కిరాతార్జునీయం-5

కిరాతార్జునీయం-5

ద్రౌపది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టాలుకలిగాయి .ఈ అనర్దాలన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని రక్షింఛి మీ పూర్వుల ఔన్నత్యం కాపాడమని మనవి .ఇందులో నా తప్పేముంది అని అనుకొంటున్నావా .మాయావులైన శత్రువులు మాయోపాయాలు పన్నుతుంటే ,ప్రతి మాయలు పన్నకుండా రుజుమార్గం లో వెళ్ళే అవివేకుల్ని శత్రువులు పరాభవి౦చరా .కవచం లేకుండా యుద్ధానికి వెళ్ళే వీరభటుడికి వాడి బాణాలు తగిలినట్లు ,మాయావులు అమాయకులను చేరి చంపుతున్నారు .కనుక వారికి మాయతోనే సమాధానం చెప్పాలి .ఉపేక్ష నీ దోషం .అనుకూలుర సాయం ,క్షత్రియత్వాభిమానం ఉన్న మహారాజులలో నువ్వు ఒక్కడివే వంశపారంపర్యంగా వచ్చిన రాజ్యలక్ష్మిని పవిత్ర వంశం లో పుట్టిన సౌందర్యవతి ఐన భార్యను స్వయంగా శత్రువులపాలు చేశావు .మాన ధనులకు రాజ్యలక్ష్మి అపహరణ కళత్ర అపహరణ లాగా అవమానం కనుక ఉపెక్షించక ప్రతిక్రియ ఆలోచించు ..ఇలాంటి ఆపత్కాలం లో కూడా శూరులు పొగిడే పౌరుషమార్గం వదిలి ,పిరికి వాళ్ళు ఆశ్రయించే దైన్య పధ్ధతి పాటిస్తూ క్షాత్రతేజం విస్మరించి దుర్దశ పాలై ,నువ్వుకస్ట పడుతూ ,మమ్మల్నీ కష్టాలపాలు చేస్తున్నావు .శత్రువుల అభి వృద్ధి వినీ  ,మా కస్టాలు చూసికూడా నీకు కోపం చెలరేగి ఎండిన జమ్మి చెట్టును నాలుగు వైపులనుంచి అగ్నిజ్వాలలు కమ్మి దహించినట్లు నిన్ను భస్మం చేయాల్సి౦దేకాని ,మా దురదృష్టం వలన నీకుకనీసం  కోపం కూడా రావటం లేదు .

  ‘’అవంధ్య కోపస్య నిహంతురాపదాం-భవంతి వశ్యాస్స్వయమేవదేహినః

అమర్ష శూన్యేన జనస్య జంతునా –న జాత హార్దేన చ విద్విషాదరః’’

సఫలమైన కోరికకలిగి నిగ్రహానుగ్రహ  సమర్థు డైన పురుషునికి ప్రజలు తామంతట తామే స్వాదీనమౌతారు .కోపం లేని వాడితో స్నేహమైనా విరోధమైనా ప్రీతికాని భయంకాని కలగదు .అవసరాన్నిబట్టి కోపం, శాంతి ప్రదర్శించటం శూరలక్షణం .శూరోచితమార్గంలో మమ్మల్ని ఉద్ధరించు .కాని క్రోధం అంతశ్శత్రువు కనుక విడువ దగినది అని సందేహించ వద్దు.

  నువ్వు రాజ్యం చేస్తుంటే వీరగంధం పూసుకొని రథాలెక్కి మహాపట్టణాలలోసంచారం చేసే భీమసేనుడు ఇప్పుడు పాదచారియై ,ధూళి ధూసర శరీరం తో పర్వతాలమధ్య దైన్యంతో తిరుగుతున్నాడు .అతన్ని చూసి అయినా పరితాపం కలగటం లేదా ఇంకాసత్యపాలనమేనా .కనీసం తమ్ముల నైనా రక్షించు .పరాక్రమాదులలోదేవే౦ద్రునితో సమానుడు ,మనుష్యులు ప్రవేశించలేని ఉత్తర కురు దేశ౦లొ ప్రవేశించి, రాజులను  జయించి ,సువర్ణ, మణి,ముక్తాదులను కప్పంగా తెచ్చి  నీపాదలవద్ద ఉంచి భక్తితో పూజిం  చిన అర్జునుడు ఇవాళ రూప విహీనుడై అడవులలో తిరుగుతూ ,నీకు నారచీరలు తీసుకొచ్చే దుర్దశలో ఉన్నాడు .అతన్ని చూస్తుంటే నాకు కలిగే జాలి, నీకు కలగటం లేదా .మగాడివైపుట్టి దిక్కులు చూస్తూ ఉన్న నిన్నుఏమనాలో తెలియటం లేదు .హంసతూలికా తల్పాలపై హాయిగా నిద్రించాల్సిన సుకుమార శరీరులు నకుల సహదేవులు ,అడవులలో నేలమీద పడుకొనటం వలన మార్దవం పోయి వారి శరీరాలు కఠినమై,మట్టికొట్టుకుపోయి ,శరీర సంస్కారంలేక అడవిఏనుగుల్లాగా కృశించిపోయారు .వాళ్ళను చూస్తూ కూడా నీ సత్యవాక్పరిపాలన ,సంతోషం నశించకుండా ఎలాఉన్నాయో నాకు ఆశ్చర్యంగా ఉంది.అహో ఏమి ధైర్యం మహారాజా నీది !నీలాంటి అన్నగారు ఏ కాలంలోనూ ఉండి ఉండరు .

‘’ఇమామహం వేదన తావకీంధియం –విచిత్ర రూపాఃఖాలు చిత్త వృత్తయః

విచి౦త యంత్యాభావదాపదం పరా –రుజంతి  చేతః ప్రసభం మమాధయః ‘’

వీళ్ళందర్నీ వదిలేయ్.నీ సంగతి చూడు .ఇలాంటిపరిస్థితి లోనూ నీ బుద్ధిమారటం లేదు .అసలు నీ మనసులో ఏముందో బ్రహ్మ దేవుడికే తెలియాలి .పోనీ నా బుద్ధితో నీ చిత్త వృత్తి ని ఆలోచిడ్డాము అంటే ,పరుల బుద్ధులు అప్రత్యక్షాలుకనుక ,ధీరత్వ అధీరత్వాదులు అనేక రకాలుగా ఉండటం వలన అనుమాని౦చటానికికూడా శక్యం కాక ఊహించటం దుర్లభమౌతోంది .శత్రువుల చే నీకు కలిగిన పరాభవం, ఆపద లను ఎలాదాటాలి ,శత్రువుల్ని ఎలా చంపాలి అనిఆలోచించే నాకే తీరని దుఖం కలుగుతుంటే ,నువ్వు యెట్లా ఈబాధల్ని భరిస్తున్నావో అర్ధం కావటం లేదు .నీది గుండే నా , రాతిబండా అని అనుమానం వస్తోంది ‘’అని నిర్మొహమాటంగా సూటిగా పాండవులందరి వేదనా బాధా తానే ధర్మరాజుకు చెప్పి కర్తవ్యమ్ బోధించింది భావి పాండవ పట్టమహిషి ద్రౌపదీదేవి .దీనికి అయ్యగారిసమాధానం ఏమిటో తర్వాత తెల్సుకొందాం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.