కిరాతార్జునీయం-2
ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో ,ప్రభువు అనుగ్రహం కోసం అసలు విషయం దాచిపెట్టి అబద్ధాలు చెప్పి రాజును మోసం చేయరాదు .దూతలు చెప్పింది ప్రియం అయినా అప్రియం అయినా చారులను ప్రభువు మన్నించాలి .లోకం లో హితం ప్రియం ఐనవాక్యం దుర్లభం .నామాటలు అప్రియాలైనా హితవాక్యాలుగా భావించి క్షమించి ,నాపై దయతో ఉండమని వేడుతున్నాను .అప్రియాలు చెప్పి రాజుకు కోపం తెప్పించటం కంటే చెప్పకుండా ఉండటం మేలు .ప్రభుకార్య ధ్వంసం ఉత్తమ మిత్ర లక్షణం కాదు .కనుక మంత్రులు మొదలైనవారు రాజుకు హితోపదేశం చేయాల్సిందే .అలా చేయకపోతే కుత్సిత మిత్రుడౌతాడుకాని సన్మిత్రుడు కాలేడు.రాజుకూడా ఆప్తులైన అమాత్యాదుల హితవాక్యాలు వినాల్సిందే .పెడ చెవిని పెట్టరాదు .వినని రాజు కుత్సితుడు ఔతాడేకాని మంచి ప్రభువుకాలేడు.రాజు మంత్రులు మొదలైనవారు పరస్పరాను రక్తులైతే రాజు సంపద చక్కగా నిలుస్తుంది .ఒకరికొకరు విరోధులైతే సంపద నిలవదు .కనుక హితవాక్య౦ అప్రియం అయినా ప్రభువుకు చెప్పాల్సిందే .అప్రియాలైనా వాటిని రాజు విని తీరాల్సిందే .రాజకీయ వ్యవహారం మావంటి అజ్ఞానులకు తెలుసుకోవటం కష్టం .శత్రువుల రాజనీతి విధానాన్ని రాజు తన సామర్ధ్యం వల్లనే తెలుసుకోవాలి కాని నా ప్రజ్ఞా విశేషం తోకాదు.గుణదోషాలను తెలుసుకొంటారనే చెబుతున్నానుకాని వ్యర్ధంగా కర్ణ కఠోరాలను చెప్పటం లేదు కనుక శ్రద్ధగా ఆలకించండి .
‘’దుర్యోధనుడు భూమినంతా పాలిస్తున్నా ,సోదరులతో అడవులలో ఉన్న మీ వలన ఎప్పటికైనా యుద్ధం వస్తుందని ,మీకు సకల విధాల సాయం అంది ,తనకు పరాజయం తప్పదని ఆలోచిస్తూ ,ప్రజలను తనపై గాఢభక్తీ విశ్వాసాలతో సహాయంగా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ‘నాకేం భయం ?‘’అని నిశ్చింతగా మాత్రం లేడు.అంతేకాదు కుటిలమార్గగామి దుర్యోధనుడు మీవలన పరాభవం కలుగుతుందని అనుమానిస్తూనే ,ప్రజల అవసరాలు స్వయంగా తెలుసుకొంటూ ,కోర్కెలు తీరుస్తూ ,వారిలో వారికి కలహాలు వస్తే శాంతియుతంగా రాజీ చేస్తూ ,గుణ సంపద లతో ధర్మమార్గాన రాజ్య పాలన చేసస్తూ విశేష ఖ్యాతి పొందాడు .దుర్జన సావాసం కంటే తన ఐశ్వర్యాదులకు నష్టం కలిగి౦పని సజ్జన విరోధం కొంత నయమని పండితులు అంటారు కదా .కనుక దుస్ట దుర్యోధనుడు సజ్జనాగ్రేసరుడైన మీతో విరోధం తెచ్చుకొన్నా ,మీకంటే గొప్పవాడి నని పించుకోవటానికి దానధర్మాలు విరివిగా చేస్తూ, సజ్జనుడు అనిపించుకొంటున్నాడు .
‘’అంతశ్శత్రువులైన కామక్రోధాదులను జయించుట చేత దుర్యోధనుడు ,మనువుచేప్పినట్లు ప్రజారంజకం గా పాలన చేయాలనుకొని అలసత్వం లేకుండా ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికి అది చేస్తూ ,రాజకార్యాలను క్రమం తప్పకుండా చేస్తూ పురుష ప్రయత్నాన్ని రాజనీత్యుక్త ప్రకారంగా విస్తరిస్తున్నాడు .గర్వం మొదలైన దుష్ట గుణాలను దూరం చేసుకొని భ్రుత్యులకు విశేషంగా బహుమానాలిస్తూ బంధు మిత్రులను అధికంగా సమ్మానిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకొంటున్నాడు .అందుచే సేవకులు రాజే తమ దైవమని భావిస్తూ తమమాన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమపనులను తాము అత్యంత వినయ విధేయతలతో అంకిత భావం తో చేస్తున్నారు .దుర్యోధనుడు ధర్మార్ధకామాలకు భంగం కలుగకుండా కాలవిభజన చేసి ,సమాన ప్రతిపత్తితోసేవించటం చేత మంత్రివర్గం కూడా ఆయన గుణాలకు ఆకర్షితమై అనురాగం తో పరస్పర మైత్రి తో వృద్ధి పొందింది ‘’అంటూ ఇంకా చెప్పసాగాడు .
సశేషం
71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-20-ఉయ్యూరు