కిరాతార్జునీయం

కిరాతార్జునీయం

సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి తెలుగు లో వ్యాఖ్యానం రాసినవారు శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్న శర్మగారు .దీని ఆధారంగానే నేను ఈ ధారావాహిక రాస్తున్నాను .నేను రాసిన ‘’గీర్వాణకవుల కవితాగీర్వాణ0’’ మొదటి భాగం లో లో భారవికవి గురించిన 17-9-2014న రాసిన  అంతర్జాల వ్యాసాన్ని  ఇక్కడ ఉటంకించి, భారవి కవిని పరిచయం చేస్తాను .

  అర్ధ గౌరవాన్ని అందలం ఎక్కించిన కవి-భారవి

  అసలు భారవి పేరే విచిత్రం గా ఉంది .దీని అర్ధం ‘’సూర్య దీప్తి ‘’(ప్రకాశం).అందరికవుల్లాగానే భారవి జీవితకాలమూ అసందిగ్ధం గానే ఉండిపోయింది .పద్దెనిమిది  సర్గ ల  మహా కావ్యం ‘’కిరాతార్జునీయం ‘’రాసిన మహాకవి భారవి .కిరాత అంటే మారు వేషం లో వచ్చిన శివుడికి పాండవ సోదరుడు అర్జునిడికి మధ్య జరిగిన పోరాటం ,మెచ్చిన శివుడు కిరీటికి పాశుపతాస్త్ర ప్రదానం చేయటం కద.ఈ కద బెజవాడ ఇంద్ర కీలాద్రిపైన జరిగిందని అందరి నమ్మకం .క్రీ.శ .ఆరవ శతాబ్దం వాడు భారవి అని ఎక్కువ మంది చెప్పారు .634చాళుక్య ‘’ఐహోళశాసనం ‘’లో భారవి కాళిదాసు ల పేర్లున్నాయి .పశ్చిమ గంగ వంశ పాలకుడైన దుర్వినీత కిరాతార్జునీయం లోని పదిహేనవ అధ్యాయం పై వ్యాఖ్యానం చేసినట్లు తెలుస్తోంది .ఈ రాజులు నాలుగవ శతాబ్దం మధ్య భాగం నుండి పరిపాలన చేశారు .దుర్వినీత మహా రాజు ఆరవ శతాబ్ది చివరలో రాజ్య పాలన చేసినట్లు చరిత్ర చెబుతోంది . ఏడవ శతాబ్దికి చెందిన దండి కవి రచనల్లో భారవి తన ముత్తాత  గారి  స్నేహితుడు అని పేర్కొన్నాడు .భారవి యే తన తాతగారికి విష్ణు వర్ధన మహా రాజు ఆస్థానం లో చోటుకల్పించాడని చెప్పాడు .ఆ తర్వాతే తాత గారు పల్లవ రాజైన  దుర్వినీత ,సింహ విష్ణుల కొలువులో చేరాడట .ఈ విష్ణు వర్ధనుడు మనం అనుకొనే కుబ్జ విష్ణు వర్ధనుడు కాదని యశోధర్మ విష్ణు వర్ధనుడు అని పరిశోధకులు అంటున్నారు .కనుక భారవి కాలం .530-550అని అందరూ ఊహించారు .భారవి దాక్షణాత్యుడని ,పల్లవ రాజులతో సంబంధం ఉన్న వాడని చరిత్రకారుడు  ‘’కాలే ‘’అన్నాడు .

  భావ  ప్రకటన  భారవితోనే ప్రారంభమైనదని విశ్లేషకాభిప్రాయం .’’భారవే రర్ధ గౌరవం ‘’అన్న టాగ్ కలిగి ఉన్నవాడు .కిరాతార్జునీయ కద మహా భారతం లోనిదే అయినా దాన్ని సుందర కావ్యం గా తీర్చిదిద్దాడు .కాళిదాసు రాసిన కుమార సంభవ రఘువంశా కావ్యాలు భారవికి ప్రేరణ గా నిలిచాయి .కాని సర్వ స్వతంత్ర మైన కొత్త శైలికి నాందిపలికి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు .’’అవంతి సుందరి ‘’కద ప్రాకారం భారవి విష్ణువర్ధనుడి ఆస్థానకవి .వామనుడు‘’కావ్యాలంకార సూత్ర ప్రవ్రుత్తి ‘’లో భారవి శ్లోకాన్ని ఉదాహరించాడు .అసలు పేరు ‘’దామోదరుడు ‘’అని అవంతి సుందరి కద వలన తెలుస్తోంది .

  కిరాతార్జునీయ కద

 జూదం లో ఓడిపోయిన పాండవులు ద్వైత వనం లో ఉంటారు .దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందొ తెలుసుకొని రమ్మని ధర్మ రాజు ఒక  అడవి మనిషిని గూఢ చారిగా పంపిస్తాడు .వాడు తిరిగి వచ్చి సుస్థిర రాజ్య పాలన చేస్తున్నాడు గాంధారీ తనయుడు అని వివరిస్తాడు .భీముడు, ద్రౌపది యుదిస్ష్టిరుడినియుద్దానికి ప్రేరేపిస్తారు .చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దానికి ఆయన అంగీకరించడు .వ్యాసమహర్షి అక్కడికి వచ్చి అర్జునుడు శక్తి పరాక్రమ వంతుడు కావాలని  అందుకోసం ఇంద్ర కీలాద్రి పై ఇంద్రునికోసం తపస్సు చేయమని ఉపదేశిస్తాడు .ఆ ఆదేశం ప్రకారం బెజవాడ వచ్చి ఇంద్ర కీలాద్రి పర్వతం పై తీవ్ర తపస్సు చేస్తాడు .తపో భంగం చేయటానికి దేవతా స్త్రీలు ప్రయత్నం చేసి విఫలురౌతారు .ఇంద్రుడు ప్రత్యక్షమై శివుడి ని గూర్చి తపస్సు చేయమని సలహా ఇస్తాడు .శివుడు అర్జున తపోదీక్షను పరీక్షించటానికి కిరాత వేషం లో మాయ రూపం లో ఉండే పందిని అతనిపైకి ఉసి గోల్పుతాడు .స్వీయ రక్షణలో కిరీటి మాయా సూకరాన్ని బాణం తో చంపేస్తాడు ,అదే సమయం లో మాయా కిరీటి శివుడు  వేసిన బాణం దానికి గుచ్చ కుం.టుంది .పందిని కొట్టిన వాడు నేను అంటే నేను అని వారిద్దరిమధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతాయి .ఇద్దరూ ద్వంద్వ యుద్ధానికి తల పడుతారు .శివుడు అర్జున బల పరాక్రమాలకు సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రదానం చేస్తాడు .కద చిన్నదే కాని భారవి సకల  వర్ణ నాత్మకం గా  గా పద్దెనిమిది సర్గల మహా కావ్యం గా విస్తరింప జేశాడు

                 కవితా గీర్వాణం

   కాళిదాసు కంటే ఒక అడుగు ముందుకు వేసి జలక్రీడ ,వన విహారాలు మధుపానం ,ప్రయాణం (ట్రావేలోగ్ )వర్ణనలు  కూడా చేశాడు .కావ్యం లో ఇవి చోటు దక్కి౦ చు కున్నాయి  మొదటి సారిగా ఈ కావ్యం లోనే .వర్ణనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మొదటికవి భారవి అనిపిస్తాడు .చాలా ప్రౌఢమైన భాషలో కావ్యం రచించాడు .ఉక్తి చమత్కారం ఈ కావ్యానికి భారవి పెట్టిన అదనపు సొమ్ము .నాలుగు నుంచి పది సర్గలు అంటే ఆరు సర్గలను  వర్ణనలతో గుప్పించేశాడు .భారవి కవిత్వాన్ని వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి దీనికి ‘’ఘంటా పథ‘’ వ్యాఖ్యానం రాస్తూ ‘’నారికేళ పాకం ‘’అన్నాడు .

‘’నారికేళఫల సన్నిభం వచో భారవేః సపది తద్విభజ్యతే – స్వాదయంతు రస గర్భ నిర్భరం సామరస్య  రసికా యధేప్సితం ‘’అంటే రసగర్భితమైన పదాలను విడ గొట్టి ఆస్వాదిస్తే పరమ రుచికరం గా ఉంటుంది .ఆ ఓపికే మనకు కావాలి .రుచి మరిగితే కొబ్బరి నమిలి నట్లు నములుతూ రసానందాన్ని పొంద వచ్చు .భాష భారవి చేతిలో ఒదిగిపోయింది .శబ్దం అర్ధం కలిసి నాట్యమే చేశాయి .అయిదవ సర్గ లో చిత్రకవిత్వమూ రాసి షోకులు తెచ్చాడు .సర్వతో భద్ర ,యమక ,విలోమం మొదలైన చిత్ర కావ్య శై లుల్ని ప్రయోగించాడు .ఇంకో గమ్మత్తైన విశేషం ఏమిటంటే ‘’ఏకాక్షర శ్లోకం ‘’కూడా రాసి తన ప్రతిభా ప్రదర్శనం చేశాడు .అంటే ఒకే అక్షరం తో శ్లోకం అంతా చెప్పాడన్న మాట .-‘’న నోనా నున్నో నున్నోనో నానా నాన నాను –నన్నో నున్నో ననున్నేనో నానేనా నున్న ననున్నాత్ ‘’ –నఅనే ఒకే అక్షరం తో రాసిన శ్లోకం ఇది .బాగా ప్రచారమైంది కూడా .దీని అర్ధం –‘’అనేక ముఖాల వాళ్ళల్లారా !ఆయన మనిషి కాదు .తనకంటే తక్కువ బల వంతుని చేతిలో ఓడిపోయాడు .ఆయన బలహీనుడి చేతిలో ఓడిపోయే వాడేమీ కాదు .నిజానికి అతని అధినాయకుడు ఓడిపోలేదు .పైచేయి ఆయనంత మాత్రాన అయిపోలేదు .పీడించే వాడు అదృశ్యమైనాడు .అది పాప కార్యం కాదు .’’ఆ తర్వాత ఇదే ధోరణిలో నారాయణ పండితుడు తన ‘’మధ్వా చార్య చరిత్ర’’లో’’న ‘’తోనే ప్రయోగం చేశాడు .వడిరాజు ,రూప గోస్వామి ఇదే దారి పట్టి ఏకాక్షర శ్లో కాలకు పట్టాభి షేకం చేశారు సంస్కృతం లో ..

      భారవి ఛందో వైవిధ్యం తో ఎన్నో శ్లోకాలు రాశాడు కాని ఆయను ఇష్టమైనది ‘’వంశస్థ’’ అనే ఛందస్సు మాత్రమే .ఈ ఛందస్సు భారవి ప్రతిభను ద్విగుణీ కృతం చేసిందని క్షేమేంద్రుడు ‘’సువృత్తి  తిలకం ‘’లో అన్నాడు –‘

‘’వృత్త చత్రస్య సా కాపి ‘’వంశస్థస్య ‘’ విచిత్రతా –ప్రతిభా భారవేర్యేన సచ్చాయే నాధికీ కృతా’’’’

 శక్తి వంతమైన శబ్ద ప్రయోగం చేశాడు భారవి .ఏ పాత్ర ఎలా మాట్లాడాలో అలానే మాట్లాదించటం భారవి గొప్ప తనం .లోకోక్తులు,  నీతులు సందర్భాన్ననుసరించి వాడాడు .వీరరస కావ్యం కనుక దాన్ని బాగా పోషించాడు .అది భారవి అభిమాన రసం కూడా .అర్ధాంతర న్యాసాలం కారాలతో లోక జ్ఞానాన్ని కలిగిస్తాడు .1050శ్లోకాలున్న ఈ కావ్యం లో 115 లో అర్దాంతారా లంకారాలే ఉన్నాయి .

                      అర్ధ గౌరవం

  భారవి అంటే ‘’అర్ధ గౌరవం ‘’అన ముందే చెప్పుకొన్నాం .తక్కువ మాటలలో ఎక్కువ అర్ధాన్ని చెప్పటమే అర్ధ గౌరవం ..ఇంగ్లీష్ లో ‘’బ్రివిటి ‘’అంటారు .దర్శనాలలో ,ధర్మ శాస్త్రాలలో సూత్రాలలో తక్కువ శబ్దాలలో ఎక్కువ భావం ఉండేట్లు చెప్పారు .అదే భారవి పాటించాడు కావ్యం లో .అంటే కావ్యానికి శాస్త్ర గౌరవ స్థాయి కల్పించాడు .ఈ లక్షణం మన తిక్కన గారిలో కనిపిస్తుంది .’’అల్పాక్షరాల్లో అనంతార్ధం ‘’అంటే ఇదే .భారవి ఇలా శబ్దార్ధాల్ని సమతూకం లో వాడటం వలన కావ్య సౌందర్యం హెచ్చింది .శబ్దానికి ఓజో గుణాన్ని చేర్చాడు .మనుష్యుల కావ్య రుచిని గురించి చెబుతూ –

‘’స్తువంతి గుర్వీ మభి దేయ సంపదం విశుద్ధి ముక్తేరపరే విపశ్చితః –ఇతి స్స్థితాయాం ప్రతి పూరుషంరుచౌ సుదుర్లభాఃసర్వ మనోరమా గిరః ‘’అన్నాడు –అంటే ‘’కొదరికి అర్ధ సంపత్తి ఇష్టం .కొందరు శబ్ద సంయోజనం కోరుకొంటారు .ఇలా మనుష్యులు భిన్న రుచులను కోరుతారు .అందరి మనస్సులనే ఆకర్షించే కవిత్వం రాయటం సులభం కాదు ‘’.ఓజస్సు, ప్రసాద గుణాలతో కవిత్వాన్ని రంజింప జేశాడు ..’’వికట కవి ‘’శబ్దం లో ఎటునుంచి అయినా అదే మాట వచ్చినట్లు ఒక తమాషా శ్లోకమే రాశాడు .’’దేవాకాని నికావా దే-వాహికస్వ స్వకా హి వా .-కాకా రే భాభా రేకాకా –ని స్వభ వ్యవ్య భ స్వ ని ‘’పాదాలను మార్చినా వెనక్కి నడిపించినా అలాగే రావటం గొప్ప ప్రక్రియ .దీని అర్ధం –మానవా !యుద్ధం ఎవరికి కావాలి?ఈ యుద్ధ భూమి దేవతలకూ ఉత్సాహమిస్తుంది .ఇక్కడ పోరాటాలు జరుగుతాయి .త్యాగాలు ఇతరులకోసం చేసుకొంటారు .ఈ భూమి మదించిన ఏనుగులతో ,జంతువులతో నిండి ఉంది .యుద్ధం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ యుద్ధ క్షేత్రం లో పారాదక తప్పదు .మన తెలుగు కవులూ ఈ ప్రయోగాలు బాగానే చేశారు .మరొక గొప్ప శ్లోకాన్ని గమనిద్దాం –‘’వికాస మీ యుర్ జగదీశ మార్గణా వికాస మీ యుర్ జగతీశ మార్గణః-వికాస మీ యుర్ జగదీశ మార్గణా వికాస మీయుర్ జగతీశ మార్గణః ‘’-దీని అర్ధాన్ని అవలోకిద్దాం –జగదీశుడైన అంటే రాజు అయిన అర్జునుని బాణాలు విస్తరిస్తున్నాయి .అలాగే జగతీశ్వరుడైన అంటే లోకేశ్వరుడైన శివుని బాణాలూ వ్యాపిస్తున్నాయి .ప్రమాద గణాలు అండ కోలాహలం చేస్తున్నారు .శివార్జున యుద్ధాన్ని ఆసక్తిగా తిలకించటానికి ఆకాశం లో దేవతలు ,మహర్షులు పరివేష్టించి శోభ కలిగిస్తున్నారు .’’

   ఇంకొక శ్లోకం లో ‘’స్థల నళినుల నుంచి రేగిన పుప్పొడి గాలి చేత ఎగర గొట్టబడి ఆకాశం లో ఒక వలయాకారం గ వ్యాపించిందిట .అది బంగారు దారాలతో అల్లబడిన’’ ఆతపత్రం’’ అంటే గొడుగు లాగా శోభాయ మానం గా ఉందట .పరమ రమణీయ భావన ఇది .దీన్ని మెచ్చిన వారు భారవిని ‘’ఆతపత్ర భారవి కవి ‘’అని పిలిచారట .

   కిరాతార్జునీయం ప్రతి సర్గ లోని చివరి శ్లోకం లో భారవి కవి ‘’లక్ష్మి ‘’శబ్దాన్ని ప్రయోగించాడు అందుకే దీనికి ‘’లక్ష్మంత కావ్యం ‘’అనే పేరొచ్చింది .ఇలాగే హర్షుడు సర్గ చివరి శ్లోకం లో ,ఆనంద శబ్దాన్ని  ప్రయోగించాడు మాఘుడు శిశు  పాల వధను ‘’శ్ర్యంత ‘’అంటే శ్రీ అంతం గా ఉన్న కావ్యం అన్నారు .నైషధాన్ని ‘’ఆనందాంత’’కావ్యమన్నారు .భారవి కిరాతార్జునీయం లోని కవితా సౌందర్యాన్ని తెలియ జేయటానికి అనేక మంది ప్రయత్నించారు .మల్లినాధుని వ్యాఖ్యానం తో బాటు 36వ్యాఖ్యానాలున్నాయి దీనికి. ‘’ప్రకృతి మధురా భారవి గిరిః’’అని ఒకకవి ప్రశంసించాడు .

           ఈ కావ్యం లో రాజనీతి ఎక్కువ. ఇలా ఉన్న కావ్యాలలో ఇదే మొదటిది .రాజాస్థానం లో మంత్రి గా ఉండబట్టే దీన్ని ఇలా రాయగాలిగడని ఊహిస్తారు .ద్రౌపది తో చెప్పించిన సంభాషణలు చాలా అర్ధ గౌరవం తో కర్తవ్య నిర్దేశకం గా ఉంటాయి. స్త్రీ ఆబల కాదు సబల అని నిరూపిస్తాడు కవి .సకల సద్గుణ సమేతుడిగా కదానాయకుడైన ఆర్జునుడిని భారవి చిత్రీకరించి కావ్య గౌరవాన్ని పెంచాడు .’ భారవి బాటలో నడిచిన మాఘ మహా కవి శిశుపాల వధ కావ్యం లో ఇంకొంచెం విజ్రుమ్భించి ఇరవై మూడు రకాల ఛందస్సులు వాడాడు .భారవి శివుడిని ఆరాధిస్తే మాఘుడు విష్ణు ఆరాధకుడు .భారవికావ్యాన్ని జర్మని భాషలోకి మొదట అనువాదం చేసిన వాడు కారల్ కాపెల్లర్ .హార్వర్డ్ ఓరిఎంటల్ సిరీస్ ద్వారా ముద్రింప బడింది .ఆరడజను  రకాల ఆంగ్ల అనువాదాలు వచ్చాయి .’శ్రీనాధ మహాకవి కిరాతార్జునీయ సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువదించి గొప్ప ప్రచారం తెచ్చాడు అందులో ప్రతి పద్యం రస  గుళికయే….  జయన్తితే సుక్రుతినో  రస సిద్దాః కవీశ్వరా’’.

    మొదటి శ్లోకం –‘’శ్రియః కురూణామదిపస్య పాలం –ప్రజాసు వృత్తింయమయంక్త్య వేదితుం

                      స వర్ణి లింగీ విదితస్సమాయయౌ –యుదిస్టిరంద్వైతవనే వనేచరః ‘’

మాయాజూదం లో కౌరవుల చేత ఓడిం ప బడిన ధర్మరాజు ద్వైతవనం నుంచి ,దుర్యోధనుడి పాలనా విధానం ఎలా ఉందొ తెలుసుకొని రమ్మని ఒక వనచరుడిని పంపగా అతడు బ్రహ్మచారి వేషం లో తిరిగి దుర్యోధన పాలనా విధానం అంతా ఆకళింపు చేసుకొని  యుదిస్టిరు నికి వివరించటానికి వచ్చాడు .

  ధర్మరాజుకు నమస్కరించి ‘’ప్రభూ !మీ శత్రువు దుర్యోధనుడు భూమి అంతా ఆక్రమించి ,ప్రజాను రంజకంగా పాలన చేస్తున్నాడు .ప్రజలుకూడా చాలా ఆనందంగా ఉన్నారు .మీ సోదరుల ఊసు కూడా ఎత్తనీయకుండా రాజు వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు .కనుక ప్రజలలో దుర్యోధనభక్తి పెరిగిపోయింది .ఇవన్నీ మీకు అప్రియాలే అయినా స్వామి మంచికోరి నేను ఏ మాత్రం సంకోచించకుండా నివేదించాను .ముఖప్రీతికోసం అసత్యం చెప్పరాదు .అలాచేస్తే కార్య విఘాతం జరుగుతుంది కనుక కింకరులు ప్రభువు సమక్షంలో ఎప్పుడూ సత్యమే చెబుతారు ‘’అన్నాడు

   సశేషం

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-1-20-ఉయ్యూరు

  image.png

      మరో కవితో మళ్ళీ కలుద్దాం

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-14-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.