కిరాతార్జునీయం-9
భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి ఉండటం వలన నీలో క్రోధాగ్ని రగిలే ఉంది .దానితో శత్రువులను దహించి వారి భార్యలకు వైధవ్యం కలిగింఛి ప్రతిస్టపొందు ‘’అని కోపోద్రేకాలను ఆపుకోలేక పలికినపలుకులను విని ధర్మరాజు మదగజాన్ని వశపరచుకొనే మావటీడు లాగా శాంతవచనాలతో శాంతపరచే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నాడు –‘’రాజకీయం అంతా దట్టించి మంచి ఉపన్యాసమే ఇచ్చావు నీవాక్ ప్రపంచంలో నిర్మలమైన నీ బుద్ధి నిర్మలమైన అద్దంలో లాగా ప్రతిఫలిస్తోంది .ఇంతటి వాక్ వైశద్యం నీకు ఉందని నాకిప్పటిదాకా తెలీదు .నాకు గర్వ౦ గా కూడా ఉంది నిన్ను చూస్తె .పునరుక్తి లేకుండా మహాబాగా సూటిగా స్పష్టంగా చెప్పావు .నీ వాక్ నైపుణ్యం మెచ్చదగిందే .శాస్త్రానికి అనుకూలంగా చెప్పేటప్పుడు యుక్తి చూపించటం ,యుక్తికి అనుకూలంగా శాస్త్రాన్ని చూపించటం దుస్సాధ్యం .అప్పటికప్పుడు శాస్త్రం యుక్తిలకు విరోధం లేకుండా మాట్లాడటం చాలాకష్టం .మహా క్షాత్రవంతుడవుకనుక నీకే ఇది తగింది .ఇంతబాగా చెప్పినా నీ మాటలలో సిద్ధాంతం లేదని పిస్తోంది .చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచి౦ చేవరకు నీవాదన సమంజసం కాదనే అని పిస్తోంది .
‘’సహసా విదదీత న క్రియా –మావి వేకః పరమాపదాం పదం
వృ ణ తేహి విమృశ్య కారిణ౦ –గుణ లుబ్ధాస్స్వయమేవ సంపదః ‘’
ఆలోచించకుండా ఏ పనీ తొందరపడి చేయకూడదు .అలాచేస్తే లాభం లేకపోగా ఆపదలు వస్తాయి .బాగా ఆలోచించి చేస్తే కార్యసాఫాల్యం కలిగి ధనవ్యయం శరీరాయాసం తగ్గుతాయి .కనుక బాగా ఆలోచించే నిర్ణయం తీసుకొందాం .(ఈశ్లోకం లోకం లో బాగా వ్యాప్తి చెంది సూక్తిముక్తా వళి అయింది ).సాహసం తో కార్యం చేస్తే సాఫల్యం కావచ్చు విఫలమవ్వచ్చు .వివేకంతో ఆలోచించి చేయాలి .సకాలం లో చల్లిన విత్తనాలు మొలకెత్తి ఫలితం ఇస్తాయి .సంప్రదాయ విద్య శరీరానికి శోభనిస్తుంది .దానికి శాంతం వన్నె తెస్తుంది .ఎప్పుడూ శాంతంగా ఉంటె లోకం నిర్లక్ష్యంగా చూస్తుంది. సమయం వచ్చినప్పుడే శౌర్యం చూపితే పరాక్రమం శాంతానికి వన్నె తెస్తుంది .రాజనీతి పాటించి ప్రయత్నం చేస్తే కార్య సిద్ధి,గౌరవం కలుగుతాయి .సాహసిస్తే పరాజయం, అగౌరవంకూడా కలగవచ్చు .శాస్త్ర దృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయాలి .ఇలా చేసినా ఒకవేళ దైవికంగా అనర్ధం వచ్చినా వారి దోషం కాదుకనుక ని౦ది౦చ రాదు .జిగగీ షువులగు రాజులు క్రోధ వేగాన్ని అణచుకొని ,కార్య సిద్ధులను బాగా ఆలోచించి తప్పక తమకు విజయం కలుగుతుంది అని నమ్మినపుడు పౌరుషం చూపాలికాని ,ఫలని శ్చయం కాకుండా కార్యం చేయకూడదు .ఇక్కడే బుద్ధి సూక్ష్మతకావాలి .రాత్రి చీకట్లను పోగొట్టి ఉదయింఛి వృద్ధి పొందే సూర్యుడు లాగా పురుషుడు క్రోధజనిత అజ్ఞానాన్ని వివేకంతో తరిమేసి అన్ని పనులు ప్రారంభించాలి .మహా శూరుడైనా, కోపావేశంతో పని ప్రారంభిస్తే కృష్ణపక్ష౦ లోచంద్రకళలు నశి౦చినట్లు రాజు ఉత్సాహ,శక్తి ,సంపదలు నశిస్తాయి .బలవంతుడను నాకేమి అని క్రోధావేశం తో పని మొదలు పెట్టరాదు .క్రోధంతో కనులు మూసుకుపోయేవాడికి యుక్తాయుక్త విచక్షణ ఉండదు .దీనివలన లోకోత్తర సామర్ధ్యం వ్యర్ధమై ,కార్యం నెరవేరదు .అవసరాన్నిబట్టి కోపం శాంతం ప్రదర్శించాలి .సంరంభం పనికిరాదు .సంపదలు శరత్కాల మేఘాలలాగా చంచలాలు .ఇంద్రియ వసులకు సంపదలు చిరకాలం నిలిచి ఉండవు .జితే౦న్ద్రియునికే ఆ అదృష్టం దక్కుతుంది .వచ్చినకోపాన్ని అంతా పైకి ప్రదర్శిస్తే కార్యహాని తప్పదు.భీమా !పూర్వపు ఖ్యాతి ,ధైర్యం పోగొట్టుకొన్నావు .ఇది నీకు తగదు .క్రోధావేశం వదిలి శాంతంగా ఆలోచించు .సంపదలకు స్వతస్సిద్ధంగా చంచలత్వం లేదు కాని ఇంద్రియ నిగ్రహం లేని రాజుకు సంపదలు నిలవవు.యుక్తాయుక్త ,సమయా సమయ ,కార్యాకార్య జ్ఞానం దురాగ్రహమున్నవానికి నశిస్తుంది .అసమయ కోపం అనర్ధదాయకం ‘’అంటూ ఇంకా చెబుతున్నాడు ధర్మరాజు భీమసేనుడికి .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-2-20-ఉయ్యూరు —