కిరాతార్జునీయం-14
ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని పలికినమాటలు అర్జునుని తేజస్సు పెంచాయి .
పాండవ పురోహితుడు ధౌమ్యుడు మంత్రాలతో అభి మంత్రించి ఇచ్చిన ఆయుధాలను ధరించిన గాండీవి.సౌమ్యాకారుడైనా ,అభిచార కర్మ ప్రయుక్త మంత్రం లాగా ,తనకు ముందు శత్రువులను చూస్తున్నట్లు దుర్నిరీక్షుడయ్యాడు.అమోఘమైన ఆకర్షణ కలిగి ,ప్రసిద్ధ గుణ ధ్వని,బాణ విమోచన కలిగిన ధనువును ధరించి ,శత్రువులకు కనిపించని ,నిశిత ఖడ్గ యుక్తాలైన పెద్ద అమ్ముల పొదులను కట్టుకొని ,ఖాండవ దహనం చేసే దేవేంద్రుని వజ్ర ప్రహారాలకు ఆచ్చాదనకలిగించే కాంతి కలిగి ,దీప్తి వంతమై నభో మధ్యమం లో వెలిగే కవచాన్ని ధరించి ,కుబేర అనుచరుడైన యక్షుడు చూపించే మార్గాన్ని బట్టి ,ఇంద్రకీలాద్రికి బయల్దేరుతున్న అర్జునుని చూసి అక్కడి మహర్షులు అతని ఎడబాటు తట్టుకోలేక దుఖిస్తున్నారు .
‘’అనుజగురు రథ దివ్యం దుందుభి ద్వానమాశా –స్సుర కుసుమ నిపాతైర్వ్యోమ్ని లక్ష్మీర్వితేనే
ప్రియమివ కథ యిష్య న్నాలింగ స్ఫురంతీం-భువన మనిభ్రుత వేలా వీచి బాహుః పయోధి ‘’
ఇతి భారవి కృతౌ కిరాతార్జునీయే మహాకావ్యే లక్ష్మీ పడలాంఛనే తృతీయ సర్గః ‘’
ఈ విధంగా దేవ కార్యార్దమై అర్జునుడు బయలు దేరి వెళ్ళే సమయం లో దిక్కులలో దివ్య దుందుభులు మ్రోగాయి .ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు .సముద్రుడు ఉప్పొంగి కెరటాలతో ఒడ్డును ఒరుస్తూ ‘’అర్జునుడు కొద్దికాలం లోనే నీ భారాన్ని పోగొడతాడు ‘’అని తనప్రియురాలు భూమితో ఊరడింపుగా చెబుతున్నాడా అన్నట్లుగా గర్జించించాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-2-20-ఉయ్యూరు