ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2
కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా ప్రాపకానికి వచ్చి ,వ్యక్తిగత ధ్యానమే మనోవికాసానికి దారి అనే వారిసూక్తి జనానికి బాగా పట్టి ,జెన్ మతం కళలలో లో నూ ప్రతిఫలించింది ,ఈయుగ కావ్యాలు –కథాకావ్యాలు, టంకాపద్య కావ్యాలు ,’’జుహిట్స్ ‘’అనే వ్యాసాలూ ,బౌద్ధవ్యాసాలు ,చైనా రచనలు .దేశీయ విదేశీయ పద్ధతుల కలయిక వలన ఒక కొత్త జాతీయ వ్రాత విదానంవచ్చింది .దీనిఫలితంగా జాతీయ గ్రంథాలు ,పూర్వ యుగ కథలపై ఆసక్తి పెరిగి వాటికి ప్రతులు తయారు చేయటం, వ్యాఖ్యానాలు రాయటం జరిగింది .దీనితో ‘’షింటో’’ల అధ్యయనమూ పెరిగింది .నీతి అనుకరణ వాజ్మయం ఎక్కువగా వచ్చినా ఉపజ్ఞ తక్కువే .ఆకాలం లో జరిగిన అనేక దుఃఖ సంఘటనలపై కరుణ రసాత్మక రచనలు వచ్చాయి .బౌద్ధుల దృష్టిలో ఇది క్షీణ యుగం –‘’మప్పో’’.
హేకేమోనోగటారి,జేనేసి సీసు ఇకి అనే ప్రత్యేక గ్రంథాలుఈకాలం లో వచ్చాయి రెండిటికి మూలం ఒకటే .రెండవది మొదటిదాని రూపాంతరమే .మొదటిది యుద్ధ కథానకం .కర్త ఎవరో తెలీదు .జపాన్ సారస్వతం లో ఈ రెండిటికి అత్యన్తప్రాముఖ్యం ఉంది .’’బివా ‘’అనే జంత్ర వాద్యం పై పాడే తరువాత వచ్చిన నాటకాలకు ఇది ప్రేరణ గా ఉన్నది .హమురో టోకి నాగా రాసిన ‘’హె ఇచిమోనోగటారి’’,’’హాజెన్ మో నోగటారి ‘’మిజు కగామి ‘’అంటే నీటి అద్దం అనే చారిత్రిక రచనలుగా వచ్చాయి .
క్యోటో రాజాస్థానం లో టంకాపద్యాల రచన నిరాఘాటంగా సాగుతూనే ఉంది .వందమంది కవుల గీతాలైన ‘’హ్యాకునిన్ ఇస్షు ‘’ ఈకాలాన్ని ప్రతిబింబించే1235లో తెచ్చిన కావ్య సంకలనం .కామో అనే బౌద్ధ సన్యాసి ,హోజోకి (1212)ముమ్యూషో,షికిమొనగటూరి’’కాల చతుస్టయం ‘’ గ్రంధాలు రాశారు .హోజోకి అంటే రచయిత స్వీయ అనుభూతుల వచన సంపుటి .టన్నిషో గ్రంథాన్ని షిన్ రాన్ సోకిన్ (1073-1262)శిష్యుడైన యూ ఏంబో రాశాడు .ఇందులో ఒకభాగం లో గురువుగారి సిద్ధాంతాలు ,రెండవభాగం లో వాటికి ప్రచారం లో ఉన్న వ్యతిరేక సిద్ధాంతాలపై యుఎన్ చేసిన విమర్శ ఉంటుంది .నిచెరిన్ షోనిన్ 1260లలో రాసిన ‘’రిష్షో అన్ కోకురాన్ అనేది జాతీయ కల్యాణం గూర్చి వివరించే వ్యాసం ..ఈకాలపు చైనా భాషా గ్రంథాలు ఎక్కువగా జెన్ శాఖ బౌద్ధులు రాసినవే .వాటికి స్థాయి లేదు .వీటిలో ఈశై డోజెన్ లు రాసినవి ప్రసిద్ధాలు .
నంబో కుచో ,మురోమాచి యుగాలు (1332-1603)-ఈ కాలం లో రాజ కుటుంబం లో రెండు వర్గాలేర్పడి ,ఇరువైపులా సమర్ధకులున్నారు .60ఏళ్ళు వీరిద్దరి ద్వంద్వ ప్రభుత్వం నడిచింది .వీటినే ఉత్తర ,దక్షిణ ప్రభుత్వాలు అన్నారు .దీనికి ‘’నమ్బోకుచో’’ యుగమని పేరు .చివరికి ఒకేచక్రవర్తి ఏర్పడి క్యోటో లో రాజధాని స్థాపించటం జరిగి అక్కడి వీధి ‘’మురో మాచి ‘’పేరును ఆయుగానికి వచ్చింది ఈయుగాన్ని ‘’ఆశషికగా యుగం ‘’అంటారు .1573వరకు దేశం అంతర్యుద్ధాలతో సతమతమైంది .పురుష ప్రాధాన్యం పెరిగి స్త్రీల ప్రాధాన్యత,గౌరవాలు తగ్గాయి .ఈయుగం లోని ఉత్తర దేశ కాలాన్ని ‘’అంధకారయుగం ‘’అంటారు .పూర్వభాగం లో కొంతవరకు కళలు చిత్రలేఖనం పరాకాష్ట పొందింది .1392-1465కాలం లో ‘’నో ‘’అనే గేయనాటిక సమగ్రంగా వచ్చింది .ఇది తప్ప మిగిలింది హీనస్థితి వాజ్మయం అంటారు .కాని అంతర్గతంగా అభ్యుదయ భావాలు ఏర్పడి తర్వాతకాలం లో శాంతికి దారి తీసింది .ఇరుపక్షాల రాజుల యుద్ధాలపై వచ్చిన రచనలే అన్నీ .ఇవి కవిలెలు, కైఫీయత్తులను పరిశీలించటానికి తోడ్పడ్డాయి .
జిన్నో షోటోకి అనే గ్రంథం’’కిట బటకచివా ఉజా ,చేజో మురకమి(1329-54)రాజ్యకాలం లో రాయబడింది .ఇది దక్షిణ రాజ్య పక్షాన్ని సమర్ధించేది ,రాజకీయ నైతిక భావాలతో కూడినది .సాహిత్య గుణం లేకపోయినా ,తర్వాత చారిత్ర గ్రంథాలకు మార్గ దర్శి అయింది .’’టైహి కి అంటే శాంతి వృత్తాంతం అనే దాన్ని కోజిమా సన్యాసి రాశాడు .చైనా జపాన్ భా షలకలయికతో సుందర సరళతర కొత్త శైలికి మార్గం చూపాడు .ఇది 17,18శతాబ్దాలలో సమగ్ర రూపం దాల్చింది .ఆధునిక శైలికిది మార్గదర్శనం చేసింది .కేన్కో సన్యాసి రాసిన ‘’ట్సురేజురెగుసా ‘’అనే గ్రంథం జీవిత విలువలను తెలియజేస్తూ 240భాగాలలో ‘’జూయి హిట్స్ ‘’వ్యాసాలతో వివరించబడింది .చాల పేరు ప్రఖ్యాతులు పొందింది .
14 వశతాబ్దిలో ‘’నొ’’గేయ నాటిక సమగ్ర రూపం,సౌష్టవం దాల్చింది.కగరు, బుగకు,డెంగకు,సరుగకు అనే నృత్యాలతో కూడిన జపాను నాటకాలు మతసంబంధమైనవిగా వచ్చాయి .వీటన్నిటి సమన్వయ రూపమే ‘’నో నాటిక ‘’..దీనిలో స్వగతాలు ,సంభాషణలు ఉంటాయి .మొదట్లో మతసంబంధంగా ఉన్నా కాలక్రమంలో లౌకికంగా మారింది .కనామా (1333-1384),కొడుకు సియమి(1363-1443)లు దీన్ని ఉచ్చస్థితికి తీసుకు వెళ్ళారు .కొందరు దీనిలో ‘’సరుకు తక్కువ ‘’అంటే ,కొందరు ‘’అత్యుత్తమ వాజ్మయం ‘’అన్నారు వీటిలోని గేయాలు ,పదాలను ‘’యోక్యోకు ‘’అంటారు .గద్య పద్యాత్మికాలు .మధ్యలో టంకా పద్యాలు దూరి చోటు చేసుకొంటాయి .ఈ నాటక ప్రదర్శనలో అనేక భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి 15రకాల మాస్కులు ఉపయోగించేవారు .’’ఈనో ‘’అనేది ప్రపంచ సాహిత్యం లో ఒక క్రొత్త ప్రక్రియ .ఇందులో టకా సగో,దోనోజి,టోసేన్అనే రచనలు ఉ త్తమ శ్రేణి కి చెందినవి .ఉదాత్త ,గంభీరాలైన ఈ నో నాటకాల మధ్యలో ‘’క్యోజెన్’’అనే హాస్య రచన కూడా ఉంటుంది .దీన్ని వాడుకభాషలో రాసే చిన్న ప్రహసనం .ఇవన్నీ తర్వాత వచ్చే నాటక ప్రక్రియకు మూలాలు .
సశేషం
ఉత్తర దేశంలో’ఈ నాడు జరిపే ’ పవిత్ర మౌని అమావాస్య’’శుభాకాంక్షలు
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -24-1-20-ఉయ్యూరు
—