కిరాతార్జునీయం-3
వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రోధంగా చూడటం చేయకుండా విజ్ఞులకు తెలియ జేసి వారికి నేరవిషయాలు తెలిపి న్యాయశాస్త్రపరంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తున్నాడు .దీనితో ప్రజలకు మరీదగ్గరై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తున్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం లో, శత్రు రాజ్యాలలో సమర్ధులైన చారులను నియమించి విషయాలను కూపీ లాగిస్తూ ,ఎవ్వర్నీ నమ్మకుండా అందరి వాడు గా కనిపిస్తూ శత్రువులలో పరస్పర భేదాలేర్పడేట్లు చేసి ,చారులు అప్పగించిన కార్యం విజయవంతంగా నిర్వహిస్తే ఊహించని రీతిలో బహుమానిస్తూ,వారికి అపరిమిత సంతోషం కలిగిస్తూ తన యడల ఇంకా ఎక్కువ విశ్వాసం తో ప్రవర్తి౦చేట్లు చేస్తూ చాలా నిశ్చింతగా ఉన్నాడు .ఒకదానిబదులు మరోటి చేయకుండా చాలా జాగ్రత్తగా ,సామదానాదులు ప్రయోగిస్తూ ఏ పనీ బీరుపోకు౦డా సఫలమయేట్లు చేయటం వలన కుప్పలు తెప్పలుగా ధనం వచ్చి చేరుతోంది .ఎక్కడా వివాదాలు లేకపోవటం తో రాజులందరూ అత్యంత భక్తి, విశ్వాస, విధేయతలు చూపిస్తున్నందున తనకు ఇక ఎదురు లేదని విజయం ఎప్పుడూ తనదే అని గొప్ప విశ్వాసం లో ఉన్నాడు .అడగకపోయినా రాజులు మదపు టేనుగులు, గుర్రాలను భారీ సంఖ్యలో కానుకలుగా సమర్పిస్తున్నారు .ఏనుగుల మద జలస్రావం తో కొలువు కూటం తడిసిపోయి బురదగామారి ,రాకపోకలకు ఇబ్బంది అవుతోంది .ఇలా సమస్త రాజన్యసమూహం అతని అడుగులకు మడుగులొత్తుతూ, వీర విధేయత ప్రకటిస్తు౦డటంతో దుర్యోధనుడు ఏకచ్చత్రాదిపత్యం గా,నిరాఘాటంగా పాలన సాగిస్తున్నాడు .
‘’ప్రభూ! దుర్యోధనుడు చెరువులు త్రవ్వించి నదులకు ఆనకట్టలు కట్టించి కాలువలద్వారా భూములకు నీరు సరఫరా చేయిస్తూ రైతులకు కూడా ఆనందం పంచి పంటలు ఎక్కువగా పండేట్లు చేయటం తో అనావృస్టి ,దుర్భిక్ష బాధ లేదు .పాడికూడా సమృద్ధిగా వృద్ధి చేసి రైతన్నల హృదయాలనూ దోచుకొన్నాడు .పాడిపంటలతో కర్షకులు ఎంతో తృప్తి చెంది, రాజుకు మరింత విధేయులుగా ఉన్నారు .
’’ఉదార కీర్తే రుదయం దయావతః –ప్రశాంత బాధం దిశతో భిరక్షయా
స్వయం ప్రడుగ్దేస్య గుణై రుపస్నుతా –వసూపమానస్య వసూని మేదినీ ‘’
భూత దయతో ,ఈతి బాధలు లేకుండా దేశాన్ని సంరక్షిస్తూ ,అభివృద్ధి చేస్తూ, మహా యశస్సుతో కుబేర సమానంగా అలరారే దుర్యోధనుని దయా దాక్షిణ్య గుణాలచేత భూమి వాత్సల్యం తో స్వాదీనయై ప్రతి ఏడూ అనంత ధన రాసులనిస్తోంది .ఈ ధనాన్ని ప్రజోపకార కార్యాలపై భారీగా ఖర్చు పెడుతున్నా,అతని సంపద తరగటం లేదు .మహదైశ్వర్యం తో పాలించే అతన్ని చూసి ప్రజలు చెప్పిన పనులు చేస్తూ ఇంకా ఎక్కువ విధేయంగా,దాసాను దాసులుగా ఉంటున్నారు
మహాబలపరాక్రమశాలురు జయలక్ష్మిని తెచ్చేవారు ,ప్రభుకార్యనిమగ్నులైనవీరభటులను సంపాదించి వారికేలోపం రానీకుండా పుష్కలంగా డబ్బు ఇస్తూ పోషించటం వలన వారు తమప్రాణాలనుసైతం పణంగా పెట్టి ప్రభుకార్యం నిర్విఘ్నంగా జరగటానికి బద్ధ కంకణు లై ఉండటం చూసి వారి బలం వలన తనకు రాబోయే యుద్ధం లో తప్పక విజయం సిద్ధిస్తుందని దండి మనసుతో ఉన్నాడు .శత్రు రాజులు ఎప్పుడుఏపని ఎందుకు చేస్తున్నారో, ఆ విషయాలన్నీ నయవంచకులైన చారులద్వారా తెలుసుకొంటూ ,ప్రతి క్రియ ఆలోచిస్తూ ,తాను చేయతలబెట్టిన పని సృష్టికర్త బ్రహ్మ లాగా ఇతరులకు తెలియకుండా,తెలుసుకొనే వీలుకూడా లేకుండా బహు గుంభనగా ,లౌక్యంగా, నిపుణ౦గా చేస్తున్నాడు .ఆయన అనుకొన్నది చేశాక మాత్రమే ఆయన ఏమి చేసింది లోకానికి తెలుస్తోంది .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-20-ఉయ్యూరు