కరోనా !మత్ డరోనా

కరోనా !మత్ డరోనా
తుమ్ముకు౦టూ,దగ్గుకుంటూ చీదుకొంటూ ఊడిపడ్డాడు మా బామ్మర్ది బ్రహ్మ౦. వాకిట్లోనే వాణ్ని చూసి వాళ్ళ అక్కయ్య లోపలిగదిలోకి తీసుకు వెళ్లి తలమీద దుప్పటేసి సాంబ్రాణి పోగేసి ,కాఫీ నోట్లో పోసి జండూ ,అమృతాంజన్ రాసి తనకు తెలిసిన హోమియో మందు మింగించాక కొంచెం స్తిమితపడి బయటికొచ్చాడు నాతో మాట్లాడటానికి .’’బావా! అక్క భలేగా క్వారంటైన్ మెయింటైన్ చేస్తోందే .దెబ్బతో నా రోగం కుదిర్చి మామూలు మనిషిని చేసింది అక్క గ్రేట్ బావా ‘’అన్నాడు .’’అవున్రా మీ అక్కకు ముందు జాగ్రత్తలు ఎక్కువ .ఎప్పుడూ చిమ్మున చీది ఎరగదు .ఎవరికైనా ఏదైనా చేస్తే వెంటనే రియాక్టయి తగ్గేదాకా ఊరుకోదు .నా విషయం లోనైనా అంతే .సరేకాని ఇంతహడావిడి గా ఎందుకు ఊడిపడ్డావ్ ?.’’అన్నాను .ప్రపంచమంతా కరోనా వైరస్ తో బాధపడుతుంటే మీరిద్దరూ ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చా .’’అన్నాడు .’’సడేలే సంబడం . ఫోన్ చేస్తే సరిపోయేదిగా ?’’అన్నాను .’’ఓరి బాబోయ్ !ఫోన్ చేస్తే దగ్గు జలుబు తుమ్ములు పది నిమిషాలు వినిపించి అర్ధంకాని హిందీలో ఏదో ఏదో చెప్పి కంగారు పెడుతున్నారు .అది లైన్ లోకి వచ్చి మాట్లాడుదామనుకొంటే మళ్ళీ మన వాయిస్ కూ బ్రేకే ‘’ఈ బాధ భారించేలోపు బండీ మీద అయిదు నిమిషాల్లో వాలి పోవచ్చని వచ్చాను .’’సరే సంతోషం .ఏమిటి తాజాకబుర్లు ?’’అడిగాను .’’కరోనాకు కారణమైన చైనాలో ఊళ్లకు ఊళ్ళే ఖాళీ అయ్యాయట.సుమారు ‘’లకారం’’ దాకా పైకి పోయారని అంటున్నారు ‘’అన్నాడు .’’లేదురా వాళ్లలెక్కప్రకారం 3వేలు దాటలేదని కదా ?’’అన్నాన్నేను .’’జనం కంగారు పడతారని తగ్గించి చెప్పారని అనధికార వార్తలు బావా ‘’ అన్నాడు .’’ఏదో రా దేన్నీ నమ్మాలో తెలీట్లేదు ‘’అన్నాను .’’అసలు ఆరోగ్య శాఖా మంత్రులకే కొన్ని దేశాల్లో సోకిందట బా ‘’అన్నాడు .’’వైరస్ కు నీ ,నా భేదం ఉండదు కదరా ‘’అన్నాను .’’మనదేశం లో మన రాష్ట్రం లోకూడా పాకిందా ?’’అడిగా .’’పాకుతోంది శరవేగంగా .’’అన్నాడు .’’మరి చర్యలు తీసుకొంటున్నారా’’ప్రశ్నించా .మందులు లేవట .మాస్కులు లేవట .అమెరికాలోనే అందుబాటులో లేక 36 రాష్ట్రాల్లో ఎమర్జెన్సి ప్రకటించి ఉద్యోగస్తులను వర్క్ ఫ్రం హోం చేయమంటున్నారు .గేమ్స్, టూరిజం ప్రోగ్రామ్స్ అన్నీ కట్ చేశారు .షోలను ప్రేక్షకులు రాకుండా ముసలి ముతకా నిర్వహిస్తున్నారట .చాలాదేశాలు విమాన ప్రయాణాలు రద్దు చేశాయి .ఒక వేళ వస్తే కనీసం 15రోజులు క్వారంటైన్ లో ఉంచి టెస్ట్ లు చేసి పంపిస్తున్నారు .నువ్వు టివిలు చూడవు .నీకెలా తెలుస్తాయిలే ‘’అని ఎద్దేవా చేశాడు.
‘’మన రాష్ట్రం లో స్థానిక సంస్థలకు .ఎన్నికలట’’అన్నాన్నేను .’’అవున్ బా . ఇంత విపత్కర పరిస్థితి లోనూ ఎన్నికలు జరపాల్సిందే అని కోర్ట్ హుకుం .తప్పలేదు ప్రభుత్వానికి .’’అన్నాడు .’’మరి నామినేషన్లు ,ప్రచారం వగైరా ఎలా ‘’అడిగా .మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం .అందుకే అప్పోజిషన్ వారు నామినేషన్ వేయటానికి దగ్గు తుమ్మూ చీదుడులతో వస్తే వైరస్ మరీ పెరిగిపోతుందని ,అధికార పక్షం వారే అన్ని చోట్లా అడ్డుకొని ,వినకపోతే పోలీసులతో బెదిరించి,నాయకులు కొంపలు తగలబెడతామని హెచ్చరిస్తూ ,ప్రతిపక్ష నాయకుల కార్లను దూలాలతో రాళ్ళతో ,తలలను దుడ్డుకర్రలతో చావమోది నామినేషన్ వేయకుండా అడ్డు పడుతూ ‘’ప్రజారోగ్యం’’ కాపాడు తున్నారు .ఇది గిట్టని బాబు ,కన్నా లు ప్రజాస్వామయం ఖూనీ అని గగ్గోలు పెడుతూ ప్రభుత్వాన్నే భయపెడుతున్నారు .కాకిగోల చేస్తున్నారు .మంత్రులు యధాప్రకారం’’ బూతు’’ ప్రవచనాలతో ‘’ బూతు’’లను ఆక్రమించే పనిలో ఉన్నారు ఎలాగైనా గెలవాలి .లేకుంటే అన్న మాటేసి వేటేస్తాడని భయం .అందుకే అంతగా బరి తెగిస్తున్నారు ‘’అన్నాడు ఊపిరి పీల్చుకొని .’’ఇది ప్రజాస్వామ్యమా ‘’అడిగాన్నేను .’’ప్రజాస్వామ్యమోకాదో కాని ప్రజల్ని కరోనా నుంచి కాపాడే గోప్పఆయుధం మాత్రం నిజం .దీనిలో ఖాఖీలుఎంతో సహకరిస్తూ ప్రజారోగ్యం కాపాడుతున్నారు ప్రతిపక్షాల నుంచి ‘’అన్నాడు . ‘’కేంద్ర ప్రభుత్వం సంగతు లేమిట్రా’’అన్న నా ప్రశ్నకు ‘’ఉ౦డుబావా .మధ్యప్రదేశ్ లో జంప్ జిలానీలను ఒక చోట హోటల్ అనే క్వారంటైన్ లో ఉంచి కరోనా నుంచి రక్షణ కల్పించి ,తగిన సమయానికి భోపాల్ చేర్చటానికి,’’కమలనాద్ ‘’ప్రభుత్వాన్ని పడగొట్టి ‘’కమలనాధుల ‘’ప్రభుత్వం మళ్ళీ తీసుకురావటానికి,ప్రజాస్వామ్య రక్షణకు ఆపసోపాలు పడుతుంటే కరోనా గోల ఎవరికి పట్టింది ‘’వాళ్ళంతా ‘’కరోనా !మత్ డర్నా’’అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లున్నారు .’’అన్నాడు .
ఒరేయ్!ఇన్ని కబుర్లు చెప్పావ్ .అసలు కరోనా అంటే ఏమిటి ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుంది .నివారణ చర్యలేమిటో నాకు కాస్త వివరించరా ‘’అన్నాను .అమాంతం కాళ్ళమీద పడి అది తెలుసుకోవటానికే నీ దగ్గరకొచ్చాను బావా ‘’అని బావురుమన్నాడు .ఇక నాకు తప్పదుగా .విషయం చెప్పాను ఈ విధంగా ‘’కరోనా అంటే కిరీటం అని అర్ధం. గ్రహణం పట్టినప్పుడు సూర్యుని చుట్టూ కరోనా ఏర్పడుతుంది .అలాగే ఈ వైరస్ అంటే సూక్ష్మజీవిని సూక్ష దర్శినితో పరిశీలిస్తే కిరీటం ఆకారం లో కనిపిస్తుంది కనుక కరోనా అని పేరు పెట్టారు .ఈ వైరస్ కలుగ జేసే జబ్బు పేరు ‘’కోవిడ్-19’’.కరోనా వైరస్(corona virus ) పేరులోని కో,వి లకు డిసీజ్ అంటే జబ్బు చేరిస్తే వచ్చిన మాట ‘’కోవిడ్’’.ఈ వైరస్సోకినతర్వాత జబ్బు లక్షణాలు బయట పడటానికి సుమారు 14రోజులు పట్టవచ్చు .ఒక్కోసారి అయిదారు రోజుల్లోనే బయట పడచ్చు .ఈ వైరస్ శ్వాస కోశాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది .1960లోనే ఈవైరస్ ను గుర్తించి ,ఇప్పటిదాకా 6రకాల కరోనా వైరస్ లను కనిపెట్టారు .ఇవన్నీ పక్షులు ,పాలిచ్చే జంతువులపై ఎక్కువ ప్రభావం చూపించాయి కాని ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహా డేంజర్ అయింది .ఈ వైరస్ సోకితే జలుగు దగ్గు ,జ్వరం ఛాతీలో నొప్పి వచ్చి ఊపిరి పీల్చటం కష్టం అవుతుంది .తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు తీస్తుంది .
ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ 19,20 చైనాలోని ఊహాన్ లో 2019 డిసెంబర్ 1 న గుర్తిమ్పబడి ,2020మార్చి 5 నాటికి ప్రపంచ వ్యాప్తి అయి సుమారు లక్షకేసులు రుజువయ్యాయి .మధ్యచైనా దక్షిణ కొరియా ,ఇటలి ,ఇరాన్ లలో వ్యాపించి 3వేలకు పైగా చనిపోయారని వార్త.దీని వ్యాప్తి అరికట్టటానికి చైనా’’హూబి లాక్ డౌన్’’,కర్ఫ్యూ వంటి చర్యలు చేబట్టింది .జపనీస్ సముద్రం లో బ్రిటిష్ క్రూయిజ్ షిప్ ‘’డడైమ౦డ్ ప్రిన్సెస్ ‘’ను నిర్బంధించి ఉంచారు .ఇటలీ లాక్ డౌన్ ప్రకటించింది .విమానాశ్రయాలు రైల్వే బస్ స్టేషన్లలో తనిఖీలు ఆరోగ్యప్రకటనలు స్క్రీనింగ్ ద్వారా ఏర్పాటు చేశారు .చైనా ఇటలీ ఇరాన్ దేశాలకు ప్రయాణాలు చేయవద్దని చాలా దేశాలు ప్రకటించాయి .చైనా ఇరాన్ జపాన్ ఇటలీ దేశాలలో బడులన్నీ మూసేశారు .అమెరికాలో చాలా రాష్ట్రాలలో ఎమర్జెన్సి విధించి ఉద్యోగులను ఇంట్లో నుంచే పని చేసే వీలు కలిపించారు ‘’అన్నాను .మాబామ్మర్ది బ్రహ్మం మొహం లో వింత వెలుగు కనిపించి ‘’అందుకే బావా !నీ దగ్గరకోచ్చేది. తిట్టినా విషయం సూటిగా సుత్తిలేకుండా చెబుతావ్ .ఇంతకీ తీసుకోవాల్సిన జాగ్రత్త లేమితో సెలవీయండి బా గారూ ‘’అన్నాడు ‘’చేతులు ,కాళ్ళు వేడినీటితో శుభ్రంగా కడుక్కునిమాత్రమే ముక్కు నోరు దగ్గర చేతులు పెట్టాలి .పచ్చిగా ఉన్నవి, సగం ఉడికించినవి తినకూడదు .ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలి లేకపోతె టిస్యు పేపర్ ఉంచుకోవాలి .దగ్గు తుమ్ము జ్వరం ఉన్నవారికి సాధ్యమైన౦త దూరంగా ఉండాలి ‘’అన్నాను .’’ ఈజాగ్రత్తలన్నీ తీసుకొంటే ‘’కరోనా !మత్ డరోనా ‘’కదా బావా అంటూ ఎగిరిపారిపోయాడు బామ్మర్ది బ్రాహ్మి .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.