దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -20(చివరిభాగం )
ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు- 7(చివరిభాగం )
34-పిరాట్ల శంకర శాస్త్రి (1884-1950)-తారణ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీశైల శాస్త్రి ,పిచ్చమా౦బ లకు కృష్ణాజిల్లా నందిగామ తాలూకా జయంతిపురం లో జన్మించాడు తండ్రి ఆంధ్రగీర్వాణ భాషాపండితుడు, దేవీ ఉపాసకుడు .సోదరులు మృత్యుంజయశాస్త్రి ,శివరామ శాస్త్రి, సదాశివ శాస్త్రి .పెద్దాయన సాహిత్య నాటకాలంకార విమర్శకుడు .చివరాయన చిన్నప్పుడే చనిపోయాడు .
శంకర శాస్త్రి నిస్టాగరిస్టుడు,శివపూజా దురంధరుడు ,సంగీత సాహిత్యవేత్త .శ్రీ వామ దేవ తీర్ధ స్వామి శిష్యరికం చేసి వేదాంత శాస్త్ర పాండిత్యం సాధించాడు .పద్యరచనా అలవాటు చేసుకొని శంకర శతకం రాశాడు .మొదట్లో పాపట్ల లక్ష్మీ కాంతం వద్ద తర్వాత వీణ కుప్పయ్యకొడుకు ముత్యాల్పేట త్యాగయ్యవద్దాగాన పాండిత్యం సాధించాడు .విజయనగరం గద్వాల అనపర్తి ఆత్మకూరు ముత్యాల సంస్థానాలలో విద్యా ప్రదర్శన చేసి గొప్ప బహుమతులు పొందాడు .కొంతకాలం గుంటూరులో ఉండి తర్వాత ముత్యాల రాజాస్థాన సంగీత విద్వా౦సుడయ్యాడు మద్రాస్ సంగీత పరిషత్ సభ్యుడు .కామవర్ధని, షణ్ముఖ ప్రియ ,భైరవి ,సింహేంద్రమధ్యమ రాగాలలో కీర్తనలు రాసి ,పాడి సంగీత రత్నాకరం లోని విషయాలు విశదీకరించాడు .ఆంద్ర విశ్వకళాపరిషత్ సభ్యుడుగా ఎన్నుకోబడిన మొట్టమొదటి వాడైనాడు .గాత్రం లోనేకాక వీణ, ఫిడేలు ,మృదంగాలలో కూడా నిపుణుడు .రెండవ సంగీత పరిషత్ అధ్యక్షుడయ్యాడు .కొడుకులు మహాదేవ శాస్త్రి ,శ్రీగిరి శాస్త్రి .
35-పిరాట్ల శివరామ శాస్త్రి –బాల్యం లో వేదాధ్యయనం చేసి తర్వాత పాపట్ల వారివద్ద సంగీతం నేర్చి అసదృశ ప్రజ్ఞాపాటవాలతో ,ఫిడేలు మృదంగాలపై జాతిపల్లవులను అడిగిన రీతిలో వాయించే నేర్పరుడయ్యాడు .హైదరాబాద్ మద్రాస్ లలో కూడా కీర్తి గడించాడు .
36-బలిజేపల్లి సీతారామ శాస్త్రి 2-9-1885న జన్మించాడు వీరివంశం సహజగానకళకు పెట్టిందిపేరు .తలిదండ్రులు ఆదిలక్ష్మమ్మ ,నరసింహ శాస్త్రి .తండ్రి సంగీత సాహిత్య విద్యా సంపన్నుడు .తల్లి అధ్యాత్మరామాయణ కీర్తనలు, తరంగాలు ,అష్టపదులు పాడటం లో నేర్పరి .నాట్య వేదికపై హృద్యమైన సంగీతం తో గుంటూరు బాణీనిర్మించి రక్తికట్టించిన బహుళనాటకకర్త బలిజేపల్లి లక్ష్మీకాంతకవి ఈయన సోదరుడు . అన్నవద్ద సంగీతం నేర్చి,గానవిద్యా దురంధరుడనిపించాడు.గానప్రతిభా దురంధరుడు కోయంబత్తూరు రాఘవయ్య శిష్యుడు ప్రయాగ తిరుమలయ్య గాన మెళకువలు గ్రహించాడు .పూచయ్య౦గార్, కోనేరి రాజాపురం గానాన్ని విని స్వంత ధోరణిలో గానం చేసి మెప్పించాడు .ఇతనిది శుద్ధ తంజావూరు సంప్రదాయం .రాగభావం ,మనోహర సంగతులు సహజ స్వర పోకడలు ,సంచారాలు సద్య స్పురణ ఇతని ప్రత్యేకతలు .ఎప్పటికప్పుడు నూతన ప్రస్తారాలతోపాడి ఇంపు గూర్చేవాడు .గాన సంస్కార ప్రాబల్యం ,ప్రతిభ అసామాన్యమైనవి .అందుచేత అరవదేశం లోనూ సంగీతం తో దున్నేశాడు .
1917లో కాశీనాధునినాగేశ్వరరావు పంతులుగారు మద్రాస్ కు ఆహ్వానించి కచేరి చేయించి ‘’స్వర్ణకంకణం ‘’ప్రదానం చేసి సత్కరించారు .శ్రీనివాస అయ్యంగార్ ‘’గానవిద్యాదురంధర’’ఆంద్ర గోష్టి సంస్థ ‘’గానకళాప్రపూర్ణ ‘’బిరుదప్రదానం చేసి సన్మానించారు .ఆదిభట్ల నారాయణ దాసుగారు ‘’స్వరసింహ ‘’బిరుదునిచ్చి పూజించారు .కవిత్వం, జ్యోతిషం లలోకూడా పాండిత్యం ఉన్నది .1944లో ‘’భక్తకల్పద్రుమ ‘’శతకం రాశాడు ఆ యేడాదే షష్ఠి పూర్తి మహావైభవంగా జరిపారు ,.శిష్యులు –మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దెందుకూరిశివరామ శాస్త్రి ,పన్నాల వెంకటప్పయ్య లు .
37 –తాడిగడప శేషయ్య -1888-1950)-‘’సంగీత విద్వత్ జనరంజక స్వరనిది ‘’బిరుదాంకితుడు. ఒంగోలుతాలూకా రావూరులో జన్మించాడు .పొన్నూరులో పతూరిరామయ్యవద్ద కాళిదాసత్రయం పూర్తి చేసి ,సహజగానం తో పద్యాలు జనరంజకంగా పాడేవాడు .మాతామహుడు, తల్లి సంగీతపాటకులు .ఇతడు గర్భంలో ఉండగా తల్లి ఒక రోజున తెల్లవారుజామున మేలుకోలుపులపాటలు పూర్వరాగ సంచారం లో పాడుతుంటే ఈర్ష్య తో ఒక గాయకుడు ‘’చిత్త చాంచల్య ప్రయోగం ‘’చేశాడు.దానిఫలిత౦ గా తల్లికి ,పిల్లాడికి కూడా మతి స్థిమితం తప్పింది .
పొన్నూరులో తూములూరి హనుమచ్చాస్త్రి వద్ద కొన్ని గీతాలునేర్చి ఏక సంధగ్రాహి అవటం వలన వారణాసి రామసుబ్బయ్యవద్ద కృతులు ,గానమర్మాలు నేర్చాడు .ఒకరోజు గురువుగారింటి పెరటిలో స్నానం చేస్తూ శేషయ్య తోడి రాగాలాపన చేస్తుంటే అతడే తన భవిష్యత్కర్త అని స్నేహితులకు చెప్పాడు .అప్పటిను౦చి శేషయ్య అనేక కచేరీలు చేసి ,చల్లపల్లి, మీర్జాపురం రాజాలచే సన్మానాలు పొందాడు .భావపూరితంగా త్యాగారాజకృతులను గానం చేయగలగాయకుడు శేషయ్య ఒక్కడే అనే గొప్ప పేరు సంపాదించుకొన్నాడు .స్వరరాగ తాళజ్ఞానం తో ,బహుచతుర రాగాలాపన చేసేవాడు .ఎప్పుడూ పిచ్చివాడిలాగా తిరిగే మహాగాయకుడు గాన అవధూత తాడిగడప శేషయ్య 1950లో 62వ ఏట చనిపోయాడు .
ఆధారం –చతుర్భాషా కోవిద ,నానారాజ్య విద్వత్సభా పదవీ విభూషిత ప్రభుత్వ గాన పరిశోధక ,నాద సుధానిధి శ్రీ మంగిపూడి రామలింగ శాస్త్రి రచన ‘’ఆంద్ర గాయకుల చరిత్రలు ‘’.
దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు ‘’ఇంతటితో సమాప్తం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-20-ఉయ్యూరు ‘’.
.
—