దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5 29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-    

 • దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -18

  ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 5

  29-వారణాసి రామసుబ్బయ్య(1882 -1912)-

  గుంటూరు జిల్లా పొన్నూరు వాసి .తండ్రి కోటయ్య .తల్లి లక్ష్మీ దేవి .భార్య రోశమ్మ ..30ఏళ్ళు మాత్రమె జీవించినా చిర యశస్సు నార్జిం చాడు .స్పురద్రూపి ఆజానుబాహు ,విశాలనేత్రుడు .సహజ సుస్వర గాత్రుడు .ఆకార సదృశ ప్రజ్ఞ ఉన్నవాడు  .రాజులను సైతం ధిక్కరించాడు .కౌశిక గోత్రుడు .తండ్రి భరత శాస్త్ర ,నాటక కళా ప్రవీణుడు .తండ్రి వద్దనే అన్నీ నేర్చాడు .15వ ఏటనే కచేరీ చేసిన బాల మేధావి .చనిపోయేదాకా కచేరీలు చేశాడు .ప్రకృతి ధ్వనులను  అనుకరిస్తూ బాల్యం లోనే కంఠం  మేళవించి కమ్మగా పాడుతూ పరవశం కలిగించేవాడు .సరళీలు ,గీతాలు అలంకారాలు తండ్రివద్ద నేర్చి ,రాజనాల వెంకటప్పయ్య వద్ద 30కృతులు ,30తానవర్ణాలు ,,పల్లవి అభ్యసించాడు .ఇతని స్వరజ్ఞానం ,లయ పటిమ చూసి గంధర్వా౦శ  సంభూతుడు అనే వారు   1906లో కాకినాడలో పూచయ్య౦గార్  సమక్షం లో కదన కుతూహలరాగం లో విషమపల్లవి పాడి అందర్నీ ఆశ్చర్యపరచాడు .పూచయ్య తనతో తీసుకొనిపోయి గానపాఠాలు చెప్పి తీర్చి దిద్దాడు .అక్కడపాడే మహా విద్వాంసుల గానం లోనిగుణ దోషాలను విమర్శిస్తూ ,వాటిని తన హృదయం లో భద్రం చేసుకొని శ్రోతలకు వినిపిస్తూ వారే పాడారేమో ననే భ్రమకలిగించేవాడు .1906లో ఎట్టియార్ పురం వెళ్లి సుబ్రహ్మణ్య దీక్షితుల తరఫున నవగ్రహస్వరం పాడి,మెప్పించి  ‘’సంగీత సంప్రదాయ గ్రంథం’’ బహుమానంగా పొందాడు.1909లో రామనాథపురం జమీలో సన్మానం పొంది దేనుకొండ చిన్నయ్య ,నారుమంచి జానకిరామయ్య ,ప్రయాగ తిర్మలయ్య ల సమక్షం లో పూర్వ ,ఆధునిక లక్షణ గతి గమక భేదాలగురించి విమర్శించి చెప్పాడు .కాట్రావులపల్లి రాణీ గారిగారి కుమార్తె వివాహ సమయంలో పండిత సభలో నందిగామ వెంకన్న ,సంగమేశ్వర శాస్త్రి ,నారాయణ దాసు మొదలైన పండిత దిగ్గజాల సమక్షం లో నిరుపమానమైన పల్లవి పాడి ‘’పల్లవి కోకిల ‘’బిరుదు పొందాడు .శేకూరు లో విషమ పల్లవి పూర్తి చేసి మాదయి వెంకటరాయుడిని పరాభావి౦ చాడు .బుచ్చి రెడి పాలెం లో భైరవి రాగాపల్లవి లో అపూర్వ గ్రహస్వరాలు వినిపించి గావిన్ద గోవిందస్వామి  అనే నాగస్వర విద్వాంసుని మెప్పించాడు.

      1907లో కలకత్తా వెళ్లి హిందూస్థానీ గాత్రం నేర్చి గోహర్జాన్ ,శరథ్  చంద్ర మోహన్ , రవీంద్రనాధ టాగూర్ లను మెప్పింఛి సర్టిఫికేట్ ,సువర్ణ పతకం పొందాడు .చేబ్రోలు బంగాళాలో జరిగిన కచేరీలో ‘’ఋషభ గ్రామం ‘’లో పాడుతుంటే దారిన పోతున్న జోడెడ్ల బండీ ఆగిపోయింది  .ఆదిభట్ల నారాయణదాసు ,సుసర్ల దక్షిణా మూర్తి గార్లు రామసుబ్బయ్యగానం విని గంధర్వగానం అన్నారు .గాత్ర వరిస్టులలో ప్రధమ శ్రేణికి చెందిన గాయకుడుగా గుర్తింపు పొందాడు .’’ హృద్య శబ్దః సుశారీరః ‘’అన్నట్లు మృదు మధుర గంభీర ,త్రిస్థాన గమక ప్రౌఢిమగల ఇతని గాత్రం నుంచి వెలువడే ప్రసారాలు గవ్వలగుత్తుల ధ్వని యుతాలు అని మెచ్చుకొనేవారు.రాగ రూప కాలాప్తులకు మేటి .ఎవ్వరికీ ఇంతటి గాన శైలి అబ్బలేదని విమర్శకాభిప్రాయం .శరీరం స్నిగ్ధం గానం అనుద్వాన యుక్తమై అనాయాస లద్గతికమై అన౦త రామ భాగవతార్ ,బిడారం కిట్టప్ప లను మరిపించేది .అందుకే ‘’స్వరజ్ఞాన ‘’.’’స్వరకల్ప వల్లరీ ‘’,’’అర్వాచీన ఆంద్ర గాయన వాచస్పతి ‘’వంటి సార్ధక బిరుదులూ పొందాడు .జంత్ర గాత్రాలలో  అశేష శేముషి ఉన్నవాడు .స్వరకల్పవల్లి ,సంగీత సర్వార్ధ సార సంగ్రహం ,సంగీత ప్రదర్శిని మొదలైన అపూర్వ గ్రంథాలలోతులు తరచిన వైదుష్యం ఉన్నవాడు .అందుకే ఎవరు ఏ రాగం లో ఎలాంటి పల్లవిని విషమజాగాలలో ఇచ్చినా అవలీలగా పాడే నేర్పున్నవాడు .ఏ రాగం లోనైనా వర్ణాన్ని ఆశువుగా రచించి పాడే ధీశాలి .స్వరప్రస్తార ప్రతిభావంతుడు .తానవితానం తాలుగతమై శోభించేది .విలంబ ,మధ్యకాలాలపై ఆసక్తి ఎక్కువ . భరత శాస్త్ర   ప్రకా౦డుడు .గాత్ర పాటలో’’ పాథే ఫోన్ ‘’కిచ్చిన నౌరోజ్ రాగపల్లవి ,కల్యాణి కాంభోజి, ఖరహరప్రియ, రాగాలాపనలు ,మోహన ,రామప్రియ రాగ కృతుల రికార్డులు రామసుబ్బయ్య అసదృశ ప్రతిభా చాతురికి నిదర్శనాలు .తన ఆంద్ర గీర్వాణ పాండిత్యం చాటటానికి పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామిపై చెప్పిన శ్రీరాగ  రుద్రప్రియ ,ఆభోగి ,చారు కేశి ,వీణాధరి జగన్మోహిని కల్యాణి ఆదితాళ,ఆటతాల వర్ణాలు ,గీతాలు ,ఖడ్గబంధాలు ,నాగబందాలు, సంగీత విమర్శక వ్యాసాలూ ఇతనిని అత్యున్నతస్థాయి వాగ్గేయకారుడని ఎలుగెత్తి చాటుతున్నాయి   .ఈయనతో ఆనాటి సమానులు- కోనేరి రాజ పురం  ,గొర్తి లక్ష్మీ నారాయణ ,చల్లపల్లి సుబ్బయ్య ,పాపట్ల లక్ష్మీకాంతం ,నందిగామ వెంకన్నలు .ఇతనికి పొన్నూరు శ్రీ భావనారాయణ స్వామి కోవెలలో స్వస్తి వాచకం  నౌఖరి ఉండేది .

     ఒకసారి వాసిరెడ్డి ప్రసాదరావు జమీందారు చివుకుల వెంకటప్పావధానిఘానాపాఠితో కలిసిరాగా సుబ్బయ్య ఫిడేలుపై పనస చెబుతూ వాయిస్తుంటే గురువు ,రాజు మురిసిపోయారు .గ్రహణ శక్తివల్లనే అంతటి విద్వా౦సుడవటానికి కారణం .దీనికి అతని విజయనగర ,తంజావూర్ మద్రాస్ యాత్రలు తరచుగా చేయటమే కారణం .అఖండ కీర్తి సాధించిన గాయక మణులలో అగ్రగణ్యుడు .పొన్నూరులో గాన విద్యాలయం పెట్టాలని చందాలు వసూలు చేశాడు కాని కార్యరూపం దాల్చలేదు .జార్జిరాజు పట్టాభి షేకానికి  ఢిల్లీలో పాటకచేరి చేయాలని ముఖమల్ అంగరఖా కుట్టి౦చు కొన్నాడు. పుచ్చా సీతారామయ్య జమీన్ దారు ద్వారా  ప్రయాణపత్రం తెప్పించుకొన్నాడు .కాని జయపుర సంస్థానం నుంచి తిరిగి వస్తూ ,చలిజ్వర పీడితుడై మద్రాస్ ఆస్పత్రిలో చనిపోయాడు .ఇతని ఆశయం ‘’ఆంధ్రులు చేతకాని వారు ‘’అన్న అపప్రదను తొలగించటమే .దక్షిణ దేశయాత్ర చేసి అరవగాయకులను ఓడించాలనే కోరిక గాఢంగా ఉండేది .దీన్ని శ్రీ హరినాగాభూషణం కు ఉపదేశించాడు .సుబ్బయ్య సంగీతం ఆజన్మ సిద్ధం .కారణమాత్ర గురు ప్రవర్ధితం  . ఇంతటి గాయక శిరోమణి గురించి తెలుగు వారంతా మరచి పోవటం  దురదృష్టం .పొన్నూరులో నైనాఆయన స్మారకం ఉందొ లేదో ? పొన్నూరు వాస్తవ్యులు,సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు ,అక్కడే సంస్కృత లెక్చరర్ చేసి రిటైర్ అయిన డా నిష్ఠలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారణాసి రామసుబ్బయ్య మహాగాయకుని కి స్మృతి చిహ్నం  అందరి తోడ్పాటుతో ఏర్పాటు చేసి నవతరానికి స్పూర్తి కలిగించమని వేడుతున్నాను .

   శిష్యులు –తూములూరి హనుమచ్చాస్త్రి ,నిరాఘాటం రామకోటయ్య ,వెంపటి సూర్యనారాయణ ,తాడిగడప శేషయ్య ,రావు సూరయ్య ,మాధవరావు ,లంకా లింగయ్య ,కోడూరి హుళక్కి ,అమ్బతిపూడి సుబ్బయ్య ,పొన్నూరి ముసలయ్య ,,రావు వెంకటరావు ,చల్లాపిచ్చయ్య శాస్త్రి .శేషయ్య గానరచన.స్వరప్రస్తరణ  అమోఘం సంగీత రహ్స్యబోధిని గ్రంధం రాశాడు .

   ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.

    సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-1-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.