11- జపనీస్ సాహిత్యం -6(చివరిభాగం )
పైషో-షోవా యుగం (1912నుంచి )
మొదటిప్రపంచ యుద్ధం మొదలైన దగ్గర్నుంచి జపాన్ లో మత సంబంధ సాహిత్యం ప్రచారం లో ఉంటూ ‘’కాగవాటో గొహికో’’అనే క్రైస్తవవమంత్రి సాహిత్యం ద్వారా మానవ సేవ బోధించాడు .షిపెన్నోకోఎపే-1920,పై యావోఇరు మోనో -1921అనే ప్రసిద్ధ నవలలు రాశాడు .నాటకకర్త మొనోజో షుక్కెటుసోనో డేషి ప్రముఖ రచన 1717లో చేశాడు.1866లో పుట్టిన టనిజక్ చిరో,1878వాడిన నగి కఫూలు కొత్త కాల్పనికోద్యమ నిర్మాతలు సహజవాదాన్ని పూర్తిగా ఖండించారు .తనిజకి రాసిన చిజిన్ నొఅయ్ ఆయన సాహిత్య తత్వానికి ప్రతిరూపం .యోషి ఇసము-1886,నగటామికిహికో-1870,టమురా టోషికో కూడా ఈరకమైన రచనలే చేశారు .
నవాదర్శవాదులు కూడా సహజవాదాన్ని ప్రతిఘటించి న వారే .వారిలో ముసుకోజి సనియట్సు 1885లో పుట్టి 1918లో కోప్సుకు మోనో,1920లోయూజో ,1926లో యాసో అనే ప్రసిద్ధ రచనలు చేశాడు .ప్రపంచం లోని అన్నిప్రాంతాలలోని పాత్రలను తీసుకొన్నాడు .చాలా రూపకాలూ రాశాడు .అరిసి మాట కేయో (1878-1923) మరోగొప్ప రచయిత. తక్కువ రచనలే చేసినా నవ వాస్తవ వాదానికి అద్దంపట్టాయి .కకుచి ,కన్అకుటగావా ర్యూనోనుకే,కుమేమసావో ,సటో మిటాన్,షిగా వోయూ లు ఇదే ధోరణిలో రాశారు .వీరిలోజనాదరం పొందిన కికుచి,రాసిన కిసెకి,చిచిక ఎదుటోజురోనో కోయ్ అనే ఏకాంకికలు బాగా ఆదరణ పొందాయి .1920తర్వాత పత్రికలలో సులభ శైలిలో నవలలు రాశాడు .షింజు ఫుజిన్-1920,సాన్ కటేయ్-1934,షోహై-1933అనే అతని నవలలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి .1923తర్వాత ‘’బున్ గేషింజూ’’అనే స్వంత మాసపత్రిక ప్రారంభించి నడిపాడు .దీనికున్న ప్రసిద్ధి మాటలతో చెప్పనలవికానిది .
గొప్ప కథలు రాసినవాడు అకుట గవమ్యానో సుకె(1892-1927),రషోమన్-1915,హన(ముక్కు )1916కధలు జగత్ప్రసిద్ధాలు .టైషో యుగం చివర్లో సామాన్య ప్రజా సాహిత్యం వచ్చింది .దీని ముఖ్యోద్దేశం ప్రచారం .శైలి లేదు వస్తువు వికృతం .ఆధునిక జపాన్ ఆలోచనా విధానం ఇందులో కనిపిస్తుంది .కొబయాషి-1903-33,హయాషి పుసో -1906,కిషి సన్జీ-1899,టకెడారి౦టారొ -1904,టోకునాగ నవోషి-1899,హయామా యోషికి-1894,మెయిడకో కోయి చిరో -1888ఈరకమైన కవులో సుప్రసిద్ధులు .
టైషోయుగం చివర్లో ‘’షిన్కంకమహా ‘’అనే మరో కొత్త ఉద్యమం బయల్దేరి యొకో మిట్స్ రీచియూమొదలైన వారు నాయకులయ్యారు .హృదయభావాలను స్పస్టగా వ్యక్తీకరించటమే వీరి ఉద్దేశ్యం .యోకో మిట్సు రాసిన కకై(యంత్రం ),గ్రంథం ముఖ్యమైనది .టంకా,హైకూ ,షిన్టైషి,సేన్ర్యు ,డోమో(బాలకవిత )అనే ప్రక్రియలన్నీ ఈకాలం లో వచ్చాయి .మెయిజి చక్రవర్తి 1852-1912,యోసనోహిరోసి-1873-1935,కుజోటకేకో మొదలైనవారు టంకా కవిత్వం లో ,మనవో కాశికి -1866-1902,నట్సు మెసోసెకి-1867-1916,తకనామా కోషి 1874,ఓనో బుషి మొదలైనవారు హైకూ కవిత్వం లో ,కునికిటడోస్పో1871-1908,షిమజకి టోసన్-1872,కిట హరా హకు షూ,మాగుచి యోనెజిరో’’ షిన్టైషి’’ కవిత్వం లో ,ఇనయా నజనమి -1870,బాలకవిత్వంలో ప్రసిద్ధులు ,కవటకేమోకు అమీ ,ఫుకుచి ఓచి-1841-1906,ఒక మోటో కిడో-1873,యమమోటో యూజో -1887,కుకట మొమోజో-1891లు ఆధునిక జపాన్ నాటకాన్ని తీర్చి దిద్దారు .సాంఘిక జీవితాన్ని చిత్రించే ‘’నోతోపాటుషిమ్పో,శిన్గెకి,కబుకి అనే నాటక విధానాలు .కాలక్రమ౦లో కబుకి ప్రక్రియ చాలా మార్పులు చెందింది .
జపాన్ కథా సాహిత్య రీతులు టైషుబుమ్గకు ,ట్సాజోకు బున్గకు సామాన్యులను బాగా ఆకర్షించాయి . అపరాధ పరిశోధన ,హాస్యం ,ఫామిలి లైఫ్ ,వీటిలో విషయాలు .మొదట్లో వాటికి స్థాయి లేకపోయినా ,కాని కికుచి కాన్ వగైరాలు ఉత్కర్ష కలిగించేట్లు రాశారు .ఫ్రెంచి జర్మన్ ఇంగ్లిష్ అమెరికన్ రచనలు చాలా జపాన్ భాషలోకి అనువదించటంతో పాఠకుల సంఖ్యగణనీయంగా పెరిగింది .1937లో చైనాతో యుద్ధం తోయుద్ధ సాహిత్యం బాగా వచ్చింది .హినోఆషి హె రాసిన’’ట్సుచి టు హీటై -1938(బురద, సైనికులు ),ముగి టు హీటై(గోధుమ ,సైనికులు )మొదలైనవి అసాధారణ ప్రచారం పొందాయి ..
1930లో జాతీయ భావం పెరిగి ,షింక్యోషో సెట్స్ అనే కొత్తతరహా నవల వృద్ధి చెందింది.ఆత్మీయభావనలు, ఆలోచనలు చిత్రీకరించటం దీని ఉద్దేశ్యం .నిత్య జీవిత సన్నివేశాలే కథా వస్తువులు .హైకూ కు దీనికి కొంత పోలిక కనిపిస్తుంది .1868నుంచి అనేక పాశ్చాత్య ప్రక్రియలు జపాన్ సాహిత్యం లోకి చేరి కలిసిపోయాయి .ఆధునిక సాహిత్యం లో ప్రతిభాసంపద కల రచయితలు తక్కువే అనే అభిప్రాయం ఉన్నది .
జపనీస్ సాహిత్యంలో నోబెల్ పురస్కారం పొందినవారు –కవబాటయసునారికి 1968లో ,ఓ కెంజబూరో కు 1994లో ,కజువోఇషిగురో కు 2017లో నోబెల్ ప్రైజులు వచ్చాయి ‘.
జపనీస్ సాహిత్యంపై ఇంత విస్తృత వ్యాస పరంపర రాయటానికి ఆధారం -ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి సుదీర్ఘ వ్యాసం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-20-ఉయ్యూరు