ప్రపంచ దేశాల సారస్వతం
19-హిబ్రూ సాహిత్యం -2
అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం సాడియా వెన్ జొసెఫ్-892-942 కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ లేడే ఓథ్’’.దీనితో పేరు ప్రశస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి .ఈ గ్రంథంతో యూదుల దార్శికత మీమాంస విదేశీ ప్రభావం నుంచి ముక్తి పొందింది .
అరబ్బుల అధీనం లోని యూదులు 10 వ శతాబ్దం నుంచి మాతృభాషలో కావ్యాలు ,వైజ్ఞానిక రాచనలు చేశారు .వివిధ దేశాలకు వలసపోయిన యూదులు ఆయా భాషలలో నిమగ్నమైనా ,మత గ్రందాల పై వ్యాఖ్యానాలు రాస్తూనే ఉన్నారు .వీరిలో 10వ శతాబ్దికి చెందిన రబేనూ జేర్షో,11వ శతాబ్ది వాడైన రబ్బీ షేలోమోయిషాకే ముఖ్యులు .స్పెయిన్ లో హిబ్రూ సాహిత్యానికి స్వర్ణయుగం వచ్చింది .సాడియా శిష్యుడు డునాష్ బెన్ లబరాట్-920-970 మొదటి సారి మాత్రాచందస్సు ఉపయోగించి నా,ఈయుగానికి ఆదికవి మాత్రం ఇబన్ నగ్డి లాహ్-1033-1055.సుందరంగా ధారావాహిక శైలిలో భక్తీ గీతాలు ‘’బెన్ధిలిం’’రాశాడు ఇతని ఇతర రచనలు –బెన్ మిష్లె,బెన్ కో హెలెథ్ .సాల్మన్ ఇబన్ గాబి రొల్-1020-1052 నిరాశావాదం తో మధురకవిత్వం రాశాడు .కవిత్వం లో వేదన, గంభీరత ,కరుణ త్రివేణీ సంగమ౦గా ప్రవహిస్తాయి .మిబ్బహార్ హాపేనీ మరో ప్రముఖ కవి మాధుర్య ప్రసాద గుణాలతో కవిత్వం రాశాడు .ప్రేమ,పెండ్లి, పుట్టుక చావు ,ప్రార్ధనలను మనోహర శైలిలో రాసి మంత్ర ముగ్ధులను చేశాడు .పహారోమి విత్రమైన జియన్ గిరి పై రాయటం వలన ‘’జియాన్ గిరి గాయకుడు ‘’అని పేరు పొందాడు .
అబ్రహాం ఇబన్ ఎజ్రా -1092-1167 స్వాధీనమైన భాషతో పాండిత్య
ప్రకర్ష తో కవిత్వం చెప్పాడు .స్పెయిన్ యూదులలో హిబ్రూ భాషలో ప్రథమకవి. మహా మేధావి తార్కిక శిరోమణి గొప్ప విద్వాంసుడు మోజెస్ బెన్ మైమోన్ మైమొనైజ్ద్ తాల్ముద్ కు చోటు కల్పించి ,యూదుల దార్శనిక మీమాంసకు ,అరిస్టాటిల్ దర్శనానికి భేదం లేదని నిరూపించాడు .ఇతని రచన ‘’పధ ప్రదర్శకం ‘’ఈయనకాలం లోనే హిబ్రు లోకి అనువాదమైంది .స్వర్ణయుగం లో చివరికవి యుదా బెన్ సాల్మన్ అల్ హఠీజీ-1155-1225వ్యంగ్యంతో ‘’మక్బరత్ తహకీ మోనీ ‘’లో మాధుర్య విలసిత కవిత్వం చెప్పాడు .ఆనందం పై సేఫెర్ శ ఆశు ఇం అనే గద్య రచన చేశాడుజోసెఫ్ ఇబన్ జబారా -1150.
ఇటలీకి చేరిన యూదులలో ఇమాన్యుయాల్ బెన్ సాల్మన్ హారోమి -1265-1330 స్వర్గ నరకాల గురించి ‘’హాథో ఫెట్ బేహా ఎడెన్’’అనే మహాకావ్యం డాంటే కవికి మార్గదర్శి అయింది .అశ్లీలం ఉన్నా తత్వ దర్శనం చేశాడు .రహస్యవాద కవులు ఎక్కువగా వచ్చారు .వీరిలో మోజెస్ డెలియోన్,పుట్టు గుడ్డి ఐజేక్ లు ముఖ్యులు .ఎక్కువమంది మధుపానం పై మధుర కవితలు రాశారు .
14 వశతాబ్దం తర్వాత యూదులపై ఐరోపా వాసులు దాడులు చేసి వెంటబడితే ఆపత్కాలం వచ్చింది యూదులకు .మోజెస్ జా కూటో-1625-1697హిబ్రూ భాషలో మొదటినాటకం రాశాడు .మోజెస్ హాయింటుజ్జాట్టో-1707- 47 కవిత్వం తో ఆధునిక యుగం ఆవిర్భవించింది .అప్పటి వరకు ఉన్న కృత్రిమశైలి వదిలేసి 17యేటనే అలంకార గ్రంథం తోపాటు మరో 30 గ్రంధాలు రాసిన మేధావి .మఅశేసి శోన్,మిగ్డాల్ ఏజ్,లఏశరిం దేహిల్లాహ్ నాటకాలలో గొప్ప భావుకత కనిపిస్తుంది .ఇతని శిష్యుడు డేవిడ్ ఫ్రాంకో మెండిజ్ రాసిన నాటకం ‘’జేముల్ అధాలి యాహ్’’.18వ శతాబ్దిలో మెన్డేల్స్ సొన్ మొదలైనవారు ‘’మీ ఆస్ఫిం ‘’అనే పత్రిక నడిపి,యూదుల లౌకిక సాంస్కృతిక దృక్పధానికి దారి చూపారు .దీనితో ఇతరదేశ యూదులలోకూడా కొత్త చైతన్యం వచ్చింది .
19 వశతాబ్ది ప్రభావశీలకవి జుడాహ్ లోయెబ్ గార్డ న్-1830-1892.ఈకాలం లోనే అబ్రహాంమాపూ-1808-67నవలా రచనకు నాంది పలికాడు .కథా కథానిక ఇప్పుడే విపరీతంగా వచ్చాయి .యూదులను రాష్ట్రీయ భావన ,ఆశయాలను కలవర పరచినపుడు హిబ్రు వాజ్మయం అనేక రకాలుగా వృద్ధి చెందింది .1896లో’హాయో౦’’అనే దైనిక పత్రిక ప్రారంభమైంది .ఐజాక్ లో ఎబ్ పెరెజ్-ఈ1851-191 కథాకారుడు కూడా .సంమోహనమైన శైలితో పాఠకులను ఉర్రూత లూగించాడు .సౌందర్యం ,భావుకత ,అనుభూతి ప్రధాన రచనలు చేశాడు .కథానికులలో రూబెన్ బ్రెయ్నిన్-1862-1939 ప్రముఖుడు .ఆధునిక కవులలో హాయిం నమ్మాన్ బియాలిక్ -1873-1934 జాతీయ గీతాలురాసి ప్రసిద్ధి చెందాడు .
20వశతాబ్దిలో ప్రాచీన మార్గాన్నికొత్త దృక్పధంతో సమన్వయ౦ చేసే కవులు వచ్చారు .జోసెఫ్ క్లౌన్నెర్,జోషూ వాదాన్ , బెర్డి చేస్కి ఈమార్గ రచయితలు .భావుక కవి సాల్ చేర్ని హోవ్స్కీ -1873-1944ప్రకృతిని ,జాతీయతను కవితా శక్తితోకలిపి మాధుర్య సౌకుమార్య రచనలు చేసి అత్యంత ప్రభావశీలి అయ్యాడు .అబిగ్డోర్ హామైరే సమకాలీన జీవితాన్ని కవితలలో కథలలో నింపాడు .ఇజ్రాయిల్ దేశం లో నేడు హిబ్రూ సాహిత్యం మూడు పూలు ఆరుకాయలుగా వికసిస్తోంది ,జోల్కిం హీ ,ఎబర్ హడని,జాడా యూరీమొదలైన వారు నూతనోత్సాహంతో హిబ్రూ సాహిత్య సేవ చేస్తున్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-2-20-ఉయ్యూరు
—