కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’
నాకు పరిచయం లేకపోయినా మళ్ళీ రెండు కవితా పొత్తాలుపంపారు శ్రీ కాశీరాజు లక్ష్మీనారాయణ పండిత కవి .ధన్యవాదాలు .రెండూ 2019జులై లో విడుదలైన తాజా పుస్తకాలే .మొదటిది ‘’కాఫీ శతకం ‘’రెండోది ‘’ముకుంద శతకం ‘’.మొన్న 6వ తేదీ అందగా ఇవాళ 8వ తేదీ చదివేశాను .శ్రీ జొన్నవిత్తుల ‘కాఫీ దండకం ‘’తో సుప్రసిద్దుడయ్యాడు .ఈకవికీ ‘’కుదిరితే ఒక కప్పు కాఫీ ‘’అలవాటు బాగా తెలిసిన వాడే .కాఫీ ఆవిర్భావం ,కలిపే తీరు,రంగు రుచి వాసనా , ఇచ్చే కిక్కూ,కమనీయంగా వర్ణించాడు .ఐతే అట్టమీద బొమ్మ కొంచెం ‘’రాక్షసం ‘’గా ఉందని పించింది .
‘’తొలిచూపు వలపు ,తొలకరిచిరు జల్లు ,తుహినం ,కులసతి స్మేరం కంటే కాఫీ ‘’చిలిపిగా ఊరిస్తుందట కవికి .మనకీ అంతేగా .’’చక్కని కాఫీ పొడితో –చిక్కని సారమ్ము (డికాషన్ )దీసి చిచ్చర పాలన్-చక్కర కల్పినతోడనె’’చవులూరిస్తుంది .ఎందుకండీ ‘’ఎలనాగ ఆలింగనం ,వలకారి పయోధరాలు ?’’వాటిల్లో లేని మాధుర్యం కాఫీలో కలదని’’ కప్పు’’ బజాయించి చెప్పాడు కవి .రోగీ వైద్యుడూ ఒకే రకంగా ఆలోచిస్తే కేమిస్ట్రి కుదిరి వ్యాధి దూరమౌతుంది .అందుకే డాక్టర్ ‘’త్వరగా ఉపశన మీయ ‘’జ్వరం బిళ్ళను కప్పు కాఫీతో వేసుకోమని సూచించటం తో ‘’వెజ్జునకు అనుజ’’అవుతుందట కాఫీ సోదరి .ఎవరి టేస్ట్ వారిది .కొందరు వేడి వేడిగా కొందరు చల్లర్చుకొంటూ కొందరూదుకొంటూ పలు విన్యాసాలతో కాఫీ దేవిని స్వీకరిస్తారు .ఆవైభోగాన్ని కవి ‘’పొగతో కొందరు ద్రావగ-నెగబీల్చుచు గొంతమంది ,ఎక్కటి రొదతో –నెగసెడి మక్కువ గొందరు –నొగరుగ నానంగ రుచియు నొక్కటె కాఫీ ‘’అని కమ్మగా చెప్పాడు కవి .ఎన్నెన్నో పానీయాలున్నాయ్ మత్తెక్కి౦చేవీ , కిక్కిచ్చేవీ,ఉషారిచ్చేవీ ,నిస్సత్తువ పోగొట్టేవీ .కాని కవికి ‘’వాటన్నిటిలో –మానసిక పికం –ఉప్పొంగేట్లు గానం చేయించగలిగే గరీయమైంది కాఫీ ఒక్కటే అంటాడు కవి భావ గర్భితంగా .ప్రవరునికాలం లో కాఫీయే ఉంటె ,వరూదినికి పూతచరిత్రుడైన ‘’బాపని’’ నీతి తప్పించటానికి అన్ని విధాలుగా చెలరేగాల్సిన అవసరం లేదట .కప్పు కాఫీ ఇస్తే ఇనుప కచ్చడాల్ కట్టిన అతడి మనసు చెదరదా ?అన్నాడు .సులభ తరుణోపాయం చెప్పాడు .బాతాఖానీ కబుర్లకోసం చేరే మిత్రుల కాఫీ సేవిస్తూ పాతరోజులు రుచులు తవ్వి తలపోస్తారు .దానితో తాదాత్మ్యమేకాదు సంతోషం విలసిల్లుతుంది .ఉష్ణం ఉగ్రంగా ప్రకోపించి నోరు చేదై,తిండియావ లేకపోతె ‘’తీరగు పానీయమై ‘’కారణజన్మురాలౌతుంది కాఫీ నెచ్చెలి .ప్రేమ ముదిరి ,మాట్లాడుకోటానికి వీలు లేకపోతె ప్రేయసి కాని ప్రియుడు కాని ‘’కుదిరితే ఒక కప్పు కాఫీ తాగుదాం ‘’అని ఆహ్వానించి ఊసుల మైకం లో పడిపోతారు .’’పద్యానికి ప్రాసయతులు –సేద్యానికి విత్తు ,వానచినుకుల్ మడికిన్ –వాద్యానికి శ్రుతిలయలు ది-న ఆద్యానికి నీవు చాల అక్కర కాఫీ ‘’అని కాఫీ ప్రాముఖ్యత తెలియజేస్తాడు కవి .అంతేనా ?యాగానికి ఆజ్యం ,వ్యాజ్యానికి సాక్షి ,రాజ్యానికి మంత్రి యెంత ముఖ్యమో ‘’ఉపభోజ్యానికి మొదటి ముఖం కాఫీ ‘’ట.ప్రాచీనకాలం లో మజ్జిగ ,ఆర్వాచీనం లో కాఫీ ‘’ప్రధమ ఔషధాలట.’’చల్ల స్వాస్త్యం ఇస్తే, ఓజనిచ్చె మోహన కాఫీ ‘’అయిందట .సవనం (యాగం )లో సోమరసం ,కవనం లో ఆత్మరసం,యుద్ధం లో వీరరసం ,పట్టు విడుపుల లోకరుణ రసం ఒక్కొక్కటే ఐతే ‘’నవరస సారమ్ము నీవ నవయుగ కాఫీ ‘’అన్నాడు గడుసుగా .బాగా చైతన్యం ఇచ్చి ,రాగద్వేషాలు లేకుండా రంజిల్ల జేస్తుందట కాఫీ .పొద్దున్నే కార్యోన్ముఖులైనవారికి శ్రమనిర్వీర్యం చేసి బలిమి ,ఔదార్యం కలిగిస్తుంది .’’నిను సేవించియు పొలమున –పని చేసేది రైతు చెమట వర్షపు చినుకై –పెను సారము నింపి పుడమి –కనువగు ఫలసాయమిచ్చు త్యాగివి కాఫీ ‘’అని కాఫీ త్యాగగుణాన్నికూడా కొత్తకోణం లో చెప్పాడు కవి .పొలాల్లో పని చేసేవారు కాఫీ కంటే టీ అనే చాయ్ నే ఎక్కువగా తాగుతారని కవి గమనించి ఉండడు.ఏది తాగినా ఫలితం ఒక్కటే .మొత్తం మీద కాఫీ పై చాల సాఫ్ట్ కార్నర్ గా ఉన్నాడుకవి .నెగటివ్ భావాలు లేకుండా పాజిటివ్ గా కాఫీ గుణగాన కీర్తన చేసి సుభాష్ అనిపించాడు కవి .
అందమైన కందాలతో రాసిన దే ‘’ముకుంద శతకం ‘’దీన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం లో దాదాపు 40సంవత్సరాలు వయోలిన్, గాత్ర సంగీత,హరికథ,మొదలైన ప్రక్రియలలో అమృతం పంచి సంస్కృతాంధ్ర సాహిత్యాలలో సత్కావ్యాలెన్నో రచించి వాగ్గేయకారు లని పించుకొన్న కవి సంగీత సాహిత్య కళానిధి ,శాస్త్ర కోవిదులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారికి అఒకిత మివ్వటం సముచితం గా ఉన్నది .బాలకృష్ణ లీల ,దుస్ట శిక్షణ శిస్ట రక్షణ ,గోపాలకులతో క్రీడా విలాసం ,స్నేహ వాత్సల్య, భక్తీ ,వంశీ నాద ప్రమోదం ,అన్నీ కలిపి రాసిన కంద శతకం .ఎనెక్డోట్స్ లా ఉన్నాయే కాని ప్రత్యేకత కనిపించలేదు .చదివి మురిసి పులకించి ,ఉదాహరించాల్సిన పద్యాలు నాకు తక్కువగా కనిపించాయి.భక్తి పారమ్యానికి తక్కువేమీ లేదు .కాఫీ ఇచ్చిన చేత్తో నే రాసినా, ఆ కాఫీ రుచి రాలేదేమో అని పించింది .పోతన భాగవత వాసన తో ఉన్నాయి పద్యాలు –ఉదాహరణకు –బాలుండీతడు ,ఘనతర శైలంబిది ‘’.ఐతే ‘’అక్కజమైన చెలువమది –చిక్కడు తలక్రిందులైన శిశుపాలునికిన్ –దక్కదు కేసరి సొత్తది-నక్కను చేబట్ట బోదు నాతి ముకుందా ‘’మంచి పద్యం అయినా పోతన ఛాయ వెంటాడింది .’’లాక్షా గృహ దహనమ్మున-రక్షింపను పాండవుల సొరంగము త్రవ్వన్ – దక్షుని పూన్చితివిజగ –ద్రక్షక నీ యండ మాకు రక్ష ముకుందా ‘’ క్షకార ప్రయోగం బాగుంది అనుకొన్న భావం కుదిరింది .ఎన్నని ముకుందుని లీలలు ? అన్నీ వర్ణించటం సాధ్యమా ,తరమా అందుకే సింపుల్ గా ‘’భవదీయ దయను గూర్చెద –భవ బంధమ్ములను ద్రెంపి’’పాహి ముకుందా అని కవి ఆర్తిగా నివేది౦చు కొన్నాడు ఆ వేణు వినోదునికి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-20-ఉయ్యూరు