్ రాజా ఆహ్వానించి సత్కరిస్తానంటే వద్దన్నాడు .జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడు కూడా .
వారసులు –పంజు శాస్త్రి ,సుబ్రాయ శాస్త్రి కొడుకులు .పంజు దేవాలయం అర్చకుడు .ఇతడి మొదటిభార్యకొడుకులు రామకృష్ణ ,సా౦బశివం ,అన్నాస్వామి .రామకృష్ణ పెద్ద కొడుకు నటేశం పూజారి .ఇతనివద్ద శ్యామశాస్త్రి రాసిన లక్ష్యలక్షణ ప్రతులున్నాయి .వీటిలో తాళప్రస్తారాలు చిత్రాలు ఉన్నాయి .సా౦బశివం బ్రహ్మజ్ఞాని, వేదాంతి .అన్నాస్వామిని సుబ్రాయ శాస్త్రి దత్తత చేసుకొన్నాడు .
అన్నాస్వామి (1827-1900)-అసలుపేరు శ్యామకృష్ణ .తండ్రి వద్ద కావ్య నాటకాలంకారగాన శాస్త్రాలు నేర్చాడు .రచయిత, ఫిడలర్ .’’పాలించుకామాక్షీ ‘’’’పాహి శ్రీ గిరిరాజసుతే ‘’అనే ఆనందభైరవి కీర్తనలకు స్వరసాహిత్యం రాశాడు .72మేళ కర్తల రాగ లక్షణాలు రాశాడు వీణకుప్పయ్యతో కలిసి అపూర్వ పల్లవులకు స్వరకల్పన చేసి ,పాడాడు .
శిష్యులు –మేలకార్ గోవిందన్ ,కామాక్షి .కొడుకు శ్యామశాస్త్రి .చిత్రలేఖకుడు ఫిడలర్ .73ఏళ్ళు జీవించి 1900లో చనిపోయాడు .
శ్యామశాస్త్రి శిష్యులు –
అలసూరి కృష్ణయ్య మైసూర్ ఆస్థాన విద్వాన్ ,పల్లవి ప్రవీణుడు .
దాసరి –నాగస్వర కోవిద ,.ఒకసారి తిరువయ్యార్ స్వామి ఊరేగింపులో శుద్ధ సావేరి రాగాలాపన పల్లవి పాడి ‘’దారి తెలుసుకొంటి ‘’కృతితో ముగించగా త్యాగరాజస్వామి అతని ప్రతిభను మెచ్చి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.
పుదుకోట శేషాచలం – 1741జననం .పుదుకోట సంస్థాన విద్వాన్ .కొడుకు మాతృ భూషయ్య .సోదరుడు రాం దాస్ రామముద్రతో కృతులు రాశాడు .శిష్యులు -స్వరకాడు సుబ్బయ్య .మనవడు గోపాలస్వామి కృతికర్త .
.ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-20-ఉయ్యూరు
—