దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16
ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3
15-లయబ్రహ్మ పాపట్ల లక్ష్మీకాంత కవి (1877-1921)
జగ్గయ్య పేట వాసి .సంగీత విద్వన్మణులలో ఒకడు .దిగంత యశోవిశాలుడు సహజ ప్రతిభ స్వతంత్ర రాగాతాళప్రస్తారాలతో ,అనేక గీతికా పాఠ్యఅనుభవం గాన్ధర్వగానం లతో ఆంధ్రనాటకానికి కొత్త జవ, జీవాలు తెచ్చాడు .గాన స్వతంత్రుడు .వివిధ గీతికా నిర్మాత అధ్యాపకుడు వాద్యకారుడు .భావజ్ఞశ్రోతలకు ఆనందం చేకూర్చే నైపుణ్యమున్నవాడు .మైలవరం థియేటర్ కు గొప్ప ‘’ఎస్సెట్’’ గా ఉన్నవాడు .సహచర వాద్యకారులు –తబలా వాద్య ప్రకా౦ డుడున బగ్గన్న ,పేటికా వాద్యకారుడు రామానుజులు. అమృత సోనలూరేట్లు వాయిస్తుంటే నాటక రంగం దేవేంద్ర సభలా భాసి౦చేది.ఆయనవద్ద తర్ఫీదు పొందని నటుడు అనుకరించని పాటపద్దతి ,నాటక సమాజం లేదు అంటే అతిశయోక్తికాదు ముమ్మారు యదార్ధమే .
అన్నరామయ్యవద్ద సంగీత శిక్షణ పొంది ,సికందరాబాద్ వెళ్లి ,చిన్నన్న సోదరులతోపోటీ చేసిగెల్చి కీర్తి పొందాడు .ఫిడేలు ,హార్మనిలలో అనితర ప్రజ్ఞ చూపి ‘’లయబ్రహ్మ ‘’బిరుదు పొందాడు .రాజమండ్రి గున్నేశ్వరాయ కంపెనీ ,మైలవరం నాటకకంపెనీలో సంగీత దర్శకునిగా రాణించాడు .విద్వత్ పరీక్షలో పల్లవి స్పెషలిస్ట్ .సంకీర్ణ ఖండజాతి తాళాల లో విషమ జాగాలు కల్పించి పల్లవి ప్రస్తారం తో ఆశ్చర్య చకితులను చేసేవాడు .గోపీ చంద్,కనకతార ,ప్రహ్లాద సావిత్రి ద్రౌపది ,కృష్ణలీల తులాభారం పాదుకా పట్టాభి షేకం నాటకాలకు భావగర్భిత కీర్తనలు రచించి నాట్య పట్టాభి షేకమేచేశాడు .రసస్పూర్తి ,పదలాలిత్యం అతీతం .నాట్యరంగం లో మొదటగా హిందూస్థానీ రాగాలు వినిపించిన ప్రయోగ శీలి .ఈయన తర్వాత అంతటి ప్రతిభాశాలి రాలేదు .శిష్యులు పురాణం కనకయ్య ,పిరాట్ల శంకర శాస్త్రి మొదలైనవారు .యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ సంగీత పరీక్షాదికారిగా చాలాకాలం పని చేశాడు .గద్వాల ,అనపర్తి సంస్థానాలనుండి వార్షిక పారితోషికాలు బిరుదులూ సత్కారాలు అనేకం పొందాడు .ఇంతటి ప్రతిభామూర్తి 44ఏళ్ళకే మరణించటం బాధాకరం .
16-ప్రయాగ తిర్మలయ్య (1861-1918)-గుంటూరు జిల్లావాసి .త్యాగారాజశిష్యపరంపరకు చెందిన కోయంబత్తూరు రాఘవయ్య శిష్యుడు .మహావైద్యనాథయ్యర్ సమకాలికుడు .కాకినాడ లో కచేరి చేసిఖ్యాతి పొందాడు శిష్యుడు బలిజేపల్లి సీతారామ శాస్త్రి .
17-చేబ్రోలు సోదరులు –చేబ్రోలువెంకటరత్నం ,పాపయ్య సోదరులు బందరు వారు .చాలాగీతాలు రాశారు .శిష్యులు –కొచ్చెర్లకోట రామరాజు కంభంపాటి సత్యనారాయణ ,కంచర్ల సుబ్బారావు ,పాపట్ల లక్ష్మీకాంతకవి .వెంకటరత్నం అమరవాది శేషయ్య శిష్యుడు .1926లో చనిపోయాడు .
18-మునుగంటి శ్రీరాములు –పానకాలు సోదరులు –కాకినాడ వారు.జంత్ర గాత్ర నిపుణులు .సంగీత కృతి దర్పణం స్వరవర్ణ సుధానిధి గ్రంథాలు రాశారు .శ్రీరామమందిరం నిర్మించి చాలా సభలు చేయించి దానధర్మాలు చేశారు శ్రీరాములుగారి దత్తపుత్రుడు మునుగంటి వెంకటరావు .
19-రావినేని వీరయ్య చౌదరి –రాజనాల వెంకటప్పయ్య శిష్యుడు .కంజీవరం నైన పిళ్ళేవద్ద సంగీతం నేర్చాడు .పల్లవి ప్రవీణుడు .
20-వెంపటి సూర్యనారాయణ-ఒంగోలు తాలూకా తమ్మవరం వాసి .రాగం పల్లవి లోనైపుణ్యం పొన్నూరి రామ సుబ్బయ్య వద్ద నేర్చాడు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-20-ఉయ్యూరు