కిరాతార్జునీయం-11
ఈ విధంగా శత్రువులచే పొందిన అపకారం, అవమానాలకు క్షుభితుడైన భీమసేనుడిని పరమ శాంత, రాజనీతి విషయాలతో యుధిష్టిరుడు ఊరడిస్తున్న సమయంలో కోరిన మనోరధం మూర్తీభవించి తనంత తానె వచ్చినట్లు వేదవ్యాసమహర్షి అరుదెంచాడు .పరస్పర విరోధం కల పశు పక్ష్యాదులను తన శాంత దృష్టితో విరోధం పోగొట్టి ,ప్రేమకలిగిస్తూ ,సమస్త పాపక్షయ కర తేజస్సు వెదజల్లుతూ ,మహా తపశ్శాలి ,ఆపన్నివారకుడు మూర్తీభవించిన పుణ్యరాశి నయనాన౦ద కారుడు వేదవ్యాసర్షి రాగా ,ధర్మరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు –
‘’మదురై రవశాని లంభయ-న్నపి తిర్య౦చి శమం నిరీక్షితైః
పరితః పటు బిభ్ర దేనసాం –దహనం ధామ విలోకన క్షమం ‘’
సహసోపగత స్సవిస్మయం –తపసాం సూతి రసూతి రాపదాం
దదృశే జగతీ భుజా ముని –సస వపుష్మా నివ పుణ్య సంచయః ‘’
మహర్షిని చూడగానే లేచినిలబడి ,మేరుపర్వతం పై సూర్యునిలా ప్రకాశింఛి ,యధోచిత అర్ఘ్య పాద్యాలతో సత్కరించి ,శా౦తం తో ఉచితాసనం పై కూర్చుండ జేసి నమస్కరించి ,బ్రహ్మ తేజస్సు తో దర్శనమిచ్చిన ఆ మహర్షికి ,చిరునగవుతో నిర్మల కిరణ భాసమానుడై ,దేవ గురునికి ఎదురుగా ఉన్న సంపూర్ణ చంద్రునిలాగా ప్రకాశించాడు .
ఇతి శ్రీ పదవాక్య ప్రమాణ పారీణ శ్రీ మహా మహోపాధ్యాయ కోలాచల మల్లి నాథ సూరి విరచితాయాం కిరాతార్జు నీయ వ్యాఖ్యాయాం ఘంటా పథ సమాఖ్యాయాం ద్వితీయ సర్గః ‘’
తృతీయ సర్గ
శరత్కాల చంద్ర కిరణాలులాగా,మనోహ్లాదకిరణ సమూహంతో ఉన్నత శరీరుడు ,నల్లని శరీరం ,పచ్చని జడలు కలిగి మెరుపులతో ఉన్నమేఘంలాగా ,ప్రసన్నతా సంపదకలిగి ,లోకాతి శయమైన ఆకార సంపదతో ,తెలియని వారికి కూడా స్నేహభావంకలిగించే వాడు ,పవిత్ర అంతఃకరణుడు అని తన ఆకారం తో అందరికీ తెలియజేసేవాడు ,అతిమధుర, అత్యంత విశ్వాస మైన చూపులతో మాట్లాడేట్లు కనిపించే వాడు ,అగ్నిహోత్రం మొదలైన ధర్మ ప్రతిపాదిత మైన పాపనాశాలైన శత్రువులకు కారణమైనవాడు ,సుఖాశీనుడు ఐన వేదవ్యాసుని,తనరాకకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ధర్మరాజు ‘’మహర్షీ !మా పుణ్యఫలం వలన మీ దర్శనభాగ్యమైంది.సకల శుభాలను,సుగుణాలను కలిగిస్తుంది .మేఘం లేకుండా వచ్చే ఆకస్మిక వర్షం లాగా మీ దర్శనం కలిగింది .ఏదో శుభం జరగబోతోంది అనిపిస్తోంది .మీ రాక మాకు మాన్యత కలిగించింది .మా యజ్ఞాలు సఫలీ కృతమయ్యాయి .నా శ్రేయస్సుకోరి నన్ను ఆదరించే విప్రుల ఆశీస్సులు సత్యాలయ్యాయి .బ్రహ్మ దర్శనం తో కొన్ని కోరికలు సిద్ధి౦చినట్లు,మీ దర్శనం తో మాకు ఐశ్వర్యం కలిగి దుఖం నశించి ,పురుషార్ధాలు సిద్ధించి ,కీర్తి విస్తరించి సకలమనోరదాలు ఈడేరుతాయి .అమృతమయుడైన చంద్రుని చూసినా, సుఖం పొందని నా నేత్రాలు ,మీ సన్నిధిలో ఆనందాన్ని పొందుతున్నాయి .బంధు వియోగ దుఖం అనుభవిస్తున్ననా హృదయం క్లేశం దూరమై మిక్కిలి సుఖంగా ఉన్నది .మహర్షులు నిస్ప్రుహులు .మా వంటివారివద్ద కోరదగింది ఏదీ ఉండదు కనుక ఎందుకు వచ్చారు అని అడగటానికి ఆధారమే లేదు .మీవంటి పెద్దలవచనాలు సకల శ్రేయస్కరాలు కనుక ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను మహాత్మా !’’అని ధర్మరాజు వాక్ వైభవంతో మనోహరంగా పలుకగా అతని వినయాదులకు ప్రీతి చెంది ,అతనికి జయం కలిగించే తలంపుతో మహర్షి సమాధానం చెప్పటం ప్రారంభించాడు .
‘’ధర్మ రాజా ! బంధువులమధ్య తీవ్ర విరోధం వస్తే పరిష్కరించి మైత్రి చేకూర్చినవారికి ఇహం లో కీర్తి ,పరం లో సుగతి కలుగుతుంది .నిస్ప్రుహులమై ,అడవులలో తపస్సు చేసుకొనే మా లాంటి ఋషులకు ఉభయ పక్షాలమీదా సమాన బుద్ధి ఉంటుంది అని వేరే చెప్పక్కరలేదు .ముముక్షువులకు కూడా సాధుజన పక్షపాతం ఉండటం సహజం .మీ ఉభయులపైనా సమాన ప్రేమ ఉండాల్సి వచ్చినా ,నీ సుగుణ సంపత్తి కి నా హృదయ౦ స్వాదీన మై ,నీకు జయం కలగాలని కోరుతోంది .నీలా౦టిసాదువుపై ఇలాంటి పక్షపాతం కలగినా ,నా మధ్యవర్తిత్వానికి ఏమీ భంగం రాదు .మీపెదనాన్న మోహపరవశంతో,సుగుణ శీలురైన ,సత్ప్రవర్తకులైన మిమ్మల్నిఅకారణంగా కొడుకులు అనే కనికరం కూడా లేకుండా విడిచి పెట్టేశాడు.అలా౦టి అవివేకి లోకంలో ఉండడు .దుర్జన సావాసం వలన జయం కలుగకపోగా ,మూల చ్ఛేదమైన ఆపదలూ వస్తాయి .మీపెదతండ్రి దుష్ట చతుస్టయమైన కర్ణాదుల మంత్రాంగం ప్రకారం నడుస్తున్నాడు .కార్యసిద్ధి కలగకపోగా ,సమూలనాశక విపత్తులు సంభవిస్తాయి వారికి .ఇది ముమ్మాటికీ నిజం .
‘’ ఆనాడు నిండు సభలో ధర్మం వదిలేసి ,ద్రౌపదీ వస్త్రాపహరణం చేస్తున్నా ,లోపల పగ రగిలిపోతున్నా శాంతమూర్తిగా ఎవరినీ దూషించకుండా ధర్మమార్గగామి వై ,నీ ధర్మం కాపాడుకొన్నావు .నువ్వు రక్షించిన ధర్మం నిన్ను రక్షిస్తుంది .కనుక శత్రువులను జయించి సమస్తభోగాలు పొండుతావని నమ్ము .-
‘’పథశ్చుతాయాంసమితౌ రిపూణా౦- ధర్మ్యాందధానేన దురం చిరాయుః
త్వయా విపత్స్వ ప్యవిపత్తి రమ్య-మా విష్క్రుతం ప్రేమ పరం గుణేషు’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-2-20-ఉయ్యూరు