కిరాతార్జునీయం-13
అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు చేయటానికి వెళ్ళబోగా దుఖం భరించలేని ద్రౌపదీ దేవి కన్నీరు నిండగా ,నల్లకలవలపై మంచు బిందువుల సమూహం ఉన్నట్లు ,నేత్రాలు విప్పటానికి ప్రతిబంధకమై ,మూసుకొంటే కన్నీరు రాలి అమంగళకరం అవుతుందనే సందేహంతో మూసుకోలేకపోయింది .నిర్మామైన సహజప్రేమకల ఆమె చూపు ను దారిబత్తెంగా అర్జునుడు గ్రహించాడు .అర్జునుని చేరి గద్గద కంఠం తో ‘’అగాధమైన బురదలో కూరుకు పోయిన ధనాన్నిఉద్ధరి౦చి నట్లు,శత్రువుల కపటోపాయాలచేత మునిగి పోయిన మన గౌరవాన్ని ఉద్ధరించటానికి తీవ్ర తపస్సు చేయబోతున్నావు .ఫలసిద్ధికలిగే దాకా సంయమనం తో ఉండాలి .తపస్సిద్ధికోసం సోదరులకోసం నాకోసం కష్టాలను ఓర్చుకొని ,నా వియోగానికి కృంగిపోకుండా తపస్సిద్ధిపొంది మా అందరి గౌరవం కాపాడు .సుఖం కీర్తి మహిమలకోసం తపస్సు చేస్తే బందువియోగం గుర్తుకురాకుండా అంకితభావం తో తపస్సు చేస్తే ,అనురాగవతి ఐన స్త్రీలాగా తపస్సిద్ధి దాన౦తట అదే వస్తుంది . శత్రు సంహారం కోసం క్షత్రియులకు బ్రహ్మ ఓజస్సును తీసేశాడు .అపకారాలవలన విజయైక జీవులతేజశ్శాలుర మానం నశి౦ప జేయబడింది .అపకారాలు ఘోర కృత్యాలవలన ,జుగుప్సిత వృత్తాంతాలను తలవంచుకొని బంధువులు ఇతరరాజులు నమ్మాల్సి వచ్చింది .ఇలాంటి ఘోరం జరుగుతుందా అని ఆశ్చర్యపోయారుకూడా .నికారం అంటే అపకారం దిగంతవ్యాప్త యశస్సును కృంగదీసి,పూర్వ పరాక్రమ కార్యాలను మరిచేట్లుచేసింది .ఆ అపకారం మనసును దహించి వేస్తూ నిద్ర పట్ట కుండాచేస్తోంది .నువ్వు దంతం కోల్పోయిన ఏనుగు లాగా ,అభిమాన ధ్వంసం కలిగి ఆనవాలు పట్టకుండా ఉన్నావు .కీర్తి క్షయం వలన ఎండిపోయిన సముద్రంలా ఉన్నావు .సమర్ధులైన వీరులైన భర్తలఎదుట కులస్త్రీ శిరోజాలను శత్రువు లాగితే నీ బలపరాక్రామాలు కాల్చానా అని లోకులు ఆడిపోసుకొంటు౦టే పూర్వపు ధను౦జయుయుడవేనా అనిపించి అలా ఐతే నీకు వైరూప్యం, నాకు పరాభవం జరిగేదికాదు.ఇప్పటికైనా నీ బలపరాక్రమాలు,శత్రువులు చేసిన పరాభవాలు స్మరించుకొని ,నీపేరును సార్ధకం చేసుకో .లేకపోతె ఇక్కడ సన్యాసిగా సిగ్గులేనివాడివిగా భిక్షా వృత్తి తో బతుకు .ఇంతకంటే చెప్పాల్సింది ఏదీ లేదు . సాదుజనాన్ని రక్షించలేని క్షత్రియుడు ,శత్రు సంహారం చేయలేని ధనుస్సు సార్ధక౦కాదు .కనుక సార్ధక క్షత్రియుడవు కావలసింది .నీజాతిని నీ ధనుస్సు సార్ధకం చేయుగాక .మాలాగానే నీ ధనుర్బాణాలు నిష్ప్రభావాలై నామావ శిష్టం గా కొన ఊపిరులతో దిక్కులు చూస్తూ ఉన్నాయి వాటిని ప్రయోగించి సార్ధకత కలిగించి మమ్మల్ని ఉద్ధరించు
‘’బలపరాక్రమాలున్నా ప్రజ్ఞను చూపని సింహాన్ని చూసి ఏనుగులు లెక్కచేయకుండా దాని కేసరాలను ఊడ బెరికినట్లు ,నీ తేజస్సు చూపకపోతే శత్రువులు నిన్ను లక్ష్యపెట్టరు.నీ ప్రజ్ఞ చూపించే సమయం వచ్చింది .దినలక్ష్మి సూర్యుని పొందినట్లు గొప్పకార్యభారం నిన్ను వరించింది .ఉత్సాహంగా కార్యభారం నెరవేర్చి లోకం లో శ్రేష్ట యోగ్య పురుషుడవు గా కీర్తి పొందు .ఇంద్రకీలాద్రికి వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసి కార్యసిద్ధి సాధించు మేమూ నీకు ఏరకమైన ఇబ్బందులు రాకూడదని దేవేంద్రుని ఉపాసిస్తాం .జయలక్ష్మి తో తిరిగిరా .ఏమరు పాటులేకుండా ఉండు.వేదవ్యాసమహర్షి అనుగ్రహించినట్లు తపస్సిద్ధి పొంది విజయుడవై శత్రుసంహారం చేసి మమ్మల్ని సంతోషపెట్టు ‘’అని ద్రౌపది బహు నిపుణ౦ గా చెప్పినమాటలు విని అర్జునుడు గ్రీష్మాదిత్యుని లాగా వెలిగాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-20-ఉయ్యూరు