కిరాతార్జునీయం10
ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం ఏదీ ఉండదని నమ్ము .అంతేకాదు యాదవులు మాతృ ,పితృ బంధువులు మిత్రపక్షం వారు వారిని వదలి వెళ్లరు .సమయం వచ్చేదాకా దుర్యోధనునివైపే ఉంటూ వారంతా సమయం రాగానే యాదవపక్షం వైపే చేరటంఖాయం –
‘’అభి యోగ ఇమాన్మహీ భుజో –భావతా తస్య కృతః కృతావదేః
ప్రవిఘాటయితా సముత్పతన్ –హరిదశ్వః కమలాకరానివ ‘’
భీమా !12ఏళ్ళు అడవుల్లో 1ఏడు అజ్ఞాతం లో ఉంటామని మనం మాట ఇచ్చాం .ఆగడువుకు ముందే మనం వారిపైకి వెడితే, ప్రతిజ్ఞను విస్మరించిన వారమౌతాం .గడువు పూర్తయ్యాక యుద్ధానికి వెడితే సూర్యోదయం చేత తటాక పద్మాలన్నీ వికశించినట్లు యాదవాది రాజులంతా దుర్యోధనుడిని వదిలి మనవైపు చేరుతారు .కనుక ఇది మనకు యుద్ధ సమయం కాదు .మిగిలిన రాజులను కూడా వాడు మనల్ని అవమాని౦చినట్లే అవమానించక మానడు.అప్పుడు వారు పరాభవం భరిస్తూ పరాక్రమ శౌర్యాలను పణంగా పెడుతూ ఊర్కోలేరు .వారే వచ్చి మనవైపు చేరతారు .ముందుగా యుద్ధానికి వెళ్ళకపోతే వచ్చే లాభం ఇది.కనుక ఇదియుద్ధసమయ౦ కాదు మనకు .దుర్యోదనుడికి సమస్తరాజన్యం వీర విధేయంగా ఉందని మన చారుడు చెప్పాడుకదా నువ్వు ఇలా అంటావేమిటి అని సందేహం నీకు రావచ్చు .మదహంకారులు ఎప్పుడూ తమపనులను నిశ్శేషంగా చేసుకోలేరు .మదవికారం పెరిగి ,వాళ్ళను ఇష్టారాజ్యం గా ఆడిస్తాడు .మదం పెరిగితే గర్వం పెరిగి అవమానం చేయటానికి వెనకాడడు.దానితో వారికి అసంతృప్తి ,అసహ్యం కలిగి ,వారంతటికి వారే విడిపోయి మనదగ్గరకు వస్తారు .మదం వలన కలిగే అనర్ధాలను చెబుతా విను .దర్పాహంకారలున్నరాజు ఎప్పుడు ఎవరితో ,దేనిమీద .ఏది చేయకూడదో ఆ జ్ఞానం ఆశిస్తుంది .అప్పుడు మూఢుడై నీతిని వదిలేస్తాడు .అప్పుడు లోకానికి వాడిపై ద్వేషం పుడుతుంది .అది క్రమంగా పెరిగి రాజకార్య వైముఖ్యం ప్రదర్శిస్తారు .అప్పుడు ఎంతగొప్పరాజైనా ,పెను గాలి వీస్తున్నప్పుడు బాగా నేలలోకి ప్రాకిన వ్రేళ్ళుగల వృక్షమైనా కూకటి వ్రేళ్ళతో కూలిపోయినట్లు కూలిపోకతప్పదు.కనుక మదహంకారాలు వదిలేయాలి .వాడిని ఈ రెండూ పూర్తిగా ఆవహించాయి .కనుక రాజులను అవమానిస్తాడు .అదే వాడికి అపకారమౌతుంది .మదహంకారాలున్న రాజు చేత అవమాని౦పబడిన మంత్రులు మొదలైనవారు దూరమైనంతమాత్రాన ఆ రాజుకు వచ్చే నష్టం ఏమిటి అని అను కొంటున్నావా .బాగా బలిసిన చెట్టుకొమ్మలు ఒకదానితో ఒకటి ఘర్షణకు లోనై అగ్ని పుట్టి ఆ పర్వత భాగమంతా భస్మీపటలం చేసినట్లు ,అమాత్యాదులకు జరిగిన అవమానం వలన కలిగిన ద్వేషం పెరిగి ,రాజును సర్వ నాశనం చేస్తుంది .శత్రువు దుర్మార్గుడైతే ,బుద్ధిమంతుడు వాడి అభి వృద్ధికి ప్రతి క్రియ చేయకుండా ఉపేక్షి౦చాలి .వాడు ఈ అవమాన పరంపర కొనసాగిస్తూ తననాశనం తానె తెచ్చుకొంటాడు .అప్పుడు వాడిని జయించటం చాలాతేలిక కనుక ప్రతిక్రియ అక్కర్లేదు .దుర్మార్గుడైన రాజుకు మిత్రులే శత్రువులై వాడి ఆహ౦కారం ,అహంకారం వలన వాళ్ళు ద్వేషం పెంచుకొని రాజును నిర్వీర్యం చేస్తారు .అప్పుడు విజిగీషువు నది వేగంతో గట్లను చీల్చినట్లు శత్రువును సునాయాసంగా జయించవచ్చు ‘’అని తన మనసులోని ఆలోచనలన్నీ జిలేబీ చుట్టల్లాగా,ఒక్కొక్కటి బయటపెడుతూ ,తాను నిస్తేజంగా ప్రతిక్రియ ఆలోచించకుండా ఎందుకు ఉంటున్నాడో మహా మేధావి గా యుధిష్టిరుడు ఇంకా చెబుతున్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-2-20-ఉయ్యూరు