దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15
ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2
8-రాజనాల వెంకటప్పయ్య (1860-1930)గురువుకు తగిన శిష్యుడు .పల్లవి పాడటం లో నేర్పరి .అనేకులకు భోజన వసతులు కల్పించి గానవిద్య నేర్పిన కులపతి .శిష్యుడు పొన్నూరు రామ సుబ్బయ్య .
9-ద్వివేదుల లక్ష్మన్న సోదరులు-బొబ్బిలి వారు. గాత్రం త్రిస్థాయిలో పలికించే నేర్పున్నవారు .మృదువుగా మనోహరంగా తంబురా శ్రుతిలాగా స్నిగ్ధంగా గానం చేసి, మహావైద్యనాధన్ వంటి వారినే మెప్పించిన వాడు .లయపట్టు తెలిసి పల్లవి ప్రస్తారం లో అమోఘ శక్తి సంపాదించి కల్యాణి ,కారుబారు బిల్హరి లో ‘’నా జీవనాధార ‘’కృతులు పాడటం లో సమర్ధులు .భావుక శ్రేణికి చెందిన గాయకోత్తముడు .
10-చల్లపల్లి పురుషోత్తం,పంచానాదం -అన్న గాత్రజ్ఞుడు.తమ్ముడు జంత్ర గాత్రజ్ఞుడు.
11-చల్లపల్లి సీతారామయ్య -సుబ్బయ్య – అన్న గంభీర గాత్రజ్ఞుడు,ఫిడలర్.తమ్ముడు వీణానాదం వంటి జీవం కల శ్రుతి రంజక గాయకుడు .తిరువత్తూరు కుప్పయ్య ,ముత్యాల్పేటత్యాగయ్యలవద్ద సంగీతం నేర్చాడు .గాత్రం లాగానే హృదయమూ మెత్తనిదే .నిర్మల ,నిరాడంబర జీవనం గడిపాడు .తానపద్ధతిసత్స౦ప్రదాయ బద్ధం ,శ్లిస్ట గుణోపేతం .బాణీలో చోళదేశపు ఛాయలుంటాయి .గౌరీ మనోహరిలో ‘’బ్రోవ సమయం ‘’,ముఖారి లో ‘’క్షీణమై తిరిగి జన్మించెనో ‘’కృతులు అతని ప్రత్యేక సొమ్ములు .’’నిర్దోషో మధ్యమో మతః ‘’అన్నట్లు రంజక,అనుకార సంజ్ఞార్హాలు .
12-కందా రాఘవయ్య –హరికథా పితామహుడు కందా రాజన్న దత్తపుత్రుడు .స్వయంగా గాన విద్య నేర్చిన వాడు .గుంటూరు సీమలో ప్రసిద్ధుడు .
13-పెనుమత్స లక్ష్మీ పతిరాజు –క్షత్రియ కుల గాయకుడు .
14-గబ్బిట యగ్గన్న శాస్త్రి (1875-1921)
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర దెందులూరు మండలం లోని గబ్బిట వారి ‘’రామారావు గూడెం అగ్రహారం ‘’వాస్తవ్యుడు .గౌతమస గోత్రీకుడు .తెలగాణ్యబ్రాహ్మణుడు .ఆజన్మ బ్రహ్మ చారి . గానగురువు కట్టు సూరన్న.శాస్త్రి గొప్ప పదకర్త ,భక్త రచయిత,గాయకుడు .తండ్రి సూర్యనారాయణ. శాస్త్రి రాసిన జావళీలు ఆంద్ర దేశం లోనేకాక కర్ణాటక,మహారాష్ట్ర నాటకాలలో వీటి నకళ్ళు ప్రవేశించి మెప్పు పొందాయి .అనితర సాధ్యమైన గాన ప్రతిభ యగ్గన్న సొత్తు .ఒకరకంగా గానయజ్ఞం చేశాడు యగ్గ(జ్ఞ)న్న శాస్త్రి .పండితాదరం పొందినమహాగాయకుడు .సుప్రసిద్ధ ఫిడలర్ గొర్తి లక్ష్మీ నారాయణ తో కలిసి ఎన్నో చోట్ల కచేరీలు చేసి సత్కారాల౦దు కొన్న శేముషీ దురంధరుడు ..శిష్యులు –ఇరుగంటి బుచ్చిరామ శాస్త్రి ,దంపూరి సుబ్బారావు ,తిరువయ్యార్ కు చెందిన పల్లవి సుబ్బారావు,కాకినాడకు చెందిన సత్యరాజు బ్రహ్మేశ్వరరావు .నాట్యాభినయ శిష్యురాండ్రు –చేటపర్రు సుందరి , పువ్వులపాపాచలం మొదలైనవారు .యగ్గన్న శాస్త్రి చాలా కృతులు ,జావళీలు ,వేంకటేశ ,భద్రాద్రి రామ శతకాలు రచించాడు. అతి తక్కువవయసు 46ఏళ్ళకే చనిపోవటం దురదృష్టం .
స్వవిషయం –యగ్గన్న శాస్త్రి మా రామారావు గూడెం అగ్రహారం వాడు మా ఇంటి పేరు వాడు కావటం మా అదృష్టం,మాకు గర్వ కారణం .1980 ఫిబ్రవరిలోమొదటివారం లో నేను మద్రాస్ వెళ్ళినప్పుడు శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారింటికి వెళ్లి కలిసి ఆయన స్క్రిబ్లింగ్ పాడ్ పై ముచ్చటిస్తుంటే ‘’గబ్బిట వారిలో గొప్ప గాయక ,పదకర్త ఉన్నారు మీకు తెలుసా ‘’?అని ఆయన ప్రశ్నించి ,రాస్తే ‘’నాకు తెలియదు ‘’అని నా అజ్ఞానం ప్రదర్శించి రాస్తే, ఆయన ‘’గబ్బిట యగ్గయ్యశాస్త్రి గారుఅనుకొంటా గొప్ప గాయకుడు పదకర్త ‘’అని నాకు రాసి చెప్పిన జ్ఞాపకం .అప్పటికి నా తెలివి తేటల దృశ్యం ‘’అంతే’’.ఐతే ఆపేరు మర్చే పోయాను .’’గబ్బిటవారిలో గొప్ప గాయకుడున్నాడు అనికృష్ణశాస్త్రి గారునాతో చెప్పారు’’ అని మాత్రం అందరికీ చాటి౦ పేస్తూ చెప్పేవాడిని .
మా రామారావు గూడెం లో మానాన్నగారిచ్చిన స్థలం లో శ్రీ భక్తాంజనేయ దేవాలయం నిర్మించిన చందోలు సుబ్బారావు గారి అల్లుడు శ్రీ కొలచిన ప్రసాదరావు గారికి ‘’యగ్గన్న శాస్త్రి గారి ఆర్టికల్ సుమారు నెలక్రిందటపంపించి శాస్త్రిగారి గురించి మరిన్ని విషయాలు తెలిస్తే నాకు తెలియజేయమని కోరాను. నేటి వరకు జవాబు రాలేదు .నాటక ,సినీ రచయిత ‘’శ్రీరామాంజనేయ యద్ధం ‘’ఫేం మాకు దగ్గరిజ్ఞాతి స్వర్గీయ గబ్బిట వెంకటరావు(మద్రాస్ ) గారబ్బాయి ,సినీ నిర్మాత గబ్బిట మధు కు అదే ఆర్టికల్ పంపి అతనికేమైనా తెలుసునేమో అని ఫోన్ చేసి అడిగితే తెలియదన్నాడు .వెంకటరావు గారిదీ రామారావు గూడెమే.
నేను అనుకోనేదేమిటంటే- మా తాతగారు కీ.శే .గబ్బిట దుర్గాపతి శాస్త్రి గారికి సోదరులు 9మంది అని మా అమ్మ చెప్పేది .కనుక వారిలో ఎవరో ఒకరి కుమారులై ఉంటారు గబ్బిటయగ్గన్న శాస్త్రి గారు అని అనుకొంటున్నాను .వారి వివరాలేవీ మాకు తెలీదు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు