దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -13
త్యాగరాజ స్వామి సమకాలికులైన గాయక మహాశయులు -5
మలబారు రాజ గాయకులు-2
స్వాతి తిరుణాల్ ఆస్థాన విద్వాంసులు
1-పరమేశ్వర భాగవతార్ –తిరువాన్కూర్ గాయకులలో అగ్రగణ్యుడు .అక్కడి సంగీత ప్రారంభ అంత్య దశను చూసినవాడు .క్లిష్టంగా ఉండే ఇతని కీర్తనలు పాడటం కష్టం .
2-గోవింద మరార్ –మొవ్వత్తుపురం తాలూకా రామమంగళం నివాసి .షట్కాలపల్లవి ప్రవీణుడు కనుక ‘’షట్కాల మరార్ ‘’అంటారు .1831లో తిరువాన్ కూర్ వచ్చి స్థిరంగా ఉన్నవారిలో మొదటివాడు .ఒక చేతిలో సప్త త౦త్రి తంబురా వేరొక చేతిలో మంజీరా తో దేశాటనం చేస్తూ పండరీపురంలో మరణించాడు .ఆ తంబుర ఆ దేవాలయం లో ఇప్పటికి ఉన్నట్లు చెబుతారు .1843లో తిరువయ్యార్ లో త్యాగరాజ స్వామిని దర్శించి ,గానం తో మెప్పించి ‘’గోవిందదాస్ ‘’బిరుదు పొందాడు .ధనాశ లేదు.
3-కృష్ణ మరార్ –అసమాన ప్రతిభతో వర్ణాలు కృతులు పల్లవులు పాడగల మేధావి .సప్తస్వరాలు పలికే ‘’ఎడక్కు ‘’అనే చర్మ వాద్యం తయారు చేసి ఎప్పుడూ పాడుకొంటూ ఉండేవాడు .తన సామర్ధ్యాన్ని ప్రకటిస్తూ తంబురకు ఒక ధ్వజాన్ని పైన కట్టేవాడు .రాజు స్వర్ణకంకణం ఇచ్చి గౌరవించాడు .
4-మేరు స్వామి (1833-70)-తంజావూర్ నుంచి వచ్చిన మహారాష్ట్ర బ్రాహ్మణ గాయకుడు .కోకిల కంఠ స్వరం ఉండటం వలన ‘’రాజా కోకిలకంఠ’’బిరుదు రాజు ప్రదానం చేశాడు .ఇతని చిత్రం స్వాతి తిరుణాల భోజన శాలలో ఉండటం విశేషం .నెలకు వందరూపాయల పారితోషికం .మంచి కథకుడు కూడా .
5-లక్ష్మణ గోసాయి -1860లో అయిల్లం తిరుణాల్ రాజు దర్బార్ గాయకుని చేశాడు .మేరుస్వామికి వ్యతిరేకి.’’మహామేరుస్వామి ‘’బిరుదుపొందాడు.నాల్గు స్థాయిల్లో అవలీలగా పాడగల సమర్ధుడు .
6-వడివేలు –గోవి౦ద మరార్ తో త్యాగరాజ స్వామి దర్శనం చేయించి ,ఆయనతో తిరువాన్ కూర దర్బార్ కు రాజాహ్వానం తెలియ జేయగా త్యాగబ్రహ్మ తిరస్కరించి ‘’మేమిద్దరం ఒక చోట కలుసు కొంటాం ‘’అని నర్మ గర్భంగా తెలియ జేశారు .తానవర్ణాలు అనన్య సామాన్యంగా ఉంటాయి .తిరువాన్ కూర్ సంస్థానం లో మొదటి సారిగా ఫిడేల్ ను ప్రవేశ పెట్టిన ఘనత వడి వేలుదే.మెల్లకన్ను, బక్క శరీరం, ఒంటికన్నుతో వికృతంగా ఉండేవాడు .శ్రావ్య కంఠ స్వరం తో అందర్నీ ఆకర్షించేవాడు .హరిపద క్షేత్రం లో పాడటానికి కీర్తనలు రాశాడు .ఇతని వర్ణాలు ప్రసిద్ధాలు .రాజు దంతపు ఫిడేలు అందజేసి సత్కరించాడు .
7-శివరాం ఉరుదాస్ ఉరఫ్ క్షీరాబ్ధి శాస్త్రి – వేదాంత గీత రచయిత ,మంత్ర వేత్త .
8-ఇర్వన్ వర్మ తంపి(1783-1856)-స్వాతి తిరునాళ్ బంధువు .500గీతాలురాసిన కవి .రాసి రాజు కు పంపి ఆమోదం పొందేవాడు .స్వాతి తిరుణాల్ తో సమాన ప్రతిభ ఉన్నగాయకుడు.కూతురు కుట్టి కుంజ తంగాచి కవయిత్రి .ఈమె మనుమడు పద్మనాభ తంపి గొప్ప చిత్రకారుడు .
9-నారుమంచి జానకి రామయ్య (1823-1902)-ఆంధ్రుడు .ఈ కుటుంబం గాన ప్రశస్తికి చాలా ఈనాములు పొందింది .1823లో పుట్టి ,18వ ఏట తంజావూరు లో త్యాగరాజస్వామిని దర్శించి ,గానబోధ చేయమంటే వీణకుప్పన్న వద్ద నేర్వమని చెప్పారు .14ఏళ్ళు గురు శుశ్రూష చేసి 300 గీతాలు ,100వర్ణాలు 100కీర్తనలు పాఠం చెప్పుకొని ,పల్లవి పాడటం లో మహా ప్రావీణ్యం సాధించాడు .1855లో స్వగ్రామం వెళ్లి ,తర్వాత మద్రాస్ చేరి కుప్పన్నవద్ద మరో రెండేళ్ళు సంగీతం నేర్చి ,దక్షిణాదిలో చాలాకచేరీలు చేసి ,ఆంద్ర దేశం లో ‘’చోళ దేశపు కర్ణాటక బాణీ’’మొట్టమొదట ప్రవేశపెట్టిన కీర్తి పొందాడు .ఈయనపాట నాద భూయిష్టంగా ,భావప్రదానంగా సకల లక్షణ సమన్వయంగా ఉంటుంది .శ్రీ త్యాగారాజ స్వామి దైవం ఊరేగింపులో కీర్తనలు తరంగాలు మైమరచి పాడేవాడు .ఫిడేలును ప్రక్కవాద్యంగా ఎప్పుడూ పెట్టుకొనే వాడు కాదు .తొట్లవల్లూరు చల్లపల్లి ఉల్లిపాలెం ,నరసరావు పేట జమీందార్ లచేత ఆహ్వాని౦పబడి కచేరీలు చేసి సత్కారాలు పొందాడు .
శిష్యులు –నారుమంచి సీతారామయ్య ,ఉప్పుటూ(లూ)రి శ్రీరాములు ,జవంగుల శ్రీహరి ,రాఘవులు శ్రీమతి రాం భాయి రంగనాయకి ,చిన్నమ్మి అందరూ పల్లవిలో దిట్ట లే .
10-నారుమంచి చినసీతారామయ్య –(1877-1943)-గుంటూరు జిల్లా పెదరావూరు వాసి జానకిరామయ్య శిష్యుడు .గురు సేవలో సంగీతం నేర్చాడు .100వర్ణాలు 100కీర్తనలు 200లక్షణ గీతాలు ,అనేక స్వర జతులు అభ్యసించాడు సీతారామయ్య శ్రీరాములను గురువుగారు కుప్పయ్య పుత్రుడు ముత్యాలప్పేట త్యాగయ్యకు అప్పగించాడు .రెండేళ్లలో అన్నీ సాధన చేశారు .వృద్ధులబాణీ మార్చి కొత్త బాణీలో పాడిన వారిలో సీతారామయ్య ఒకడు . .ఇదే ఈయన ప్రత్యేకత వర్ణం పాడటం లో పెట్టిందిపేరు .నాదాన్ని పూరించి విలంబనకాలం లో ,ఆర్తిలో ,భావప్రకటన తో గమకయుక్తంగా పాడటం లో ఘనుడు .వర్ణం ,స్వరకల్పన ప్రత్యేకత .స్వరప్రస్తారం రాగభావ పూరితమై గజగమనాన్ని పోలి ఉంటుంది.ఎవరినీ ఆశ్రయించని స్వతంత్రుడు, ఉదారుడు .పరోపకారులు. ఎ౦దరో దాక్షిణాత్య గాయకుల కచేరీలు ఏర్పాటు చేశాడు .గాన శిక్షణలో సర్వ సమర్ధుడు .ఈయనవద్ద సంగీతం నేర్వటానికి 10ఏళ్ళు పట్టేది .సెమ్మ౦ గుడి,చౌడయ్య రోజుకు 10గంటలు సాధన చేసేవారు .ఈయన వర్ణం స్వర ప్రస్థానాలు మెచ్చి తిరుమలస్వామి అయ్యంగార్ ఖరీదైన తంబురా బహూకరించారు .కొడుకు సాంబశివరావు బియె.బిఎడ్ మంచి గాత్రజ్ఞుడు .
రాజులలో స్వాతి తిరుణాల్ రాజా(1756-88) –అంటే స్వాతి తిరుణాల్ తండ్రి సంస్కృత భాషా కోవిదుడు .ఇతనికీర్తనాలు ఇప్పటికీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో గానం చేస్తారు . మలబారు సంగీత ప్రారంభ దశ ఇది .గోవి౦ద మరార్ ఎక్కువగా అష్టపదులు పాడేవాడు .
రాణీ రుక్మిణి బాయి (1800-37)-స్వాతి తిరుణాల్ సోదరి .రాసిన గీతాలను శాంతి భావగర్భితంగా శ్రావ్యంగా గానం చేసేది .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
రేపు 6-1-20సోమవారం ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-20-ఉయ్యూరు
—