రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రీ శార్వరి ఉగాది పంచా౦గ శ్రవణం కు ఒక రోజు ముందు రాచకీయ ‘’పన్’’ (పంచ్} ‘’ఆగం ‘’

శ్రవణం వినండి- సారీ చదవండి .ఈ సంవత్సరం నవగ్రహాలలో 8గ్రహాలు శుభులు ,ఒక్కటే పాపగ్రహం .రాజు ,ధాన్యాధిపతి బుధుడు .మంత్రి ,సస్య ,నీరసాది పతి గురుడు .సైన్య ,అర్ఘ ,మేఘాధిపతి చంద్రుడు .రసాధిపతి శని .కనుక లెక్క ప్రకారం శుభులు ఎక్కువవటం తో అన్నీ మంచి శకునాలుగా ఉండాలి .కానీ సీన్ రివర్స్ అయింది  . మన రాష్ట్రం లోఎమ్యెల్యేలు, ఎం .ఎల్సీలు  ,కేంద్రంలో సభ్యతమరచి రాజ్యసభ సభ్యులు ,కర్ణాటక,మద్యప్రదేశ్ లలో నిస్సిగ్గుగా శాసనసభ్యులు బోర్డులు తిప్పేసి గుంపుగా జంప్ జిలానీలయి ,కొత్తప్రభుత్వాలకు వీర విదేయులైనట్లే , గత  డిసెంబర్ లోనే మన శుభగ్రహాలన్నీ జంప్ జిలానీలై పాపులుగా ,’’పావులు’’గా మారిపోయి విశ్వవ్యాప్త ఉపద్రవం కరోనా సృష్టించి ఒక దేశాన్ని నాశనం చేయాలని మరో దేశం పై ప్రయోగించి  ,వీర విష విలయాలు వ్యాపింపజేసి అదుపుకాని స్థితి కల్పించి ,కాలిఫోర్నియా దావాగ్నిలా ,దివిసీమ బడబాగ్నిలా  వేలాదిగా జనం చనిపోతుంటే ఆనందంగా  స్మశానాలలో చలికాచుకొంటున్నారు పైశాచికంగా .

    టచ్ ద్వారా వ్యాపించే ఈ వైరస్ యెంత భయానకంగా వ్యాపిస్తోందో ఇప్పుడు తెలుసుకొని ‘’బావురావురు’’ మంటున్నాయి అగ్ర దేశాలైన ఉగ్రదేశాలు .మానవత్వం మంట గలవటానికి అదుగో  ఆ శుభగ్రహాల కప్పదాట్లే కారణం .కొన్ని దేశాలలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ .అగ్రదేశాలు ‘’కొంప’’లోనే అన్నీ కానిమ్మని లాకౌట్ ,లు లాక్ డౌన్లూ  చేసి నరసంచారం లేకుండా చేస్తున్నారు .’’కరోనా! బొంగా  !అదే౦ చెయ్యలేదు ఉత్తిహడావిడి పార సెట్మాల్  వాడమని బ్లీచింగ్ తో స్నానం చేయమని ప్రకటించి మర్నాడే ప్లేట్ ఫిరాయించి లాక్డౌన్ చేయించి ‘’బయటికొస్తే ముక్కుతో చంపేస్తా ‘’అని భయపెట్టాడు పక్కరాస్ట్రనాయకుడు .ఆయన్నే ఆదర్శంగా అడుగులేసే మన పరమానందయ్య శిష్యుడు గురూ మొదట చెప్పింది నిజమేనని నమ్మి దాన్నే రికార్డ్ గాపెట్టి చెప్పి ,90రోజులుగా అమరావతి ఉద్యమం నడుపుతున్నమహిళలను రైతుల్నీ ప్రక్కనుంచి పోతున్నా పట్టించుకోకుండా’’ నీరో’’ లా ప్రవర్తించి ఒకే ఒక్కసారి తనకు కావాల్సిన వందిమాగధ పత్రికలవారిని పిలిచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘’60 దాటినవారికే కరోనా భయం .మిగిలినోరికి’’ ఫికర్ నై ‘’రోజుకు నాలుగు కిలోల పారాసెట్మాల్   టాబ్లెట్స్ మింగితే ,బ్లీచింగ్ పౌడర్ చిమ్ముకుంటే కరోనా గమ్మునుంటుంది ‘’అని డాక్టర్ రెడ్డీ గా ,రెడ్డీస్ లాబ్ అధ్యక్షుడుగా ,ఫిలాసఫర్లకే ఫిలాసఫర్ గా ,అపర ధన్వంతరిగా సూచిస్తే జనం విస్తుపోయి కిలకిలా గలగలా నవ్వుకొన్నారు .ఈయనా మర్నాడే ప్లేట్ మార్చి సెలవులు లాకౌట్లు ప్రకటించి,’’ —- ముత్తైదు’’ లా వ్యవహరించాడు .రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానినకాన్ని పోస్ట్ పోన్ చేస్తే ఎక్కడో కాలి ,కులం పూనకంతో ఆయనా ఆయన కౌరవ సేన భీభత్సం సృష్టించారు అంతకు ముందూ  తర్వాత కూడా .ఉచ్చనీచాలు వదిలేశారు .పాపం వాళ్ళెం చేస్తారు మంచి గ్రహాలన్నీ స్వస్థానాలు వదిలేసి పరాయి కొంపల్లో ,పాప స్థానాలలో హాయిగా స్థిరపడితే .ఇది పాపగ్రహకూటమి .ప్రపంచ విలయం .అక్రమాలకూ నిలయం .కలియుగం  అంతమయే రోజులు దగ్గరకోచ్చాయా అనే అనుమానం .ఇదంతా ఆ  ‘’అష్ట గ్రహ కూటమి’’ప్రభావమే .వీళ్ళు పావులు, పిపీలికాలు .శాంతం పాపం .

  ఇక దేశ గ్రహచారం ఎలా ఉంటుందో చూద్దాం –అన్ని రాష్ట్రాలు జనతాకర్ఫ్యు తో ఇంటి క్వార౦ టైన్ లో ఉండటం వలన ప్రభుత్వాలకు రూపాయి కూడా ఖర్చుకాదు. అంతా ఆదాయే .భక్తులకు పూలు  కొబ్బరికాయ, పళ్ళు,అగరొత్తులు ,కర్పూరం  ఖర్చులు లేవు .గుడులన్నీ మూతలేకాని తీతల్లేవు .ప్రసాదాలు వండక్కర్లేదు  నైవేద్యాలు, భోగాలు లేవు .యెదొఇన్త వండి నైవేద్యం పెట్టటమే. దేవుళ్ళకూ పస్తులే పాపం. ‘’యదన్నం మానవాః తదన్నం దేవతాః ‘’అని ఆర్యోక్తి ఉండనే ఉంది ..గ్రహప్రభావం కాక మరేంటి .శివుడికే ఒకప్పుడు శని ప్రభావం తప్పలేదు .ఇప్పుడు కామన్ గా దేవుళ్ళకూ దేవతలకూ అదే తీరు .దండల్లేవ్ స్తోత్రపాఠాల్లేవ్ ,పవళింపు,సుప్రభాత సేవల బంద్.పూజార్లు ఏంచేస్తే అదే జరిగినట్లు ఊరడింపు.

  శుక్ర ,గురులు భీష్మించారు .వివాహాది శుభకార్యాలు బంద్.ఒక వేళ చేసుకొన్నా అయిదారుగురు మనుషులతోనే .ఎంత ఆదా?స్వయం నియంత్రణ తెచ్చింది కరోనా ఒక రకంగా .కేంద్ర ప్రభుత్వం  ఆర్ధిక మాంద్యానికి చేసే పనుల్లేవ్.స్పీచులు తప్ప’’ మెజర్లు’’ ఉండవు .మాటలకు ఝడిసేదా ఆర్ధిక కరోనా ?కొరడా దెబ్బలకు జడుస్తున్దికాని .మొత్తలావులకు ఊడిగం చేసేవారికి సామాన్యుల గొడవేం పడుతుంది .500కోట్లకు రాజ్యసభ సీటు కొనేవారికి జనానలతో పనేమిటి -బ్యాంకు లావాదేవీలు పారిశ్రామిక దిగ్గజాలకు రోడ్డునపడే కుక్కల నక్కల రొద పడుతుందా .ఇదంతా పాపగ్రహ కూటమి ఫలితమే .గ్రహాలు నడిపిస్తుంటే పాపం వీళ్ళే చేస్తారు ?అని సరిపుచ్చుకోవాలి సామాన్యుడు .మాన్యుల నెదిరించి బతగ్గలడా .ఎదిరిస్తే దేవభూమి ఉత్తరప్రదేశ్ లో ,వీరభూమి పంజాబ్ లో,  దేశ శిరో భూమి ఢిల్లీ లో అయినట్లే శాస్తి జరుగుతుంది .అడ్రస్ లు గల్ల౦తవుతాయి

   ఇకమన రాష్ట్రం సంగతికొస్తే –ఎన్నికల కమీషన్ తో తలంటి .రోజూ హై కోర్ట్ తిట్లు మొట్టికాయలు ,పంచ్ లూ తప్పని పరిస్థితి .స్పీకర్ తో సహా వాచాలత్వం ,బూతుల పంచాంగం కరోనా వైరస్ లా సెకండ్, ధర్డ్ స్టేజ్ చేరి ,చివర్లో  పీక్ లో ఉంటాయి .ఇంకా పీక్ లో ఫ్రస్ట్రేషన్ ప్రసాద్ లా ,ఫ్రస్ట్రేషన్ ఉమన్ లా మంత్రులు ప్రవర్తిస్తారు .నాలుకలపై సరస్వతి నర్తించాల్సిన చోట చండిక నర్తిస్తోంది .ఇప్పటికే పది పదిహేను రద్దులు చేసిన ‘’ముద్దు’’ లాయన ఇక ఈ కరోనా ఫ్రస్ట్రేషన్,  కోర్టు కేసులు ,ఎలక్షన్ తంతు ,దోపిడీలు ,నామినేషన్ చిమ్పుళ్ళు,వెయ్యకుండా బెదిరింపులు ,ఉపసంహరణ అఘాయిత్యాలు, నరుకులాటలు ,హోదా, ‘’వినోదం ‘’సినిమాలో ‘’ఉత్తుత్తి బ్యాంక్ ‘’లా ఎండమావి అవటం ,సెంటర్ డబ్బు ‘’చేపక’’పోవటం ,శుక్రవారం’’ కోర్టు’’ ప్రార్ధనలతో  ఎన్ఫోర్స్ మెంట్ వేధింపులతో విసిగి, వేసారి,కౌరవ నాయకుడిలా   ,చివరకి అసెంబ్లీతో సహా మంత్రి వర్గ౦తో సహా తననూ రద్దు చేసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి .ఇది జరక్కపోతే 365 భయం ఉండనే ఉంది .అమరావతికి అభయమిస్తు౦ది కోర్టు .ఇప్పటిదాకా దాగుడుమూతలాడిన సినీ హీరోలు తప్పు తెలుసుకొని జనజీవివన స్రవంతి లో చేరే సూచనలున్నాయి .మీడియా కూడా భజన మానేసి స్వయం నియంత్రణ తో ప్రజాస్వామ్యంగా పనిచేసే సూచనలున్నాయి .కరోనా భయోత్పాతం కలల్పించినా చివరకు ఒక రకంగా మంచే చేస్తుందేమో .ఐతే ప్రపంచ వ్యాప్తంగా అందరికి గుణపాఠం మాత్రం నేర్పింది .మర్చిపోలేని పర్యావరణ స్పృహ ,శుచి ,శుభ్రత ,మనదైన సంస్కారం లకు పునరుజ్జీవనం కలిగించింది.

  ఇప్పుడే ఒక యువక శ్రోత ఒక చీటీ పంపి ‘’ఇక సోది ఆపి ,సరుకులధరలు ,ఎగుమతి దిగుమతి ,జనాభా వగైరాలు చెప్పి ఏడవండి ‘’అని రాశాడు ,.అదే విషయానికి వస్తోన్నాన్రాకన్నా . కరోనాలాగా కంగారు పెట్టిస్తే ఎట్లారా నాన్నా ! ప్రేమించుకొన్నా, స్పర్శ సుఖం లేకపోవటం వలన యువతీ యువకులు పెళ్లి చేసుకోటానికి భయపడటం వల్లా ,పెళ్లి ఐన భార్యాభర్తలు కూడా అన్ని సుఖాలున్నా’’ ఆసౌఖ్యం ‘’లేనందువల్లా సంతానం ఈ ఏడాది తగ్గి, జనాభా పెరగదు . చైనాలో పాము ,కప్ప ,పిల్లి ,ఎలుక, కుక్కా, నక్కా నరజాతికి ఆహారం కాకుండా హాయిగా జీవిస్తాయి .ఇండియా నుంచి వాటి ఎగుమతులూ ఉండవుకనుక  ఎగుమతి ,స్మగ్గ్లింగ్ తగ్గుతుంది .ఆవు మాంసం చూస్తే ఐరోపా గడగడ లాడటం వల్ల అక్కడా,ఇక్కడా  గోమాత సేఫ్ .ఇక్కడకూడా ప్రజల్లో అవేర్ నెస్ పెరిగి లారీల్లో వాటి దొంగరవాణా బంద్ .విభూతి ,తులసి, పసుపు మిరియం ధనియం, గోమూత్రం, ఆవుపాలు, పేడ, వేపల ఔషధ గుణాలు మళ్ళీ గుర్తుకు రావటం తో  వీటి ధరలు ఆకాశాన్నంటినా ఆశ్చర్యం లేదు .

  రోజుకూలీ లేక నిత్యావసరాలు దొరక్క కూరగాయలు ఆకాశం లో ఉండటం వల్లా జనం తిండికి మొహం వాఛి పోతారు .ప్రభుత్వం వారికి డబ్బు సాయం చేసి ఆదుకోకపోతే వారి జీవితాలు మాల్ న్యూట్రిషన్  తో హుళక్కి అయ్యే ప్రమాదముంది .మగ ఉద్యోగులు ఇంటి చాకిరి ,వర్క్ ఫ్రం హోమ్ లతో బిజీ బిజీ అయి, పలకరిస్తే కస్సుబస్సు  మంటారు .చిక్కి శల్యమౌతారు .ఆనందం అర్ణవం అవ్వాల్సింది ఆవిరై పోతుంది .స్త్రీ ఉద్యోగినులు,  హౌస్ వైవ్స్ ల పాలిట స్వర్గం గా ఉంటుంది జనతాకర్ఫ్యు. హాయిగా కాలు మీద కాలేసుకొని సీరియల్స్, సినిమాలు చూస్తారు .కనుక ఒళ్ళు బరువెక్కే ప్రమాదం ఉంది .పిల్లలు ‘’జాం జాం’’ గా  వీడియో గేమ్స్ తో ఎంజాయ్ చేస్తారు .ఒకప్పుడు చైనా చేసినట్లు ,ఆమెరికాలో వాళ్ళకూ’’ లెసన్స్ ఆన్ లైన్’’ లోనే కనుక కళ్ళు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు కర్తా0తికులు .

  రాశి ఫలితాలకొస్తే ‘’అన్ని రాశుల ఉనికి ‘’అని అన్నమయ్య చెప్పినట్లు ఒక్కటిగానే ఉంటుంది .పెద్ద తేడా ఉండదు .ఎందుకంటె శుభులు కూడా సావాసా దోషం తో పాపులయ్యారు కనుక .నరఘోషకు, గ్రహ శాంతికి డబ్బులు ఖర్చు చెయ్యలేని స్థితి కనుక నే చెప్పే చిట్కా పాటిస్తే చాలు .మేష రాశి వారు మేకతోలు ,వృషభం వారు ఎద్దు చర్మం ,మిధునం వారు రతీమన్మధ బొమ్మ ,కర్కాటం వారు –ఎండ్రకాయ డిప్ప ,సింహం వారు సింహ౦ తోక ,కన్యారాశి వారు బాపు బొమ్మ ,తులవారు త్రాసు ,వృశ్చికం వారు తేలుకొండి,ధనుస్సు వారు విల్లంబు ,మకరంవారు మొసలి పొలుసు ,కుంభరాశి వారు కుండపెంకు ,మీనం వారు ఎండు చేప ఉంగరాలలోనో తలకో మొలకో ఆభరణ౦ లోనో ధరిస్తే ,అన్నీ సర్దుకుంటాయి .అన్ని రాశులవారు తప్పక ‘’కరోనా జపం ‘’కరోనాభిషేక౦  చేయిస్తే కాని శాంతి లభించదు .ఇవేవీ చేయలేనివారు ఇంటి వాకిలి ద్వారం తలుపు మీదనో, గోడమీదనోఒకప్పుడెప్పుడో మనం ‘’ఓ స్త్రీ రేపురా ‘’అని రాయించినట్లు ఇప్పుడు  ‘’ఓ కరోనా !ఇవాళకాదు రేపు రా ‘’అని రాయిస్తే చూసి పారిపోవచ్చు .అసలు ఇవన్నీ ఎందుకురా భయ్ నమస్కార సంస్కారం ,బయటినుంచి రాగానే కాళ్ళూ చేతులూ మొహం కళ్ళూ కడుక్కొని తడి గుడ్డ తో తుడుచుకొంటే కరోనా లాంటివి మనల్ని చూసి ఆమడ దూరం పారిపోతాయి .ఎరుక మర్చి పోయి ,అనర్ధాలు తెచ్చు కొంటున్నాం .మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలని కరోనా సందేశంరా భయ్.ఇది గుర్తిస్తే చాలు .

   మాస్కులు అందించలేక అమెరికా యే చేతులెత్తేసింది కనుక మనం పాత చీర ముక్కలతో మాస్కులు తయారు చేసుకొని వాడితే సరి .దీనివలన పాతచీరల ధరలు పెరిగే ప్రమాదం ఉంది .స్టీలు సామాను వాళ్ళ నోట మట్టే. దేవుళ్ళకూ’’ మాస్కుల దండలు’’ వేస్తె మంచిది వారు సర్వవ్యాపులు ,సర్వాంతర్యాములు కనుక .

  ఇక ‘’సంక్రాతి పురుష ‘’పు౦గవుడి గురించి నాలుగు మాటలు.పేరు ‘’మంద’’.అంటే ‘’మనమంద’’లోని వాడే నన్నమాట .  ఆయనాకరోనా విషయం లో సకల  జాగ్రత్తలు తీసుకొని  వేప నీటి స్నానం ,పీత వస్త్రధారణ –పేత అంటే పీతలు వస్త్రంగా అనికాదు రా బాబూ పసుపురంగు,పెద్దపులి వాహనం తో వస్తాడు .తుంగభద్రానదికి ఈఏడాది పుష్కరం కనుక అన్ని జాగ్రత్తలతో పుష్కర విధులు నిర్వహిస్తే మంచిది .ఇంతకీ రేపు ప్రవేశించే కొత్త సంవత్సరం పేరు ‘’శార్వరి’’అంటే ‘’రాత్రి ‘’పగలుకంటే రాత్రి భయంకరం కదా .అందుకే ముందే కరోనా హెచ్చరికలతో వస్తోంది .కనుక మనం సరదాగా ‘’కరోనా ఉగాది ‘’అనుకున్నా తప్పేమీ లేదేమో .

  అసలు పంచాంగ శ్రవణం రేపు చేస్తాను .

 మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-3-20 –ఉయ్యూరు    .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.