ప్రపంచ దేశాల సారస్వతం
6-ఐస్ లాండిక్ సాహిత్యం -1
ఐస్ లాండిక్ సాహిత్యం అంటే ఐస్లాండ్ దేశం లో వర్ధిల్లిన ,ఐస్ లాండ్ ప్రజలు రాసిన సాహిత్యం .ఇక్కడ మధ్యయుగాలలో 13వ శతాబ్దిలో సాహిత్యం’’ సాగాలు ‘’అంటే కుటుంబ కథలదారావాహిక పేరిట వచ్చింది .ఐస్ లాండిక్ ,పురాతన నార్సే అంటే ఒకటే .కనుక ఓల్డ్ నార్సే సాహిత్యమే ఐస్ లాండ్ సాహిత్యం .సి౦గు రూర్ నార్డాల్ ఈ సాహిత్యాన్ని సేకరించి రెండూ ఒకటే అని రుజువు చేశాడు .
మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం మూడు భాగాలు -1-ఎడ్డిక్ పోయెట్రి 2-సాగాస్ 3-స్కాల్డి క్ పోయెట్రి .
1-ఎడ్డాస్-ఇదిపాత నార్సే పదంగా చాలామంది భావించారు .దీని అర్ధం ముత్తాతమ్మ.అంటే బాగా ప్రాచీనమైనది అని భావం .కొందరు ‘’ఒడిడి’’అనేఒక ప్రదేశం గురించిన పదం ను౦చి వచ్చినమాట గా చెప్పారు.ఇక్కడే వచన ఎడ్డా రాసిన ‘’స్నారి స్టూర్లుసన్’’ పుట్టినట్లు భావిస్తారు .ఎల్డ ర్ ఎడ్డాలేక కవిత్వ ఎడ్డా సాముండర్ ఫ్రూయి రాసినట్లు కథనం .కాని ఆధునికులు దీన్ని తిరస్కరించి ఇదంతా 10వ శతాబ్దం లో వచ్చిన కవితలు, కథలుగా పేర్కొన్నారు . ఒకరకంగా ఇవన్నీ స్కాండినేవియన్ ప్రధాన ప్రదేశం నుంచి వచ్చినవే . మొదటిసారిగా ఐస్ లాండ్ దేశం లో 13వ శతాబ్దంలో వీటిని రాసుకొన్నారు .మొట్టమొదటి కవితా ఎడ్డా ‘’ కోడేస్ రీజియా ‘ వ్రాతప్రతిని ’1643లో దక్షిణ ఐస్ లాండ్ లో స్కాల్ హాట్ బిషప్ బ్రిన్జాయ్ ఫర్ స్వేల్న్ సన్ కనుగొన్నాడు .యంగర్ లేక ప్రోజ్ ఎడ్డా ను స్నారి స్త్రూల్ సన్ రాశాడు .ఇది నార్సే పురాణగాథ లను ఆధునికులు అర్ధం చేసుకోవటానికి బాగా ఉపయోగ పడుతుంది .ఇందులో ఐస్ లాండ్ కు చెందిన మైథలాజికల్ కథలు, వాటితోపాటు ‘’కెన్ని౦ గ్స్’’కూడా ఉన్నాయి .వీటివలన ఐస్ లాండిక్ ‘’స్కాల్డ్స్’’కవులగురించి తెలుసుకోవచ్చు .
2-స్కాల్డిక్ కవిత్వం –ఎడ్డిక్ కవిత్వానికి స్కాల్డిక్ కవిత్వానికి తేడా ఉంది .దీన్ని నార్వేజియన్ ,ఐస్ లాండిక్ కవులు రాశారు .వీరినే ‘’స్కాల్డ్స్ ‘’అంటారు .వీటిలో ఐస్ లాండ్ దేశ రాజుల ,యుద్ధ వీరుల, సాహసికుల వీర గాథలను పాడుకోవటానికి వీలుగా ఉండే కవిత్వం ఉండిఉత్తేజాన్ని ప్రబోధాన్ని ప్రేరణను కలిగిస్తాయి .వీటిని స్థానిక ఉత్సవాలలో సామూహికంగా గానం చేసి వారికి నివాళి ఘటిస్తారు .కవిత్వం నాటకీయంగా ఉంటూ మనసును ప్రభావితం చేస్తుంది .ఆ మహానుభావులగురించి కవులు అసత్య కధనాలు అల్లి ఉండరు అనే ప్రగాఢ విశ్వాసం ఐస్ లాండ్ ప్రజలది .ఉదాహరణకు ‘’ఈజిల్స్ సాగా ‘’లో ఈజిల్ కుమారులు మరణించటం చాలా భావోద్వేగం తో ఉంటుంది .
స్కాల్డిక్ కవులను ప్రజలు ఆరాధ్యకవులుగా భావిస్తారు .వీరిని నాలుగు విభాగాలు చేశారు -1-ప్రొఫెషనల్ పోఎట్స్ అంటే రాజాస్థానకవులు .వీరిని రాజును మెప్పించటానికి కీర్తించటానికి కవిత్వం రాస్తారు .ఇవన్నీ చారిత్రాత్మక వాస్తవ సంఘటనలే .పరిపాలనాధికారులు కూడా ఈకవిత్వాన్ని బాగా మెచ్చి ప్రోత్సహించారు .వీరిపైనా వీరిజీవిత సంఘటనలపైనాస్పందించి ఈకవులు కవిత్వం రాశారు
2-ప్రైవేట్ కవులు –వీరు కాసుకోసం కవిత్వం రాయలేదు .పండుగ పర్వదినాలలో ఇతరకవులతో పోటీ వచ్చినప్పుడు రాశారు .
3-క్లెరిక్స్ –మతసంబంధ కవిత్వం రాసిన వారు .
4-అజ్ఞాతకవులు –వీరికవిత్వం తరతరాలుగా ప్రజలనాలుకలపై నర్తించి సాగాలలో చేరింది .తమమనోభావాలను బయటపెట్ట టానికి ఈ అజ్ఞాత పదం బాగా ఉపయోగపడింది .
స్కాల్డి క్ కవిత్వం ఛందస్సు ను బాగా పాటించి రాసినదే .అందులో ఎన్నో అలంకారాలు ,వాటిలో క్లిష్టమైన ‘’కెన్ని౦ గ్స్’’కూడా ఉంటాయి .వీటిలో కళాత్మకత ఉండటం ప్రత్యేకం .పదక్రమం ,పాద నిర్మాణం నిర్దుష్టంగా ఉంటాయి
సాగాలు –పాత నార్సే భాషలో వచనం లో రాసినవే సాగాలు .జర్మని ,స్కా౦డినేవియన్ ప్రజలు ఐస్ లాండ్ కు వలసవచ్చిన చారిత్రాత్మక కథనాలు .వైకింగ్ ల సముద్రయాత్రలు వారు జయించి నివాసం ఏర్పాటు చేసుకొన్న ప్రదేశాలు,నిర్జన గోట్లాండ్ లో జనావాసం ఏర్పాటు వగైరాలుంటాయి .ఎడ్డాలు పైలోక కథలు ఐతే , సాగాలు ఇహలోక వాస్తవ జీవిత కథలు .ఇందులో బిషప్పులు ,సన్యాసుల జీవితాలు ,శృంగార కథనాలు ఉన్నాయి .కొన్నిటిలో పురాణ గాధలు కూడా అందులో తమాషాగా చోటు చేసుకొంటాయి .9-13శతాబ్దాల మధ్య స్కా౦డినేవియాచరిత్ర తెలుసుకోవటానికి సాగాలు గొప్ప ఉపకరణాలు .
మహిళా సాహిత్యం
మధ్యయుగంలో స్త్రీల సాహిత్యంఎక్కడా కనిపించదు .అజ్ఞాతకథలు కవితలు మహిళలే రాసినట్లు నమ్ముతున్నారు .స్కాల్డిక్ కవితలలో ఎక్కువభాగం నార్వీజియన్, ఐస్ లాండిక్ మహిళలు రాసినవే అంటారు .తర్వాతకాలం లో మాత్రమే పురుషకవులు స్కాల్డిక్ కవిత్వం ,సాగావచనం రాశారు .మహిళలు గొప్పకవిత్వమే రాశారని భావిస్తున్నారు .కాని 15వ శతాబ్ది కి చెందిన రిమూర్ సైకిల్ ,లాండ్రేస్ రిమూర్ లలో స్త్రీ సంబంధ విశేషణాలు వ్యాకరణపదాలు ఉన్నట్లు గుర్తించారు .కనుక మొదటి ఐస్ లాండిక్ కవిత్వం రాసింది మహిళ మాత్రమే అని నిశ్చయంగా చెబుతారు .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -13-1-20-ఉయ్యూరు
,