కాశీ’’వారి వేంకటేశ్వర శతకం
శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం భోజనం చేసి కాసేపు కునికి ,మధ్యాహ్నం 3కు లేచి చదివి ,రసవంతమైన దారాశుద్ధిగల భక్తి శతకం కనుక శివరాత్రినాడు దానిపై స్పందిస్తే భక్తీముక్తీ అనిపించి రాస్తున్నాను .ఇప్పటికే భవానీ శతకం ,కులశేఖరాళ్వార్ ముకుందమాల-అనువాదం ,ముకుంద శతకం శతకం ,కాఫీ శతకం రాసిన అనుభవం కవిగారిది .కొంతకాలం మిత్రుడు ఎన్. సి .హెచ్. చక్రవర్తి గారితో కలిసి జంటకవిత్వమూ రాశారు .కవి విశ్రాంత కృష్ణా జిల్లాపరిషత్ ప్రధమ శ్రేణి తెలుగుపండితుడు కావటం తో, పాఠాలలో కవిత్వం చెప్పీ చెప్పీ ,చదివే రోజుల్లో క్షుణ్ణంగా నేర్చీ నేర్చీ అనుభవమున్నవారు .నాకు ఈ పుస్తకం తోనే వారి పరిచయం .నన్నెలా తెలుసుకొని పంపారో ఆ శ్రీనివాసునికే ఎరుక .
సురధుని కడుగు పాదాలకు శతకం అంకితం చేశారు .మొదటిపద్యమే మనోహరంగా ఉంది .’’శ్రీవర పద్మనాభ రవి శీతకరాక్ష భుజంగ మర్దనా ,-క్ష్మావర పద్మపద హరిచందన చర్చిత కైటభారి’’అంటూ ధారగా పారింది కవిత్వం భక్తి నిండారగా .తనబ్రతుకు పండుగ అవటానికి ఈరచన చేశారట .పుష్పాలు ఫలాలు తోయం ఇద్దామనుకొంటే అన్నీ ఎంగిలి చేసినవే కనుక ‘’ఎంగిలికాని నామనము నిచ్చెద’’అంటారు భక్తీఅర్తీ చమత్కారాలతో .రసవత్తరంగా వేణువు వేణువైనట్లు శ్రీనివాసుడు వకుళమాతను చేరాడట .’’మానసవీధి,నీ మృదుల మంజుల భావపరంపరల్ సదా జ్ఞాన పరీమళమ్ములువెదజల్ల ‘’కోరిక కవిగారిది .అర్ధం కాని నుదుటి గీతలు సార్ధకం చేయమని కోరారు .వార్ధి భుజ౦గ తల్పమున ,వార్ధిజ పాదములొత్త,లోకముల్ వర్ధిల జేసే ‘’ జగన్నాయకుడు తన క౦టకమయ బాటకు బాసటగా ఉండమని కోరారు .తాను మంద బుద్ధియై ‘’మోక్షమనే కమలాన్ని’’వదిలి ఐహిక సుఖాల వెంటబడిన వాడినని , అమలిన భక్తి నిమ్మని వేడుకొన్నారు .నారాయణ వృక్షవంత శిఖరంమున నిలిచిన వేంకటేశ్వరుడు అనటం బాగుంది .ఆలయ పాలక వర్గం భక్తులిచ్చే విశేష ధనరాసులను స్వామికై౦కర్యానికి , లేక లోక కల్యాణానికి ఉపయోగించకుండా ‘’తెగ మింగే హైన్య వికార వర్తనులను ‘’అంతం చేయమని నిష్కర్షగా కోరారు .మహాభక్తుడు అన్నమయ్య ‘’సురరిపు శోణిత ప్రభల శోభిలు నందకం ‘’శ్రీనివాసునికి ‘’సరససురాగ భావములు జాను తెనుంగున నాలపించి కాంచన హారం వేశాడట.కొండంత వేల్పు తనను శతాధిక పద్య రచన తో నుతింప జేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ,భవసాగర తీరాన్ని దాటి౦పజేసి,దయ చూపిన ‘’దాన వార్తి కర ,శుక్తి సుదర్శన ధారి’’మాధవునికి జోతలు సమర్పించి ‘’నను జూడవె ప్రేమను వేంకటేశ్వరా ‘’ అంటూ శతకం పూర్తి చేశారు మధు మధురంగా మధురకవి కాశి రాజు లక్ష్మీనారాయణ కవి .
మహా శివరాత్రి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-20-ఉయ్యూరు