దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -11
త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -3
2- విద్యా వాచస్పతి ముత్తుస్వామి దీక్షితులు (దీక్షితార్ )(1775-1835)
‘’నాద సముద్ధరణార్ధం సంభవామి యుగే యుగే ‘’అన్నట్లు భగవంతుడు జ్ఞాన త్రిమూర్తుల రూపం లో అవతరించాడు అని చెప్పటానికి త్యాగయ్య ,శ్యామా శాస్త్రి ,దీక్షితార్ గార్లు భూమిపై అవతరించారు .శ్యామ శాస్త్రి లయబ్రహ్మ ,సర్వాంతర్యామి ,అద్వితీయుడు వేలాది రాగాల సృష్టికర్త రాగ స్థితికర్త అయిన త్యాగరాజుగారు విష్ణుమూర్తి . ,లయకర్తా ప్రళయ భయంకరుడు ,నియమాలను పాటించే ఈశ్వర రూపుడు దీక్షితులు .కర్నాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులు వీరు .త్యాగయ్య దీక్షితులు విష్ణు మహేశ్వరులులాగా సదా పూజ్యులు .నాదమూర్తి రెండు నేత్రాలవంటివారు .ప్రాచీన సంప్రదాయ బద్ధులై నాద విద్యను మోక్షసాధనంగా చేసుకొన్న మహా నాదోపాసకులు .
ముత్తుస్వామి దీక్షితులు 1775లో రామస్వామి ,సుబ్బమా౦బలకు జన్మించాడు .సోదరులు బాలాస్వామి ,బాలస్వామికూడా గానకళా ప్రవీణులే అని ముందే చెప్పుకొన్నాం .ముత్తు(ద్దు)స్వామి బాలంబికా వరప్రసాద లబ్ధుడు .తండ్రివద్దె సంగీత సాహిత్యాలు నేర్చాడు .జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడుకూడా .ఏక సంధ గ్రాహి .తండ్రి సృష్టించిన హంసధ్వని రాగంలో ‘’వాతాపిగణపతిం భజే ‘’కీర్తన రాసి తండ్రికి అంకితం చేసి రచనప్రారంభించాడు . ఈకీర్తన వినని వారు లేరు .
మణలి జమీందారు ఆశ్రయం లో ఉన్నప్పుడు శ్రీ విద్యోపాసకుడు చిడంబరనాథ యోగి వచ్చిశ్రీవిద్యా మంత్రోపదేశం చేసి ,తనతో కాశీకి తీసుకువెళ్ళి గానవిద్యలో ప్రవీణుడిని చేశాడు .అక్కడే అంతర్యాగ, బహిర్యాగాలు చేసి ‘’శ్రీ గురుగుహమూర్తి ‘’ఐన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని తిరుత్తనిలో దర్శించి ,ఒక రోజుండగా రాత్రి స్వామి ప్రత్యక్షమై నోట్లో పటికబెల్లం పెట్టి ఆశీర్వదింఛి అదృశ్యమవగా,పులకిత శరీరం తో ధ్యానిస్తే జ్ఞానోదయమై,వెంటనే ‘’శ్రీ గుహో జయతి ‘’అంటూ 20 కీర్తనలు రాశాడు .ఇవి జగత్ప్రసిద్దాలైనాయి .మాలలుగా కీర్తనలు రాయటం లో ప్రసిద్ధుడైనాడు ‘’గురుగుహ ‘’ముద్ర కీర్తనలలో ఉంటుంది .తర్వాత కంచి చేరాడు .అక్కడే శ్రీ విద్యోపాసనలో మంత్రం ద్రస్టలైన త్యాగయ్య ,శ్యామ శాస్త్రి గార్లు ఉపనిషద్ బ్రహ్మాన్ని సేవిస్తున్నారు .త్యాగయ్యగారి రామ అష్టపదులకు రాగ తాల వర్ణన మెట్టులు కూర్చాడు .
కొన్నేళ్ళ తర్వాత తిరువయ్యార్ వచ్చి ,శ్రీ త్యాగేశుని సేవిస్తూ ,నదీ తీరంలో నిత్య సచ్చాస్త్ర పఠనం తో ‘’ప్రాణారామం మన ఆనందం ,శాంతి సంరుద్ధమమృతం’’అన్నట్లు శాంత చిత్తంతోకాలం గడిపాడు .ఇక్కడే త్యాగేశ ,ఆనందేశ ,అచలేశ ,హాటకేశ ,వల్మీకేశ లపై కీర్తనలు రాశాడు .అన్ని శివ ,విష్ణు క్షేత్ర సందర్శనం చేసి ,శ్రీ వేంకటేశ,కాశీ విశ్వేశ,పంచలింగ క్షేత్రాలపై ‘’ప్రబంధాలు ‘’అనబడే పెద్ద కీర్తనలు రచించాడు .నవగ్రహాలపై నవరత్న కీర్తనలు రాశాడు .క్షేత్రయ్య విజయ రాఘవ పంచకం, త్యాగయ్య ఘనరాగ పంచకం ,స్వాతి తిరునాళ్ళ మణి ప్రవాళ కీర్తనలను పోలిన నవగ్రహ ,నవావరణ కీర్తనలు రాశాడు .నవగ్రహ కీర్తనలలో దీక్షితుల జ్యోతిశ్శాస్త్ర పాండిత్యం వ్యక్తమౌతుంది .నీలోత్పలా౦బిక ,మీనాక్షి దేవి లపై కృతులల్లాడు .ఇవి గీర్వాణ భాషలో ఉదాత్త స్తోత్ర వాజ్మయంగా ప్రసిద్ధి చెందాయి .ఈయన మంత్రశాస్త్ర ,యోగ శాస్త్ర వైదుష్యానికివి అద్దం పడుతాయి .
దీక్షితుల సోదరులు చిన్నస్వామి బాలస్వాములు రాజాస్థానాలలో అన్నగారి కీర్తనలు గానం చేసి బహుళప్రచారం చేశారు .మధురకు ఆహ్వాని౦ప బడి అక్కడే ఉండగా తమ్ముడు చిన్నస్వామి చనిపోగా సోదరుని మరణం భరించలేక బాలస్వామి శిష్యుడు హరితోకలిసి రామేశ్వరం తీర్ధయాత్ర చేసి ,ఎట్టియార్పురం రాగా రాజు దీక్షితార్ కృతులు అతని నుంచి విని అతన్ని ఆస్థాన విద్వాంసుని చేసి అక్కడే ఉ౦చేశాడు .ఈ విషయాలన్నీ తెలిసిన దీక్షితులు ‘’సుఖ దుఖే సమౌ కృత్వా ‘’అన్నట్లు మనసుదిట్టపరచుకొన్నా,బాలాస్వామిని చూడాలనే కోరిక మాత్రం పోలేదు .
ఇద్దరు భార్యలతో ,శిష్యుడు తేపూరు సుబ్రహ్మణ్యం తో కలిసి ఆవూరి దేవాలయ అర్చన చేశాడు .అప్పుడు బాలాస్వామి వివాహ విషయం తెలిసి ,ఎట్టియా పురం వెడుతూ దారిలో నీరు లేక పొలాలు ఎండిపోవటం చూసి ‘’ అమృతవర్షిణి ‘’రాగం లో ‘’ఆన౦దామృత కర్షిణి వర్షిణి’’కీర్తనరాసి పాడగా ,ముసురుపట్టి ధారాపాతంగా వర్షాలు కురిసి రైతులు ఎంతో సంతోషించారు .ఎట్టియాపురం దర్బారులో కీర్తనలు పాడగా రాజు ఆనందించి ఆస్థానం లో ఉండిపొమ్మని కోరగా నిర్లిప్తంగా ,తిరువయ్యార్ చేరి మళ్ళీ తన సంగీత పాఠాలు చెప్పటం మొదలుపెట్టాడు .
ఒక సారి కివలూరు లో దైవ దర్శనానికి వెళ్ళగా పూజారులు ఆలయం తలుపులు మూసేశారు .అక్కడే నిలబడి శంకరాభరణ రాగం లో ‘’అక్షయ లింగ విభో ‘’కీర్తన ఆశువుగా పాడగా ఆలయ తలుపులు తెరుచుకొన్నాయి .త్యాగయ్య శామశాస్త్రులపై అమితభక్తి .వారి కీర్తనలు తరచుగా వింటూ ఆన౦ది౦చేవాడు దీక్షితార్ .త్యాగయ్యగారింట జరిగిన శ్రీ రామ పట్టాభిషేకం సందర్భంగా మణిరంగు రాగం లో ‘’ మామవ పట్టాభిరామ ‘’కీర్తన రాశాడు .పుత్రులు లేకపోవటం తో సుబ్బరామ దీక్షితులను దత్తత చేసుకొన్నాడు .
1885లో ఎట్టియాపురం రాజు యువరాజు వివాహానికి రమ్మని ఆహ్వానించగా ,తనకు మరణం ఆసన్నమైందని గ్రహించి ,శిష్యులతో వెళ్ళాడు .ఆరోజు దీపావళి ఊరంతా మహా
సందడిగా ఉంది .పట్టపు తెనుగు మదమెక్కి ,తొండం ఆకాశం వైపు పైకెత్తి భీభత్సం చేస్తుంటే,ఏదో కీడు రానున్నదని గ్రహించి ,దీక్షుతులవారికి విన్నవిస్తే ,కన్నులు తెరచి ‘’మీనాక్షి కుముదం ‘’అనే తన కిష్టమైనకీర్తన అన్నారు .శిష్యులు అందుకొని’’మీనలోచనీ పాప మోచనీ ‘’ పల్లవిని పాడుతుండగా ముత్తుస్వామి దీక్షితులవారి కపాల విచ్చేదనం జరిగి 60వ ఏట ప్రాణాలు కోల్పోయారు .రాజు ,ప్రజల దుఖం వర్ణనాతీతం .
దీక్షితార్ శిష్యవర్గం
శిష్యులలో నాట్యం చేసేవారు మార్దంగికులు ,నాదస్వరం వారు గాయకులు,వాజ్మయ నిర్మాతలున్నారు .శుద్ధమద్దెల త౦బి యప్ప ,తిరుక్కడయార్ భారతి , అవడయార్వీణ వెంకట్రామయ్య ,తేవూరు సుబ్రహ్మణ్యం ,కోర్నాడ రామస్వామి ,అయ్యస్వామి బిల్వ వనం ,వడివేలు చిన్నయ్య ,పొన్నయ్య ,శివానందం ,నర్తకి అమ్మాణి,కమలం .
త౦బియప్ప –శ్రుతిపర్వమైన మద్దెల వాయించి ‘’శుద్ధ మద్దెల ‘’బిరుదు పొందాడు .మహా వైద్యనాధయ్యర్ ‘’చింతయామి కందమూలకందం’’ కీర్తన పాడుతుంటే సరిగ్గా లేదని ఆక్షేపించిన రసజ్ఞుడు.
భారతి, వెంకట్రామయ్య, సుబ్రహ్మణ్యం –గురువుతో తీర్ధ యాత్ర చేశారు
రామస్వామి –భరతనాట్యం లో దిట్ట .సంగీత మార్గదర్శి .
బిల్వవనం –నాదస్వర వాద్య నిపుణుడు
అయ్యస్వామి –తాన ,పద వర్ణ రచయిత.
పొన్నస్వామి –భరతనాట్య ,ఫిడేలు ప్రవీణుడు .గురుభక్తి తెలియజేస్తూ ‘’భిన్న షడ్జ ‘’రాగం లో గురుగుహమూర్తికి శిష్యుడనని చెప్పాడు .స్వరజతులు ,పద వర్ణలరచనలో సిద్ధహస్తుడు
కమల –గాన ,నాట్య కోవిదురాలు .గురువు ఆర్దికకస్టాలలో ఉన్నప్పుడు తన ఆభరణాలు అమ్మి సహాయం చేసి ఆదుకొన్న ఉత్తమ శిష్యురాలు ,త్యాగి .
ముత్తుస్వామి దీక్షితులు అమరజీవి , సన్మార్గుడు విరాగి ,ముముక్షువు అద్వైతి ,సోహత్వం పొందిన మహాజ్ఞాని మధురవాక్కులు ,గేయకల్పనలు ,రాగ విన్యాసం ,ఆత్మతత్వం దీక్షితార్ కీర్తనల ప్రత్యేకత .నాదోపాసనతో త్యాగబ్రహ్మ భక్తిని అనన్య సామాన్య ప్రతిభతో తీర్చిదిద్దితే ,దీక్షితులు రాగ గమకాది లక్ష్యలక్షణ సమన్వయం చేశాడు .తాళగతులతోరాగవిన్యాస క్రమాన్ని పోషించి ,లక్షణ యుక్తగానాన్ని శ్యామ శాస్త్రి నిర్మించాడు .ఈ త్రయం సందేశం ఒక్కటే ‘గానం ఆముష్మిక సాధనం అనిచెప్పి , యుగ కర్తలని పించారు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-1-20-ఉయ్యూరు
—