21-ప్రపంచ దేశాల సారస్వతం
21-అరబ్బీ సాహిత్యం -1
అరబ్బీ భాష –క్రీ .పూ.4వేల సంవత్సరాల క్రితమే ఆరబ్ నాగరికత ఉందని ,క్రీ.పూ.6వేలు నాటికే అక్కడి నాగరకత ,సంస్కృతీ ఉచ్చ స్థితి లో ఉన్నాయని పురాతత్వ పరిశోధనవలన తెలుస్తోంది .అరెబిక్ భాష సెమెటిక్ భాషా కుటుంబానికి చెందింది .ఉత్తర అరబ్ దేశం లోనగర సంస్కృతికి నిలయమైన అరబ్బీ భాష కు ,మక్కా క్షేత్రం గొప్ప ఆశ్రయం .ఈ భాష సార్ధవాహుల ద్వారా మెసపొటేమియాకు వ్యాపించి అక్కడ పరి ష్కృతి పొంది ,ఉదాత్తభాషగా రూపు దాల్చింది ..క్రీ.శ.7వశతాబ్ది తర్వాత ఇస్లాం మతం తో పాటు అరబ్బీ భాషా సంస్కృతులు సమస్త ప్రాక్ మధ్యమ దేశాలలో ,ఆసియా ,ఆఫ్రికా ఖండ౦ కొన్ని ప్రాంతాల్లో వ్యాపించింది .అన్ని వ్యవహారాలూ ఆ భాషలోనే జరిగేవి .13వ శతాబ్దం లో ఖురాన్ ప్రభావం జావా ,మాల్టా, ఈజిప్ట్ ,స్పెయిన్, సిసిలీ మొదలైన చోట్ల విస్తృత మైంది .ఇప్పటికీ మధ్య ప్రాచ్యం లో అదే మాతృభాష మాత్రమేకాక ప్రపంచం లోని మహామ్మదీయ సంస్కృతికి మూల భూతంగా ఉన్నది .మాండలికాలలో తేడాలున్నా ,గ్రాంధిక భాషా మూలం ఒక్కటిగానే నిలిచి ఉంది.
సాహిత్యం –అరబ్బీ సాహిత్యం ఉత్పత్తి ,వికాసం అంతా కవిత్వం ద్వారానే ప్రారంభమైంది .మంత్రాలలో అంత్యప్రాసల తో ఉన్న గద్యాలే ,క్రమంగా లయాన్వితాలై అనేక ఛందస్సులుగా మారాయి .యాత్రికుల వియోగ గాధలను వర్ణించే ‘’ఖసీదా ‘’అనే గేయాలు బాగా ప్రచారం లో ఉండేవి వేట ,ఒంటెలు తుఫాను మొదలైన ఎడారి జీవనానికి చెందిన విషయాలు ముఖ్యంగా వర్ణింప బడేవి .ఆనాటి సామూహిక జీవితం, సాంఘిక పరిస్థితులు ,యుద్ధాలు మానవ ప్రవృత్తులు వర్ణించే గేయాలను పాడేవారిని ‘’రాసో ‘’అంటారు .ఇస్లాం మతానికి ముందు అనేక ఖసీదాలు రాసి ప్రసిద్ధి చెందినకవి ఉమ్రా –ఉల్ –కైస్.గద్య సాహిత్యం లో మొట్ట మొదటిది ఖురాను గ్రంధం .రాసూలు మహమ్మద్ కు దేవదూతలచే లభించిన తత్వ జ్ఞానాన్ని ,మత సాంఘిక ఆదర్శాలను విధి ,నిషేధాలను వివరించే ఖురాన్ మహామ్మదీయులందరికి ఏకైన పవిత్ర ధర్మ గ్రంథం.ఖురాన్ రచనా కాలానికి అరబ్బీ లిపి చాలా దోష భూయిష్టంగా,అసంపూర్ణంగా ఉండేది .కనుక వాక్యార్ధ నిర్ణయం చేయటానికి ,వ్యాకరణ ,శబ్ద భాషా సాహిత్యాల అవసరం తప్పని సరి .ఖురాన్ శైలి ఆనాటి గద్యానికిమూలం. నేటికీ అదే ఆదర్శప్రాయం .ఉపదేశాలకు ధార్మిక విషయ బోధనకు వచనమే అందరికి అందుబాటు .పైగంబర్ ,ఖలీఫాలకాలం లో కావ్య రచనకు ప్రోత్సాహం లేక గద్యమే ప్రచారమైంది .
ఖలీఫాలకాలం లో ఇస్లాం మత సిద్దాన్తాలతోపాటు ,ఉన్నత సామాన్య వర్గాలలో స్వేచ్చా విలాసాలు ,రాజకీయాలు ఎక్కువగా ఉండేవి .భోగలాలస విస్తృతమైనది –ఇప్పుడు ఆసరా లభించి కవులు విజ్రుమ్భించారు .శృంగారం ఏరులై కవిత్వం లో ప్రవహించింది .బుదానియా జమీత్ బ –మమార్ ,లుబనా –కైస్ బ జరీహ్,లైలా –మజ్ను వంటి ప్రేమకావ్యాలు వచ్చి ఇరాన్ ,టర్కీ మొదలైన దేశాలలో బాగా ఆదరణ పొందాయి .ఈ కావ్యాలే తర్వాత జానపద గాధలుగా వ్యాప్తి చెందాయి .వీటిలో ఉమర్ –బ –రబియా కు విశేష స్థానం లభించింది .కుర్రేషు కు చెందిన ఈ రచనలు సంకలన రూపం పొందాయి .ఈ రచనలలో గజల్స్ ప్రాచుర్యం పొందాయి .కవిత్వం ప్రాభవం పొందటానికి మరో కారణం కూడా ఉంది .ఖురాన్ ఘట్టాలు అర్ధం కావాలంటే కావ్యజ్ఞానం అవసరం .కనుక ఖురాన్ అధ్యయనం ,వ్యాఖ్యానాలకు కవిత్వం గొప్ప సాధనంగా ఉపయోగ పడింది .మొత్తం మీద అరబ్బీ కవిత్వ, వచనరచనలకు ఖురానే మూలం అయింది .ఖురాన్ సిద్ధాంత నిరూపణకోసం ఏకంగా ఒక ప్రత్యేక వాజ్మయమే ఏర్పడింది .అనేక ఖురాన్ ప్రతులను ఒక చోట చేర్చి సమగ్ర రూపం కల్పించినవాడు ఇబ్న జబీర్ –ఉల్ –తహరి. . ఖలీఫాల రాజధాని డమాస్కస్ నుంచి బాగ్దాద్ కు మారాక ,అరబ్బీ రాజకీయ ,సాంఘిక లౌకిక సంస్కృతుల పై పారశీక ప్రభావం ఎక్కువైంది .క్రొత్త రచనా ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ఆధ్యాత్మిక ధార్మిక ,వేదాంత భూగోళ ,భౌతిక శాస్త్రాది శాఖలు వాజ్మయం లో యేర్పడ్డాయి.13వ శతాబ్దం నాటికి సాహిత్యం లో సాంప్రదాయానికి వ్యతిరేకంగా గ్రీకు ,క్రైస్తవ వాజ్మయ ప్రభావాలతో జాతీయ ఉద్యమం ప్రారంభమైంది . దీన్ని ప్రారంభించినవారు 995కాలం వాడైన-అబుల్ హసన్ –అల్-అష్కి మరియు మన్సూర్ అల్-మతుర్దీ-944.ఈ ఉద్యమఫలితంగా వచ్చిన వేదా౦త మార్గమే ‘’కలాం ‘’.దీని సిద్దాన్తవాది ఇందులోని సాహిత్యానికి ప్రతినిధి అబూబకర్ వలీల్లాని -1085.ఇతని రచన –కితాబ్ –అల్ మిలల్ –వల్నిహాల్ గ్రంథం.అన్ని సిద్ధాంతాలను క్రోడీకరించి ఇస్లాం కు మెరుగులు దిద్దాడు .ప్రాచీన సంప్రదాయకవి షేక్ అబ్దుల్ –కాదిర్ –జీలాని ముఖ్యమైన ‘’అల్-కదీరియా’’ గ్రంథం రాశాడు .ఈకాలం వాడే అల్ –గజ్జలి -1111ప్రముఖ సూఫీ విద్వాంసుడు నిగూఢమైన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని వర్ణించాడు .ఈ రచన వలననే ఇస్లాం లో సూఫీకి స్థానం లభించింది .పాశ్చాత్య దేశాలో ఖోరాన్ ,అరబ్బీ పఠన,పాఠనాలు పెరగటం తో అక్కడ కూడా గ్రంథరచన జరిగింది .స్పెయిన్ వారైన అల్ దనీ,అల్ షతీబీ లు ఖోరాన్ ఉచ్చారణ విధానం పై పుస్తకం రాశారు .
అబూ అసదుద్దౌలా -685-మొదటి వ్యాకరణం రాశాడు .అరబ్బీ వ్యాకరణ పరిశీలన అంతా కుఫ్రా ,బస్రా నగరాలలోనే ఎక్కువగా జరిగేది .దీనిపై రెండు భిన్నవాదాలు వచ్చాయి .వ్యాకరణ ప్రకా౦డు లు –ఖాబీల్ –బిల్అహ్మద్ ,అబూ –శిర్ అమర్ ,బిన్ఉస్మాన్ లు .వ్యాకరణం లో దిట్ట లైన వారు కూడా వర్ణనాత్మక గ్రంధాలు రాయటం విశేషం .వీటి తర్వాత నిఘంటువులు వ్యాకరణాలు వచ్చాయి .అబూబకర్-ఇబ్న-రైద్,అల్ -మొహర్రద్ లు నిఘంటు నిర్మాతలు .అల్ముహర్రద్ విజ్ఞాన సర్వస్వం ‘’కితాబ్ –ఉల్-కామిల్ ‘’రచించాడు .కుఫాలో ఉన్న వ్యాకరణ పండితులలో కిసాయీ ,ఫెర్రా ,ఇబ్న అల్ ముఖ్యులు ‘’కితాబ్ –ఉల్-ఫసీహ్ ‘’అనే విజ్ఞాన కోశాన్ని’’ తాలబ్ ‘’రచించాడు .బాగ్దాదు లో ఇబ్న –ఖలాలియా ,ఇబ్న –అహమ్మద్ ,ఇబ్న –ఫారిస్ ప్రముఖ అరబ్బీ పండితులు .అల్ జమ్ఖ సమ్రీ రాసిన డిక్షనరీ ,గ్రామర్ చాలా ప్రసిద్ధమైనవి .ఇరాన్ సంపర్కం వలన అరబ్బీ కావ్యానికి సౌకుమార్యం, లాలిత్యం,మధురోక్తులు భాషలో పెరిగాయి హర ఇబ్న ఉర్ద్ ,సలీహ్ ఇబ్న-అబ్దుల్ –ఖుద్దూస్ ,అబు-నివాస్ ,అబుల్ –అతాహి ,అబూ తమ్మాన్ ప్రసిద్ధ ఆరబ్ కవులు. అబూ నివాస్ రాసిన –జుహది యాత్ ,అబుల్ –అతాహి రాసిన జుహద్ లు ప్రసిద్ధ అరబ్బీ కావ్యాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-3-20-ఉయ్యూరు