భాష –ఐరోపా దేశం లో అనేక దేశాల సాహిత్యానికి ప్రాణం ,భారతీయ వాజ్మయానికి సంస్కృత భాషలాగా అంతర్యామిగా,ఆదర్శ ప్రాయంగా ఉన్నాయి గ్రీకు భాష ,సాహిత్యాలు .గ్రీకు లో పండితులైతే సర్వం కరతలామలకం అనే అభి ప్రాయం ఉంది .’’కోటీశ్వరులే గ్రీకు సాహిత్యం లో పారంగతులౌతారు . గ్రీకు బోధించాలన్నా ఆచార్యులు కోటీశ్వరులై ఉండాలి ‘’అన్నాడు బెర్నార్డ్ షా .అంత ఖరీదైన భాషా సాహిత్యాలన్నమాట ఆనాడు .
గ్రీకు ఆర్యభాషా కుటుంబానికి చెందిన భాష .విభక్తులు ,వికరుణులుపూర్తిగా ఉండటం తో నేర్వటానికి అమితాసక్తి, ఓర్పు,పట్టుదల ఉండాలి .అందుకే ఏదైనా అర్ధం కాకపొతే ‘’గ్రీక్ అండ్ లాటిన్ ‘’గా ఉంది అనే సామెత వచ్చింది .సంస్కృతం వస్తే దీన్ని నేర్వటం’’ వీజీ ‘’.మా౦డలీకాలూ ఉన్నాయి .డోరిక్,అట్టిక్ లు వీటిలో ముఖ్యమైనవి .అట్టిక్ భాష నుంఛి వచ్చిన వాటినే పూర్వం గ్రీకులు సాహిత్యానికి వాడారు .దీనికి వికృతి ఇప్పుడు గ్రీకులో వ్యవహారంగా ఉన్న భాష .
సాహిత్యం –క్రీ.పూ.323వరకు వీరగాథలు,ప్రజాస్వామ్య నగరరాజ్యాలు ,అత్యుత్తమ రూపకాలు ,వివిధరంగాలలో జ్ఞానం ,దార్శనిక వివేచన గ్రీకు సాహిత్యం లో వర్ధిల్లాయి .అందుకే అది ‘స్వర్ణయుగం ‘’అన్నారు .ఈ సాహిత్యకారులు ఆసియా నుంచి వచ్చి ‘’మినోస్ ‘’నగరం లో స్థిరపడి ,క్రమంగా గ్రీక్ దేశం చేరారు .క్రీ.పూ 8వ శతాబ్దిలో ప్రక్క దేశాలవారైన’’ పొయేనీషియన్’’ ల నుండి హిబ్రు లిపిని తీసుకొని ,5 వ శతాబ్దిలో లిఖిత రూప గ్రంథాలను తయారు చేసుకొన్నారు .
గ్రీకుల మొదటికావ్యం క్రీ.పూ.10 వ శతాబ్ది కి చెందిన గుడ్డివాడైనకవి ‘’హోమర్ ‘’రాసిన ‘’ఇలియడ్’’.ట్రాయ్ ముఖ్యపట్టణం గా ఉన్న ఆసియాలోని ‘’ఇలియం’’ దేశం తో గ్రీకులు ఐదేళ్ళు యుద్ధం చేసి వారిని జయించిన వీర ఐతిహాసిక పురాణ గాథ ఇలియడ్.దీనిని వర్జిల్, మిల్టన్ మొదలైన కవులు అనుకరించారు .పదవ సంవత్సరం లో జరిగిన యుద్ధాన్నే హోమర్ ముఖ్య కథ గా తీసుకొన్నాడు .ఇందులో ఎకిలీన్ ,హెక్టర్ మొదలైన ఆదర్శ వీరుల చిత్రణ అత్యద్భుతం ,రసవంతంకూడా .యుద్ధ వర్ణన ,సైనిక విన్యాసాలు సినిమాచూస్తున్నంత స్పష్టంగా కళ్ళకు కట్టించాడు .భావన ,కవితా ప్రవాహం,భావ చిత్రాలు ,శబ్దార్ధ కలయిక మొదలైనవి అతిలోక సౌందర్యంగా దర్శనమిస్తాయి .చైతన్యం ,ఉదాత్తత కల మహాకావ్యం ఇలియడ్ అంటే క్లాసిక్ .
యుద్ధం అయ్యాక తుఫానులకు గురై ,దారి తప్పి ఇంటిని వెదుకుతూ వచ్చిన వీరుడు ‘’యులిసిస్’’ ,అతని అనుయాయుల గాథలను హోమర్ మహాకవి ‘’ఒడిస్సీ ‘’పేరిట రాశాడు .ఈ గాథలను హోమర్ వీధుల వెంట పాడుకొంటూ పోతూ ఉంటె ,తరువాత తరం వారు వాటిని సేకరించి భద్రపరచారు .మధ్యమధ్య కొన్ని తర్వాత కాలపు రచనలు అందులో చొప్పించారు .దార్శనికుడు ,సమీక్షకుడు ఐన’’ ప్లేటో’’ పండితుడు అన్నిటిని నిశితంగా పరిశీలించి ,శోధించి ,పరిష్కరించి అసలైన హోమర్ కావ్యాన్ని లోకానికి అందించి ఆమహాకవి శ్రమకు సార్ధకత కల్పించాడు .
తర్వాతకాలం లో హోమర్ కావ్యాలకు అనుకరణలు చాలా వచ్చాయి .8వ శతాబ్దం లో దేవతా స్తుతులు చాలావచ్చాయి .సామాన్యుల భాషలో ‘’హేసియోడ్’’కవి ఖండకావ్యాలు రాసి వారి భావాలను వర్ణించాడు .గ్రీకుల పౌరాణిక విశ్వాసాలను ‘’థియో గోని ‘’గ్రంథం లో విశ్లేషించాడు .హోమర్ వాడిన భాష గ్రీసు దేశం లోని ఇయోన్ ప్రాంతభాష .ఈ ప్రాంతం తో భారతీయులకు సంబంధాలు బాగా ఉండటం వలన గ్రీకులను’’ యవనులు ‘’అని పిలిచారు యవనభాష ను ఎసియోడ్ వదిలేసినా ,దార్శనిక వివేచనతో అక్కడి వారు ఛందో రూపం లో క్రీ.పూ.6 వశతాబ్దం లోనే రాశారు .అప్పుడే ‘’ఆర్ఫిక్ ‘’సంప్రదాయం వచ్చింది .క్రమంగా క్రీ.పూ.5 వ శతాబ్దికి ప్రజాస్వామ్యం ,వ్యక్తిస్వేచ్చ ,అభి వృద్ధి చెందాయి .గేయకవిత్వం బాగా వచ్చింది ‘’లైర్ ‘’అనే వాయిద్యంతో ఈ గేయాలు పాడేవారు .లైర్ నుంచి వచ్చిన గీతాలుకనుక వీటిని ‘’లిరిక్’’ లు అన్నారు .వీటిలో శోకం ,విరహం ఎక్కువ .ఆర్టేయస్ ,సొలాన్ ,థి యోగ్నిస్ లు రాసిన రాజకీయ గీతాలు లభించాయి .క్రీ.పూ 7 వ శతాబ్దం లో ఇయామ్బిక్ ఛందస్సులో ‘’ఆర్కి లోకుస్ ‘’కవి భగ్నప్రేమ గూర్చి రాసి పాడాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-20-ఉయ్యూరు
—